Tuesday, September 30, 2008

..సంఘర్షణ..

తెలి సంధ్యా సమయాన, ఆతడిని చూడాలని రెక్కలు కట్టుకు వచ్చి వాలాను. రవి, ఆతడి చుట్టూ చేరిన ప్రకృతి, ఆహా...! ఎంత మనోహరమైన దృశ్యం అది..! అతడిని, ఆ దృశ్యాన్నీ చూస్తూ, మైమరచి అలానే నిలుచుండిపోయాను. ఎవరు చెప్పారో మరి తనకి, ఉన్నట్టుండి తన చూపు నా పై..! అంత దాకా అతడినే తదేకం గా చూసేస్తున్నదానిని, అతడి చూపు నాపై పడేసరికి ఒక్కసారిగా నాలో ఎందుకో ఇంత అదిరిపాటు?!! కాస్త తమాయించుకుని, అతడిని అసలు చూడనట్టే తల దించాను, కనురెప్పలపై అతడి చూపు వేడిని ఇంకా అస్వాదిస్తూనే..! ఇంతలో, ఆ పక్క విచ్చుకుంటున్న ఎర్ర మందారాలతో పోటీపడుతున్న పెదవులను అదిమి పట్టలేక, మరి ఇక చేసేది లేక, దాచేందుకు ముఖం పక్కగా తిప్పాను. ఎంత తిప్పుకున్నా పువ్వు చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ ఆమెని అల్లరిపెడుతున్న భ్రమరంలాగ, అతడి చూపుల కిరణాలు ఇప్పుడు నా చెంపని గిల్లుతున్నాయి. ఆ గిల్లుడు చేతనో లేక సిగ్గు వలనో మరి, చెక్కిళ్ళు ఎరుపైతే ఎక్కాయి. నా కను కొనల్లో అతడి మసక రూపం. తలెత్తి చూడాలనే ఆతృత గుండె వేగాన్ని పెంచేస్తోంది. కానీ చూడలేను :(. కదిలిన చెట్ల ఆకుల సందుల్లోంచి జారిన మంచు బిందువుల్లా చల్లగా తాకుతున్న అతడి చిరునవ్వులు..... గోళ్ళన్నీ కొరికేస్తూ నేను...
ఏమిటో ఈ సంఘర్షణ !!

Saturday, September 27, 2008

..ముత్యాల మాల..

మెల్లగా, ఓపికగా, వరుసగా...
ఒక్కొక్కటిగా.. ముచ్చటగా...
నే అందిపుచ్చుకున్న ముత్యాలను పేరుస్తూ...
ఒక[నా] మాలని గుచ్చుతున్నాను...
నన్ను అలంకరించు కునేందుకు..!

మొదటి సారి తెగిపోయింది :-(, మళ్ళీ గుచ్చాను..నమ్మకంతో..
రెండావసారి కొట్టుకుపోయింది, కొత్తగా పేర్చాను.. ఈదిన అనుభవాలతో..
మూడవసారి మాసిపోయింది, జాగ్రత్తగా శుభ్రపరిచాను.. ప్రేమతో..
ఇప్పుడు మాయమైపోయింది, ఒంటరిగా మిగిలిపోయాను.. అయోమయంలో..!!

Thursday, September 25, 2008

అమ్మా... నేనేం చేసాను ?!!అమ్మా... నేనేం చేసాను ?!!
ఎందుకు నన్ను వెళ్ళగొడుతున్నావూ..?
పువ్వు లాంటి నీకు నేను భారంగా ఉన్నానా ??
భారంగా ఉన్న నేను నీకు నొప్పి కలిగిస్తున్నానా??
క్షమించమ్మా.. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను
లేదమ్మా... నన్ను వెళ్ళనివ్వకమ్మా..
వద్దమ్మా... నన్ను వదలద్దమ్మా..
అమ్మా... అమ్మా.. వదలద్దమ్మా....
అమ్మా... అమ్మా.. అమ్మా... అమ్మా.....!

.......................................
........................................

నన్ను కడుపులోంచి వెళ్ళగొట్టింది, గుండెల్లో చేర్చుకోవటనికా..
నాపై కాఠిన్యం చూపించింది, కమ్మని ఒడి పరిచేందుకా..
నీ కష్టాన్నంతా గొంతులో పట్టింది, నాకు జీవం పోసేందుకా..
ఎంత మూర్ఖురాలిని...!!
నిన్ను అర్థం చేసుకోలెకపోయనమ్మా... ఇన్నాళ్ళూ..!!

చూపును చూసి, వెనకున్న ఆలోచనని చదివేస్తావు.
స్వరాన్ని బట్టి, గుండెలోని భావాన్ని కనిపెట్టేస్తావు.
'నువ్వు నా దానవే..' అని ప్రతి క్షణం నన్ను హత్తుకుంటావు.
'నా లోకం నువ్వేనంటూ..' నా కోసం లోకాన్ని, నాన్నని సైతం ఎదిరిస్తావు..!

నీ కలల్లో నా భవిష్యత్తుని చూస్తూ,
నీ కనుబొమ్మల్లో నాకై తపనను ముడుస్తూ,
నీ కళ్ళళ్ళో నా సంతోషాన్ని చూపే...
నా చిట్టి తల్లీ.., నీ ఋణం ఎలా తీర్చుకోనే....?!

ఓ మాట చెప్పనా అమ్మా...?
I Love You :)

Friday, September 19, 2008

అహం - తాపత్రయం

ఎంటీ అసలూ..నువ్వు నా మాట వినవా..? భయం ఎలాగూ లేదు. కనీసం నేనంటే..లెక్క కూడా లేకుండా పోయింది. ఏదన్నా అంటే.. అన్నిటికీ ముందు ఆ ఏడుపొకటి.. నిన్ను చూసుకుని, ఆ చేతులకు, కాళ్ళకు కూడా సొంత అభిప్రాయాలు.. సొంత పెత్తనాలూ...! ఒకళ్ళు చక చకా సెల్ ఫోన్ అందిస్తే... ఇంకొకరు బయటికి పరుగు. మీకందరికీ నేను బా....గా..... లోకువైపోయాను అసలు. అసలు మిమ్మల్నంతా చెడగొట్టింది ఆ చెవులు కదూ.. ముందొచ్చినదాన్ని..! అని ఏంత పొగరు అసలు!! ఆ గొంతు వినకపోతే, ఏంటో అంత నష్టం...!! పోనీ జరిగిందేదో జరిగిపోయింది.. అని నోరు ఏమైనా.. కొంచమైనా... తిన్నంగా ఉంటుందా...???! తోచిందల్లా మాట్లాడేస్తే...ఎవరిది బాధ్యత?? నన్నెవరూ అర్థం చేసుకోరా అసలు ? మీరు చేసే చేష్టలకి మిమ్మల్ని ఎవరూ అనరు.. అన్నీ పడేది, భరించేది, బాధ పడేదీ నేను!! అంతా నన్ను అన్నేసి మాటలంటుంటే... దిష్టి బొమ్మల్లా గుడ్లప్పగించుకుని చూస్తారే తప్ప, "తప్పు నాది... ఆ క్షణంలో నేను తన మాట వినలేదు. కాబట్టి ఎదైనా తప్పు జరిగితే అది నాది." అని మీలో ఒక్కరంటే..ఒక్కరైనా ముందుకు వచ్చి చెప్తారా... ?? లేదు..! రారు... రాలేరు! నాకు తెలుసు. ఎన్ని సార్లు జరగలేదు నాకు ఇలాంటి సత్కారాలు..? సమయానికి నా స్నేహితురాలు వెన్నెల వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఈ పాటికి నువ్వు ఏ స్థితిలో ఉండేదానివో...ఆలోచించావా అసలు?!! మీకర్థం కావట్లేదు.. నన్ను మీలో చేరనిస్తే కదా.. అసలు నేనేదైనా చెయ్యగలిగేది?? అది వదిలేసి, నన్నో శతృవులా, అంటరానిదానిలా... చూస్తారు. నా ముసుగులో ఎవరో ఎక్కడో విచక్షణ లేకుండా ఏదో చేసారని, మీరు నన్ను పట్టించుకోకపోతే.... నష్టం ఎవరికీ? అని ఒక సారి బుద్ధిని అడిగి తెలుసుకోండి. ఇంతకంటే.. నేనేమీ చెప్పను..? ఎన్ని సార్లని చెప్పను ?? చెప్పి చెప్పి నే అలిసిపోయి, అరిగిపోయి, కరిగిపోవాలి అంతే... ఇప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా నోరు విప్పట్లేదు..! అంతే.. మీలో మార్పు ఈ జన్మకి రాదంతే... కొన్ని జీవితాలంతే...!! మీ ఖర్మ.. అనుభవించండి!

Wednesday, September 17, 2008

..తామర క్షణం..

జీవితంలో ఇవి నావి, నా ఆస్థి అని చెప్పుకోగలిగేవి కేవలం నా క్షణలేనేమో..! అలాంటి వాటిని ఉదయం లేచిన దగ్గరనుంచి.. పడుకునే దాకా... ఎదో ఒకటి చేస్తూనో, ఎమీ చెయ్యకుండానో.. ఈ రోజుకు కావాల్సినవి సమకూర్చుకుంటూనో....నిన్న కూర్చుకున్న వాటిని వదిలించుకుంటూనో .. రాబోయే రేపు కోసం కష్టపడుతూనో, కలలు కంటూనో.. ఆలోచిస్తూనో... అర్థం లేకుండానో... సలహాలిస్తూనో, సంజాయిషీలు చెప్పుకుంటూనో... గడిపేస్తున్నాను.

ఇలా కరిగిపోతున్న వాటిలో నే జీవించేది ఎన్ని? వాటిలో ఎన్నింటిని నేను అచ్చంగా నావిగా పోగుచేసుకుంటున్నాను..? అసలు అచ్చంగా నావి అంటే ఏవి? నా కోసమై నే గడుపుకునే క్షణాలా..? లేక నాకు ఇష్టమైనది చేస్తూ గడిపే క్షణాలా?

అయ్యో... ఇలా తికమకపెట్టే ఈ ఆలోచనల బురదలో ఇప్పుడే ఒక తామర క్షణం.. విరిసి, మెరిసి, "నువ్వు జీవించేది ఇక్కడ" అని చెప్తూ, [నువ్వు నన్ను పట్టుకోలేవన్నట్టు] నన్ను చూసి కొంటెగా నవ్వుతూ, నే గ్రహించేలోపే మాయమయ్యింది.... అరే.. ఏం చేసాను నేనా క్షణం..? ఏదీ..నే జీవించిన నా క్షణం....?? ఎమో.. ఎటెళ్ళిందో తెలీదు!! తను విచ్చినప్పుడు [క్షణం కంటే వేగంగా] వ్యాపించిన ఆ సువాసన మాత్రం ఇంకా అలానే ఉంది. తను నా భ్రమ కాదని, నాకు తెలపటానికన్నట్టు....

Monday, September 15, 2008

ఆకాశం రంగేమిటో..?!

ఆకాశం రంగేమిటో.....?!

చచ్చు ప్రశ్న... "ఆకాశం రంగేమిటి" ఏమిటి.. వెధవ పైత్యం కాకపొతే...!
నీలంగా ఉంటుంది. అది కూడా తెలియదా...?!!

హ్మ్.. తెలుసు.. ఆకాశం కేవలం పగటి వెలుగులో మాత్రమే నీలం రంగులో ఉంటుంది. సూర్యోదయ సమయంలో నలుపు నుంచి, బూడిద రంగులోకి, అటుపై గులాబి, ఎరుపు, సిందూర వర్ణాలు పులుముకుని, ఆఖరుకి, నీలంగా మెరుస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిందూరం,ఎరుపు,గులాబి, బూడిద వర్ణల్లోకి మారుతూ.. మెల్లగా నలుపు పులిమేసుకుంటుంది.

మరి అసలు ఆకాశం రంగేమిటీ??!!

ఆ ఆకులు...?? హ్మ్.. అదే ప్రశ్న.. ఆ ఆకుల రంగేమిటి ?!!

ఆకుపచ్చ.. మళ్ళీ అదంతా పగటి వెలుగులోనే... అ వెలుగు సన్నగిల్లే కొద్దీ... అవి కూడా నలుపే పులుముకుంటున్నాయి..

వెలుగులోనే అసలు రంగు బయట పడుతుంది అంటారు. కానీ ఆ వెలుగు ఎప్పుడూ ఒకలా ఉండదే...!! మరి అసలు వెలుగు ఏది, అసలు రంగు ఏది ఎలా చెప్పగలం ??

పగటి పూట మనకి కనిపించే ఆ రంగులు, వెలుగును తీసుకుని, వెన్నక్కి ఇచ్చే వర్ణాలు కదా.. ఐతే.. వాటి అసలు రంగు ఏమిటి?? అసలు ఏదైనా రంగు ఉందా లేదా?? ఏమీ ఇవ్వకపోతే ? మన ఉనికే లేదా ?? అసలు వెలుతురే లేకపోతే అప్పుడు మన రంగు?

ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ఉంటామో అదే మన నిజమైన తత్వం అంటూ ఉంటారు. అంటే.. నలుపే [చీకటే] నిజమా..?? వెలుగు మాయా..??

లోకంలో రంగుల్ని..చూస్తూ ఆనందించే నాకు.. ఒక్కసారిగా ఇవన్నీ నన్ను మోసం చెయ్యటానికి సృష్టింపబడిన వాటిలా, మాయలా, భ్రమలా కనిపిస్తున్నాయి....నలుపొకటే నిజంలా తోస్తోంది... !!

ఎంటో ఈ కృష్ణ [నల్లని] మాయ నాకు....

Tuesday, September 9, 2008

కురిసేను విరిజల్లులే...


అతడిని ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసాను. కానీ ఈ రోజు అతడిలో ఎదో తెలియని శోభ నన్ను ఆకర్షిస్తోంది. కళ్ళార్పకుండా తదేకంగా చూస్తున్నాను. చూసేకొలదీ బలపడుతున్న ఆకర్షణ... నాకు తెలియకుండానే నా పాదాలు అతడి వైపు కదులుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ దూరం కరుగుతుందా, ఎప్పుడెప్పుడు అతడిని చేరుకుంటానా అన్న ధ్యాసలో కళ్ళు తెరిచి తపస్సు చేస్తున్న మునీశ్వరిలా, ఐహిక సుఖలన్నీ మరచి అతడినే పూజిస్తున్నాను. అతడిని చేరే వరమివ్వమని ప్రార్ధిస్తున్నాను. ఇది కట్టలు తెగిన వయసు వ్యామోహమో.. లేక అదుపు, ఆంక్ష లేని వెర్రి ప్రేమ మైకమో లేక మరేదైనానో నాకు తెలియదు. అసలు ఎప్పటికైనా అతడిని చేరుకుంటానో లేదో అనేది కూడా ఆలోచించట్లేదు. ఎప్పుడు వచ్చింది నాలో ఇంత మూర్ఖత్వం? ఏమో ఈ ఆకర్షణ ముందు, నా భావం ముందు నాకేదీ అనిపించట్లేదు, కనిపించట్లేదు. అతడిని చేరుకోవటమే నా జీవిత లక్ష్యంలా తోస్తుంది. ఒక్కొక్కటిగా బంధాలన్నిటినీ విడిచిపెడుతున్నాను, మోక్షం పొందేందుకు బయలుదేరిన సన్యాసినిలా.... అతడు నా వైపు వస్తున్నాడు. నన్నే చూస్తున్నాడు... అది గమనించిన నా మనసైతే పురివిప్పిన నెమలల్లే నర్తిస్తోంది. నర్తించే నన్ను చూసి అతడిలో ఎలాంటి చలనం లేదు. గాంభీర్యమే కనిపిస్తోంది. కానీ ప్రతి క్షణం అతడిపై నా ఆకర్షణ మరింత బలపడుతుంది.

తొలి సందేశం...
అతడి మీదుగా వచ్చిన గాలి నన్ను సోకింది. నాలో సన్నగా మొదలయిన ప్రకంపన..

మొట్టమొదటి సారి అతడిలోని మొరటుతనాన్ని చూస్తున్నాను. నిప్పులు కురిపిస్తున్న అతడి కళ్ళను అదరకుండా చూస్తున్నాను, అతడిలోని ప్రతి భావాన్నీ అనుభవించాలని... గర్జిస్తున్న అతడిని బెదరకుండా ఆహ్వానిస్తున్నాను, ఆప్యాయంగా హత్తుకోవటానికి... అతడు చేసే పిడుగుపాటు లాంటి గాయాలను భరిస్తున్నాను సంతోషంగా... అతడు ఆక్రమిస్తున్న నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతున్నాను. అతడిని నాలో కలిపేసుకోవాలని అనుకున్నాను. కానీ నన్ను పెనవేసుకుపొతున్న అతడితో ఏకమై కరిగి, జారి, ప్రవహిస్తున్నాను. నా అన్న ఉనికి, తడిసి ముద్దై, మట్టిలో కలిసిపోయింది. కాసేపటికి తేలికై అతడు నా ఒడిలో సేద తీరుతున్నాడు. అలసి సొమ్మసిల్లేట్టుగా భారంగా నేను...

ఏంటీ? అలా చూస్తున్నావ్?? నీకిది వెర్రిగా తోస్తుందా? వీపరీతంగా కనిపిస్తుందా? మోహనా... నువ్వు చెప్పు.. నువ్వు కూడా అతడిని చుసి మైమరువలేదా? అతడి ప్రేమను చిరునవ్వుతో స్వాగతించలేదా?? అలా దిక్కులు చూస్తావే...? ఒక్క సారి, "ఇక్కడ ఎవరూ లేకుండా ఉంటే ఎంత బాగుండు" అని ఎన్ని సార్లు నీ రెక్కల్ని నువ్వే ముడుచుకోలేదూ? ఆ గొడుగును నువ్వు మనస్పూర్తిగానే తెస్తున్నావా రోజూ? లేక అతడి ప్రేమ వానలో తడిసే నిన్ను చూసి అసూయతో మాట్లాడే వాళ్ళకోసమా? గొడుగును కావాలనే తేవటం మర్చిపోయిన నాడు అతడు నన్ను కరుణించాలని నాతో పాటు నువ్వూ ఆర్ధ్రంగా ఎదురుచూడలేదూ?? నిజం చెప్పు... మా అనుబంధాన్ని చూసి ఆనందించే నువ్వు, మా భావాలను నేనిలా వ్యక్తపరిస్తే తప్పుగా, తెగింపుగా చూస్తున్నావా? నేను బరితెగించానా? లేక నా ధైర్యం చూసి, నువ్వు భయపడుతున్నావా?

నీ సమాధానాలు నీకోసమే...గుర్తుంచుకో..!!

లేదు.... నేనేమీ అనుకోవట్లేదు. నువ్వు చెప్పు...

కొంతసేపటికి ఇద్దరం తేరుకున్నాం. భౌతికతను కోల్పోయి, ఇప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గలా, ప్రకాశవంతంగా, అతడు. అతడి ప్రేమలో తడిసి దానిని అందరికీ పంచే ప్రేమమూర్తిగా నేను, ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాం. సంతరించుకున్న కొత్త అందాలతో పులకరించి, ఒక్క సారి నా రెక్కలు విప్పి అతడిని చుట్టలేనని తెలిసీ, అతడిని అమాంతంగా కౌగిలించుకున్నాను. ఈ నిమిషం ఇలానే స్తంబించిపోవాలన్న దురాశ కలగకపోలేదు. కానీ అతడి ప్రేమతో పాటు అందిపుచ్చుకున్న బాధ్యతలను మరువలేను. ఆ నిమిషం కరిగింది. ముడి విడింది. దూరం దరిచేరింది...

కానీ నాకు తెలుసు అతడిని మళ్ళీ కలుస్తాననీ.. నా ప్రేమను దాయలేననీ...

:) నువ్వు దాయలేవు..ఒప్పుకుంటున్నాను.. ఈ భూమిపై వికసించే ప్రతి పువ్వూ.. దానికి సాక్ష్యం..!

Friday, September 5, 2008

'వినిపించని రాగాలే... కనిపించని అందాలే...'

రాత్రి 10 కావస్తోంది. బెంగుళూరు నుండి హైదరాబాదు రహదారి మీద, National Travels వారి బస్సు చీకట్లను ఛేదించుకుంటూ వేగంగా దూసుకుపోతుంది. కిటీకీ తెరలు మూసెయ్యమని ఆర్డర్ వేశాడు బ్బస్సులోని యాదగిరి. నేను యాదగిరి వంక కోపంగా చూశాను. వాడు మాత్రం నన్నేమీ అనలేదు! అసలు నన్ను చూస్తే కదా ఏమైనా అనటానికి!! ముయ్యమని చెప్తూ డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళిపోయాడు. అన్ని కిటికీల తెరలు మూసుకున్నాయి. నాది కూడా... ఈలోపు ’పరదేశి’ [హిందీ] సినిమా మొదలయ్యింది. నేను అంతకు ముందు చూడలేదు. సో లీనమై చూసేస్తున్నా.... సినిమా పూర్తయ్యే వరకూ తెలియలేదు లైట్లన్నీ ఆరిపోయి చాలాసేపయ్యింది అని. ఇప్పుడు టీవీ కూడా కట్టేసేటప్పటికి అంతా చీకటి, నిశ్శబ్దం. అందరూ నిద్రపోతున్నారా ? లేక నాలాగే మౌనంగా మాట్లాడుకుంటున్నారా..? ఏమోలే! నాకెందుకు?! ఇలాంటి అవకాశం కోసమే కదా నేను ఇంతసేపూ వేచి చూసింది..! ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకూడదు. కిటికీ తెర నెమ్మదిగా తెరిచాను. కిటికీ సందుల్లోంచి, గండిపడ్డ నదిలా ప్రవహిస్తోంది గాలి. ఆ జోరుకు కళ్ళు మూసుకుపోతున్నాయి. ముఖం కోసేంతటి వేగం..! ఆ చిన్ని సందును, కిటికీ అద్దం ముస్తూ పూరించేసాను. సీట్లో వెనక్కి వాలి, తల పైకెత్తి సెకండ్ షోకి రెడీ అయ్యా... రాత్రి పూట ఆకాశాన్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. ఒంటరిగా చేసే ప్రయాణంలో ఐతే ఇంకా చాలా ఇష్టం. నల్లటి ఆకాశం లో మిళుకూ-మిళుకూ మంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ’వినిపించని రాగాలే... కనిపించని అందాలే...’ అన్నట్టు ఎంత ఖర్చుపెట్టినా పెద్ద పెద్ద నగరాల్లో కూడా దొరకని ఈ అందమైన అనుభవం... చుక్కలతో సావాసం. ఆకాశం నన్ను ఒడిలో చేర్చుకుని జోల పాడుతుంటే, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా, అమ్మ ఒడిలో హాయిగా నిదురించే పసిపాపలా.. చింతలన్నీ మరచి నా కలల లోకంలో విహరించాను. ఊహలు ఊయలలూగుతూ ఆలపించే రాగాలు వింటూ నిదురపోయాను.