Showing posts with label ప్రేమ. Show all posts
Showing posts with label ప్రేమ. Show all posts

Tuesday, July 30, 2019

శాశ్వతం - మర్మం



దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;
తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసి
అరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.
ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. 

అవునంటూ ఒక కొమ్మ ఊగింది.
తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,
పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయి
ఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని హర్షాతిరేకానికి సాక్ష్యం.

-----------------------------------------

ఇది శాశ్వతం కాదంటూ ఆకాశం పయనమయ్యే ప్రయత్నం చేస్తూ గర్జిస్తుంది.
ఈ నిమిషం నిజం. ఈ మమేకం తన్మయత్వం నా అస్థిత్వానికి చిహ్నం. ఆ మర్మం నాలో నాతో ఆజన్మాంతం నా సొంతం.

అంటూ అడవి చీకటి ఒడిలో ప్రశాంతంగా నిదురించింది.    

Wednesday, October 3, 2012

ఎలా చెప్పను?!!

ఈ రోజు పూర్ణిమ.

ఒరిగిన కుండలోంచి కారుతున్న వెన్నలా... ఆకాశంనుండి వెన్నెల కారుతుందా అన్నట్టుంది.
చుక్కలు మిలుకుమంటున్నాయి హుషారుగా...
చల్లగాలి కౌగిలింతలా బిగుస్తూ కూడా హాయిగా ఉంది.
సన్నగా చిరునవ్వోటి తొంగి చూస్తుంది. తెలుస్తుంది.
కొంటెగా పరిహాసాలాడే జుట్టు ఎప్పటిలాగే గిలిగింతలు పెడుతుంది.
అయితే నా చిరునవ్వుకు ఇవేమీ కారణాలు  కావుగా...

పిల్లలు నవ్వితే మనమూ నవ్వుతాం. వాళ్ళెందుకు నవ్వారో తెలియకపోయినా! అలానే ఇవన్నీ, నా నవ్వుకు కారణం తెలియకుండానే నన్ను ఒకింత అనుమానంతో, 'ఎందుకో అంత ఆనందం' అని కొంటెగా అడుగుతున్నాయి. అనుమానం సరే, అడగటమూ సరే... కానీ చెప్పానంటే నమ్ముతారా? అసలు అర్ధమవుతుందా?అయ్యేలా చెప్పగలనా? అని! అయినా ఏం చెప్తాం!
మాటలు కుప్పలు కుప్పలుగా పోసేసి వెతికేస్తున్నాను.  ఊ... హూ! కుదరటంలేదు. కలవటంలేదు. అసలు సరిపోవటంలేదు. ఇలా కాదు. పోనీ ఉదాహరణ తీసుకుని ప్రయత్నిస్తే! మ్... కుదరొచ్చు. ప్రయత్నిస్తా....

అదే... ఒక విత్తు చెట్టుగా ఎదుగుతుంది, భూమి, గాలి, నీరు తీసుకుని. ఆ చెట్టు వలన వాన పడి, వాన వలన నీరు సమకూరుతుంది. నీటి వలన చెట్టు వలన నీటి వలన చెట్టు....... ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కదా! మ్....

అయితే.. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమిస్తున్నారు?
ఇది సగం ప్రశ్న!
ఎవరు ఎవరికి ఏమిచ్చి ఏమి పుచ్చుకుంటున్నారు? ఇది  పూర్తి ప్రశ్న! :)

జీవితం. ఆహా! ఒకరికి ఒకరు పరస్పరం జీవితం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఒకరు లేకుండా మరొకరు లేరు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ఈ క్రమంలో ఈ పరంపరలో వారి జీవితాలే కాదు మరెన్నో జీవితాలు ఆవిష్కరింపబడుతున్నాయి.

ఒక తల్లి, బిడ్డ పరస్పరం ప్రేమ చూపించుకునేప్పుడు ఎవరు ఎక్కువ ఆనందిస్తున్నారంటే ఏం చెప్పగలం? పరస్పరం ఇచ్చి-పుచ్చుకుంటున్నారు. ఆ లీలలో, కేళిలో ఇది తల్లి, ఇది బిడ్డ అని వేరుగా చూడలేం. వారిద్దరూ ఉన్నారు. ఒకటిగా!! ఆ ప్రవాహం రెండు వైపులనుండీ ప్రవహిస్తుంది.
ఆ అలౌకిక అనుభవం, అనుభూతి, ఆనందం కొలవలేం.
ఆ సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూస్తున్న నా స్థితిని వర్ణించటం అసాధ్యం.
ఆ నా స్థితి ఈ రోజు నా చిరునవ్వుకు కారణం!



Tuesday, September 18, 2012

How Far We Are


You were roaring dangerous when I reached you. 
And when you reached me, I was locked inside.  

Hanging on to the glass of separation, 
quietly whispering to me to break through. 
Looking straight into my eye,
Could you look at yourself in there? 

Soon, dear, you were gone. 
And here I am... looking through the glass. 


**********
We were always close enough to carry each others shadows. Yet so far....

Sunday, May 27, 2012

తను-నువ్వు

      తనెన్ని మాటలు నేర్చిందో తెలుసా నువ్వెళ్ళాకా! ఇప్పుడు తనకెన్ని ఆశలో, ఎన్ని ఊసులో.... అన్నీ నీ గురించే!! ఏకాంతం పరదా పడగానే నన్ను అల్లేసుకుని నాతో సాల్సానో సామ్బానో ఆడటం ఇప్పుడు తనకో హాబీ!

అది కాకపోతే కబుర్లు కబుర్లు కబుర్లు.......

       ఆ కబుర్లు ఏంటో తెలుసా? నువ్వు వస్తే నిన్ను చూస్తే.. ఎలా ఉండాలో ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో... అని ఎన్నో రిహార్సల్స్ వేస్తుంది. నిన్ను చూడగానే నవ్వుతూ 'Welcome Back' అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వాలో లేక 'I missed you' అంటూ అమాంతం గా వాటేసుకోవాలో.. మరి 'hi' అని నువ్వేం చేస్తావో చూద్దామా లేక దాక్కుని నిన్ను ఆటపట్టించాలా... అని...

        తరువాత నీతో కాస్త ఏకాంతం దొరికితే తన భావాలన్నీ చెప్పాలా లేక వాటిని పెదవుల వద్దే ఆపి కళ్ళలో దాచి నిన్ను వెతకనివ్వాలా లేక చిలిపి ఆటలతో నిన్ను మురిపించాలా అని...

         ఇలా నిత్యం నీతో గడపాలనుకునే ప్రతి నిముషాన్నీతన ఊహల్లో అలంకరించుకుంటూ వాటిని ఎప్పుడెప్పుడు మాలగా గుచ్చి నీకివ్వగలనో అని తహతహలాడుతూ తిరిగే తను నడిచే రంగవల్లికలా మురిపెంగా కనిపిస్తుంది. ఎప్పుడూ పరవశం, తన్మయత్వం తప్ప వేరే ఊసేరుగని తన సాంగత్యం నాకు వెన్నెల వెలుగును తలపించేది.

కాల్చే విరహం ఇంత చల్లగా ఉంటుందని వినలేదు నేనెప్పుడూ....



******************************


           తనలో ఏదో చిటపట. వెన్నెల ఎంత నిండుగా ఉన్నా పాలిపోయినట్టు ఉండదు. అలాంటిది ఈ మధ్య తనెందుకో పాలిపోయినట్టనిపిస్తుంది. నిరుత్సాహంగా తిరుగుతుంది. అద్దిన రంగవల్లికలా నిండుగా నవ్వే తానిప్పుడు నడుస్తున్న నిశిలా భారంగా, గంభీరంగా లోతైన కళ్ళతో పేలవంగా తిరుగుతుంది. ఏమంటే ఏమీ లేదంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా నీ ఊసులేదు. నీ ఊసు లేనంత మాత్రాన, నీ ఊహ లేదనుకోను!! ఎందుకంటే తడిసిన మట్టి వాసనో, నీకిష్టమైన పాటో తాకిన ప్రతి సారీ ఆ లోతైన కళ్ళలో నల్లని మేఘాలు కమ్ముకోవటం చూసాను. లోయలో పడిన పిడుగు  కొండా,కోనా ప్రతిధ్వనించినట్టు తను నిలువునా స్థంబించి కంపిస్తుంది అలాంటప్పుడు. ఆ కనులు నీరు కారటం నేను చూడలేదు. కానీ తడిపొర కమ్మిన కన్నులు చూసే పదునైన చూపును చూసాను. ఎన్ని వరదలు ఆ కనుకొనలకా పదును చేసాయో!!

వియోగం మంచు ముక్కలా నరాలు తెగేలా కోస్తుందంటే నమ్మలేదు నేను. మీ మధ్యా?  వియోగం??!! ఇదేదో మనస్పర్ధలా అనిపిస్తుంది నాకు.

నువ్వు రా!! నువ్వు త్వరగా వచ్చి ఈ మంచును కరిగించు.

Break the ice, before it cuts through.

Wednesday, November 30, 2011

ప్రేమ

వదిలించుకుంటే వదిలెయ్యటానికి దెయ్యమా?? ప్రేమ...
ఆత్మ కదూ?!
దొరికేంత వరకూ వెతుకులాట...
దొరికితే సందిగ్ధం. మౌనం. ధ్యానం.
పొత్తు కుదిరితే కోలాటం.
కుదరకపోతే విరహం. వైరాగ్యం. స్వర్గ ద్వారం.


---------------------------------------------
యశోద తన కృష్ణుడిని రకరకాలుగా అలంకరించి చూసుకుని మురిసిపోయేదట.
రోజుకో రకంగా అలంకరించి చూసుకున్నా తృప్తి కలిగేదికాదుట ఆవిడకి.
ఆవిడ పిచ్చి కానీ ఆ తేజో మూర్తి ముందు ఈ అలంకారాలెంతా?!!
అలానే  ప్రేమని వర్ణించటానికి మొత్తం సాహిత్యం సరిపోదు. ఆ విషయం తెలిసినా మనసొప్పుకోదు.
ఎంత చెప్పినా ఇంకా బాగా చెప్పాలనిపిస్తుంది. ఎంత విన్నా ఇంకా.... కొంచం అనిపిస్తుంది.
తగదనో... తెగదనో తెలిసినా....నచ్చిన రంగులతో, భావాలతో అలంకరించి,
దగ్గరైన అద్దాల్లో ప్రేమని చూసుకుని మురిసిపోవటం ఒక అద్భుతమయిన అనుభవం. :)

అలాంటి ప్రయత్నాల్లోదే ఈ టపా కూడా ఒకటి.