Showing posts with label మధుర స్మృతులు. Show all posts
Showing posts with label మధుర స్మృతులు. Show all posts

Tuesday, July 30, 2019

శాశ్వతం - మర్మం



దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;
తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసి
అరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.
ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం. 

అవునంటూ ఒక కొమ్మ ఊగింది.
తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,
పూలు రెమ్మలు గుసగుసలాడి  మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయి
ఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని హర్షాతిరేకానికి సాక్ష్యం.

-----------------------------------------

ఇది శాశ్వతం కాదంటూ ఆకాశం పయనమయ్యే ప్రయత్నం చేస్తూ గర్జిస్తుంది.
ఈ నిమిషం నిజం. ఈ మమేకం తన్మయత్వం నా అస్థిత్వానికి చిహ్నం. ఆ మర్మం నాలో నాతో ఆజన్మాంతం నా సొంతం.

అంటూ అడవి చీకటి ఒడిలో ప్రశాంతంగా నిదురించింది.    

Tuesday, April 19, 2011

One fine morning........

ఈ రోజు [Apr-19,2011] ఉదయం 5:30 కి వీధి కుక్కలు తెగ మొరుగుతున్నాయి. నాన్ స్టాప్ గా వాటి మొరుగుడుతో ఒక పావు గంట యుద్ధం చేసి ఇక నా వల్ల కాదని నా నిద్ర చేతులెత్తేసింది..... 'ఎవడు వాడు, ఏ దొంగ నా నిద్ర కొల్లగొట్ట సాహసించే..! ' అని మనసులో కసురుకుంటూ బాల్కనీలోకొచ్చి చూసిన నాకు అగ్ని పూల చెట్టు వెనుక... సాగిపొతున్న పల్చని నల్ల మబ్బుల చాటున చంద్రుడు ఉన్నట్టు ఆనవాలు కనిపించింది. కళ్ళు నులుముకుని తదేకంగా రెప్పార్పకుండా ఆ సుందర దృశ్య కావ్యాన్ని తిలకిస్తున్నాను, మబ్బులు ఎప్పుడు తొలిగిపోతాయా..... అని. వాయు దేవుడు జోక్యం తో నల్ల మబ్బు కదిలింది. చూడ్డానికి రెండు కళ్ళు చాలని ఆ దృశ్యం!! స్వేత వర్ణ ఛాయతో నిండు పున్నమి ధగ ధగ మెరుస్తూ ఉంది. నా మనసు చెదిరిపోయింది. ఎంత ఆనందమో చెప్పలేను. ఆ నిమిషం ఆ దృశ్యాన్ని అలాగే కళ్ళలో నింపేసుకుని, అది చెదిరేలోపు లోపలకెళ్ళి  నా కెమేరా తెచ్చాను. నిద్ర మైకం ఓ పక్క, 'ఈ ఫోటో బాగా తీయాలి.. మళ్ళీ మబ్బులొచ్చేస్తాయి' అన్న హడావుడి ఇంకో పక్క, I was conscious and in hurry. కేమెరా settings ఎమీ గుర్తు రాలేదు!! కష్టపడి రెండు ఫోటోలు క్లిక్కాను. బట్ లక్కు చిక్కలేదు. హ్మ్మ్మ్మ్..... షేక్ అయిపోయాయి :( ఈ లోపు వాటి సొమ్మేదో కరిగిపోతుందన్నట్టు మబ్బులు శశి ని దాచేసుకున్నాయి :((.  వాటి వెనుక అతగాడు చప్పుడు చెయ్యకుండా పశ్చిమం ఒడిలోకి జారుకున్నాడు, దొంగ లాగ. :|

ఆ షేక్ అబ్దుల్లా పిక్చర్సే ఉన్నాయి మీతో షేర్ చేసుకోటానికి... అవే, ఇక్కడ పెడుతున్నా.






ఆ తరువాత ఆ ఫోటోలతో తృప్తి లేక, నన్ను కొల్లగొట్టి వీడిపోయిన పున్నమి నా మనసును కలచి వేస్తుంటే... విరహ వేదనతో నిద్రపోలేక, వేరే పని చేయలేక, దేవదాసు సీసా పట్టుకుని కూర్చున్నట్టు, ప్రేమ నగర్ లో ఏ.న్.ర్ లా.... నేను పాచి మొహంతో కెమేరా పట్టుకుని బాల్కనీలో కూర్చున్నాను.

పున్నమి అస్తమించి తూరుపు తెల్లారే వేళ, సూర్య కిరణాలు ప్రసరిస్తూ అణువనువులో నవ చైతన్యం నింపే వేళ, ప్రకృతి పరవసింపజేసే వేళ... మరికొన్ని ఫోటొలు తీసాను. పున్నమి లో పొందలేని స్వాంతన తొలి పొద్దు వెలుగుల్లో దొరికింది. :) కథ సుఖాంతం. :P


అందిబుచ్చుకున్న ఆ క్షణాలు మీకోసం ఇక్కడ...

Tuesday, December 21, 2010

ఆ రాత్రి...

రూమ్మేట్ కలవరింతలతో  మెలకువ వచ్చింది. తనని పిలిచాను. తను ఇంకా కలవరిస్తూనే ఉంది. ఈ సారి గట్టిగా అరిచినట్టే పిలిచాను. స్పృహలోకొచ్చి పక్కకు తిరిగి పడుకుంది తను. నేనూ పడుకున్నా, నిద్ర పట్టలేదు. రూమ్మేట్ వైపు చూసాను. నిద్రపోతుంది. గట్టిగా శ్వాస తీసుకుని నిద్రపోవాలని ప్రయత్నించాను. ఎంత సేపు ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఎందుకో చీకటి... కళ్ళలో గుచ్చుకుంది. నాతో కాసేపు కబుర్లు చెప్పవూ అని చనువుగా నా పక్కన కూర్చున్నట్టు తోచింది. లేచి రూం బయటకు నడిచాను. చలి బాగా ఉంది. వీధి తలుపు మెల్లగా వేసి, వేసుకున్న స్వెటర్ ను కౌగిలించుకుని మేడ మెట్లెక్కాను. చలిలో చీకట్లో ముడుచుకుని పడుకున్నట్టుంది ప్రకృతి.

ఎన్నాళ్ళైంది ఇలా ఏకాంతంగా కాస్త సమయం గడిపి..! బహుశా 2 యేళ్ళైనట్టుంది. నేల మీద వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూస్తున్నాను. ఆహా...! ఎంత అందంగా ఉందీ. రాత్రి పూట నక్షత్రాలతో నిండిన ఆకశం చూడటం అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాఆఆ......లాఆఆ ఇష్టం. ఎకాంతంలో అలా ఆకాశాన్ని చూసిన ప్రతి సారీ ఒక అప్యాయమైన భావం ఏదో మనసును అల్లేసుకుంటుంది . చిన్నప్పుడు డాబా మీద పడుకుని ఆకాశాన్ని చూసేప్పుడు నాన్న ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండేవారు. కొన్ని సార్లు 'నక్షత్రాలు కదులుతున్నాయి' అంటే, అవి ఉపగ్రహాలనీ... అలాగే, పక్క పక్కనే కనపడుతున్న నక్షత్రాలు నిజానికి చలా దూరం దూరంగా ఉంటాయని... ఇలా ఎన్నో! విని అప్పుడు ఎంతో ఆశ్చర్యమేసేది. ముఖ్యం గా ఇప్పుడు చూసే నక్షత్రాలు ఇప్పటివి కావు ఎప్పటివో అన్న విషయం ఐతే.... ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉండేది. అంతే కాదు, ఆ విషయం గుర్తొచ్చిన ప్రతి సారీ ఎన్నో ఆలోచనల దొంతరల్లో తలమునకలవుతూ, ఏదో ఫిక్షన్ లాండ్ లో తేలుతున్నట్టుగా తోచేది. కానీ అర్ధమయ్యేది కాదు!! ఇప్పుడు అనుభవిస్తుంటే తెలుస్తుంది.

చీకటి ఆకాశం దుప్పటి అనంతంగా కళ్ళ ముందు పరుచుకుంది నా గతంలా......
గతంలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు... ఇప్పుడు నా ఆకాశం లో - చుక్కల్లా - ఎక్కడో - దూరంగా- మెరుస్తున్నాయి. మధురమైన జ్ఞాపకాల నీడలో ఆ నిముషం వెచ్చగా తోచింది. ఆ గతాన్నలాగే హత్తుకుని నిద్రపోవాలనిపించింది.

అలా చూస్తూనే ఉన్నాను. చూస్తూ చూస్తూ ఉండగా ఆకాశం నల్లని సముద్రం లా తోచింది. గతం తలూకు ఛాయల్ని తన లోతుగా చేసుకుని ఘోషిస్తున్న ఒక అనంత సాగరం అది. చుట్టూ చీకటి. భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళు పెద్దవి చేసి కదులుతున్న ఆ సాగరాన్ని చూస్తున్నాను. అమాంతంగా ఒక చీకటి అల ఎగసి నన్ను ముంచెత్తింది. కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. చీకటి అలను నా కనురెప్పలు ఆపలేకపోయాయి. అంత ఎత్తు నుండీ కళ్ళ ద్వారా నాలోకి జలపాతం లా దూకింది చీకటి. కొట్టుకుపోతా అనుకున్నా! కరిగిపోయాను. అలతో ఏకమయ్యాను. చీకటిని నిండుగా నింపేసుకున్నాను. లేక చీకటే నన్ను తనలో కలిపేసుకుందో...

చుట్టూ చీకటి. కళ్ళలో చీకటి. చీకటి తప్పితే నాకేమీ స్ఫురించటం లేదు. ఆ రాత్రి ఆ చీకట్లో నా గతంతో నేను ఒకటయ్యాను.

Thursday, February 19, 2009

..हम and జెర్రి..

అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా... వేసవి సెలవుల్లో పెద్దమ్మ, అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయి ఇంకా మా ఫామిలీ అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిసే వాళ్ళం. అ వేసవి చల్లగా లేదు [అప్పటికి గోదావరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు మరి!]. రాత్రి భోజనాలయ్యకా ఆడాళ్ళంతా విధి గదిలో టీ.వీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేల చల్లగా ఉండటం వల్ల ఒక్కొక్కరూ మెల్లగా నడుం వాలుస్తున్నారు. నేను అలానే వాళ్ళ కబుర్లు వింటూ పెద్దమ్మ పక్కన చేరి నిద్రపోయాను. ఎంత సేపయ్యిందో, ఏమయిందో తెలియదు. ఉన్నట్టుండి కేకలు విని ఉలిక్కిపడి లేచాను. చాలా గొంతులు వినిపించాయి.. పెద్దమ్మ కేకలు.. "కదలకు, అటే వస్తోంది" అన్న మిగతా వాళ్ళ అరుపులు. వంటగదిలో గోడ పక్కన చీపురుకట్ట ఉంది. త్వరగా పట్టుకు రా అని పిన్నితో అమ్మ అన్న మాటలు... నా నిద్ర కళ్ళకు కనిపించింది మాత్రం, మసక మసకగా ఒక చిన్న మెలికెల జీవి. ఆ అరుపులకి ఎటెళ్ళాలో తెలియక అనుకుంటా, అది కూడా తెగ అటు-ఇటు తిరిగేస్తోంది. దీనిని దూరంగా పంపటం నా కర్తవ్యం అని స్ఫురించటానికి ఆట్టే సమయం పట్ట లేదు. వెంటనే చేత్తో లాగి పెట్టి దానిని ఒకటి పీకాను. అది కాస్తా బెడ్రూం వైపు వెళ్ళి పడింది. అంతే, కొత్తగా పెళ్ళయిన మా పిన్ని.. "అమ్మో! మా ఆయన!" అంటూ బెడ్రూం వైపు చీపురుకట్టతో పరుగు తీసింది. ;)

మెలకువ వచ్చాక తెలిసింది ! అది ఒక జెర్రి అని. "బహుసా మేడ మీద నుంచి తెచ్చిన బట్టల్లోంచి పడింది." అనుకుంటారు, ఇప్పటికీ! అమ్మేమో "నీకు ఏమి కాలేదు కదా?" అంటూ నా చెతులు, వేళ్ళు క్షుణ్ణంగా తడిమి తడిమి చూసింది. కాసేపయ్యాకా అంతా చుట్టూ చేరి, 'బుజ్జీ, అసలు జెర్రి ని అంత ధైర్యం గా చేత్తో ఎలా కొట్టావే? భయం వెయ్యలేదా?' అని అడిగారు. ధైర్యమా.. పాడా!! నాకేం తెలుసు అది జెర్రి అని. నిద్రలో ఉండగా సడన్ గా లేపితే ఎవరినైనా పీకుతా. అలాగే దాన్ని కూడా పీకాను. కానీ దొరక్క దొరక్క దొరికిన సువర్ణావకాశం... వదులుతానా..?! "మరేం అనుకున్నారు నేనంటే ?" అని కళ్ళెగరేసి జడ మెలేశాను నేను. అప్పట్నుంచి మనం వీర నారీ మణి కేటగిరీ ఇంట్లో.. హహ..

ఎన్ని మధుర స్మృతులో బాల్యంలో...