Friday, May 28, 2010

నిన్ను...

... వెతుకుతూ ప్రపంచాన్ని చూసాను.
... కనుగొని ప్రేమని చూసాను.
... కోల్పోయి మనసును చూసాను.
... వదులుకుంటూ నన్ను చూసుకుంటున్నాను.

Thursday, May 27, 2010

గ-క్షో?!

వేరు వేరు దిక్కుల్నుంచి
పోటీ పోటీగా పరవళ్ళు తొక్కుతూ
ఒక్కోరూ ఒక్కో రంగులో
చెప్పలేని మలుపుల్లో
పసిగట్టలేని విధంగా కలిసిపోతే....
అది సంగమం.

***

బోలెడన్ని విషయాలు
క్యూ లేని వరుసలు
లెక్కలేని ఆలోచనలు
చూపుకు చిక్కని చుక్కలు [తల చుట్టూ :D]
తేల్చుకోలేనంతగా ఇబ్బంది పెట్టేస్తే...
మది సంక్షోభం.

-----------
ఇప్పుడు ఏమయింది? గ-క్షో?!

Tuesday, May 25, 2010

Way...

మొట్టమొదటి సారి కళ్ళు తెరిచాడతను. ఇది వరకు ఏదీ చూసిన జ్ఞాపకం లేదతడికి. ఏం చెయ్యాలో తెలియక దిక్కులు చూస్తున్నాడు. ఏవో శబ్దాలు వినిపించాయి, మొదటి సారి. ఇంద్రియాలొక్కక్కటిగా చేస్తున్న దాడితో కదలటానికి ప్రయత్నం చేసాడు. నడుస్తున్నాడు. అతడిని లెక్క చేయక సాగిపోతున్న వాటి ముందు అతడు నిర్భయంగా నడుస్తూ పోతున్నాడు. మధ్య మధ్యలో కొంతమంది తనని గమనిస్తున్నారన్న అనుమానం కలిగింది. కదిలిపోయాడు, వాటికి దూరంగా. అలా గమనిస్తున్నాయన్న వస్తువులు పెరిగే కొద్దీ అతడు పరుగు ప్రారంభించాడు. వాటి సంఖ్య పెరిగే కొద్దీ అతడి వేగం మరింత పెరిగింది. బెదిరిన లేడిలా పరుగుపెడుతున్న అతడు చివరికి ఒక నిర్జన ప్రదేశంలోకొచ్చాడు. ఒగురుస్తూ చుట్టూ చూసాడు. చెట్లున్నాయి. అవేవీ అతడిని గమనించటం లేదని నిర్దారించుకున్నాకా ఒక చోట కూలబడ్డాడు. అయోమయంతో ఉక్కిరిబిక్కిరిగా ఉందతడికి. కోపంగా బుసలు కొడుతున్నట్టుగా ఉన్నాడు. ఆ నిర్జన మైదానంలో చేతికి దొరికినదాన్ని ఎత్తి విసిరికొట్టాడు. గట్టిగా అరిచాడు. దూసుకునెళ్ళి ఒక చెట్టును కసి తీరా రక్కాడు. తరువాత కొట్టుకుపోయిన వేళ్ళను చూసి ఏడ్చాడు. నేలమీద పడున్న కర్రెత్తి తను రక్కిన చెట్టును శక్తి మేరకు కొట్టాడు. పెరడు లేచి జిగురు కారుతున్న చెట్టును చూసి ఆపకుండా నవ్వుతున్నాడు. నవ్వాపుకోలేక కిందపడి దొల్లుతూ, అలా ఎప్పుడు జారుకున్నాడో... నిద్రలోకి.

వెచ్చగా తగులుతున్న శ్వాసతో, ఏదో గుచ్చుకుంటున్న స్పర్శతో, చిన్నగా కలుగుతున్న బాధతో అతడికి మెలకువ వచ్చింది. సగం తెరుచుకున్న కళ్ళ ముందు నిల్చున్న వస్తువు, చిన్నగా అతడి తొడ మీద చేసిన గాయం నుండి కారుతున్న రక్తాన్ని నాకుతున్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా చావుకేక పెట్టాడు. ఆ కేక కి తోడేలు వెనక్కి జంకింది. అంతలోనే ఊపందుకుని అతడి మీదకి ఉరికింది. తోడేలు తో హోరాహోరీ పోరాటం. తిన్న ప్రతి దెబ్బతో తోడేలు రెట్టింపు బలంతో అతడి మీదకి దూకుతూ అందిన అవయవాన్నల్లా ముక్కలుగా కోరికేస్తుంది. ఆఖరికి అతడి భయం ముందు తోడేలు శక్తి ఓడిపోయింది. చేతికందిన రాయిని గాల్లోకెత్తిన అతడిని చూసి అది వణికింది. రెప్పపాటులో తోడేలు తల బద్దలయ్యింది. చచ్చింది. భయం సన్నగిల్లాకా అతడికి బాధ తెలిసింది. రక్తం కారుతున్న దెబ్బల బాధతో అతడు నేల మీద పడి దొల్లుతున్నాడు. ఎంతకాలం గడిచిందో మరి, అతడి గాయాల నుండి రక్తం కారటం ఆగింది. లేచి నిల్చున్న అతడు తోడేలు తల బద్దలుకొట్టిన రాయిని తీసుకుని నడక ప్రారంభించాడు, అతడొచ్చిన దారంటే...ఇంకో దారి లేదు మరి! అది one way.. The only way!

Sunday, April 18, 2010

తొలి చూపులోనే...

చీకట్లో మెట్ల మీద కూర్చున్న ఆమె,
మదిలో అలల హోరు జ్ఞాపకాలతో
సాగరాన్ని తలుస్తూ మురుస్తూ..
విరహాన్ని చిరునవ్వుగా పేర్చి,
జారిపోకుండా పట్టుకుంది గెడ్డం కింది చేతిలో...

అలిగిన మేఘమో,
మరి కలిగిన మేఘమో!
కరిగే సందడి చేస్తుంటే..
తల పైకెత్తి చూసిందామె.

పక్కింట్లో కొబ్బరాకు నీడన ఎదిగిన,
వంపు సొంపుల సన్నజాజి పందిరి...
వీస్తున్న సమీరానికి లయబద్దంగా
ఊగుతోంది వయ్యారంగా...

విచ్చుకున్న జాజులనే ఆభరణాలుగా ధరించి
వెలుగుతున్న పందిరిని తదేకంగా చూస్తూ,
మదిలో పరవళ్ళు తొక్కుతున్న ఊహలతో
అసంకల్పితంగా అటు వైపు అడుగులేసిందామె.

తన్మయత్వంతో అలా చూస్తుండగానే,
గాలికో జాజి ఆమె ముందు రాలింది.
పరవశం తో జాజిని స్వీకరించి,
ప్రేమగా తాకి, ముద్దాడి జడలో తురిమింది.

ఎవరి గుమ్మానికి కట్టిన చిరు గంటలో
గాలికి శ్రావ్యంగా మోగుతున్నాయి.

Tuesday, April 6, 2010

కవిత

అక్కసు ఆరాటం ఆక్రోశం ఆవేశం...
రాక పోకల ఆనవాలు లేని చీకటి ఇరుకు డొంక.
ఊపిరి సలపని ఉక్కిరిబిక్కిరి మైకపు ఆలింగనం.
విశ్వాంతరాళంలో వ్యాపించిన శబ్ద(పద) ఝరి కాఠిన్యం.
ఒకటిని రెండుగ చీల్చి ఒకటన్న భావన చెరిపి పారి ఏలిన
ఆమె సోయగం, ఆ దర్పం...
అనిర్వచనీయం అమోఘం అనంతం అమరం.


****

Wednesday, March 31, 2010

Boxing ring - round 1:)

బెంగళూరు కబ్బన్ పార్కులో ఉన్న అక్వేరియంలో తీసిన విడియో.

Tuesday, March 30, 2010

..శారదామృతం..

రద్దీ బస్సు... ఒక అమ్మాయి సీట్ లోంచి లేచి తన ఒళ్ళో కూర్చున్న పాపను సీట్ లో కూర్చో పెట్టీ బాయ్ చెప్తుంది. వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు నాకు, మాటలు అర్ధం కావటం లేదు. పాప ముఖం కనిపించలేదు కానీ తల కనిపుస్తుంది. ఆ పాప తలని అడ్డం గా ఊపేస్తుంది. "అక్క ని వెళ్ళొద్దంటోంది కాబోలు" అనుకున్నా నేను. తన మాట వినకుండా బస్ దిగిపోతున్న అక్కని చూపిస్తూ వెనక సీట్ లో కుర్చున్న అమ్మకి ఏదో చెప్పేస్తుంది, చాలా హడావుడిగా.... గోల చెయ్యొద్దని అమ్మ సైగ చేయటంతో ఊరుకుంది. కానీ ఇంకా బస్ డోర్ వైపే చూస్తుంది. ఆ స్టాప్ నుండి బస్ కదిలిన వెంటనే పాప సీట్ లోంచి దిగి ముందు సీట్ లో ఫోన్ లో బిజీగా ఉన్న ఆంటీ ని పలకరిస్తుంది. అప్పుడు ఆ పాపకు అర అడుగు దూరం లో ఉన్నాను నేను. లేత గులాబి రంగు స్లివ్ లెస్ గౌను, రంగు రంగు ల బూట్లు, రెండు చిన్న చిన్న పిలకలు, మెరుస్తున్న కళ్ళు, ఇట్టే ఆకట్టుకునే ముఖ కవళికలు, హావ భావాలు.... దగ్గరగా వచ్చిన ఆ సీతకోక చిలుకను, చిట్టి వింతను కళ్ళార్పకుండా అలాగే చూస్తున్నాను. తాను చేసిన బొమ్మకి ఒక్క మచ్చైనా పెట్టకపోతే తన మనసు[విధి] ఒప్పదేమో ఆ పైవాడికి!! ఈ బొమ్మ మూగది. చివుక్కుమంది ఒక్కసారిగా... ఆ ఒక్క సెకనులో ఎంత వికారంగా నలిగిపోయి, కృశించి, ఏడ్చిందో మనసు.. తిట్ల దండకం మొదలు పెట్టాను. ఈ లోగా ఆ పాప పైకి మళ్ళింది ధ్యాస, మళ్ళీ! ఒకటో వరసలో ఉన్న ఆంటీ, మూడో వరుసలో ఉన్న అమ్మ మధ్య వెయ్యి పచార్లు, కబుర్లు, ఫిర్యాదులు[ఆంటీ ఫోన్ లో మాటాడేస్తుందట], ఆంటీ కి ఫోన్ పెట్టెయ్యమని వార్నింగ్ లు.... పిలకలు లాగిన కుర్రాళ్ళని చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ.. తట్టి దాగుడుమూతలాడుతున్న వాళ్ళని చిన్నగా కొట్టి మందలిస్తూ, మరీ..ఈ... మాట వినకపోతే నాలిక కరిచి-కళ్ళెర్ర చేసి భయపెడుతూ చుట్టూ ఉన్నవారికి ఎన్నో మధురమైన నిముషాలు కానుకగా ఇచ్చింది. అలా భయపడ్డవాళ్ళలో 'నేనూ ఉన్నా..' అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నాకు దగ్గరగా వచ్చినప్పుడు తనని తట్టానని, నన్ను బెదిరించి ఏదో సైగ చేసింది. ఆ సైగలు అర్ధం కాలేదు, నేను నవ్వుకున్నాను. ఆ పావుగంట ప్రయాణం లో ఆ పిల్ల చుట్టూ ఉన్న వారందరినీ, కనీసం 30 మందిని, తన చేష్ఠలతో ఆకట్టుకుంది, అలరించింది. అంతలో ఒక అబ్బాయి చేతిలో ఉన్న ఫోల్డర్ ని చూపించి, 'ఇది ఏమిటి?' అన్నట్టు సైగ చేసింది. 'ఫోల్డర్' అన్నాడతను. అర్ధం కాలేదనుకుంట, అమ్మ వైపు తిరిగింది. అమ్మ పెదాల కదలిక అర్ధమయ్యేలా చెప్పింది. పాప అర్ధమైనట్టు తలూపింది. భగవంతుడా...! ఆ పాప చెవిటిది కూడా...!! చాలా సందర్భాల్లో ఈ రెండు లోపాలు కలిపే ఉంటాయని తెలుసు. మూగ, చెవిటి వారిని ఇంతకు ముందు నేను చూసాను కూడా. కానీ ఆ పాపను చూసి ఎందుకో గుండెల్లో కలుక్కుమంటోంది. ఆ పాప పేరు తెలుసుకోవాలనుకున్నాను. కానీ ఏదో మూల భయం! చేదు జ్ఞాపకం గా మిగులుతుందేమో అని... లాస్ట్ స్టాప్ వచ్చేసింది. ఆఖరుకి అడిగెయ్యాలని నిశ్చయించుకుని, బస్ దిగి వాళ్ళ కోసం నిల్చున్నా. వాళ్ళు కూడా బస్ దిగారు. పాప అమ్మ ను అడిగాను, 'ఏం పేరు?'

'శారద' అన్నారావిడ.
ఇంకెన్ని తూట్లు పొడుస్తావు భగవంతుడా.... ! :(((( అనిపించింది మనసులో..
'ఇందాక మీ దగ్గరకొచ్చినప్పుడు మిమ్మల్ని పేరు అడిగింది. మీకు అర్ధం కాలేదు' అని నవ్వారు ఆవిడ. ఏమని స్పందించాలి నేను?? చిన్నగా నవ్వాను.

వాళ్ళు వెళ్ళిపోయారు. రెండు సెకన్ల తరువాత నేను కూడా కదిలాను.
ఐతే, 'ఒక్క ఫోటో తీసుకుందాం' అన్న ఆలోచన రానివ్వని నా మొహమాటానికి, సంశయానికి నన్ను నేనే.. తిట్టుకుంటూనే ఉన్నాను ఆ రోజంతా.

సుమారు ఒక నెల తరువాత....
ఆ శారదా దేవి నన్ను ఈ రోజు కరుణించింది, అనుకోకుండా... :)

లేట్ అయిపోయిందని ఉరుకుల పరుగుల మీద బస్టాప్ కి వచ్చి, మొదటి బస్ రద్దీ గా ఉండటంతో వెనకే వచ్చిన ఇంకో బస్ ఎక్కి సీటు ఖాళీ లేనందువల్ల నిల్చున్న నేను, ఆమె చేసిన అలికిడి విని, ఏదో గుర్తొచ్చినట్టు వెనక్కు తిరిగాను. స్కూల్ యూనీఫాం లో శారద! ఎప్పటిలాగే చిరునవ్వుతో... ఎవరో తెలీని అన్నయ్యతో సీటు షేరింగ్. వాడి భుజం మీద చాలా చనువుగా వాలిపోతూ, మధ్య మధ్యలో ఇరుగ్గా ఉందని వాడి మొహం మీద చెయ్యి పెట్టి నిష్ఠూరమాడుతూ.. హహహా.... నా పంట పండింది. ఈ అవకాశం జారవిడుచుకోను. ఇంత ముందులా ఆలస్యం చెయ్యకుండా మొబైల్ లో కెమెరా ఆన్ చేసాను. కానీ, 'ఫోటో తీసుకుంటా' అని అడిగితే వాళ్ళ అమ్మ ఏమంటారో! అసలు ఎమనుకుంటారో!' అని భయమేసింది. ఒక వేళ అడిగాక కాదంటే? దొంగతనంగా తీసే అవకాశం కూడా పోతుందేమో అని.. చెప్పకుండా కొన్ని క్లిప్స్ రికార్డ్ చేసాను. నా ధౌర్భాగ్యమో, లేక ఉన్నంతలో తృప్తి పడమనో మరి, 'battery low' అంటూ సెల్ సైగ చేసింది. దాని మాట వినక తప్పలేదు. సెల్ ని బాగ్ లో పడేసి, బస్ లో రాడ్ కు వెలాడుతూ ఆ శారదామృతాన్ని సేవిస్తూ మిగతా ప్రయాణం కొనసాగించాను.

'మళ్ళెప్పుడొస్తుందో.......' :)