వేణువూది, పరవశించే మదిని యేమార్చి, ఊరేగించి, లాలించి, వశపరచుకుని,
ఆఖరుకు, నీ సన్నిధినే పరమపథమని నిష్కల్మషంగా, అమాయకంగా భావించినపుడు, అదే అదనుగా...
ఇది భ్రమనీ, తాత్కాలికమనీ, నీది కాదనీ, అసలు నీదనేది ఏదీ లేదనీ గుర్తుచేసి, ఉన్న ఫళాన వెళ్ళగొట్టీ....
ఆ విసురుకు రెక్కలు విరిగి, నేల కూలిన పక్షిలా, బ్రతకలేక, చావు రాక, చితికిపోయి దయనీయంగా ఉన్నప్పుడు...
చిరునవ్వు చిందిస్తూ, కారే కన్నీరుకు 'మాయా మోహాల నుండి విముక్తి'గా అద్వితీయమైన, అమోఘమయిన, లోకాతీతమయిన భాష్యం చెప్పే వాడివి.... ఏమిటి నీ గొప్ప??? ప్రభూ!!
ఉన్నదంతా దోచేసే దొంగలు నీకన్న మేలు కదూ?!!! కనీసం మనసును గాయపరచక, మిగిల్చి పోతారు.
Wednesday, October 28, 2009
Friday, October 16, 2009
వెలితి
రోడ్లు వెడల్పు చేసేందుకు అప్పుడప్పుడూ చెట్లు నరికేస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశాలు నేను చాలా సార్లు చూసాను. ఐనా ఎందుకో అలాంటి దృశ్యం చూసినప్పుడల్లా లోలోపల లోతుల్లో ఎక్కడో..... చెప్పలేని బాధ. ఆ ప్రాణం కొణ్ణేళ్ళుగా ఎదిగి, వికశించి, ప్రేమించి, ఉన్నది పంచి, ఈ రోజు ఇలాంటి దుస్థితికి గురయ్యిందే, కర్కసత్వానికి బలయ్యిందే అన్న వేదన. నిర్దాక్షిణ్యం గా వేళ్ళతో సహా పెకిలించేస్తున్న ఆ దృశ్యాన్ని చూస్తున్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి!! ఆమెకెంత నొప్పి కలుగుతుందో అన్న ఆలోచన వస్తూనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. మనిషిగా పుట్టినందుకు సిగ్గేస్తుంది. ఇది ఇలా ఉంటే..... తన శరీరాన్ని చీల్చుకుని ప్రాణం పోసుకుని, ఇన్నేళ్ళుగా ఎదుగుతున్న నేస్తాన్ని తానే మోస్తూ, చూస్తూ గర్వం తో పొంగిపోతుండగా.... "మీ బంధం ఇక ఇక్కడితో అంతం" అంటూ ఈ రోజు గునపపు పోట్ల పడ్డాయి. తన కళ్ళ ముందే తానెంతో మురిపెంగా పెంచుకున్న స్నేహం తనకి దూరమవుతోంది. ఈ హటాత్పరిణామాన్ని తట్టుకోలేక, ఆ గునపాలు చేసే గయాలను సైతం లెక్క చెయ్యకుండా తన నేస్తాన్ని కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఒక పక్క వృధా అవుతూంటే... ఆ స్నేహం తాలూకు ఆనవాళ్ళు కూడా మిగలనివ్వకుండా, వేళ్ళతో పాటుగా పెకిలించేస్తున్నప్పుడు ఆ హృదయం ఎంత బాధపడి ఉంటుందో!! ఎంతగా కృంగిపోయి ఉంటుందో!! తగిలిన పోట్ల కంటే... అవి తనలో మిగిల్చిన ఖాళీ భారమైంది, భరించలేనిది. ఏం చేసి భర్తీ చేయగలం ఆ ఖాళీని? ఎవరు పూడ్చ గలరు ఆ వెలితిని?? మన రహదారులెంత విశాలం చేసుకున్నా, మన మనసులెందుకు ఇంకా ఇంత సంకుచితంగా ఉన్నాయి??!
Friday, October 9, 2009
నింగిలో రాగాలు.....
ఒక నిండైన అనుభవం కలిగినప్పుడు అబ్బురంగా తోచింది, అదృష్టం అనిపించింది.
గుర్తొచ్చిన ప్రతి సారీ అందం పంచింది, ఉబ్బితబ్బిబ్బయ్యెలా చేసింది.
పదే పదే ఎదురుపడి నన్ను హత్తుకుంటుంది, పడదోస్తుంది, పడబోతే చేయందిస్తుంది.
నిలువునా తడిపేస్తున్న ఈ అనుభవాల జల్లులు జీవితపు కిరణాన్ని మృదువుగా తాకి శృతి చేస్తున్నాయి.
సప్త స్వరాలు పలికే సప్త వర్ణాలను అవిష్కరిస్తున్నాయి.
గుర్తొచ్చిన ప్రతి సారీ అందం పంచింది, ఉబ్బితబ్బిబ్బయ్యెలా చేసింది.
పదే పదే ఎదురుపడి నన్ను హత్తుకుంటుంది, పడదోస్తుంది, పడబోతే చేయందిస్తుంది.
నిలువునా తడిపేస్తున్న ఈ అనుభవాల జల్లులు జీవితపు కిరణాన్ని మృదువుగా తాకి శృతి చేస్తున్నాయి.
సప్త స్వరాలు పలికే సప్త వర్ణాలను అవిష్కరిస్తున్నాయి.
Subscribe to:
Posts (Atom)