Sunday, September 27, 2009

వాన వెలిసిన ఒక ఉదయం....

నీలం లో తెల్ల మేఘాల జంట వీడ్కోలు పాడుకుంటున్నాయి...,
దూరం గా గిర్రు గిర్రున తిరుగుతూ, తూలుతూ గాలి పటం నిరసన వ్యక్తం చేస్తుంది.
ఒంటరి తూరీగ ఒకటి ఆశగా ఎగురుతుంది.
చెట్ల ఆకుల మధ్య వెలుగు చనువుగా చేరిపోయింది.
తడిసిన ఇసుకలో వాన నీరు ధారలు కట్టి పారుతోంది.

**************************

నిన్నటి వరకూ బొద్దింకల గబ్బు కంపు...
వాన పడిందిలే, అనుకుంటే ఎలుకలు వదల్లేదు, ఈ రోజు కూడా...
ముక్కలుగా కొరికిన వాటిని కుప్పలుగా పోస్తున్నాయి.
వరదొస్తే కొట్టుకుపోయేవేమో....!!
వానొచ్చి చిందర వందర చేసి, ఇప్పుడు గమ్మునుంది.
మట్టిలో కడిగిన చెత్త కొత్త వాసనలు గుమ్మరిస్తుంది.

***************************

దూసుకొచ్చిన కాంతి రేఖను రాలుతున్న చినుకు విచ్చిన్నం చేసింది.
ఎక్కడో... గోడ పగుళ్ళ వెలితుల్లో ఒక విత్తు మొలిచింది.

Wednesday, September 16, 2009

ఎక్కడికీ పయనం?

ప్రతి నిమిషం, ప్రతి ఒక్కరం ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటామని అంత ముందు ఎక్కడో రాసుకున్నను. క్రితం నిమిషం వరకూ కూడా అలానే అనుకున్నాను. ఇప్పుడు నా ఆలోచన మారుతున్నట్టు అనిపిస్తుంది.

ప్రతి నిమిషం, ప్రతి ఒక్కరం స్థిరత్వం కోసం పరితపిస్తున్నామని అనిపిస్తుంది....

ఒకడు ఇస్తున్నాడు. ఒకడు పుచ్చుకుంటున్నాడు. ఒకడు నవ్వుతున్నాడు. వేరొకడు ఏడుస్తున్నాడు. ఒకడు పూజిస్తున్నాడు. ఇంకెవడో కక్ష సాధిస్తున్నాడు. ఒకడు కష్టపడుతున్నాడు. ఒకడు సర్దుకుపోతున్నాడు. ఇలా ఎవరేం చేసినా వారు నమ్మిన ఎదో ఒక విషయంలో స్థిరత్వం పొందటానికే ప్రయత్నిస్తున్నామేమో! సరిగా చూస్తే మనుషులే కాదు, వస్తువులు కూడా.. ఎత్తు నుంచి పడుతుంది, జారుతుంది, స్థిరత్వం పొందే వరకూ. అణు స్థాయిలో కూడా ఒక స్థిరమైన స్థితి పొందే వరకూ ఇచ్చి-పుచ్చుకోవటాలు జరుగుతుంటాయి. నీరు వాలు వెంట పారుతుంది.

ఇలా సృష్ఠిలో ఏ పదార్ధం అయినా, జీవి అయినా, వస్తువు అయినా సరే తన పరిధిలో భౌతిక, సామాజిక, మానసిక మరేదైనా దృక్పథాల్లో ఎక్కడైతే తనకు స్థిరత్వం లేదో ఆ విషయంలో స్థిరత్వం పొందే దిశగా జీవిత ప్రయాణం సాగిస్తుంది. ఇదే సృష్ఠి తనను తాను అలవోకగా నడుపుకునే విధానం?!!

ఒక అద్భుతం ఏమిటంటే జ్ఞానం స్థాయితో పాటుగా ఈ నిర్దేశికాల సంఖ్య పెరగటం! అంటే రాయి, నీరు, గాలి లాంటి వాటిలో భౌతిక; మొక్కలు, జంతువుల్లో భౌతిక, రసాయన, జైవిక; అంశాలు నిర్దేశికాలవుతాయి. మనిషి విషయానికొచ్చేసరికి వీటన్నితోపాటు సామాజిక, మానసిక, మనస్తత్వ స్థితులు కూడా అంశాలవుతాయి. ఇలా ఇన్ని అంశాల స్థితి గతుల ఫలితం మనిషి జీవన పయన మార్గం. అదే మనిషి జీవితానికి అందం, అబ్బురం చేకూరుస్తుందనుకుంటా... అలానే క్లిష్ఠతను కూడా!!

ఇలా కొనసాగే పయనాల్లో ప్రేమ అనేది ఒక ముఖ్యమైన ఉత్పాదకం మాత్రమే?!!

ఒకప్పుడు ఇలా... అనుకున్న ఒక ఆలోచనని ఈ రోజు అలా కాదు ఇలా.. అని కొత్తగా అవిష్కరించుకున్నాను. చూడాలి నా పయనం ఎటు సాగుతుందో!! :)


*******************
నాలో ఆలోచనని ఈ దిశగా ప్రేరేపితం చేసిన నేస్తానికి కృతజ్ఞతలు.

Tuesday, September 15, 2009

లైవ్ షో..

కొంచం పిండి నీలి మందు డబ్బాలో పోసుకోవచ్చు అన్నట్టున్న ఆకాశం మీద,
టైడ్! అవాక్కయ్యారా? అన్నట్టు తెల్లగా, చిక్కగా మెరిసిపోతున్న మబ్బులు.
వాళ్ళలో వాళ్ళు ఎవో కబుర్లాడుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటుంటే,
"నాతోనే, నాతోనే..!!" అని మురిసిపోతూ, కళ్ళు అప్పగించి టీ.వీ చూసే ప్రేక్షక పాత్రలో ఉన్న నాకు....
పగలే ఇక వెన్నెలా, జగమే ఒక ఊయలా~~~

**********

ఆవేశంతో ఊగిపోతూ బస్సెక్కిన నా పై ఆకాశంలోని ఆ మబ్బులు ఏం మందు చల్లాయో మరి! నే చేసిన గంటన్నర సేపు ప్రయాణం అచ్చం గా వాటితోనే ఏవో ఊసులాడుతున్నట్టే సాగిపోయింది. ఆ ఊసులేమిటో అంతు పట్టని నా మెదడును, "అంత కష్టపడకు, ఆ ఊసులు నాతో." అని ఏదో చెప్పి మనసు సమాధానపరచింది. గట్టు మీద నుంచి ఇసుక తిప్పలోకి దూకినట్టు, అమాంతం ఈ నేల మీది నుంచి ఆ ఆకాశాంలోకి దూకి ఆ నీలంలో మునిగిపోయి, కావాల్సినంత సేపు ఆ నింగిని అలానే పట్టుకుని ఉండాలన్న కోరిక పుట్టకపోలేదు. కానీ అలా కుదరదు కదా... వీలైనంత సేపు ఆ నీలాన్ని, ఆ మబ్బుల ఆకృతుల్ని కళ్ళతోనే తాగేసాను. ఎంత చేసినా, ఎంత చూసినా తృప్తి తీరదే!!

Thursday, September 3, 2009

మన్-దారం


మాట రాని ఊసు ఏదొ మౌనమై చూస్తుంది.
ఊహ లేని పలుకు ఏదొ గోడమల్లె కూర్చుంది.

ఊసులకు వారధి, చూపులే కట్టేది.
చూపులకు బాట, తలపులే వేసేది.

తలపులన్ని తలుపులేసి భద్రపరచి ఉంచేవా..?
భద్రమైన మనసు చూసి నిగ్రహమని మురిసేవా..?