Friday, January 25, 2019

నా మాట నమ్మండి

ఏందుకో యీ యాతనా తపనా మనో వేదనా!
ఇది ఇక ఎప్పటికైనా నన్ను వదిలి పోవునా?!

విధి వికటించి
తలరాత పిచ్చిగీతలా తోచి
కాయం మానల్లే ఎండి
గాయం పుండుగా మారి
గుండె యాంత్రికంగా కొట్టే ప్రతి పోటూ
గునపంలా దిగుతుంది

దిగులో బాధో విచారమో మరి పైత్యమో
ఎదైనాకానీ మందు ఒకటే లాగుంది.
వేలు విడిచిన వివేకం చెప్తుంది.

ఏడ్చినట్టుంది...
మనిషికి మెదడుకి మందు పని చేస్తుందేమో కానీ

ఇది మనసుకి పట్టిన దెయ్యం
పీక కాదు గుండె పట్టుకుంటుంది
ఇది రక్తం తాగదు కానీ
దాని పళ్ళు దిగిన గుండె
మెల్లగా జీవస్చవమై బీటలు వారి
చిట్లి దానంతటదే ముక్కలవుతుంది.

పేదరాసి పెద్దమ్మ కథలో
విక్రమార్కుడి కథల్లో రంగులో
ఖాస్త ఊరట కలిగించొచ్చు
అంతకుమించి లాభం లేదు.
తెరచిన అరచేతులు గాల్లో ఊపుతూ
అంది అన్నీ తెలిసిన ఒకామె

ఇలాంటి క్లిష్ఠ పరిస్థితుల్లో
మూతి బిగించి చేతులు ముడుచుకుని
కుదరదని కూర్చుంటే ఎట్లా...

అయ్యో..! చెప్తుంటే వినరే
దెయ్యం పట్టిందంటే నమ్మరే!!

నా మాట నమ్మండి.
ఆ విషం ఊరంతా పాకేలోగా
విషయం గ్రహించండి
జాడీలో పట్టండి
పొలిమేరలోకి తీసుకుపోయి పూడ్చేయండి.
రోదిస్తూ చెబుతోందో వనిత.