Wednesday, March 23, 2011

చిన్ని చిన్ని విషయాలే...

నువ్వు లేని నాడు నేను భోజనం మానెయ్యలేదు, నిద్ర మానెయ్యలేదు, కలలూ ఆగలేదు. నవ్వటం మానెయ్యలేదు, తిరగటం మానెయ్యలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దగా ఏమీ మారలేదు. ఎప్పటిలాగే సమయానికి తగ్గట్టు అన్ని పనులూ జరిగిపోతున్నాయి. పెద్ద మార్పులేమీ లేవు. భోజనం లో ఉప్పులేదన్న సంగతి పసిగట్టకపోవటం, ఎప్పటిలాగే ఏదో సాధించాలన్న థీంతో సాగే నా ప్రతి కలలో ఉన్నట్టుండి నువ్వు ఎదో మూల నుంచి వచ్చి, ఏదో చెప్పి మరింకేదో మూలలో మాయమవటం. నా నవ్వు వెంటే, 'ఇప్పుడు నువ్వు ఉంటే ఎలా స్పందిస్తావో' అన్న నీడ లాంటి ఆలోచన... లాంటీ చిన్న చిన్న మార్పులు తప్పితే పెద్ద మార్పులేమీ లేవు. కానీ జీవితం అంటే చిన్ని చిన్ని విషయాలే కదా...

నువ్వు లేనప్పుడు, ఇదంతా ఏంటి ?? ఇది నువ్వా? లేక నువ్వు ఆక్రమించిన నేనా? చిత్రంగా తోస్తుంది. నువ్వు పరిచయం కాకముందు కూడా నాలోనే ఉండి, నువ్వు పరిచయం అయ్యాక మాత్రమే బయట పడి, అది నేనా, నువ్వా, నీలాంటి నేనా, నాలాంటి నువ్వా?? అనేది అర్థం కాకుండా, నన్ను ప్రశ్నల ఊబిలో పడేసి ఉక్కిరిబిక్కిరి చేస్తూ... ఓసారి ఇదని, ఓసారి అదని, ఇంకోసారి సమస్తం అదేనని, మరోసారి ఇదంతా తాత్కాలికమైన ఆకర్షణ అని, నన్ను అయోమయం పాలు చేస్తుంది ఎవరా...! అని ఆలోచిస్తూ ఉంటే ఒక పాటలోని లైన్లు గుర్తొస్తున్నాయి.
'నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు...
నీ ప్రేమనే ప్రశ్నించుకో, ఆ నింద నాకెందుకు..!'

అంటే నా పుణ్యమో,పాపమో దానికి నెనే బాధ్యురాలినా..? :-) అంతేలే..! ఎంతైనా నువ్వు వేరు, నేను వేరు కదా. ఆలోచనలు వేరు, ఆశయాలు వేరు, ఇష్టాలు వేరు, అభిప్రాయాలు వేరు, చూసే దృక్కోణాలు వేరు, జీవితంలో మన దారులు వేరు. మరి నాలో ఉన్న అదేదో నాలా కాక నీలానే ఎందుకు కనిపిస్తున్నట్టు ?? ఒకరి సమస్య ఇద్దరిది అని ఎందుకు అనిపిస్తుంది? ఒకరికి గాయమైతే ఇంకొకరి మనసు ఎందుకు విలవిలలాడటం కాదు.. గాయం అవుతుందేమో అన్న ఆలోచనే భరించలేనిదిగా వుంటుందే.... ఎందుకు? నీలో నన్ను నేను identify చేసుకోవటం వల్ల??

ఒకరికొకరు స్పందించటం != ఇద్దరూ ఒకటే
నీలో నన్ను నేను identify చేసుకునే పరంపరలో... నువ్వు - నేను వేరన్న చిన్న విషయం మర్చిపోతున్నాను!

నీ ప్రేమనే ప్రశ్నించుకో, ఆ నింద నాకెందుకు..!

ఏమో  అనుకున్నా..! ఎంత సూక్ష్మం ఉంది ఈ వాక్యం లో!!
ఒక్కో సారి అతి చిన్న విషయం కూడా చాలా క్లిష్టమయిపోతుంది కదా ఆలోచనల్లో పడి..?

 
********
జీవితం చిన్న చిన్న విషయాలలోనే వికసిస్తుంది, ఆదమరిస్తే హరిస్తుంది కూడా...
చిన్నవి  అనేవాటికి హద్దులు ఉంటాయి. ఉండాలి! అందుకే అవి చిన్నవి. ఆ హద్దులు మనం గ్రహించం. అంతే!
పొరపాటున ఎవరైనా గుర్తు చేసినా ఒప్పుకోం, నచ్చదు. మాయ అందించే ఆనందం అలాంటిది మరి!, వదిలే వరకూ.

Thursday, March 3, 2011

గుప్పెడు గుండె - చిల్లు కుండ

అరడుగు దూరాన ఉన్న ఆనందాన్ని పట్టుకోడానికి జీవితకాలం సరిపోదు.
'ఉందీ...' అన్నామా, ఎంటనే జారిపోద్ది. గాల్లాంటిదా ఆనందం...?!!
పీల్చుకుని ఉంచేసుకుంటా అంటే కుదరదు.
వదిలెయ్యాల... మళ్ళా దానెనక పరిగెత్తాల.. :)


********
గుప్పెడు గుండెలో పుట్టిన ప్రేమని వర్ణించటానికి మొత్తం సాహిత్యం సరిపోదు.
ఎంత వడిసిపట్టుకుందాం అన్నా లాభం లేదు, గుండె చిల్లు కుండే!!
పోవాల...... మళ్ళా రావాల... :)
ఆగిందా.., బీడువారిన నేల్లాగా పగుళ్ళుపోయి పంట పండదు. రసహీనం!---------------------------------------------
ఇందుకేనా ధ్యానాన్ని ఊపిరితో ముడెట్టారు???!!!!
నాకింకా ఎవేవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, బాబోయ్...! :P