Monday, July 19, 2010

గగనకాంత

వలవో కలవో
వదిలిపోని ఎద లయవో....:)

నిదురించే కళ్ళలోన నీలి గగనమై నిలిచావు.
చుక్కలన్ని నావంటావు. చందమామ నీవంటావు.
నవ్వుతూ వస్తావు, రోజుకో వన్నెలో వెన్నెలంత పంచుతావు.
అంతలోనే సెలవంటావు. రెప్పపాటులో మాయమవుతావు.

పక్షాలెన్ని గడిచినా పుంతలెన్ని తొక్కినా
ఋతువులెన్ని మారినా రంగులెన్ని కూర్చినా
గాథలెన్ని చేరినా గమ్యమెటు సాగినా...
నేస్తమా నీకోసం
వేచిఉండగలను నే గగనకాంతనై.

Friday, July 9, 2010

మీమాంస


కలల కొలనులో అలలు గలగలలాడగ
కళ్ళ వాకిళ్ళలో ఆశలు మెల్లగ వాలె.
నడిరేయికి నన్నోదిలి నా కాలమెటు పోయెనో...
సడిచేయకనే ఈ జాము దాటగలనా..
తెలి పొద్దు వెలుగులో మంచులా మెరిసి మాయమవు ఘడియ దాక
నే వేచి ఉండగలనా...
మేలి ముసుగు అంచుల్లో వాసనలన్ని దాచేసి సమయపు
గడియ నే తీయగాలనా.....

Tuesday, July 6, 2010

గుర్తు

'రాలేదా?' అన్నా రాలేదు నీకు.
రావద్దన్నా రాక మానను నేను.
జరిగిన నాడు నేనో సరస్సుని.
ఎరుగని నాడొక మంచుగడ్డని.
వెచ్చని ఎదలో కరిగిన, ప్రవాహాన్ని.
కలిగిన మనసును కోసే కాఠిన్యాన్ని.

Friday, July 2, 2010

సాఫ్ట్ కష్టాలు...

నా క్లాస్మేట్ ఫ్రెండ్ ఒక సారి 'soft pals' అని సంబోధించాడు మమ్మల్ని. అదే సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ ని.
నిజమే కదా... ఎంత సాఫ్ట్ గాళ్ళం మేం!! డీసెంట్ గా రెడీ అవుతాం. ఎవడేమైపోయినా పట్టించుకోం. ఆకాశం ఊడి పడిపోతున్నా సరే మా డెస్క్ ల దగ్గరే కాపురం ఉంటాం.

'ఇదేంటీ ఇలా మాట్లాడేస్తున్నాను, నేను సాఫ్ట్ గా కదా చెప్పాలీ...అపచారం, అపచారం!'

ఎక్కడున్నానూ, ఆఆ..... పట్టించుకోం! సో, సాఫ్ట్ గా చెప్పాలంటే, ఖాళీ దొరికితే ఏ మాల్ కో, పబ్ కో, సినిమా కో వెళ్ళి మా తిప్పలు మేం పడాతాం. ఇంకా సమయం చిక్కితే నిద్రపోతాం! అంతే గానీ ఎవరి విషయాల్లోనూ తల దూర్చం!! ఆఖరికి సొంత విషయాల్లో కూడా.. :P

అలా మేనేజర్ పాపాలు మేనేజర్ కే వదిలేసి, శాంత మూర్తుల్లా, ఆశ్రమవాసుల్లా గడిపే మా జీవితాల్లోనూ చెప్పుకోలేని ఒక కష్టం ఉంది!!! అదీ..........................

ఏదీ ప్రభావం చూపలేని మా సాఫ్ట్ గాళ్ళకి, అదేంటో గాని, శుక్రవారం 4 అయ్యేసరికి మాత్రం ఎదో అద్వితీయామైన శక్తి మా డెస్క్ నుంచి, వర్క్ స్టేషన్ నుంచి దూరంగా లాగేస్తూ ఉంటుంది. ఒక బలమైన ఆకర్షణ ఏదో మమ్మల్ని బయటకు విసిరికొట్టటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ అద్వితీయ శక్తికి ధీటుగా, ఘాటుగా సమాధానం చెప్పగలిగేది కేవలం...........

'RELEASE'

రిలీస్ అన్నది కేవలం పేరుకే.. నిజానికి ఇదో బంధనం!! ఏం చెప్పేది మా సాఫ్ట్ కష్టాలు..! :(