Tuesday, December 21, 2010

ఆ రాత్రి...

రూమ్మేట్ కలవరింతలతో  మెలకువ వచ్చింది. తనని పిలిచాను. తను ఇంకా కలవరిస్తూనే ఉంది. ఈ సారి గట్టిగా అరిచినట్టే పిలిచాను. స్పృహలోకొచ్చి పక్కకు తిరిగి పడుకుంది తను. నేనూ పడుకున్నా, నిద్ర పట్టలేదు. రూమ్మేట్ వైపు చూసాను. నిద్రపోతుంది. గట్టిగా శ్వాస తీసుకుని నిద్రపోవాలని ప్రయత్నించాను. ఎంత సేపు ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఎందుకో చీకటి... కళ్ళలో గుచ్చుకుంది. నాతో కాసేపు కబుర్లు చెప్పవూ అని చనువుగా నా పక్కన కూర్చున్నట్టు తోచింది. లేచి రూం బయటకు నడిచాను. చలి బాగా ఉంది. వీధి తలుపు మెల్లగా వేసి, వేసుకున్న స్వెటర్ ను కౌగిలించుకుని మేడ మెట్లెక్కాను. చలిలో చీకట్లో ముడుచుకుని పడుకున్నట్టుంది ప్రకృతి.

ఎన్నాళ్ళైంది ఇలా ఏకాంతంగా కాస్త సమయం గడిపి..! బహుశా 2 యేళ్ళైనట్టుంది. నేల మీద వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని చూస్తున్నాను. ఆహా...! ఎంత అందంగా ఉందీ. రాత్రి పూట నక్షత్రాలతో నిండిన ఆకశం చూడటం అంటే నాకు చాలా ఇష్టం. చాలా అంటే చాఆఆ......లాఆఆ ఇష్టం. ఎకాంతంలో అలా ఆకాశాన్ని చూసిన ప్రతి సారీ ఒక అప్యాయమైన భావం ఏదో మనసును అల్లేసుకుంటుంది . చిన్నప్పుడు డాబా మీద పడుకుని ఆకాశాన్ని చూసేప్పుడు నాన్న ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉండేవారు. కొన్ని సార్లు 'నక్షత్రాలు కదులుతున్నాయి' అంటే, అవి ఉపగ్రహాలనీ... అలాగే, పక్క పక్కనే కనపడుతున్న నక్షత్రాలు నిజానికి చలా దూరం దూరంగా ఉంటాయని... ఇలా ఎన్నో! విని అప్పుడు ఎంతో ఆశ్చర్యమేసేది. ముఖ్యం గా ఇప్పుడు చూసే నక్షత్రాలు ఇప్పటివి కావు ఎప్పటివో అన్న విషయం ఐతే.... ఎన్ని సార్లు విన్నా కొత్తగా ఉండేది. అంతే కాదు, ఆ విషయం గుర్తొచ్చిన ప్రతి సారీ ఎన్నో ఆలోచనల దొంతరల్లో తలమునకలవుతూ, ఏదో ఫిక్షన్ లాండ్ లో తేలుతున్నట్టుగా తోచేది. కానీ అర్ధమయ్యేది కాదు!! ఇప్పుడు అనుభవిస్తుంటే తెలుస్తుంది.

చీకటి ఆకాశం దుప్పటి అనంతంగా కళ్ళ ముందు పరుచుకుంది నా గతంలా......
గతంలో ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు... ఇప్పుడు నా ఆకాశం లో - చుక్కల్లా - ఎక్కడో - దూరంగా- మెరుస్తున్నాయి. మధురమైన జ్ఞాపకాల నీడలో ఆ నిముషం వెచ్చగా తోచింది. ఆ గతాన్నలాగే హత్తుకుని నిద్రపోవాలనిపించింది.

అలా చూస్తూనే ఉన్నాను. చూస్తూ చూస్తూ ఉండగా ఆకాశం నల్లని సముద్రం లా తోచింది. గతం తలూకు ఛాయల్ని తన లోతుగా చేసుకుని ఘోషిస్తున్న ఒక అనంత సాగరం అది. చుట్టూ చీకటి. భయం వేసింది. గుండె వేగంగా కొట్టుకుంది. కళ్ళు పెద్దవి చేసి కదులుతున్న ఆ సాగరాన్ని చూస్తున్నాను. అమాంతంగా ఒక చీకటి అల ఎగసి నన్ను ముంచెత్తింది. కళ్ళు గట్టిగా మూసేసుకున్నాను. చీకటి అలను నా కనురెప్పలు ఆపలేకపోయాయి. అంత ఎత్తు నుండీ కళ్ళ ద్వారా నాలోకి జలపాతం లా దూకింది చీకటి. కొట్టుకుపోతా అనుకున్నా! కరిగిపోయాను. అలతో ఏకమయ్యాను. చీకటిని నిండుగా నింపేసుకున్నాను. లేక చీకటే నన్ను తనలో కలిపేసుకుందో...

చుట్టూ చీకటి. కళ్ళలో చీకటి. చీకటి తప్పితే నాకేమీ స్ఫురించటం లేదు. ఆ రాత్రి ఆ చీకట్లో నా గతంతో నేను ఒకటయ్యాను.