Sunday, October 24, 2010

చిరు కానుక

అది నాకెంతో ఇష్టమైన మొక్క. ఎంత అంటే.. వదిలుండలేనంత!! ఆ మొక్కని చూస్తూ ఎంచక్కా అనిపిస్తుంది. వెన్నెల్లో అర విరిసిన పూలతో ముచ్చటగా కనిపించినపుడు ముసి ముసిగా నవ్వుకుంటూనో, నీరెండ సమయంలో ఆ మొక్క నీడలో నిల్చున్నప్పుడు కొమ్మల అంచుల మీదుగా వచ్చే గాలిని పూర్తిగా ఊపిరిలోకి నింపుకుంటూనో, తెలవారు జామునే నిద్రకళ్ళతో తలుపు తెరవగానే వంటిని తాకే చల్లని గాలి స్పర్శతో చటుక్కున విచ్చుకున్న కళ్ళ ముందు చిన్నగా ఊగుతూ శుభోదయం చెప్పుకుని పలకరించుకుంటూనో... ఇలా ఆ మొక్కతో గడిపిన మధురమైన క్షణాలెన్నో ఉన్నాయి.

కానీ ఏం చేస్తాం, నిండా పూలు పూసే నిలువెత్తు మొక్కని నా స్వార్ధం కోసం పీకి తేలేను. అందుకే ఒడుపుగా కాస్త బెరడు తెచ్చుకున్నాను. నే నాటిన విత్తు మొలిచి ఎదుగుతుండగా, అదును చూసి అంటు కట్టాను.

అంటైతే కట్టాను కానీ... ఇప్పటికి ఒక్క పువ్వు కూడా పుయ్యలేదు! అసలే వెయ్యి అనుమానాలతో లక్ష దణ్ణాలతో చేసిన పని..!

"దేవుడా... దేవుడా!!" అని ఓ పక్క ఆశ కొద్దీ దేవుడిని విసిగించటం. ఇలా రోజుకు పది సార్లు వచ్చి పూల కోసం చూసుకుంటున్నప్పుడు, 'అంతగా ఎదురు చూస్తే ఫలితం రాదేమో!' అన్న వెధవ శంక ఇంకో పక్కన..


అనుకున్నంతా అయ్యింది! నేను భయపడినట్టే ఒక రోజు మొక్క ఎండిపోయింది. అన్ని సార్లు చూసుకుంటూ కూడా ఈ పరిణామాన్ని ఎలా నేను గమనించలేదో నాకు అంతు చిక్కలేదు. ఆ బాధతో రెండు రోజులు అన్నం తినలేదు నేను. ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి 'ఛ..ఛ..! మొక్క ఎండిపోతే ఇలా ఏడుస్తూ కూర్చుంటారా..' అని పక పకా నవ్వేసరికి నాకు కోపం వచ్చి ఫోన్ పెట్టేసాను. తనే మళ్ళీ ఫోన్ చేసి 'ఏం కాదులే.. ఎండ సరిగా తగులుతోందా, నీళ్ళు సరిగా పోస్తున్నామా చూసుకో. నీళ్ళూ ఎక్కువైనా మొక్క చచ్చిపోతుంది సుమా..!' ఇలా చెప్పుకుంటూ పోయింది.

అసలే...'చచ్చిపోతుంది' అన్న ఊహే కష్టంగా ఉన్నప్పుడు తను అలా అనే సరికి తన్నుకుంటూ ఏడుపొచ్చేసింది. 'మళ్ళా మాట్లాడతా' అని ఫోన్ పెట్టేసి డాబా మీదకెళ్ళి ఒక మూల కుర్చుని చాలా సేపు ఏడ్చాను. అలా ఏడ్చి ఏడ్చి ఎప్పుడు నిద్రపోయానో మరి లేచి చూస్తే 3 అయ్యింది. కిందికొచ్చి రూంలో పడుకున్నాను.

మర్నాడు నుండి మొక్కకు సమయానికి పోషణ తప్పితే పూల కోసం ఎదురుచూడటం తగ్గిపోయింది. ఈ మార్పు ఎలా వచ్చిందో ఎందుకొచ్చిందో నేను గమనించలేదు. అలా ఒక 3 వారాలు గడిచిపోయాయి....

ఆఫీసులో పని ఒత్తిడి బాగా పెరగింది. కొన్ని రోజులు ఎప్పుడు వస్తున్నా, ఏం తింటున్నా, ఎంత సేపు పడుకుంటున్నా, ఏం చేస్తున్నా అనేది తెలీకుండా రోజులు దొర్లిపోయాయి. అలా ఎన్ని రోజులో కూడా సరిగా గుర్తులేదు.

ఈ రోజు ‘ప్రాజెక్ట్ రిలీజ్'.... హమ్మయ్యా అయిపోయింది ఈ రోజుతో. కాస్త ప్రశాంతం గా ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటూ ఇంటికొచ్చి స్నానం చేసి, హాయిగా పప్పన్నం లో అమ్మ పంపిన ఆవకాయి కలిపి భోం చేసి, సినిమా చూస్తూ సోఫాలో నిద్రపోయాను.


పక్షుల కూతలతో మెలకువ వచ్చింది. అయిదున్నర అయిందేమో.. మళ్ళీ ముసుగేద్దాం అనుకున్నా... కానీ చాణ్ణాల్ల తరువాత నిద్రలేపిన నెస్తాలను పలకరించాలన్న కోరికతో లేచి వెళ్ళి వీధి గుమ్మం తెరిచాను. రయ్యి మంటూ తగిలింది ఐస్ లా  చల్లని నవంబరు గాలి. వెంటనే చేతులు ముడుచుకుని, ఒక చేత్తో ఇంకో చేతిని రుద్దుకుంటూ బయటకి వచ్చాను.


నా మొక్క.......... నే విత్తు నాటి అంటు కట్టిన మొక్క...... చిగురులేసింది!!

లేలేత ఆకుల పక్కగా విరిసిన ఒక పువ్వు, పక్కనే చిన్ని చిన్ని మొగ్గలు నాలుగు!!!

ఆ దృశ్యం చూడగానే ఇక ఆగలేదు, అనురాగంతో కూడిన కృతజ్ఞత తో కూడిన ఆనందంతో వెల్లువెత్తిన భాష్పాలు వరదలా కారిపోయాయి కళ్ళలోంచి. తొలి పొద్దు వెలుగు రేఖ ఒకటి, పూవు మీదున్న నీటి బొట్టును తాకి మెరిసింది. ఆ పూవును కోసి మోహన కృష్ణుడికి కానుకిచ్చాను.

Friday, October 15, 2010

కన్నీటి చుక్క

కళ్ళలో గుచ్చుకుంది ఆ నిమిషం.

కాటుకతో కప్పిపుచ్చే ప్రయత్నంలో, కుదరదంటూ వేలి కొస ఆసరాతో గడపదాటింది.

అర సెకనులోనే నమ్ముకున్న ఆసరా నీడనివ్వలేదన్న నిజం తెలిసి కృంగిపోయింది.

తొందరపాటు అడుగు తెచ్చిపెట్టిన ఆగాధాన్ని అనుభవిస్తూ కుమిలిపోయింది.

తిరిగిపోలేక, ఉన్నచోట నిలవలేక ఎటూ తోచని అయోమయంలో కూరుకుపోయింది.

ఆ క్షణాన్ని ఛేదిస్తూ.. తెగించి తన దారి కోసం కదలబోయి, చెరిగిపోయింది.
 
కనుమరుగైపోయింది, ఓ కన్నీటి చుక్క!