Thursday, February 19, 2009

..हम and జెర్రి..

అప్పుడు నేను ఏడో తరగతి అనుకుంటా... వేసవి సెలవుల్లో పెద్దమ్మ, అక్క, అన్నయ్య, పిన్ని, బాబాయి ఇంకా మా ఫామిలీ అంతా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కలిసే వాళ్ళం. అ వేసవి చల్లగా లేదు [అప్పటికి గోదావరి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు మరి!]. రాత్రి భోజనాలయ్యకా ఆడాళ్ళంతా విధి గదిలో టీ.వీ చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. నేల చల్లగా ఉండటం వల్ల ఒక్కొక్కరూ మెల్లగా నడుం వాలుస్తున్నారు. నేను అలానే వాళ్ళ కబుర్లు వింటూ పెద్దమ్మ పక్కన చేరి నిద్రపోయాను. ఎంత సేపయ్యిందో, ఏమయిందో తెలియదు. ఉన్నట్టుండి కేకలు విని ఉలిక్కిపడి లేచాను. చాలా గొంతులు వినిపించాయి.. పెద్దమ్మ కేకలు.. "కదలకు, అటే వస్తోంది" అన్న మిగతా వాళ్ళ అరుపులు. వంటగదిలో గోడ పక్కన చీపురుకట్ట ఉంది. త్వరగా పట్టుకు రా అని పిన్నితో అమ్మ అన్న మాటలు... నా నిద్ర కళ్ళకు కనిపించింది మాత్రం, మసక మసకగా ఒక చిన్న మెలికెల జీవి. ఆ అరుపులకి ఎటెళ్ళాలో తెలియక అనుకుంటా, అది కూడా తెగ అటు-ఇటు తిరిగేస్తోంది. దీనిని దూరంగా పంపటం నా కర్తవ్యం అని స్ఫురించటానికి ఆట్టే సమయం పట్ట లేదు. వెంటనే చేత్తో లాగి పెట్టి దానిని ఒకటి పీకాను. అది కాస్తా బెడ్రూం వైపు వెళ్ళి పడింది. అంతే, కొత్తగా పెళ్ళయిన మా పిన్ని.. "అమ్మో! మా ఆయన!" అంటూ బెడ్రూం వైపు చీపురుకట్టతో పరుగు తీసింది. ;)

మెలకువ వచ్చాక తెలిసింది ! అది ఒక జెర్రి అని. "బహుసా మేడ మీద నుంచి తెచ్చిన బట్టల్లోంచి పడింది." అనుకుంటారు, ఇప్పటికీ! అమ్మేమో "నీకు ఏమి కాలేదు కదా?" అంటూ నా చెతులు, వేళ్ళు క్షుణ్ణంగా తడిమి తడిమి చూసింది. కాసేపయ్యాకా అంతా చుట్టూ చేరి, 'బుజ్జీ, అసలు జెర్రి ని అంత ధైర్యం గా చేత్తో ఎలా కొట్టావే? భయం వెయ్యలేదా?' అని అడిగారు. ధైర్యమా.. పాడా!! నాకేం తెలుసు అది జెర్రి అని. నిద్రలో ఉండగా సడన్ గా లేపితే ఎవరినైనా పీకుతా. అలాగే దాన్ని కూడా పీకాను. కానీ దొరక్క దొరక్క దొరికిన సువర్ణావకాశం... వదులుతానా..?! "మరేం అనుకున్నారు నేనంటే ?" అని కళ్ళెగరేసి జడ మెలేశాను నేను. అప్పట్నుంచి మనం వీర నారీ మణి కేటగిరీ ఇంట్లో.. హహ..

ఎన్ని మధుర స్మృతులో బాల్యంలో...

Wednesday, February 11, 2009

తరుగుతుందంటారా..?


హే.. ట్రై దిస్..

ఐ నో. 'ఆల్మండ్ జాయ్'. రైట్?

హ్మ్.. వాట్ ఈస్ ఇన్సైడ్ ?

కొకొనట్. :)

హ్మ్.. :)

యు లైక్ కొకొనట్ సో మచ్ నా? :)

హ హ హ....


ఈ రోజు అఫీసులో శ్రీజిత్ తో జరిగిన సంఘటన ఇది. తనకి నచ్చినదాన్ని నాతో పంచుకుంటున్నాడు అన్న ఆలోచన మనసులో చాలా ఆలోచనలని, జ్ఞాపకాలని రేపింది.....

చిన్నప్పుడు క్లాస్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఐతే తలా ఒక చాక్లెట్ ఇచ్చేవారు. అది తినకుండా దాచి, ఇంటికెళ్ళాక చెరిసగం చేసి తమ్ముడితో పంచుకుని తినేదాన్ని. నాకిష్టమైన రకం చాక్లెట్ ఐతే ఇంటికెళ్ళే వరకు తినకుండా ఉండటం కొంచం కష్టమయ్యేది. వేళ్ళే లోపు ఓ వంద సార్లు బయటకు తీసి చూసుకునేదాన్ని :) ఎవరైనా ఇస్తే తమ్ముడితో పంచుకోవటానికి నాకేం అభ్యంతరం ఉండేది కాదు కానీ, నాన్న కొన్న వాటి పై 'నాది ' అన్న భావం ఎంత ఉండేదో..!! నాకు ఎంతో ఇష్టమైన గన్ బొమ్మని వాడు విరిచేసినప్పుడు 'నా బొమ్మలన్నీ వీడు పుట్టాకా విరగ్గొట్టేశాడు ' అని ఎంత ఏడ్చానో. ఆ ఉక్రోషానికి అసలు కారణం వేరే. అదేంటంటే... నాకు తమ్ముడంటే చాలా ఇష్టం. వాడు అమ్మ కడుపులో ఉండగా మడి కట్టుకుని ఎన్ని పూజలు చేశానని??!! కానీ వాడు పుట్టాకా ఏదో తేడా నాలో... అమ్మ నాకన్నా వాడినే ఎక్కువ ఎత్తుకుంటుంది. వాడినే ఎక్కువ పట్టించుకుంటుంది. వాడి వైపు తిరిగి పడుకుని, నన్ను వెనక పడుకోమంటుంది. అమ్మ కి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. అంతా వీడీవల్లే. వీడు పుట్టాకనే అమ్మ నన్ను సరిగ్గా చూడట్లేదు అని చాలా కుళ్ళు ఉండేది. దానివల్ల అవకాశం దొరికినప్పుడల్లా ఇలా బయట పడేదాన్నన్నమాట. లొడ లొడా వాగే నేను ఉన్నట్టుండి కాం అయిపోయాను. అమ్మ, నాన్న నన్ను గమనిస్తూనే ఉన్నారు. వాడు కొంచెం పెద్దయ్యి, నేను కూడా వాడిని ఎత్తుకోగలిగే సమయానికి, ఈ ఆలోచనలు కాస్త తగ్గాయి. ఇదే కాదు, అమ్మ వేరే పిల్లల మీద ప్రేమ చూపిస్తే ఏదోలా ఉండేది. సమయంతో పాటు మానసికంగా ఎదిగాక మనసులో అలాంటి ఆలోచనలు పోయాయి. కానీ ఇప్పుడనిపిస్తోంది....

తమ్ముడితో అన్నీ పంచుకోగలిగిన నేను అమ్మ ప్రేమని పంచుకునేందుకు ఎందుకు అంత కష్టపడ్డాను?? పిల్లలంటే చాలా ఇష్టం ఉన్నా, అమ్మ వాళ్ళని దగ్గరకు తీసుకుంటే నాకు ఎందుకు అంత కుళ్ళు ఉండేది ? అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడూ నా బుర్రలో ఒక్కటే ప్రశ్న. "అమ్మకి వీళ్ళంటే 'నాకంటే' ఎక్కువ ఇష్టమా..?" అని. అమ్మని ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ ప్రశ్న నా మనసులో చాలా కాలం అలానే ఉంది. ఎందుకంటే బాహ్యం గా అమ్మ నా మీద చూపించే ప్రేమ, వారి మీద చూపించే ప్రేమ ఒక లాగే ఉండేవి. కొన్ని సార్లు నా మీద చూపించేదే తక్కువ అనిపించేది. అప్పుడప్పుడు తగిలే తిట్లు, మొట్టికాయలు ఇలాంటి ఆలోచనల్ని మరింత బలపరిచేవి. తమ్ముడికి ఈ సంగతేమీ తెలీదు. వాడెప్పుడూ అలా కుళ్ళుకున్నట్టు నాకు కనిపించలేదు. బహుశా నేను కూడా అమ్మ, నాన్న తో పాటుగానే పరిచయం కావటం వల్ల కాబోలు. ఈ చిక్కంతా కొత్త బంధాలతోనేనేమో..!

పక్క వారికి పంచితే, నాకు అందేది తగ్గిపోతుంది అనే ఆలోచన ప్రేమ కు పుష్టుగా అప్ప్లై చేసేసుకున్నాను అనుకుంటా..:) గమ్మత్తు ఏంటంటే, నిజంగా తరిగిపోయే చాక్లెట్లు, బొమ్మలు వగైరా పంచుకునేందుకు నాకెప్పుడూ మనసు కష్టం అనిపించలా... కానీ కొద్దిగా ప్రేమ దగ్గరే బోల్తా పడ్డాను :) ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ దేని గురించైనా అలా పొశెసివ్ గా అనిపించినా [అంతే, కుక్క తోక, నా బుద్ధి ఒకే రకం..], నాకు సీక్రెట్ తెలిసిపోవటం వల్ల, 'హహ, నువ్వు మరీ విశూ...' అని నన్ను చూసి నేనే నవ్వేసుకుంటాను.:) దానితో ఆ ఫీల్ మనసులో ఎంతో సేపు ఉండదు.

ఇంతకీ, పంచుకుంటే ప్రేమ తరుగుతుందంటారా..? నిజంగా తరగకపోయినా, అలా అనిపిస్తే ఏం చెయ్యాలో..!

Wednesday, February 4, 2009

..భావ బాష్పాలు..


నిన్న రాత్రి ఉన్నట్టుండి నువ్వు గుర్తొచ్చావు. నేను బాధపడుతున్నాను అనుకున్నాయో ఏమో, పిలవకుండానే కన్నీళ్ళు కూడా ఒచ్చేసాయి. ఒంటరిగా ఫీల్ అవుతున్నా అనుకున్నట్టు ఉన్నాయి. నీ ఆలోచన తోడు ఉండగా నాకు ఒంటరితనం అనిపించదు అని ఎంత చెప్పినా వినలేదు అవి. వదిలి అసలు పోనంటాయే!

ఇవి ఎంత మంచి నేస్తాలో తెలుసా! నా కళ్ళలో నిలిచిన నీ రూపాన్ని ఎవ్వరికీ కనపడానీయకుండా దాచేస్తాయి. ఆ నిమిషంలో మాటల్లో చెప్పలేక, మనసులో మోయలేక, కళ్ళలో ఉప్పొంగే నా భావాలెన్నిటినో.. "మేమున్నాం కదా, మాకొదిలేయి.." అంటూ మోయలేమని తెలిసి కూడా ఆ భారాన్నంతా నెత్తినేసుకుంటాయి. భావ భారం మోయటం అంత సులువా.. నువ్వు చెప్పు ? పాపం ఆ బరువుకు కళ్ళలో ఇక నిలవలేక జల జలా రాలిపోతాయి. పోతూ పోతూ కూడా నన్నవి వదిలిపెట్టవు సుమా..! నా చెంపలను నిమురుతూ పోతాయి. గుండెల్లోకి ఇంకి, పొంగిన నా భావాలన్నిటినీ మూట కట్టి మనసు అర లో భద్రం చేస్తాయి.

చాలా సార్లు చూసి చూసి.. జాలేసి, ఉండబట్టలేక వాటిని ఇలా అడిగాను. "రాలి పోతున్న వాటిని అలా పోనివ్వక, ఎందుకు వృధాగా పోగుచేసి భద్రం చేస్తున్నారు?" అని.. దానికవి ఏమన్నాయో తెలుసా?

"వెర్రిదానా! కరిగిపోయి, రాలిపోయి, ఆవిరైపోయేందుకు అవేమైనా కన్నీళ్ళటే?! అవి నీ భావాలు. అత్మీయమైన మదిలో తప్ప మరెక్కడా మనలేవు. వాటిని నువ్వెంత అపురూపంగా చూసుకుంటావో మాకు తెలుసు. మా మీద జాలితో మాటవరసకి ఇలా అంటున్నావు కానీ, నువ్వు వాటిని అలా తుడిచేయగలవా? నీ కళ్ళలో తోడుకున్న వాటిని 'ఆ' గుండె పై చేర్చినప్పుడు కాని మాకు మోక్షం లేదు." అని.

ఎంటో వాటి వెర్రి తాపత్రయం! కాని అవి మదిలో చేరిన ప్రతి సారీ, ఆలోచనల్లో పెరుకున్న కుళ్ళంతా వాటి ఉధృతమైన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మది ఏదో కొత్త అందం సంతరించుకుంటుంది. నిర్మలమైన పసి పాప బోసినవ్వులా తోస్తుంది.

ఈ ఘనత అంతా ఎవరిదనుకోనూ? నా నేస్తాలను నాకే వదిలేసిన నీకా? ఇంత మనోహరమైన అనుభవాన్ని నాకు అందజేస్తున్న వాటికా? అన్నీ సమ పాళ్ళలో పేర్చి ఇచ్చిన ఆ మాధవుడికి మాత్రం వేవేల కృతజ్ఞతలు. _/|\_