Wednesday, February 4, 2009

..భావ బాష్పాలు..


నిన్న రాత్రి ఉన్నట్టుండి నువ్వు గుర్తొచ్చావు. నేను బాధపడుతున్నాను అనుకున్నాయో ఏమో, పిలవకుండానే కన్నీళ్ళు కూడా ఒచ్చేసాయి. ఒంటరిగా ఫీల్ అవుతున్నా అనుకున్నట్టు ఉన్నాయి. నీ ఆలోచన తోడు ఉండగా నాకు ఒంటరితనం అనిపించదు అని ఎంత చెప్పినా వినలేదు అవి. వదిలి అసలు పోనంటాయే!

ఇవి ఎంత మంచి నేస్తాలో తెలుసా! నా కళ్ళలో నిలిచిన నీ రూపాన్ని ఎవ్వరికీ కనపడానీయకుండా దాచేస్తాయి. ఆ నిమిషంలో మాటల్లో చెప్పలేక, మనసులో మోయలేక, కళ్ళలో ఉప్పొంగే నా భావాలెన్నిటినో.. "మేమున్నాం కదా, మాకొదిలేయి.." అంటూ మోయలేమని తెలిసి కూడా ఆ భారాన్నంతా నెత్తినేసుకుంటాయి. భావ భారం మోయటం అంత సులువా.. నువ్వు చెప్పు ? పాపం ఆ బరువుకు కళ్ళలో ఇక నిలవలేక జల జలా రాలిపోతాయి. పోతూ పోతూ కూడా నన్నవి వదిలిపెట్టవు సుమా..! నా చెంపలను నిమురుతూ పోతాయి. గుండెల్లోకి ఇంకి, పొంగిన నా భావాలన్నిటినీ మూట కట్టి మనసు అర లో భద్రం చేస్తాయి.

చాలా సార్లు చూసి చూసి.. జాలేసి, ఉండబట్టలేక వాటిని ఇలా అడిగాను. "రాలి పోతున్న వాటిని అలా పోనివ్వక, ఎందుకు వృధాగా పోగుచేసి భద్రం చేస్తున్నారు?" అని.. దానికవి ఏమన్నాయో తెలుసా?

"వెర్రిదానా! కరిగిపోయి, రాలిపోయి, ఆవిరైపోయేందుకు అవేమైనా కన్నీళ్ళటే?! అవి నీ భావాలు. అత్మీయమైన మదిలో తప్ప మరెక్కడా మనలేవు. వాటిని నువ్వెంత అపురూపంగా చూసుకుంటావో మాకు తెలుసు. మా మీద జాలితో మాటవరసకి ఇలా అంటున్నావు కానీ, నువ్వు వాటిని అలా తుడిచేయగలవా? నీ కళ్ళలో తోడుకున్న వాటిని 'ఆ' గుండె పై చేర్చినప్పుడు కాని మాకు మోక్షం లేదు." అని.

ఎంటో వాటి వెర్రి తాపత్రయం! కాని అవి మదిలో చేరిన ప్రతి సారీ, ఆలోచనల్లో పెరుకున్న కుళ్ళంతా వాటి ఉధృతమైన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మది ఏదో కొత్త అందం సంతరించుకుంటుంది. నిర్మలమైన పసి పాప బోసినవ్వులా తోస్తుంది.

ఈ ఘనత అంతా ఎవరిదనుకోనూ? నా నేస్తాలను నాకే వదిలేసిన నీకా? ఇంత మనోహరమైన అనుభవాన్ని నాకు అందజేస్తున్న వాటికా? అన్నీ సమ పాళ్ళలో పేర్చి ఇచ్చిన ఆ మాధవుడికి మాత్రం వేవేల కృతజ్ఞతలు. _/|\_

4 comments:

రాధిక said...

విశాలా మీరు భావాల తోటలో తిప్పి తిప్పి వదిలేస్తారు.నచ్చిన పువ్వులు చాలానే వున్నా కొయ్యడానికి మనసొప్పనట్టు మీ ఆలోచనలు నచ్చేస్తున్నా కామెంటు పెటలేకపోతున్నాను.మీ టపాలనీ చదివి అలా ఆలోచిస్తూ వుండిపోవాలనిపిస్తుంది.అక్షర రూపం ఇచ్చి ఆలోచనలు తెంపడం ఒక్కోసారి నచ్చదు నాకు.

ఏకాంతపు దిలీప్ said...

Yes, Beautiful!

శేఖర్ పెద్దగోపు said...

>>నా కళ్ళలో నిలిచిన నీ రూపాన్ని ఎవ్వరికీ కనపడానీయకుండా దాచేస్తాయి

చాలా బావుంది.

>>భావ భారం మోయటం అంత సులువా.. నువ్వు చెప్పు ? పాపం ఆ బరువుకు కళ్ళలో ఇక నిలవలేక జల జలా రాలిపోతాయి. పోతూ పోతూ కూడా నన్నవి వదిలిపెట్టవు సుమా..! నా చెంపలను నిమురుతూ పోతాయి

కన్నీటిని కూడా ఆత్మీయ స్నేహితుల్లాగా చాల బాగా చెప్పారండి.

మోహన said...

@రాధికా గారూ,

కామెంటులదేముందండీ.. మీకు నచ్చి మీరు అనుభవించగలిగితే అంతకన్నా నాకు ఆనందమైన విషయం మరోటి లేదు.

@కొత్తపాళీ, దిలీప్, శేఖర్
Thank you.