Wednesday, June 23, 2010

..ప్రణయగానం..



మధించిన మనసున,
సూదంటీ క్షణమున,
తేనెలూరు మాటల్లో.. తేలియాడు తోటల్లో,
తేనెటీగ నీవా ప్రణయమా...!

Monday, June 21, 2010

కలయా నిజమా..!

కంటి, నిజమొక కల కంటి.
కల నిజమవుననుకొంటి.
కలలో నిజమే, నిజమై ఎదురుగ నిలుచనుకొంటి.
కల నిజమవు... నిజం, నిజం!
నిజము కల కాదు కాదు. కేవలమొక కలే కల.
కలే నిజం. కలయే!, నిజం... నిజం.
ఏది కలా, ఏది నిజం!!!


********
సీత గారు రాసిన కలయా నిజమా! చదివాక కలిగిన ఒక తుంటరి ఆలోచన :)

Thursday, June 10, 2010

ఐక్యం

మబ్బు దుప్పటి కప్పిన ఆకాశం నీడలో,
రాత్రి వానలో మురిసిన అడవి....
తడారని మానులు ముదురు వర్ణాలు చిలుకుతుంటే,
నేలంటిపెట్టుకున్న పచ్చిక సరికొత్త అందాలు సంతరించుకుని ముస్తాబవుతుంది.
పెదవంటిన చినుకు రాలునని పూలు మొహమాటపడుతున్నాయి, విరిసేందుకు.
మధ్య మిగిలిన ప్రదేశమంతా గాజు వర్ణపు మైకమేదో తెరలు కట్టి,
వెలుగుతూ వగలుపోతుంది. చిక్కగా పేరుకుని, చక్కగా అల్లుకుపోయింది.
సరిహద్దు రేఖల కింద భూమి పరుచుకున్నట్టు,
శరీరాల చాటున ఈ మైకం ఒకటిగా ప్రవహిస్తుంది.

ఆర్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచపు గుండెల్లో ప్రేమను కురిసి,
ప్రకృతి విశాల ప్రపంచాన్ని తనలో ఐక్యం చేసుకుంది.

Tuesday, June 8, 2010

తప్పని బంధం!!

పీకల దాకా కోపం, నరనరం లో ప్రవహిస్తుందా అన్నట్టు ఆమె వళ్ళంతా ఎర్రగా కందిపోయింది. భరించలేని నిస్సహాయత పళ్ళ కింద నలిగిపోతూ కన్నీటి రూపం లో పారుతోంది. జనాభా లేఖ్ఖల్లో కూడా కనిపించని ఆ బంధానికి ఆమె ఎంతో విలువ ఇచ్చింది. ఆ విలువే ఇప్పుడు తన ముందరికాళ్ళ బంధమై, సంకెలై కూర్చుంది. తన మానవత్వానికి, సహనానికి అగ్నిపరీక్ష పెడుతుంది పదే.. పదే..! ఎలాంటి పరిస్థితిలో అయినా మానవత్వం మర్చిపోయి పశువులా ప్రవర్తించకూడదన్న ఒకే ఒక్క కారణంతో మౌనంగా సహనం వహిస్తుంది. తన సహనానికి తగలబడేది తానేనని తెలిసినా, తనలో కర్కసత్వాన్ని కేవలం తనదైన ప్రపంచంలో ఎక్కడో చీకటి మూల లోతైన గోతిలో సమాధి చేస్తూ వచ్చింది. కాష్మోరా మళ్ళీ నిద్ర లేచినట్టు, ఇలా గాలి వీచినప్పుడల్లా పేట్రేగుతున్న అతడి అహంకారాన్ని ఇక సహించలేకపోతుంది. అయినా గతంలో కూడా ఎన్ని సార్లని జరగలేదు ఈ తంతు?! తలచిన ప్రతి సారి పైకి వినపడకుండా లోలోపలే దహించిపోయేట్టు ఏడ్చిన పైశాచిక రాత్రులేన్ని లేవని..! అలా లోలోపల కుమిలిపోవటం తప్పితే ఏం చేయగలిగింది? అయినా ఏదైనా ఆ రాత్రికేగా... ఆ రాత్రి గడిస్తే తుఫాను తరువాతి ప్రశాంతత లా ఉన్నా, చెల్లాచెదురైన బంధాన్ని ఏరికొచ్చి మళ్ళీ గూడు కట్టాలి, తనే... ప్రతిసారీ! కట్టినా అదేన్నా...ఆళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసును?! ఆమె కట్టడం - అతడు కూల్చనం... ఇదో ఖరీదైన అలవాటైపోయింది వారికి. ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చినా సరే ఒక్కసారి కూడా ఆమె వెనుదిరగలేదు, వదిలేయలేదు?! "ఎలాగూ పోయేదే కదా అని ఊపిరి పీల్చకుండా ఉంటామా? ఇదీ అలానే." అంటుంది. తప్పదు... దీర్ఘరోగంతో బాధపడుతున్న తన సహచరిని భరించక తప్పదు. ఆమె శరీరం ఉన్నంత కాలం వారి బంధాన్ని ఆమె మోయక తప్పదు. నచ్చని వ్యవహారాలను, అసహ్యం కలిగించే రీతిని ఒప్పుకోక తప్పదు. చావైనా, బ్రతుకైనా.. ఏదేమైనా నీతోనే అనుకోక తప్పదు. ఏదో ఒక రోజున మారకపోతాడా అన్న ఆశతో కాలం గడపక తప్పదు......

తప్పదు, ఎందుకంటే వారిది వీడిపోని బంధం కాదు.. విడదీయలేని బంధం. తప్పుడు బంధం కాదు.. తప్పని బంధం!!

Thursday, June 3, 2010

మేఘన - చివరాఖరి ప్రేమలేఖ...

నాలో ఉన్న నేను కాని నాకు,

............................. పరిచయాలు, కుశల ప్రశ్నలు అవసరమే లేదు కదా మన మధ్య! అందుకేనేమో ఎలా మొదలుపెట్టాలో తెలియటంలేదు. సందర్భం వివరించకుండానే నువ్వు అర్ధం చేసుకున్న ప్రతి సారీ నేను లోలోపల ఎంతగా మురిసిపోయేదాన్నో నేను చెప్పలేను. చాలా సార్లు నిన్ను తలుచుకుంటూ తిరుగుతున్న వేళ నువ్వొచ్చి పలకరించావు. అప్పుడు కలిగిన ఆనందాన్ని నీతో పంచుకోవాలనిపించేది. కానీ నువ్వెక్కడ వెక్కిరిస్తావో, ఏడిపిస్తావో అని ఆ ఆనందాలన్నీ నా చిరునవ్వు వెనక దాచేసేదాన్ని. ............................... ఇలా నాలో లోలోపల మురిసే వేళల్లో ఎప్పుడో తెలిసింది నాకు, చిగురాకుల్లాంటి ఊహల్లో నిన్ను నిలబెట్టుకున్నానని.. స్వచ్ఛమైన నా సంతోషాలన్నీ నీకే కైంకర్యం చేసానని... నువ్వు ఇవేమి కోరలేదు, నిజం! నేను కూడా ఇవన్నీ ప్రతిగా నీనుండీ ఏదో ఆశించి చెయ్యలేదు సుమా... పరిమళించే పూలుపూసే మొక్క ఆ పూలలో అన్ని సుమగంధాలను ఎందుకు నింపుతుంది? అంటే ఏం చెప్పగలం? ప్రేమ పోసి పెంచిన ఈ తోట లో పూలన్నీ ప్రేమనే విరుజిమ్ముతాయి. అవన్నీ ఇప్పుడు మూతి బిగించి, మేం ఎవరికోసం వికసించాలి అని అడిగితే నేనేం చెప్పను? దేవుడు లేని గుడి శిథిలమైనట్టు, నా మనసు శిథిలమై పాడుబడుతుందేమో... 'దైవం' అంటే నాకు ఎంత దగ్గరతనమో నీకు తెలుసు కదా! ఒక గుడిలో ఒకే దేవుడు. నిన్నొదులుకోలేను. అలా అని బలవంతంగా నిన్ను ఇక్కడ ఉంచి ఉక్కిరి బిక్కిరి చెయ్యలేను. ఇవన్నీ నీతో నోరు విప్పి చెప్పనూ లేను. బాధ పడుతూ ఉండాలని లేదు. ఉత్సాహంగా నా జీవితంలో మలుపులను హుందాగా తీసుకొవాలని చాలా కొరికగా ఉంది. కానీ లోలోపల లోతుల్లో ఎక్కడో.... ముచ్చటగా పెంచుకున్న ఒక పూతోటలో మొక్కల్ని వేళ్ళతో సహా పెకిలించేస్తున్నట్టుగా, చూస్తునే ఉన్నా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి లో ఉన్నట్టుగా ఎదో ఆంతు లేని ఆవేదన. ఎవరికీ చెప్పుకోలేని ఈ బాధ తో సతమతమవుతున్న నన్ను చూస్తే నాకే జాలేస్తోంది.
ఈ లేఖ నిన్ను చేరదని తెలుసు. అయినా రాస్తున్నాను. ఏదో ఒక రూపం లో నా బాధని వ్యక్తపరచాలి. కనీసం నాతో నేను చెప్పుకోవాలి. అందుకే రాస్తున్నాను. చరిత పుటల్లో, ఈ లేఖ ఇలానే మరుగునపడిపోవచ్చు గాక! కానీ ప్రియతమా.... నిన్న చరితం, నేడు నిజం, రేపు తథ్యం. మనం ఈ జన్మలో ఈ విధంగా ఒకటవ్వలేకపోవచ్చు. కానీ నిను చేరని నేను అసంపూర్ణం. ఈనాడు పరిస్థితులు అనుకూలించక పోయినా, ఏదో ఒక రోజున, ఏదో ఒక రూపంలో నేను నిన్ను చేరకపోను. నీలో ఐక్యం అవ్వకపోను. ఆనాడు నేను గాలిగానైనా, ధూళిగానైనా మరే విధంగానైనా కానీ.., నిన్ను చేరేది మాత్రం తథ్యం. నా ఈ ఆలోచన తెలిస్తే కొందరు నవ్వచు, కొందరికి నాది మూర్ఖత్వమనిపించవచ్చు. నీకు కూడా ఇదంతా ఒక పిచ్చి గానో, ఉన్మాదం గానో, బలహీనత గానో తోచచ్చు. నేను వాదనలాడను. ఆడలేను కూడా. చూపించేందుకు నా వద్ద ఎలాంటి ఋజువులూ లేవు మరి! కానీ నా మనసుకు తెలుసు, నాకు తెలుసు నిను చేరుకుంటానని. ఇదే మాట వదిలి పోతున్న వసంతాలకు విన్నమించుకున్నాను. మూతి ముడిచిన నా పూలకు చెప్పి బుజ్జగించాను. అవి అర్థం చేసుకున్నాయి. నాకు మాటిచ్చాయి, నిను చేరేవరకు నిత్యం పూస్తూనే ఉంటామని, నిను చేరాక నీకై పూస్తామనీ... ఇదంతా నీకోసం కదూ...? ఎవరన్నారు నువ్వు నాకు ఏమీ ఇవ్వలేదని? ఒక్క సారి ప్రేమించినందుకే నిత్య వసంతాన్నే కానుకగా ఇచ్చావు కదా!!!

మళ్ళా కలుస్తా....

*****************
తను ప్రేమ కి మేఘన ఆఖరిసారిగా ఒక ఉత్తరం[డైరీలో] రాస్తే ఇలా ఉంటుందేమో అన్న ఊహ, ఈ టపా...