Monday, December 29, 2008

..అగమ్యగోచరం..

ఎడారి మనసులో ఒయాసిస్సల్లే ఎదురుపడ్డావు.
నిను చేరేందుకు ఎంతో దూరం పయనించాను.
దారంతా మనసుకు ఎన్నో పోట్లు.
అలసి, విసిగి, ఆగి, వెనుతిరిగి చూసాను.

అక్కడ ఏదో ఒక కొత్త ప్రదేశం!!
నందన వనాలు, నెమళ్ళూ, పూలు, సెలయేళ్ళు..
చెట్లు, వాటి నీడలో సేదతీరుతున్న మనుషులు...
ఇంకా ఎన్నో దృశ్యాలు.

ముందు నీవు లేవు.
వెనుక నా గతం లేదు.
చదును చేసిన మనసుతో...
అగమ్యగోచర స్థితిలో ఒంటరిగా నేను!!

Wednesday, December 17, 2008

ఆరయ్యింది..!

తల నిమురుతూ నాన్న నిద్రలేపారు. ఇంకో 5 నిమిషాలు డాడీ అంటూ ఇటు తిరిగి ముడుచుకుని పడుకున్నాను. 'ఏయ్.. ఇందాకే లేపి వెళ్తే, ఇంకా పడుకున్నావా...? లే..! అసలు చెప్పలేకపోతున్నాను నీకు. లే ఇంక. సరిపోయారు తండ్రీ, కూతుర్లు..' అన్న అమ్మ మాట విని, ఎదో గొణుక్కుంటూ లేచాను. ఇంకా ఏమంత వెలుగు రాలేదు. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నాన్న ఎవరితోనో మాట్లాడుతున్నారు. చుట్టూ చూస్తే నేను తోటలో ఉన్న మడత మంచం మీద ఉన్నాను. ఇక్కడికి ఎప్పుడొచ్చాను?? అనుకుంటూ లేచి కళ్ళు నులుముకుంటూ నడిచాను. అంతా ఎప్పుడో లేచినట్టున్నారు..! అయినా పెళ్ళి రేపు కదా.. అనుకుంటూ గుమ్మం ముందు దాకా వచ్చాను. అత్త ఎదురయ్యి, 'ఏమ్మా, సరిపోయిందా నిద్రా?' అని వెటకారంగా అడిగింది. ఏదో అనబోయాను. ఇంతలో మొన్న అందరిలో ఏదో వాగినందుకు అమ్మ లోపలికి తీసుకెళ్ళి, 'ఇంకోసారి అత్తకి అలా తిక్క సమాధానలు చెప్పావంటే చూడు..' అని వార్నింగ్ ఇచ్చింది గుర్తొచ్చి, 'హిహి ' అని నవ్వేసి ఇంట్లోకి నడిచాను. అమ్మకోసం వెతుకుతున్నాను. అసలెక్కడా కనిపించదే..! ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళినట్టు...? ఇంతలో బెడ్రూంలోంచి పెద్దగా ఆడవాళ్ళ నవ్వులు వినిపించాయి. అక్కడుందేమో చూద్దాం అని అటు వెళ్ళాను. అమ్మ కింద కూర్చుని మల్లెపూల మాలలు కడుతుంది. ఇంకో నలుగురు ఆడవాళ్ళు[వాళ్ళు నాకేమవుతారో నాకు తెలియదు.] కూడా పూలు కడుతున్నారు... 'మమ్మీ!' అని పిలిచాను. పలకలేదు. ఇంకా మాటల్లోనే ఉంది. 'మమ్మీ... మమ్మీ..!' అని మళ్ళీ పిలిచాను. 'ఆ...!' అంటూ నా వైపు తిరిగి, 'ఏం తల్లీ, అయ్యిందా నిద్ర..? ఇంకా లేదా??' అని అడిగింది. అందరూ నవ్వేశారు. ఇప్పుడు అందరి మధ్యలో కూర్చుని ఆ మాట అడగటం అవసరమా.. అనుకుంటూ... ఆ మాటలు పైకి అనలేక, ఉక్రోషంతో.. 'బ్రష్ ఇవ్వు..' అని గట్టిగా అడిగాను. 'బ్రష్షా..? దేనికి?'. నాకేం అర్థం కాలేదు. నేను అమ్మని అలానే చూస్తున్నా. తను నవ్వాపుకుంటూ.. 'అసలిప్పుడు టైం ఎంతయ్యిందనుకుంటున్నావ్??' అని అడిగింది. ఆలోచించకుండా, 'ఎంతయ్యింది..?' అని వెంటనే ఎదురు ప్రశ్న వేసాను. 'ఎంతా..., సాయంత్రం ఆరయ్యింది..!' అని చెప్పగానే, తనతో సహా అంతా గట్టిగా నవ్వేసారు. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు నాకు, నేను మధ్యాహ్నం మిగతా పిల్లలతో కలిసి చెరువు దగ్గర ఆడుకుని వచ్చి, వాళ్ళతో పాటూ తోటలోని మంచాల మీద పడుకుని నిద్రపోయానని, వాళ్ళు తరువాత లేచి నన్ను ఒక్కతినే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని..! ఏం చెయ్యాలో తెలియక, నాలిక్కరుచుకుంటూ బయటికి పరుగెత్తాను.....

ఆ రోజు మళ్ళీ యే ఆంటీ కంటైనా పడితే ఒట్టు..! :P

Saturday, December 13, 2008

..గ్రహణం..

నిత్యం నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు తను. అలా అని నేనే తన లోకం కాదు. లోకమంతా తనదే అని అందరికీ ప్రేమ పంచుతాడు. చంటి పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి మనసులో తనకో ప్రత్యేక స్థానం. తను పలకరించిన ప్రతి వారూ ఏదో కొత్త అందంతో, తేజంతో వెలుగుతారు, ప్రేమను ఒలకబోస్తారు. తను ఎక్కడుంటే అక్కడ వెన్నెలే.. తన సమక్షంలో ఆడుకుంటూ, పాడుకుంటూ, ఎలాంటి బెంగ, బాధా లేకుండా గడిచిపోతుంది. తను లేని నాడు ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ప్రతి క్షణం నా కళ్ళ ముందు లేకపోయినా, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడన్న స్పృహ ఎప్పుడూ ఉంటుంది నాకు. ప్రతి ఒక్కరికీ తను పంచే ప్రేమలో, ఆప్యాయతలో నాకూ కొంత భాగం అందుతోంది తెలుసా..? ఎలానో మరి నాకు తెలియదు. కానీ అందుతుంది. అంతే..! నాక్కూడా తనొక్కడే లోకం కాదు. లొకమంతా నాదే.. నా దాకా వస్తే అవతలి వారి బరువూ నేనే మోసేస్తుంటాను. దాని వల్ల అంతా నాకు ఓర్పు చాలా ఎక్కువ అనుకుంటారు. నిజమే.. ఎప్పుడూ కిల-కిల మంటూ, కళ కళలాడుతూ ఉంటాను. సప్త వర్ణాల కలయిక నేను. నా చుట్టూ నిత్యం, నవ్వుల పువ్వులే.. కోపం ఎప్పుడో కానీ రాదు. కానీ కోపం అంటూ వస్తే.. దయా, దాక్షిణ్యం లాంటివేమీ ఉండవు. అగ్ని పర్వతాలు బద్దలయిపోతాయి, సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తను అలా కాదు. ఒకరి బరువు మొయ్యడు. తనతో గడిపిన క్షణాల్లో మాత్రం ఎవరికీ ఏ బరువులూ గుర్తు రావు. తను ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. మల్లెపూవులా చల్లగా, నవ్వుతూ...

ఈ రోజు తన వైపు అడుగేయబోయాను. నా రాక గమనించి తప్పుకుంటున్నాడనిపించింది. నా మీద కోపం వచ్చిందేమో అనిపించింది. 'ఎందుకో చెప్పకుండా ఇలా కోప్పడితే ఎలా..?' అని నాకూ చాలా కోపం వచ్చింది. కానీ........!!!

***
నా ఛాయే.. నిన్ను నాకు దూరం చేస్తుందని గ్రహించలేకపోయాను నేస్తం.. :(

Friday, December 12, 2008

..నా కోపం..

ఆనందమది, అందరితో పంచుకుంటాను.
కష్టమది, ఇష్టమైన వారికే చెప్పుకుంటాను.
ఆశయమది, హాస్యం చేస్తే ఊరుకోను.
కోపమది, కొద్దిమందికే చూపగలను.

**
నా కోపం నాకు చాలా విలువైనది.

Thursday, December 4, 2008

మానస మేఘాన్ని నీ తలపు తెమ్మెర తడిమినపుడు,
సుతారం గా కురిసే నీ జ్ఞాపకాల తుంపరలో తడుస్తుంటే...
నీతో గడిపిన క్షణాలు చినుకులై నన్నలా తాకుతూ ఉంటే...
ఆ అనుభూతుల నందన వనంలో విరిసిన ఆనంద కుసుమాలు నన్నలంకరిస్తున్నాయి.

Wednesday, November 26, 2008

ఏం చెయ్యాలి నేను..??

చెప్పలేను.. చదవనూలేను.
మూయలేను.. మరువనూలేను.
అలగలేను.. అడగనూలేను.
రాలేను.. రాజీ పడనూలేను.
వాదించలేను.. వదిలెయ్యనూలేను.
సాధించలేను.. సర్దిచెప్పుకోనూలేను.
ఉరకలేను.. ఊరికే ఉండనూలేను.
ఏం చెయ్యాలి నేను..??

..వెలుగులో నీడ..

చీకటిలో నా నీడ నేనేగా..
మరి వెలుతురులో నీవే నా నీడను మోసేవుగా..
'నా నీడ' ని గుర్తించక, నిన్ను చూసి నే మురిసేనుగా..
నే మోస్తున్నది నీ నీడనని నే మరిచేనుగా...

*******

పూర్తి చీకటిలో నీడ విడిగా కనిపించదు. నాలోనే ఉండిపోతుంది. మరి పూర్తి వెలుగులో నీడ? నేను వెళ్ళే ప్రతి చోటకి, నా కంటే ఒక సెకను ముందే చేరుకుంటుంది. నే వచ్చి చూసే సరికి అంతా నే అనుకుంటున్నట్టే కనిపిస్తుంది. నే చూసేది, నా ప్రతిబింబమని నాకు అసలు అనుమానమే రాదే..!! అందుకేనేమో.. నే ఆనందంగా ఉన్నప్పుడు, పూవును చూసినా నవ్వినట్టు ఉంటుంది. అదే నే బాధలో ఉంటే నా ఆప్తులు నవ్వినా, వెక్కిరింతగానే తోస్తుంది. అచ్చం, నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడు లా... ఇలానే ఎదుటి వారు తమ ఛాయల్ని నా పై చూసుకుంటారు కదా. అప్పుడు కడిగిన అద్దం లా నే ఉంటేనే కదా, కల్తీ లేని వాళ్ళ బింబాన్ని వారు చూసుకోగలుగుతారూ...?! కానీ అందరూ అన్ని వేళలా అలా ఉండగలరా? అసలు అలా ఉండటం సాధ్యమా..? కాదని చెప్పేందుకు నిమిషం పట్టదు. అద్దానికి తన సొంత ప్రతిరూపం ఏమీ లేదు. పైగా నిర్జీవమైనది కాబట్టి తనకి సాధ్యం. మరి మనం ? ప్రాణమున్న మనుషులం. మనలో అన్నీ ఉంటూ ఉండగానే, పక్కవాడికి మాత్రం అవి ఏమీ లేనట్టు ఉండటం అంత తేలికైన విషయం కాదు. మసక వెలుతురులో ఒక నీడ మరో నీడ పై చేరి వింత ఆకృతుల్ని సృష్టిస్తాయి. అవి ఎలా ఆకారం పొందుతున్నాయో అర్థం కాకపోతే భయపెడతాయి. అర్థం చేసుకుంటే ఆడుకోవచ్చు వాటితో... అలాగే జీవితంలో ఒకరి మానసిక పరిస్థితి, మరొకరి పై పడి వింత పరిస్థితులను సృష్ఠిస్తుంటాయి. అర్థం చేసుకుని వాటిని సరిగ్గా ఏర్పరిస్తే అందమైన ఆకృతి తయారుచెయ్యచ్చు. ఆనందంగా ఉండచ్చు.

పాడుబడ్డ బావిలోకి జారి పడితే, అందులో పడ్డామన్న ఆలోచనే బయటకు రావాలన్న గమ్యాన్ని చూపిస్తుంది. గమ్యంపై దృష్టి పెట్టి, అవసరం ఐతే చుట్టూ ఉన్న వాటిని ఆసరా చేసుకుని, ముందడుగు వేస్తేనే బయటకు వచ్చే దారి కనిపిస్తుంది. ఆ బావికి, అది అందించిన ఆసరాకి, 'నేను పడిపోయాను' అన్న దానికి కూడా అర్థం కనిపిస్తుంది. లేకపోతే నే పడ్డ బాధ అంతా వ్యర్థమే కదా..?

పాడుబడ్డ బావిని మనకు కలిగిన నష్టం అనుకుంటే, కష్టాలు, బాధలు, గాయాలు అందులో ఉండి కూడా మనకు చేయూతనిచ్చే ఆసరాలు అవుతాయి. బయట పడ్డ మనలో ఒక నూతన జీవం ఉంటుంది. ఆ బావి కూడా నష్టం గా కాక, ఒక కష్టమైన అనుభూతిగా, స్పష్ఠమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.

Friday, November 21, 2008

..Unnoticed World..Touched was I deeply, by few expressions. Why?
Deep enough to pull the strings of my Soul. And I,
To those tunes, sung and swung and moved and danced.
Lifted and carried was the overwhelmed me, to...
Where the flowers of Love filled the colours of Life,
And in all the Thoughts there, was their fragrance...!


Opening my eyes like waking from a Dream,
I see myself, where I was before!!
So,was that not real? and just a World of Dream ??
'No.. no..', surrounded a Breeze, so shouting.
Thence did I close my eyes again and took a deep breath.

Aaah... the map to my Dream, found I then!!
The way to go, was not by flying 'away', but by 'Diving In'.....

Monday, November 10, 2008

..రసీదు పత్రం..

మాధవుని సమక్షం బృందావనం కాగా...
వేయి వసంత ఋతువులే ఆక్రమించిన మనసు
కోటి కోకిల గానాలే పలికెనో... లేక,
మురళీ రవముకు మంజీరమై నర్తించెనో.. ఏమో..!

ఆనందం ప్రవాహమై ఉరకలు వేస్తూ పరవళ్ళు తొక్కుతూ,
ఈ లోకమునకు [స్వచ్ఛమైన గంగవోలె] చిరునవ్వులై జాలువారుతుండగా,
మౌన సామ్రాజ్యమునేలు నీవు, కడిగిన ముత్యమంటి నీ చిరునవ్వునే కానుకివ్వగా...
అది నా నిగూఢ ప్రేమకి నీ రసీదు పత్రమే అనుకోనా?

నా భావాలు, Osho మాటల్లో...

'కాస్త ఏకాంతం' పోస్ట్ లో నే చెప్పాలనుకుని, చెప్పలేకపోయాను అనుకున్న భావాలు నిన్ననే 'ఓషో' మాటల ద్వారా నా కంట పడ్డాయి. అవి మీతో ఇక్కడ పంచుకోవాలనిపించి...

What do I mean when I say "really Love"? I mean that just being in the presence of the other you feel suddenly happy, just being together you feel ecstatic, just the very presence of the other fulfills something deep in your heart.... something starts singing in your heart, you fall into harmony, just the very presence of the other helps you to be together; you become more individual, more centered, more grounded. Then it is Love.

Love is not a passion, love is not an emotion. Love is a very deep understanding that somebody somehow completes you. Somebody makes you a full circle. The presence of the other enhances your presence. Love gives freedom to be yourself; it is not possessiveness.

When you start feeling with someone that just the presence, the pure presence - nothing else, nothing else is needed, you dont ask anything, just the presence, just that the other is, is enough to make you happy.... Something starts flowering within you, a thousand and one lotuses bloom, then you are in love. And then you can pass through all the difficulties that reality creates. Many anguishes, many anxities - you will be able to pass through all of them and your love will be flowering more and more, because all those situations will become challenges. And your love, by overcoming them, will grow more and more strong.

Love is eternity, If it is there, then it goes on growing and growing. Love knows the beginning but does not know the end.


Maturity - The Responsibility of Being Oneself
Osho
(Insights for a new way of living)
[Page no. 65]

Thursday, November 6, 2008

..కాస్త ఏకాంతం..

చాలా రోజులయ్యింది.. బహుశా నెలలేమో...!! నువ్వు చాలా సార్లు జ్ఞాపకం వచ్చావు. అలా గుర్తొచ్చినప్పుడు కొన్ని సార్లు నిన్ను చాలా చాలా తలుచుకున్నాను. ముఖ్యం గా ఈ గజిబిజి ఇరుకు జివితంలో కాస్త ఏకాంతం సంపాదించటానికి ప్రయత్నించేప్పుడు. నువ్వెప్పుడూ నన్ను నీ అంతట నువ్వు రమ్మనలేదు. నేనే.. నీకు, నాకు వీలున్నప్పుడల్లా నీ దగ్గరకి వచ్చి కాస్త సమయం గడపటం తప్పితే మన మధ్య అంత అనుబంధం ఏమీ లేదు. ఇప్పుడే బడి నుంచి ఇంటికొచ్చిన చిన్నపిల్లలా ఊర్లో కబుర్లన్నీ మొసుకొచ్చి ఆ మూట నీ ముందు విప్పితే.. నువ్వేమో మౌనంగానే 'ఊ...' కొడుతూ వినటం... నేను ఎక్కడికేళ్ళాను, ఏం చేసాను అన్నీ నీకు చెప్పటం.. ఎందుకో నాకు అదో ఆనందం! ఆ తరువాత ఇద్దరం చుట్టూ దూరంగా ఉన్న ప్రపంచాన్ని, అందులోని పాత్రల్ని చూస్తూ పచార్లు చేసేవాళ్ళం గుర్తుందా..? కాసేపు బాతాఖానీ, అయ్యాకా పాటలు... అసలు కాలం ఎలా గడిచిందీ తెలిసేదే కాదు.. తరువాత కాసేపటికి ఇంకా నా మనసులో లెక్కలేనన్ని ఊసులు మెదిలేవి. కానీ మాట్లాడాలనిపించేది కాదు. ఏమైనా చెప్పు అని నువ్వు అడిగినా సరే... చిరునవ్వు తప్ప నా దగ్గర ఇంకేం మిగిలేది కాదు. ఎందుకో మరి...! ఎలాంటి ఆలోచనలూ లేకుండా గాలిని చుట్టుకుని, ఆకాశంలోకి చూస్తూ అలానే గడిపేయాలనిపించేది. అనంత విశ్వంలో నేనూ ఒక విడదీయలెని భాగం అన్న స్పృహ అప్పుడు కలిగేది. నా ముందున్న సమస్తాన్ని చూస్తుంటే ఎలా అనిపించేదో మాటల్లో ఎలా చెప్పను ?? ఆ క్షణాల గురించి చెప్పటానికి నా మిగతా జివిత సమయం సరిపోదు. కానీ ప్రయత్నిస్తాను. ఒక్క సారే కాకపోయినా, ఎప్పటికైనా సరే అదేదో నీకు మొత్తం చెప్పెయ్యాలన్న ఆరాటం. నా ఆశ అయినా క్షణం పాటు చెదరచ్చేమో కానీ, ఆరాటానికి అలుపులేదు. ఎందుకో..!!


అప్పుడు 'నాకు దొరికిన ఏకాంతాన్ని అలా మౌనం[వ్యర్థం] గా గడిపేశానే.. :(' అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలా ఏకాంతం దొరికితే మాటలు మాత్రమే వెతుక్కుంటున్నాను. వాటితోనే నా ప్రపంచాన్ని అల్లుకుంటున్నాను. పూర్తిగా స్వేచ్ఛ దొరికిన ఈ రోజున నాలో నేనే ఇరుక్కుపోతున్నాను. "అనుబంధం ఏమీ లేదు" అని ఎందుకనిపించిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నాకు, నేను కూడా ఇచ్చుకోలేనంత స్వేచ్ఛ నీ దగ్గర అందుకున్నాననుకుంటా... ఇందులో నీ ప్రమేయం ఏమీ లేకపోయుండచ్చు. కానీ విధి ఎందుకో మనల్ని ఈ క్రాస్స్రోడ్స్ దగ్గర ఎదురుపడేలా చేసింది!!

Friday, October 24, 2008

..చీకటి బావి..

చీకటి బావిలోకి తొంగి చూస్తున్నా..
లోతు ఎంతుందో తెలియట్లే..!
ఓర్పు తాటికి నిబ్బరం చేద వేసి తోడుదునా..?
ఏమీ తగలట్లేదు, కనిపించట్లేదు!!
తాడును పేనుతూ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించా.
పడ్డాయి, కానీ ఉప్పు నీళ్ళే..!!

ఇది పాడుబడ్డ, ఉప్పు నీటి, చీకటి బావా ?
లేక, నిశ్శబ్ధ అనంత సాగర ముఖ ద్వారమా..???

వద్దన్నా ఎగసి పడే ఆశల అలలు నీ సొంతమా..??
కాదనుకున్నా, కదలలేక కావలించుకున్న కలలు మిగిల్చిన కన్నీటి సెగ....?

Tuesday, October 21, 2008

ఏమో...!!!

మనసు చెదిరిపోయి, ముఖం మోకాళ్ళ పై పెట్టుకుని గుండెలు అవిసేలా ఏడ్చిన రోజు,
ఆ పసి దాని చేయి నా తల నిమరకుంటే నేను ఏం చేసేదాన్నో..!

కలత చెంది, కన్నీరు కూడా కరువై ఒంటరిగా మిగిలిననాడు,
ఆ తొలకరి వాన చినుకు పలకరించకుంటే, నేను ఏ ఎడారి పంచన చేరేదాన్నో..!

చిమ్మ చీకట్లు ముసిరి, దిక్కు తోచక, భయంతో దిక్కులు పెక్కటిల్లేలా అరిచినపుడు,
ఆనాటి ఏకాదశి వెన్నెల కిరణాలు ప్రశరించకపొతే, నేను ఏ అగాధంలో పడేదాన్నో..!

అన్నీ ఉన్నా, అనామకురాలినై జనారణ్యంలో బిక్కు బిక్కు మంటూ లోలోపల క్షీణిస్తున్న నాడు,
ఆ చిట్టి హృదయం నా చేయి పట్టి తనతో లాక్కెళ్ళకపోతే, నేను ఏ కౄర మృగానికి చిక్కేదాన్నో..!

చిరునవ్వు జాడ మరచి, ఎటెళ్ళాలో తెలియక అయోమయంలో దారి తప్పిన నాడు,
ఆ చిన్ని గడ్డి పూవు ఆహ్వానించి చిరునవ్వులు వడ్డించకపోతే, నేను ఏ వీధిల్లో పడి తిరిగేదాన్నో..!

పోగొట్టుకునేందుకు నా వద్ద ఇక ఎమీ మిగలలేదని, అసహనం గా మారిననాడు,
పంచేందుకు, నా దగ్గర అంతు లేని ప్రేమ ఉందని ఆ నేస్తం గుర్తుచెయ్యకపోతే, నేను ఏమై మిగిలేదాన్నో..!

ఏమో...!!!

Monday, October 20, 2008

మరే, నేనేమో..

వెన్నెలని పిడికిలిలో పట్టి, నా గది సరుగులో దాచేస్తా..
సముద్రపు కెరటాన్ని ఎత్తుకుని, నాతో పట్టుకెళ్ళిపోతా..
చంద్రుడికి గేలం వేసి, రోజంతా నాతో పాటు ఉంచేసుకుంటా..
పక్షం రోజుల లెక్క సూర్యుడికి అప్పచెప్పేస్తా..

మబ్బులతో దోస్తీ కట్టీ, ఇంటికి మోసుకొచ్చేస్తా..
రెయింబో రంగులు తెచ్చి, ఎండిన పూలకు పూసేస్తా..
చీకటి దుప్పటికి కన్నం పెట్టి, ఆవల ఎముందో చూసేస్తా..
చెట్లను రిక్వష్ట్ చేసి, మనకోసం స్పెషల్ లిఫ్ట్ అరేంజ్ చేయిస్తా..

గాలి మీద సవారి చేసి, పొగనంతా చెరిపేస్తా, ధూళాంతా కడిగేస్తా..
చుక్కలకు మాటలు నేర్పి, పాటలు పాడించేస్తా..
కొండతో చేరి, కోతి కొమ్మచ్చి ఆడేస్తా..
నువ్వు నాతో వస్తే, నా చెగోడీలన్నీ ఇచ్చేస్తా !

నేస్తం, నా జత వస్తావా.. ??

Thursday, October 16, 2008

ఏమీ ఎరుగనట్టు!!

పొద్దున్నే ఆఫీసు కి బయలుదేరే హడావిడిలో ఉన్నాను. ఉన్నాను అన్నది పేరుకేనేమో! ఆలోచనంతా ఎక్కడో...

అద్దం ముందు నిల్చుని తిలకం దిద్దుకుంటున్నాను. అద్దం లో నన్ను చూసి 'ఏంటి ఈ రోజు స్పెషల్ ??' అని కొంటెగా నవ్వుతూ అడుగుతున్నాయి నా కళ్ళు... ఏమీ ఎరుగనట్టు..!!

అసలే ధ్యాస ఇక్కడ లేదంటే, అదే అలుసుగా ..'విషయం ఏంటో చెప్పు..' అని కురులు అందకుండా ఆటపట్టిస్తున్నాయి...

బుజ్జీ, ఈ రోజు జడ బాగా వేసుకున్నావే. గౌరీ దేవికి పెట్టిన విరజాజి మాల తెచ్చుకో పెడతాను అంది అమ్మ. ఆ దండ నా జడలో ఇలా ముడిచి అమ్మ అలా తిరిగిందో లేదో, 'ఏమిటి సంగతీ..' అంటూ దొరికిందే సందుగా బుగ్గ గిల్లేసాయి అమ్మలక్క జాజులు....

ఎలాగయితే తప్పించుకుని బయటపడ్డాను అనుకుంటూ, అడుగు బయటపెట్టగానే, చటుక్కున అల్లేసింది 'విషయం చెప్పకుండా..ఎక్కడికి పోతావు చిన్నదానా.. నా చేతుల్లో చిక్కుకున్న పిల్లదానా..' అంటూ సమీర....

విడిపించుకునే ప్రయత్నంలో తూలి మీద పడగానే, 'హమ్మ! దొరికింది దొంగ.. నా చేతబడకుండా జారుకుందాం అనుకున్నావా నీ పని చెప్తా ఉండు...' అని తను పోగు చేసిన పూసలన్నీ నా పై గుప్పించేసి, 'అయినా అంత ఖంగారు దేనికో..' అని బుగ్గ నొక్కుకుంది వర్ధనం...

చక చకా అడుగులేసుకుంటూ ముందుకు నడిచేసాను. బస్ లో కిటికీ లోంచి చూస్తూ, 'అబ్బా..ఉదయాన్నే వాతావరణం ఎంత బాగుందో' అనుకుంటూ పెదాలపై చిన్న నవ్వు మొలకెత్తగానే పక్కనే కూర్చున్న ఆంటీ విసిరేస్తోంది అదో రకమైన చూపులు...

నా మానాన నేను, 'మనసే కోవెలగా.. మమతలు మల్లెలుగా.. నిన్నే కొలిచెదరా.. నన్నెన్నడు విడువకురా... కృష్ణా...' అని పాట హం చేస్తుంటే.. 'whatsup dear? who is Krishna?? ' అని కళ్ళెగరేసేసింది పక్క స్టాపులో బస్ ఎక్కిన శ్రావణి...

ఇది చాలదన్నట్టు ఆఫీసులో అడుగుపెట్టగానే 'ఏమిటి, ఈ రోజు చాలా brightగా కనిపిస్తున్నావ్? ఓహ్..! జడలో పూలూ కూడా.. హ్మ్.. హ్మ్.. క్యా బాత్ హై మేడం??' అంటు రిసెప్టనిష్ట్ సీమ....

ఛ..!! ఎక్కడ చూసినా ఇదే గోల... నన్ను అందరూ ఆటపట్టించేవాళ్ళే.... తెలియకపోతే అనుకోవచ్చు. అంతా తెలిసీ ఇలా చేస్తే..??అందరినీ నీ వైపుకే లాగేసుకున్నావు! ఇప్పుడు నా వైపు నేను తప్ప ఇంకెవరూ లేరు :((

వాళ్ళ సంగతి సరే.. నువ్వు కూడానా..?! :( నా గురించి నీకు తెలియనిదా? అలా కనిపించకుండా దోబూచులాడతావేం? ఊరంతా పలకరిస్తావ్, వెళ్ళిన ప్రతి ఇంట్లో నీ అడుగుల ముద్రలు వేస్తావ్.. మరి నా కోవెలలోకి రావేం ? కనీసం తొంగి చూడవేం?? అంత కాని దాననైపోయానా?? నువ్వూ నన్ను చూసి నవ్వుతున్నావా....?? ఏమీ ఎరుగనట్టు..?!

అంతేలే నీకు అలానే ఉంటుంది. బాగా లోకువైపోయాను నేను నీకు. పో..! నేను అలిగాను. అంటే, నీతో మాట్లాడను. ఏమీ మాట్లాడను. అస్సలు మాట్లాడను. ఏదీ చెప్పను. చెప్పనంటే చెప్పను. అంతే..! నేను కూడా నీలానే ఉంటాను... ఏమీ ఎరుగనట్టు!!

Monday, October 6, 2008

కానుక

వైరాగ్యం కాదిది, విరక్తి...!!! లోపల ఒక అగ్ని పర్వతం బద్దలయినట్టు, ఉడుకుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా బయటకి వేళ్ళే దారి లేక నన్ను లోలోపలే కాల్చేస్తున్నట్టూ ఉంది నాకు. ఏం చెయ్యాలో తోచక నడవటం ప్రారంభించాను.

నడుస్తున్నాను... ఎందుకో ఎక్కడికో తెలియదు. అలా నడుస్తూ ఉన్నాను. ఎంతసేపటి నుంచి నడుస్తున్నానో గుర్తులేదు. ఎంత దూరం వచ్చానో అన్న ఆలోచన లేదు. బయలుదేరినప్పుడు ఎదురుగా ఉన్న సూర్యుడు ఇప్పుడు నడి నెత్తి మీద ఉన్నాడు. అంటే చాలా దూరమే వచ్చానేమో...! తిరిగి వెనక్కి వెళ్ళలేను ఇప్పుడు. ఎలా వెళ్ళాలో తెలియదు కూడా... కాళ్ళు పీకేస్తున్నాయి. కానీ కుర్చోవాలని లేదు. గొంతు ఎండిపోతుంది. నీళ్ళ కోసం ఎక్కడా ఆగాలని లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తెలియకుండా పడిపోవాలే కానీ, ఆగే ఆలోచన లేదు. ఎందుకింత పట్టుదల..? ఏం సాధించటానికి ఇంత శ్రమ?? ఏమో..?!! "ఇది" అని స్పష్టంగా తెలియదు. కానీ ఎదో వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. ఏం వెతుకుతున్నానో గుర్తులేదు! కలవరమో, కలతో.. లేక అయోమయమో.. మొత్తానికి ఒక చోట స్థిరంగా మాత్రం ఉండలేకుండా ఉన్నాను.

ఇంతసేపూ నేను గమనించ లేదా? లేక వీళ్ళంతా ఇప్పుడే వచ్చారా ?? ఎప్పట్నుంచి నా చుట్టూ ఇంత మంది ఉన్నారో..!! అంతా హడావుడిగా ఎవరి పనిలో వాళ్ళు తిరుగుతున్నారు. చుట్టూ ఉన్న మనుషులు అంతా తెర మీద కదులుతున్న పాత్రల్లా కనిపిస్తున్నారు. నేను వారికి కనిపించని ప్రేక్షకుడిలా... చూస్తున్నాను. చూస్తూ నడుస్తున్నాను... ఎంత పరిణితి చెందిన నటులో వీళ్ళు. వారి ముఖంలో ఎన్నో హావ భావాలు. వారి గొంతులో ఎన్నో స్థాయిలు. కొన్ని నాకు వినిపిస్తున్నాయి. కొన్ని నాకు వినపడననంత దూరంగా... నేను మాత్రం నడక సాగిస్తూనే ఉన్నాను. కొందరి కథ నా [??!] దారిలోనే సాగుతుండటంతో ఆ పాత్రల్ని ఎక్కువసేపు చూస్తున్నాను. నా ప్రయాణం మాత్రం నే అనుకున్నట్టు గానే [తరువాతి అడుగు ఎటు వెయ్యాలో ముందుగా నిర్ణయించుకోకుండా..], సాగుతోంది. సరిగ్గా అప్పుడే ఎవరో పిలిచారు నన్ను. ఉల్లిక్కిపడ్డాను!! ఇదేమిటి ఇక్కడ నే ఒక్కడినే ప్రేక్షకుడననుకున్నాను. కొత్తగా ఈ పిలుపు ఎవరిది ? పిలిచింది ప్రేక్షకుడా లేక పాత్రధారా? పాత్రధారి అయితే నేను కూడా...??!!! ఏమని పిలిచారు?? నా పేరు వాళ్ళకెలా తెలుసు ?? అసలు పేరుతోనే పిలిచారా?? లేకపోతే నేనెందుకు పలికాను, అటు వైపు ఎందుకు తిరిగాను ? అసలు పిలిచారా లేక ఇది నా అపోహా? ఇలా సాగుతున్న ప్రశ్నల పరంపర లోనుంచి తేరుకుని చూసే సరికి, అప్పటికే అడుగులు అతడి వైపు పడుతున్నాయి. ఇంత దాకా ఎలాంటి గమ్యం లేకుండా సాగిన ప్రయాణంలో ఉన్నట్టుండి ఒక ఒడ్డు కనిపించింది నాకు. ఆ పిలిచినవారి దగ్గరకెళ్ళి నా సందేహాలన్నీ తీర్చుకోవాలి. ఏదైతే నేమి, ఇది కూడా నా నిర్ణయం కాదు. నే నడుస్తున్నాను. నే నిర్ణయించని నా దారిలో....

అతడు కూడా నాలాగే నడుస్తూ వస్తున్నట్టున్నాడు. కాస్త గంభీరంగా ఉన్నాడు కూడా...! అది ప్రయాణం వల్ల కలిగిన అలసట వల్ల కాబోలు. చూపు చాలా తీక్ష్ణంగా ఉంది. తన గమ్యం తనకి కనిపిస్తుందనుకుంటా. దృష్టంతా దారి పైనే... అతడిలో స్పష్టత చూసి అలా అనిపించింది నాకు. ఇలా అనుకుంటూనే అతడిని చేరుకున్నాను. నే వెళ్ళగానే, అతడు కాస్త చతికిలబడి, కింద కూర్చున్నాడు. తన పక్కనున్న నేల పై అరచేతితో తట్టాడు, నన్ను కూర్చోమన్నట్టుగా... నేను కూర్చున్నాను. మంచినీళ్ళు తీసీ కావాలా అన్నట్టుగా సైగ చేశాడు. ఊ.. అన్నట్టుగా తలూపాను. ఎంత దాహంతో ఉన్నానో.. ఆ కాసిన్ని నీళ్ళు తాగగానే ప్రాణం లేచొచ్చింది. రాగానే, కృతజ్ఞతగా అతడికి ఓ చిరునవ్వు సమర్పించుకుంది, ప్రాణం. కాస్త సేపు ఇద్దరం ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఛేదించిన సందర్భాలు, అతడి దారిలో కలిసిన ఇతర బాటసారులు, వారితో కలిసి చేసిన ప్రయాణం, ఇలా ఎన్నో విశేషాలు పంచుకున్నాం. చూడ్డానికి ఎంతో సీదా, సాదా గా ఉన్నాడు. కానీ ఎన్నో విషయాలు చెప్తున్నాడు. చాలా లీనమై వింటున్నాను అవన్నీ... అంతే లీనమై చెప్తున్నాను కూడా..! ఎందుకో కాస్త సరదాగా అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది. నేను నా నడక ఆపి చాలా సేపయ్యింది అని.., తీర్చుకోవాలనుకున్న సందేహాలు ఒక్కటీ అడగనేలేదనీ..!! పెద్ద విషయంలా అనిపించలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి బయలుదేరాం ఇద్దరం. దారంతా మాటలు, నవ్వులు.., అప్పుడప్పుడు దాగుడుమూతలు.., మధ్య మధ్యలో వానలో పాటలు, ఆటలు...

ఇంకొంత దూరం ఈ దారి. అటు తరువాత అది వేరు వేరు దిక్కులకు విడిపోయింది. "నువ్వు ఎటు వెళ్తున్నావూ?" అని అతడు నన్నడిగాడు. తెలియదన్నాను. ఆ తరువాత కాసేపు మౌనంగా సాగింది నడక. ఇంతలోనే, ఆ కూడలికి చేరుకున్నాం. అతడు తన సంచిలోంచి లాకెట్ ఉన్న గొలుసొకటి నా చేతికిచ్చి తాను నిర్దేశించుకున్న దారిలో కదిలిపోయాడు. నేను మాత్రం అక్కడే కాసేపు ఆగిపోయాను ఆ గొలుసును చూస్తూ...!! అది గవ్వల గొలుసు. అతడు సముద్ర తీరాన చాలా సేపు ప్రయాణించాడని చెప్పాడు ఇందాక మాటల్లో. అక్కడ ఏరిన గవ్వల్లా ఉన్నాయి. అంత అపురూపమైన వస్తువును నాకు ఇచ్చాడా...?! నాకేమీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనకీ, "ఎందుకు ఇలా.. ?" అన్న ప్రశ్న వేసుకోలేదు. మరి, ఇదేంటి ఇప్పుడు..? అతడితో గడిపిన ఆ కాస్త సమయంలో ఎదో అర్థాన్ని వెతుక్కుంటున్నాను? అక్కడే జీవించాలనా..? చాలా కొత్తగా ఉంది నాకు. ఉన్నట్టుండి ఏదో నొప్పి, లోలోపల జలపాతపు హోరులా, సాగర ఘోషలా, సుడిగాలిలా, ఎక్కడో తెలియనంత లోతుగా, నా కడుపులో ఎవరో మెలిపెడుతున్నట్టుగా..! మనసును ఇంట్లో కొక్కేనికి తగిలించి వచ్చినట్టుగా...... ఇప్పుడు నేను "మనస"న్నానా..???!!!

Friday, October 3, 2008

తప్పక చదవండి..

కైవల్యం
ఇంతముందు చదవకపోతే తప్పకుండా చదవండి. చదివేస్తే తప్పకుండా మళ్ళీ ఒక సారి చదవండి. :)

Tuesday, September 30, 2008

..సంఘర్షణ..

తెలి సంధ్యా సమయాన, ఆతడిని చూడాలని రెక్కలు కట్టుకు వచ్చి వాలాను. రవి, ఆతడి చుట్టూ చేరిన ప్రకృతి, ఆహా...! ఎంత మనోహరమైన దృశ్యం అది..! అతడిని, ఆ దృశ్యాన్నీ చూస్తూ, మైమరచి అలానే నిలుచుండిపోయాను. ఎవరు చెప్పారో మరి తనకి, ఉన్నట్టుండి తన చూపు నా పై..! అంత దాకా అతడినే తదేకం గా చూసేస్తున్నదానిని, అతడి చూపు నాపై పడేసరికి ఒక్కసారిగా నాలో ఎందుకో ఇంత అదిరిపాటు?!! కాస్త తమాయించుకుని, అతడిని అసలు చూడనట్టే తల దించాను, కనురెప్పలపై అతడి చూపు వేడిని ఇంకా అస్వాదిస్తూనే..! ఇంతలో, ఆ పక్క విచ్చుకుంటున్న ఎర్ర మందారాలతో పోటీపడుతున్న పెదవులను అదిమి పట్టలేక, మరి ఇక చేసేది లేక, దాచేందుకు ముఖం పక్కగా తిప్పాను. ఎంత తిప్పుకున్నా పువ్వు చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ ఆమెని అల్లరిపెడుతున్న భ్రమరంలాగ, అతడి చూపుల కిరణాలు ఇప్పుడు నా చెంపని గిల్లుతున్నాయి. ఆ గిల్లుడు చేతనో లేక సిగ్గు వలనో మరి, చెక్కిళ్ళు ఎరుపైతే ఎక్కాయి. నా కను కొనల్లో అతడి మసక రూపం. తలెత్తి చూడాలనే ఆతృత గుండె వేగాన్ని పెంచేస్తోంది. కానీ చూడలేను :(. కదిలిన చెట్ల ఆకుల సందుల్లోంచి జారిన మంచు బిందువుల్లా చల్లగా తాకుతున్న అతడి చిరునవ్వులు..... గోళ్ళన్నీ కొరికేస్తూ నేను...
ఏమిటో ఈ సంఘర్షణ !!

Saturday, September 27, 2008

..ముత్యాల మాల..

మెల్లగా, ఓపికగా, వరుసగా...
ఒక్కొక్కటిగా.. ముచ్చటగా...
నే అందిపుచ్చుకున్న ముత్యాలను పేరుస్తూ...
ఒక[నా] మాలని గుచ్చుతున్నాను...
నన్ను అలంకరించు కునేందుకు..!

మొదటి సారి తెగిపోయింది :-(, మళ్ళీ గుచ్చాను..నమ్మకంతో..
రెండావసారి కొట్టుకుపోయింది, కొత్తగా పేర్చాను.. ఈదిన అనుభవాలతో..
మూడవసారి మాసిపోయింది, జాగ్రత్తగా శుభ్రపరిచాను.. ప్రేమతో..
ఇప్పుడు మాయమైపోయింది, ఒంటరిగా మిగిలిపోయాను.. అయోమయంలో..!!

Thursday, September 25, 2008

అమ్మా... నేనేం చేసాను ?!!అమ్మా... నేనేం చేసాను ?!!
ఎందుకు నన్ను వెళ్ళగొడుతున్నావూ..?
పువ్వు లాంటి నీకు నేను భారంగా ఉన్నానా ??
భారంగా ఉన్న నేను నీకు నొప్పి కలిగిస్తున్నానా??
క్షమించమ్మా.. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను
లేదమ్మా... నన్ను వెళ్ళనివ్వకమ్మా..
వద్దమ్మా... నన్ను వదలద్దమ్మా..
అమ్మా... అమ్మా.. వదలద్దమ్మా....
అమ్మా... అమ్మా.. అమ్మా... అమ్మా.....!

.......................................
........................................

నన్ను కడుపులోంచి వెళ్ళగొట్టింది, గుండెల్లో చేర్చుకోవటనికా..
నాపై కాఠిన్యం చూపించింది, కమ్మని ఒడి పరిచేందుకా..
నీ కష్టాన్నంతా గొంతులో పట్టింది, నాకు జీవం పోసేందుకా..
ఎంత మూర్ఖురాలిని...!!
నిన్ను అర్థం చేసుకోలెకపోయనమ్మా... ఇన్నాళ్ళూ..!!

చూపును చూసి, వెనకున్న ఆలోచనని చదివేస్తావు.
స్వరాన్ని బట్టి, గుండెలోని భావాన్ని కనిపెట్టేస్తావు.
'నువ్వు నా దానవే..' అని ప్రతి క్షణం నన్ను హత్తుకుంటావు.
'నా లోకం నువ్వేనంటూ..' నా కోసం లోకాన్ని, నాన్నని సైతం ఎదిరిస్తావు..!

నీ కలల్లో నా భవిష్యత్తుని చూస్తూ,
నీ కనుబొమ్మల్లో నాకై తపనను ముడుస్తూ,
నీ కళ్ళళ్ళో నా సంతోషాన్ని చూపే...
నా చిట్టి తల్లీ.., నీ ఋణం ఎలా తీర్చుకోనే....?!

ఓ మాట చెప్పనా అమ్మా...?
I Love You :)

Friday, September 19, 2008

అహం - తాపత్రయం

ఎంటీ అసలూ..నువ్వు నా మాట వినవా..? భయం ఎలాగూ లేదు. కనీసం నేనంటే..లెక్క కూడా లేకుండా పోయింది. ఏదన్నా అంటే.. అన్నిటికీ ముందు ఆ ఏడుపొకటి.. నిన్ను చూసుకుని, ఆ చేతులకు, కాళ్ళకు కూడా సొంత అభిప్రాయాలు.. సొంత పెత్తనాలూ...! ఒకళ్ళు చక చకా సెల్ ఫోన్ అందిస్తే... ఇంకొకరు బయటికి పరుగు. మీకందరికీ నేను బా....గా..... లోకువైపోయాను అసలు. అసలు మిమ్మల్నంతా చెడగొట్టింది ఆ చెవులు కదూ.. ముందొచ్చినదాన్ని..! అని ఏంత పొగరు అసలు!! ఆ గొంతు వినకపోతే, ఏంటో అంత నష్టం...!! పోనీ జరిగిందేదో జరిగిపోయింది.. అని నోరు ఏమైనా.. కొంచమైనా... తిన్నంగా ఉంటుందా...???! తోచిందల్లా మాట్లాడేస్తే...ఎవరిది బాధ్యత?? నన్నెవరూ అర్థం చేసుకోరా అసలు ? మీరు చేసే చేష్టలకి మిమ్మల్ని ఎవరూ అనరు.. అన్నీ పడేది, భరించేది, బాధ పడేదీ నేను!! అంతా నన్ను అన్నేసి మాటలంటుంటే... దిష్టి బొమ్మల్లా గుడ్లప్పగించుకుని చూస్తారే తప్ప, "తప్పు నాది... ఆ క్షణంలో నేను తన మాట వినలేదు. కాబట్టి ఎదైనా తప్పు జరిగితే అది నాది." అని మీలో ఒక్కరంటే..ఒక్కరైనా ముందుకు వచ్చి చెప్తారా... ?? లేదు..! రారు... రాలేరు! నాకు తెలుసు. ఎన్ని సార్లు జరగలేదు నాకు ఇలాంటి సత్కారాలు..? సమయానికి నా స్నేహితురాలు వెన్నెల వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఈ పాటికి నువ్వు ఏ స్థితిలో ఉండేదానివో...ఆలోచించావా అసలు?!! మీకర్థం కావట్లేదు.. నన్ను మీలో చేరనిస్తే కదా.. అసలు నేనేదైనా చెయ్యగలిగేది?? అది వదిలేసి, నన్నో శతృవులా, అంటరానిదానిలా... చూస్తారు. నా ముసుగులో ఎవరో ఎక్కడో విచక్షణ లేకుండా ఏదో చేసారని, మీరు నన్ను పట్టించుకోకపోతే.... నష్టం ఎవరికీ? అని ఒక సారి బుద్ధిని అడిగి తెలుసుకోండి. ఇంతకంటే.. నేనేమీ చెప్పను..? ఎన్ని సార్లని చెప్పను ?? చెప్పి చెప్పి నే అలిసిపోయి, అరిగిపోయి, కరిగిపోవాలి అంతే... ఇప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా నోరు విప్పట్లేదు..! అంతే.. మీలో మార్పు ఈ జన్మకి రాదంతే... కొన్ని జీవితాలంతే...!! మీ ఖర్మ.. అనుభవించండి!

Wednesday, September 17, 2008

..తామర క్షణం..

జీవితంలో ఇవి నావి, నా ఆస్థి అని చెప్పుకోగలిగేవి కేవలం నా క్షణలేనేమో..! అలాంటి వాటిని ఉదయం లేచిన దగ్గరనుంచి.. పడుకునే దాకా... ఎదో ఒకటి చేస్తూనో, ఎమీ చెయ్యకుండానో.. ఈ రోజుకు కావాల్సినవి సమకూర్చుకుంటూనో....నిన్న కూర్చుకున్న వాటిని వదిలించుకుంటూనో .. రాబోయే రేపు కోసం కష్టపడుతూనో, కలలు కంటూనో.. ఆలోచిస్తూనో... అర్థం లేకుండానో... సలహాలిస్తూనో, సంజాయిషీలు చెప్పుకుంటూనో... గడిపేస్తున్నాను.

ఇలా కరిగిపోతున్న వాటిలో నే జీవించేది ఎన్ని? వాటిలో ఎన్నింటిని నేను అచ్చంగా నావిగా పోగుచేసుకుంటున్నాను..? అసలు అచ్చంగా నావి అంటే ఏవి? నా కోసమై నే గడుపుకునే క్షణాలా..? లేక నాకు ఇష్టమైనది చేస్తూ గడిపే క్షణాలా?

అయ్యో... ఇలా తికమకపెట్టే ఈ ఆలోచనల బురదలో ఇప్పుడే ఒక తామర క్షణం.. విరిసి, మెరిసి, "నువ్వు జీవించేది ఇక్కడ" అని చెప్తూ, [నువ్వు నన్ను పట్టుకోలేవన్నట్టు] నన్ను చూసి కొంటెగా నవ్వుతూ, నే గ్రహించేలోపే మాయమయ్యింది.... అరే.. ఏం చేసాను నేనా క్షణం..? ఏదీ..నే జీవించిన నా క్షణం....?? ఎమో.. ఎటెళ్ళిందో తెలీదు!! తను విచ్చినప్పుడు [క్షణం కంటే వేగంగా] వ్యాపించిన ఆ సువాసన మాత్రం ఇంకా అలానే ఉంది. తను నా భ్రమ కాదని, నాకు తెలపటానికన్నట్టు....

Monday, September 15, 2008

ఆకాశం రంగేమిటో..?!

ఆకాశం రంగేమిటో.....?!

చచ్చు ప్రశ్న... "ఆకాశం రంగేమిటి" ఏమిటి.. వెధవ పైత్యం కాకపొతే...!
నీలంగా ఉంటుంది. అది కూడా తెలియదా...?!!

హ్మ్.. తెలుసు.. ఆకాశం కేవలం పగటి వెలుగులో మాత్రమే నీలం రంగులో ఉంటుంది. సూర్యోదయ సమయంలో నలుపు నుంచి, బూడిద రంగులోకి, అటుపై గులాబి, ఎరుపు, సిందూర వర్ణాలు పులుముకుని, ఆఖరుకి, నీలంగా మెరుస్తుంది. సాయంత్రానికి మళ్ళీ సిందూరం,ఎరుపు,గులాబి, బూడిద వర్ణల్లోకి మారుతూ.. మెల్లగా నలుపు పులిమేసుకుంటుంది.

మరి అసలు ఆకాశం రంగేమిటీ??!!

ఆ ఆకులు...?? హ్మ్.. అదే ప్రశ్న.. ఆ ఆకుల రంగేమిటి ?!!

ఆకుపచ్చ.. మళ్ళీ అదంతా పగటి వెలుగులోనే... అ వెలుగు సన్నగిల్లే కొద్దీ... అవి కూడా నలుపే పులుముకుంటున్నాయి..

వెలుగులోనే అసలు రంగు బయట పడుతుంది అంటారు. కానీ ఆ వెలుగు ఎప్పుడూ ఒకలా ఉండదే...!! మరి అసలు వెలుగు ఏది, అసలు రంగు ఏది ఎలా చెప్పగలం ??

పగటి పూట మనకి కనిపించే ఆ రంగులు, వెలుగును తీసుకుని, వెన్నక్కి ఇచ్చే వర్ణాలు కదా.. ఐతే.. వాటి అసలు రంగు ఏమిటి?? అసలు ఏదైనా రంగు ఉందా లేదా?? ఏమీ ఇవ్వకపోతే ? మన ఉనికే లేదా ?? అసలు వెలుతురే లేకపోతే అప్పుడు మన రంగు?

ఎవరూ చూడనప్పుడు మనం ఎలా ఉంటామో అదే మన నిజమైన తత్వం అంటూ ఉంటారు. అంటే.. నలుపే [చీకటే] నిజమా..?? వెలుగు మాయా..??

లోకంలో రంగుల్ని..చూస్తూ ఆనందించే నాకు.. ఒక్కసారిగా ఇవన్నీ నన్ను మోసం చెయ్యటానికి సృష్టింపబడిన వాటిలా, మాయలా, భ్రమలా కనిపిస్తున్నాయి....నలుపొకటే నిజంలా తోస్తోంది... !!

ఎంటో ఈ కృష్ణ [నల్లని] మాయ నాకు....

Tuesday, September 9, 2008

కురిసేను విరిజల్లులే...


అతడిని ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసాను. కానీ ఈ రోజు అతడిలో ఎదో తెలియని శోభ నన్ను ఆకర్షిస్తోంది. కళ్ళార్పకుండా తదేకంగా చూస్తున్నాను. చూసేకొలదీ బలపడుతున్న ఆకర్షణ... నాకు తెలియకుండానే నా పాదాలు అతడి వైపు కదులుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ దూరం కరుగుతుందా, ఎప్పుడెప్పుడు అతడిని చేరుకుంటానా అన్న ధ్యాసలో కళ్ళు తెరిచి తపస్సు చేస్తున్న మునీశ్వరిలా, ఐహిక సుఖలన్నీ మరచి అతడినే పూజిస్తున్నాను. అతడిని చేరే వరమివ్వమని ప్రార్ధిస్తున్నాను. ఇది కట్టలు తెగిన వయసు వ్యామోహమో.. లేక అదుపు, ఆంక్ష లేని వెర్రి ప్రేమ మైకమో లేక మరేదైనానో నాకు తెలియదు. అసలు ఎప్పటికైనా అతడిని చేరుకుంటానో లేదో అనేది కూడా ఆలోచించట్లేదు. ఎప్పుడు వచ్చింది నాలో ఇంత మూర్ఖత్వం? ఏమో ఈ ఆకర్షణ ముందు, నా భావం ముందు నాకేదీ అనిపించట్లేదు, కనిపించట్లేదు. అతడిని చేరుకోవటమే నా జీవిత లక్ష్యంలా తోస్తుంది. ఒక్కొక్కటిగా బంధాలన్నిటినీ విడిచిపెడుతున్నాను, మోక్షం పొందేందుకు బయలుదేరిన సన్యాసినిలా.... అతడు నా వైపు వస్తున్నాడు. నన్నే చూస్తున్నాడు... అది గమనించిన నా మనసైతే పురివిప్పిన నెమలల్లే నర్తిస్తోంది. నర్తించే నన్ను చూసి అతడిలో ఎలాంటి చలనం లేదు. గాంభీర్యమే కనిపిస్తోంది. కానీ ప్రతి క్షణం అతడిపై నా ఆకర్షణ మరింత బలపడుతుంది.

తొలి సందేశం...
అతడి మీదుగా వచ్చిన గాలి నన్ను సోకింది. నాలో సన్నగా మొదలయిన ప్రకంపన..

మొట్టమొదటి సారి అతడిలోని మొరటుతనాన్ని చూస్తున్నాను. నిప్పులు కురిపిస్తున్న అతడి కళ్ళను అదరకుండా చూస్తున్నాను, అతడిలోని ప్రతి భావాన్నీ అనుభవించాలని... గర్జిస్తున్న అతడిని బెదరకుండా ఆహ్వానిస్తున్నాను, ఆప్యాయంగా హత్తుకోవటానికి... అతడు చేసే పిడుగుపాటు లాంటి గాయాలను భరిస్తున్నాను సంతోషంగా... అతడు ఆక్రమిస్తున్న నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతున్నాను. అతడిని నాలో కలిపేసుకోవాలని అనుకున్నాను. కానీ నన్ను పెనవేసుకుపొతున్న అతడితో ఏకమై కరిగి, జారి, ప్రవహిస్తున్నాను. నా అన్న ఉనికి, తడిసి ముద్దై, మట్టిలో కలిసిపోయింది. కాసేపటికి తేలికై అతడు నా ఒడిలో సేద తీరుతున్నాడు. అలసి సొమ్మసిల్లేట్టుగా భారంగా నేను...

ఏంటీ? అలా చూస్తున్నావ్?? నీకిది వెర్రిగా తోస్తుందా? వీపరీతంగా కనిపిస్తుందా? మోహనా... నువ్వు చెప్పు.. నువ్వు కూడా అతడిని చుసి మైమరువలేదా? అతడి ప్రేమను చిరునవ్వుతో స్వాగతించలేదా?? అలా దిక్కులు చూస్తావే...? ఒక్క సారి, "ఇక్కడ ఎవరూ లేకుండా ఉంటే ఎంత బాగుండు" అని ఎన్ని సార్లు నీ రెక్కల్ని నువ్వే ముడుచుకోలేదూ? ఆ గొడుగును నువ్వు మనస్పూర్తిగానే తెస్తున్నావా రోజూ? లేక అతడి ప్రేమ వానలో తడిసే నిన్ను చూసి అసూయతో మాట్లాడే వాళ్ళకోసమా? గొడుగును కావాలనే తేవటం మర్చిపోయిన నాడు అతడు నన్ను కరుణించాలని నాతో పాటు నువ్వూ ఆర్ధ్రంగా ఎదురుచూడలేదూ?? నిజం చెప్పు... మా అనుబంధాన్ని చూసి ఆనందించే నువ్వు, మా భావాలను నేనిలా వ్యక్తపరిస్తే తప్పుగా, తెగింపుగా చూస్తున్నావా? నేను బరితెగించానా? లేక నా ధైర్యం చూసి, నువ్వు భయపడుతున్నావా?

నీ సమాధానాలు నీకోసమే...గుర్తుంచుకో..!!

లేదు.... నేనేమీ అనుకోవట్లేదు. నువ్వు చెప్పు...

కొంతసేపటికి ఇద్దరం తేరుకున్నాం. భౌతికతను కోల్పోయి, ఇప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గలా, ప్రకాశవంతంగా, అతడు. అతడి ప్రేమలో తడిసి దానిని అందరికీ పంచే ప్రేమమూర్తిగా నేను, ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాం. సంతరించుకున్న కొత్త అందాలతో పులకరించి, ఒక్క సారి నా రెక్కలు విప్పి అతడిని చుట్టలేనని తెలిసీ, అతడిని అమాంతంగా కౌగిలించుకున్నాను. ఈ నిమిషం ఇలానే స్తంబించిపోవాలన్న దురాశ కలగకపోలేదు. కానీ అతడి ప్రేమతో పాటు అందిపుచ్చుకున్న బాధ్యతలను మరువలేను. ఆ నిమిషం కరిగింది. ముడి విడింది. దూరం దరిచేరింది...

కానీ నాకు తెలుసు అతడిని మళ్ళీ కలుస్తాననీ.. నా ప్రేమను దాయలేననీ...

:) నువ్వు దాయలేవు..ఒప్పుకుంటున్నాను.. ఈ భూమిపై వికసించే ప్రతి పువ్వూ.. దానికి సాక్ష్యం..!

Friday, September 5, 2008

'వినిపించని రాగాలే... కనిపించని అందాలే...'

రాత్రి 10 కావస్తోంది. బెంగుళూరు నుండి హైదరాబాదు రహదారి మీద, National Travels వారి బస్సు చీకట్లను ఛేదించుకుంటూ వేగంగా దూసుకుపోతుంది. కిటీకీ తెరలు మూసెయ్యమని ఆర్డర్ వేశాడు బ్బస్సులోని యాదగిరి. నేను యాదగిరి వంక కోపంగా చూశాను. వాడు మాత్రం నన్నేమీ అనలేదు! అసలు నన్ను చూస్తే కదా ఏమైనా అనటానికి!! ముయ్యమని చెప్తూ డ్రైవర్ కేబిన్ వైపు వెళ్ళిపోయాడు. అన్ని కిటికీల తెరలు మూసుకున్నాయి. నాది కూడా... ఈలోపు ’పరదేశి’ [హిందీ] సినిమా మొదలయ్యింది. నేను అంతకు ముందు చూడలేదు. సో లీనమై చూసేస్తున్నా.... సినిమా పూర్తయ్యే వరకూ తెలియలేదు లైట్లన్నీ ఆరిపోయి చాలాసేపయ్యింది అని. ఇప్పుడు టీవీ కూడా కట్టేసేటప్పటికి అంతా చీకటి, నిశ్శబ్దం. అందరూ నిద్రపోతున్నారా ? లేక నాలాగే మౌనంగా మాట్లాడుకుంటున్నారా..? ఏమోలే! నాకెందుకు?! ఇలాంటి అవకాశం కోసమే కదా నేను ఇంతసేపూ వేచి చూసింది..! ఇంక ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకూడదు. కిటికీ తెర నెమ్మదిగా తెరిచాను. కిటికీ సందుల్లోంచి, గండిపడ్డ నదిలా ప్రవహిస్తోంది గాలి. ఆ జోరుకు కళ్ళు మూసుకుపోతున్నాయి. ముఖం కోసేంతటి వేగం..! ఆ చిన్ని సందును, కిటికీ అద్దం ముస్తూ పూరించేసాను. సీట్లో వెనక్కి వాలి, తల పైకెత్తి సెకండ్ షోకి రెడీ అయ్యా... రాత్రి పూట ఆకాశాన్ని చూడటం అంటే నాకు చాలా ఇష్టం. ఒంటరిగా చేసే ప్రయాణంలో ఐతే ఇంకా చాలా ఇష్టం. నల్లటి ఆకాశం లో మిళుకూ-మిళుకూ మంటూ నక్షత్రాలు మెరుస్తున్నాయి. ’వినిపించని రాగాలే... కనిపించని అందాలే...’ అన్నట్టు ఎంత ఖర్చుపెట్టినా పెద్ద పెద్ద నగరాల్లో కూడా దొరకని ఈ అందమైన అనుభవం... చుక్కలతో సావాసం. ఆకాశం నన్ను ఒడిలో చేర్చుకుని జోల పాడుతుంటే, చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధం లేకుండా, అమ్మ ఒడిలో హాయిగా నిదురించే పసిపాపలా.. చింతలన్నీ మరచి నా కలల లోకంలో విహరించాను. ఊహలు ఊయలలూగుతూ ఆలపించే రాగాలు వింటూ నిదురపోయాను.

Sunday, August 17, 2008

స్త్రీ- స్వేచ్ఛ- సీతాకోకచిలుక


అభిమానంలో అభినవ 'సీత'లం.
'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.

మనః మేధస్సును ఏకం చేసి,
దాస్య శృంఖలాలను ఛేదిచాం.
జ్ఞాన జ్యోతిని వెలిగించి,
వెలుగుబాటలో ప్రయనిస్తున్నాం.

సహజీవిగా గుర్తింపు గెలిచి,
సమానంగా వెలుగొందుతున్నాం.
ప్రోత్సాహకులకు కృతజ్ఞులం,
వారి ఆశయాలకు మేం ప్రతినిధులం!

'జీ'వనంలో స్వేచ్ఛనొందిన సీతాకోకచిలుకలం.
అభిమానంలో అభినవ 'సీత'లం.

-------------------------------------------------

వారి చిత్రాన్ని ప్రచురించేందుకు అనుమతించిన పృథ్వీరాజు వర్మ గారికి కృతజ్ఞతలు.

Thursday, August 7, 2008

..అంతర్యానం - భయం..

భయం... భయం.. భయం.... ఎందుకంత భయం ? దేని గురించి భయం?
ఆలోచిస్తున్నాను....
ఆలోచిస్తే తెలుస్తుందా ? అనుభవిస్తే కదా తెలుస్తుంది???
సరే... నా అనుభవంలోకి తొంగి చూస్తున్నాను....
ఆ నిమిషం లో ఏం జరిగింది ? అసలు ఈ ప్రక్రియ ఎలా మొదలయ్యింది ? ఇంతై, వటుడింతింతై అన్నట్టు ఎలా పెరిగి నన్ను మించే అంత పెద్దదయ్యింది ? నేను గుర్తు చేసుకుంటున్నాను...

ఆ.. అవును! అప్పుడు నాకు నచ్చని పని జరిగింది. నా మనశ్శాంతికి భంగం కలిగించేది. ఆ moment లొ ఎదో తెలియని disturbance. ఆ disturbance లో చాలా ఆలోచనలు రేగాయి. అవి నాకు రకరకాల కోణాలు చూపిస్తూ.. నన్ను తలో దిక్కుకి మోసుకెడుతున్నాయి.. నేను వాటిని అనుసరిస్తున్నాను.

ఒక్కో ఆలోచన మరి కొన్ని భయం నిండిన ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. అవి చెట్టు కొమ్మల్లా... ఎదిగిపోతున్నాయి. ఊడల్లా మనసులో పాతుకు పోతున్నాయి. ఒక్కో ఆలోచనని అనుసరిస్తూ నేను నా Integrity ని కోల్పోతున్నాను. నేను విడిపోతున్నాను!!! నా Integrity ని మళ్ళీ సాధించే ప్రయత్నం లో నేను వాటిని తెంచేస్తున్నాను... విరిచేస్తున్నాను... నన్ను పట్టిన వాటిని విదిలించుకుంటున్నాను... పోరాడుతున్నాను... కానీ ఏం చేసినా లాభం లేదు. అవి నాకంటే వేగంగా, ప్రతి సారి మరింత బలంగా పుట్టుకొస్తున్నాయి. ఇలా విడివిడిగా చాలా దూరం ప్రయాణించాను. విడిపోయిన నాకు, నా భయం నాకన్నా పెద్దగా కనిపించింది. నేను బలహీనపడుతున్నానా ? లేక నా భయం శక్తి పుంజుకుంటుందా ??? తెలియదు.

నా ఓపిక నశిస్తోంది. అలసిపోతున్నాను. వీటీతో ఎంత పోరాడినా నేను సాధించలేనని అర్థమయ్యింది. వీటిని నాశనం చెయ్యాలంటే, వీటి మూలాల్ని పట్టుకోవాలని గ్రహించాను. పోరాటంలో ఒక్క అడుగు వెనక్కి వేశాను. వాటిని అడ్డుకోవటం మాని, విడిపోయిన నన్ను నేను పోగుచేసుకుని, వెనుదిరిగి, ముందుకు నడిచాను.....

నా ఆలోచనల్ని అనుసరిస్తూ ఎన్నో దారులు చూశాను. కాని ఈ దారిన ఎప్పుడూ ప్రయాణించలేదు. ఇది అంత కష్టాంగా లేదు. నన్ను ఏది అడ్డగించట్లేదు... కానీ చీకటిగా ఉంది. కొత్త దారి అయినా, చీకటిగా ఉన్నా తెలిసిన త్రోవలా ఉండటం వల్ల తేలికగానే సాగిపోతున్నాను. ఈ దారి నన్ను ఎక్కడికి తీసుకెళుతుందో అని ఆత్రుతతో సాగిపోతున్నాన్ను....

కొంత దూరం వెళ్ళగానే కొంత వెలుతురు కనిపించింది. మబ్బు పట్టిన మేఘం లా ఉంది. మధ్య మధ్యలో మెరుపులు. ఆ కాంతే నాకు ముందు కనిపించిన వెలుతురు. ఏదో కర్మాగారంలో స్రామికులంతా చాలా తీవ్రం గా, ఆగకుండ పని చేస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. అరే..! అవి నా ఆలోచనలు..!! ఓహో.. ఐతే అవి ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయన్న మాట. ఈ ఫాక్టరీ కి పవర్ కట్ చేస్తే సరి.. అంతా కుదుటపడుతుంది. అది ఎక్కడా? అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అక్కడ చాలా గొట్టలున్నాయి... ఏది పవర్ లైనో తెలియలేదు. అలా ముందుకు వెళ్తున్నాను....

అలా కొంత దూరం వెళ్ళాకా.. లయ బద్ధం గా ఒక చప్పుడు వినిపిస్తూ ఉంది. ఒక్క క్షణం ఆగి చూసాను. లయ బద్ధం గానే ఉంది కానీ వేగం గా ఉంది.. ఎవరో తరుముతున్నట్టు...

ఇంతలో "ఆగావేం ? రా.. పర్వాలేదు." అని ఒక కంఠం వినిపించింది.

కొంత ముందుకు వెళ్ళి చూస్తే ఏదో కదులుతోంది. దాని లోంచే అన్ని లైన్లూ వెళ్తున్నాయి. ఓహో.. మన టార్గెట్ ఇదన్నమాటా.. పోరాటానికి సిద్దం అవ్వాలి. ముందు అసలు రాయబారం నడిపి చూద్దాం.. అని..

"ఇలా చూడు... నువ్వు మాట్లాడుతున్నావ్, శాంతంగా కనిపిస్తున్నావ్ కాబట్టి చెబుతున్నాను. నాలో భయానికి గల కారణం తెలుసుకుని, దాన్ని అడ్డుకోవాలని.. అవసరమయితే నాశనం చెయ్యాలని బయలుదేరి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు లొంగిపో!! లేదా యుద్ధం చేసైనా నేను నిన్ను గెలుస్తాను."

"సరే.. ముందుగా నికో విషయం చెప్పాలి. నువ్వు వింటుంది నా స్వరం. కానీ చూసేది నన్ను కాదు."

"కాదా?? ఆ కదిలేది నువ్వు కాదా??? అంటే.. నువ్వూ.... నువ్వు అంతరాత్మ వా?

"మ్మ్.. అలాంటిదే.. కానీ నువ్వు ఎవరికోసమైతే వెతుకుతున్నావో వారు ఇక్కడ లేరు."

"అంటే..?"

"అంటే... ఆ కదిలేది నీ గుండె. అది రక్తాన్ని తొడుతూ ఉండటం తప్ప, తనకి నీ భయం గురించి తెలీదు."

"అవునా..! అవును.. నీకివన్నీ ఎలా తెలుసు? నువ్వు నిజం చెప్తున్నావని నమ్మకం ఏంటి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావ్?"

"నాకు తెలుసు. నమ్మటం, నమ్మకపోవటం నీ ఇష్టం. అబద్దం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు దేని గురించైనా వెతుక్కుంటూ నా దాకా వస్తే నీకు నే చేయగలిగినంత సహాయం చెయ్యటమే నా కర్తవ్యం."

"సరే.. క్షమించు. తప్పయ్యింది. సహజం గా ప్రతి జీవిలోనూ ఉండే defencse mechanism వల్ల అనుకుంటా... నిన్ను కూడా అనుమానించాను."

"Thats ok.. I understand. నిజానికి నీలోని ఈ దృక్పదమే నీలో భయానికి ఒక కారణం."

"కొంచం వివరించగలవా..? "

"ఎదుటివారు మనకి ఏదో అపాయం చెయ్యటనికే మన దగ్గరకు వస్తారన్న అలోచన . అలా అపాయం చెస్టే 'నాదీ' అని నువ్వనుకునేది ఏదో కోల్పోతావన్న అపోహ. అది కోల్పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయమే ఈ భయం అన్న ప్రక్రియ. "

"మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పా ?"

"కాదు. ముందు జాగ్రత్త మంచిదే. అతి జాగ్రత్త కాదు. ఉదాహరణకి..
పిల్లలు ఆడుకోవటనికి వెళ్ళారు. పడిపోతే? దెబ్బ తగిలించుకుంటే ??
ఊరెళుతున్నాను.. ఇంట్లో దొంగలు పడితే ? అన్నీ దోచేస్తే ?
బయట గేటు తాళం వెయ్యాలి. ఎవరైన వచ్చి నన్ను ఎత్తుకుపోతే??
చీకట్లో bathroom కి వెళ్ళాలి. ఆ చీకట్లోంచి ఎవరైనా వచ్చేస్తే? నన్ను మింగేస్తే ??

వీటన్నిటికీ ఓ పరిష్కారమో, ప్రత్యామ్నాయమో చేసుకోవచ్చు. భయం వేస్తుందని పనులు మానుకోలేము కదా.. చలా సార్లు అసలు విషయం కన్నా మన ఆలోచనలు, ఊహా శక్తి ఆ విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ఇంకా భయపెడతాయి."

చేతనైతే ఎదిరించాలి. లేకపోతే అన్నిటికీ సిద్ధంగా ఉండటం తప్ప భయపడి మనం ఏదీ సాధించలేం. ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని కోల్పోవటం తప్ప..."

"నువ్వు అలానే అంటావ్..ఇప్పుడు రోజులు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా..."

"నీ ఆవేదన నాకర్థమయ్యింది... భయానికి కారణాలు చిన్నవవచ్చు, పెద్దవవచ్చు. అలాగే ఆ కారణాలు ఎన్నయినా ఉండచ్చు.. కానీ నువ్వు తెలివైన దానివి కదా... నువ్వు చెప్పు.. భయపడి ఏమి సాధిద్దాం అని ?? భయపడుతూ ఇంట్లో కూర్చుంటే, జీవితానికి అర్థమేముంది? అన్నిటికంటే పెద్ద భయం. మృత్యు భయం. మృత్యువు ఏదో ఒక రోజు వస్తుందని తెలుసు. అది ఎక్కడా, ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు, అని కూడా తెలుసు కదా నీకు..."

"తెలుసు. కానీ నా భయం నా ఒక్కదాని గురించి కాదు. నిజం చెప్పాలంటె నా గురించి కానే కాదు. నాకు నా చావంటే భయం లేదు. కానీ నాకు నా వారి క్షేమం ముఖ్యం. వాళ్ళు క్షేమంగా ఉండలి."

"నిజమే నీకంటే నీవారి మీదే మమకారం ఎక్కువ నీకు. కానీ నేను ఒక్కటే చెప్పగలను.వేరే ఎవరి చేతిలోనో మీట ఉందనుకుని నువ్వు ఇంతదాకా వచ్చావు. కానీ నిజానికి అది నీ చేతుల్లోనే ఉంది. అతిగా ఆలోచిస్తూ.., జీవించే ప్రతి నిమిషం భయంతో నరకం చేసుకునే కంటే, బ్రతికిన ఎంత సేపైనా ధైర్యంగా నవ్వుతూ బ్రతుకు. చనిపోయాకా స్వర్గానికి వెళతామో నరకానికి వెళతామో.., అసలు అవి ఉన్నాయో లేదో మనకి తెలియదు. కానీ నీ జీవితం నీ చెతుల్లో ఉంది. ఒక్క సారి నీ నరాల్లోని ఆ టెన్షన్ ని వదులు చేసి చూడు. ఈ క్షణం స్వర్గం చేసుకునే అవకాశం నీకుంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఎంతైనా ఇది నీ జీవితం కదా..! సలహా ఇవ్వటం వరకే నా పని. సారధ్యం కాదు."

"మ్మ్.. ప్రయత్నిస్తాను. నాకు చాలా ధైర్యాన్నిచ్చావు. నీకు చాలా థాంక్స్."

"నీ అభిమానం కానీ.. నిజానికి ధైర్యాన్ని ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. గుర్తు చెయ్యగలరు. అంతే...! నెను చేసింది అదే..

"పోనీ గుర్తుచేసినందుకు థాంక్స్."

"మ్మ్. వదలవుగా..!! సరే.. My pleasure and you are always welcome. Live your life courageously and enjoy every moment of it."

":-)"

లేచి చూస్తే బారెడు పొద్దెక్కింది.. ఎప్పుడు నిద్రపోయానో....!!


-------------------------------------------------------------------------------------------------------------------
జీవితం పూలబాట కాదు. కఠిన పరీక్షలే అడుగడుగునా.. పదునైన నాగలితో చదునుచేస్తే కాని, పంట పండించలేం. పరీక్షల్ని ఎదుర్కుంటే తప్ప గెలవలేం. "కోల్పోయేది ఏమి లేదు. సాధించేది ఎదైనా ఉంటె.. మనల్ని మనం."


నాకు ధైర్యాన్ని గుర్తుచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ...
- ఓ ధైర్యవంతురాలు :-)

Wednesday, August 6, 2008

ప్రస్తుతానికి ఇక్కడ ఆగాను!!

గత నాలుగు రోజులుగా గుండెలో ఏదో కలకలం. లోపల ఏదో పెద్ద సంభాషణ జరుగుతున్నట్టు... నాలుగైదు గొంతులు అస్పష్టంగా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు ఒక గొంతు పెద్దగా వినిపిస్తుంది. కానీ ఏమీ అర్థం కావటం లేదు. మగత నిద్రలో ఉన్నప్పుడు కూడా నాకు ఏదో చెప్పాలన్న తపన తో నన్ను గట్టిగా పిలుస్తున్నట్టు... పీడకల మాత్రం కాదని తెలుసు. భయం కూడా కాదు. నాలుగు రోజులు పరిశీలించాక అర్థమయ్యింది...నాలో మెదులుతున్న అస్పష్ఠమయిన ఆలోచనలు రూపం పొందెందుకు తహ తహలాడుతున్నాయని...

నే పట్టలేకున్నాను వాటిని... ఎంత వేగం!! పట్టినా, కాగితం పై పెట్టే లోపు చటుక్కున జారిపోతున్నాయి..!!! ఛ్.. మెదడులోని ఆలోచనలని అంతే వేగంగా అక్షర రూపంలో రికార్డ్ చెయ్యగల యంత్రం ఏదైనా ఉంటే బాగుండు కదా!

స్వార్థం, ప్రేమ, కరుణ, కర్తవ్యం, బాధ్యత.... నాకు నచ్చిన పని చెయ్యటం స్వార్థమా? ఎవరినీ నొప్పించకుండా ఉండటం ప్రేమా ?? బాధ్యత అంటే ???.............

ఇలా అలోచిస్తూ ఆ ఆలోచనల ప్రవాహంలో మునుగుతూ తేలుతూ.. కొట్టుకుపోతున్నాను.. ఆటు పోట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. యే ఒక్క వైపుకో ఈదటం చాలా కష్టం గా ఉంది. మధ్య మధ్యలో ఎగిసిపడుతున్న ప్రశ్నల అలలు లోతుకు తోసేస్తున్నాయి...

ఆఖరికి కలాన్ని ఊతంగా చేసుకుని ఈదుతున్నాను. ఈదుతూనే ఉన్నాను. తీరం కనిపించలేదు. రాస్తూనే ఉన్నాను. ఆఖరికి ఓడనే ఆశ్రయించానో, ఒడ్డుకే చేరుకున్నానో.... ఒక చోట ఆగాను. ఆ ఆఖరి ఖండాన్ని ఇక్కడ రాస్తున్నాను.

నచ్చిన పని చెయ్యటం అంటే మన మీద మనకున్న ప్రేమను వ్యక్త పరచటం.
తనను తాను ప్రేమించుకోలేని వాడు మరెవరినీ ప్రేమించలేడు!
ఆ స్వప్రేమ దాహం తీర్చటం కోసం ఇతరుల ఆనందానికి అడ్డుపడితే అది స్వార్థం.
తనను మాత్రమే ప్రేమించుకునే వాడు ఎప్పటికీ ప్రేమను అనుభవించలేడు!!

Serving oneself is Self-love
Serving oneself at the cost of others is Selfishness
Serving others is Compassion
Serving others at the cost of self is Low/no self-esteem [expecting something in return]
Serving others through serving self is Responsibility
Serving Self through serving others is Universal Love

ఇందులో ఎంత అర్థం ఉందో, ఇది ఎంత వరకూ నిజమో నాకు తెలియదు. కానీ, ప్రస్తుతానికి ఇక్కడ ఆగాను!!

Saturday, July 26, 2008

ఓ పూవూ.. నీకేమిష్టం ?


మోహన: సుమా.. నిన్న నువ్వు "ఓ పూవును నేను..." అని చెప్పింది నాకు నచ్చి, ఇక్కడ నా బ్లాగు లో పెట్టేసాను. అది అందరికీ నచ్చింది. మెచ్చుకున్నారు కూడా...

సుమ: చాలా సంతోషం. అందరికీ నా తరపున ధన్యవాదాలు చెప్పు. మర్చిపోకు!

మోహన: చెప్తా కానీ.. అక్కడితో అయిపోలేదు. నీకేమి ఇష్టమో తెలుసుకోవాలని చాలా ఉత్సుకతో ఉన్నారు అంతా! నేనే ఎదో ఒకటి చెప్పేద్దాం అనుకున్నా.. కానీ, మన పూర్ణిమ అందంగా కవిత రూపంలో చెప్పాలని ఒక కండిషన్ కూడా పెట్టింది. కాబట్టి మళ్ళీ.. నిన్ను ఆశ్రయించక తప్పలేదు నాకు. మరి చెప్పు...నీకు ఏమిష్టం ?

సుమ: హ్మ్.... అయితే ఇది నాకు ఇంటర్వ్యూనా ? :)
మోహన: పోనీ అలానే అనుకో.. నీ సరదా ఎందుకు కాదనాలి ? :)
సుమ: కానీ కవితంటే కొంచం కష్టమే!
మోహన: అబ్బా.. మురిపించింది చాలు. చెప్పవే..!
సుమ: సరే సరే... నాకేమి ఇష్టం అంటే........


నాకు భావమంటే ఇష్టం.
ఆనందం, దుఃఖం. ప్రేమ, అభినందన.
ఆరాధన, అర్చన.. ఇలా స్వచ్చమయినది ఏదైనా...
అందుకే..!
భావ వ్యక్తికరణలో నేను ఎప్పుడూ ఉండటానికి ప్రయత్నిస్తాను.

తరువాత నాకు చిరునవ్వంటే ఇష్టం! ఎందుకో తెలుసా ?
భావ వ్యక్తికరణలో సహజంగా పుట్టేది చిరునవ్వు.
ఆర్భాటం లేకుండా, అందంగా ఉంటుంది.
నా అవసరం రానీయదు ఈ చిరునవ్వు. :)
కానీ నే తనలోనూ విరబూస్తానని గమనించిందో లేదో మరి ఈపాటీకి!

ఇంకా నాకు నచ్చింది చెయ్యటం ఇష్టం!
"వెళ్ళకమ్మా నలిగిపోతావు" అని అమ్మ అంటే....
"నచ్చినది చెయ్యలేని జీవితం ఉండీ ఎందుకమ్మా..?"
అని నా స్వార్థం నే చూసుకున్నాను. తనకి కడుపుకోత మిగిల్చాను.

నేను ఎవరికేం చేసినా, నాకు నచ్చింది చేశాను.
అది ప్రేమనుకునేరు కొందరు. నిజానికి అది నా స్వార్థం.
ఒక్కోసారి నా అంత స్వార్థపరురాలు లేదనిపిస్తుంది.
కాని, నా స్వార్థం లో కూడా పరోపకార వాంఛ ఉన్నప్పుడు అది ప్రేమకి తీసిపోదేమో! అసలు అదే ప్రేమేమో! అనిపించింది.

అయ్యో.. నాకెమిష్టమో చెప్పమంటే.. ఇలా మీ మెదడు తినేస్తున్నాను.. అన్నట్టు ఇది కూడా నాకు నచ్చిన పనే..! హహహ

ఇంకా నాకు.. సైట్ కొట్టటం ఇష్టం. ;)
టైం దొరికితే చాలు. అదే ధ్యాస..!
సీతాకోకలకు, తూనీగలకు, తేనెటీగలకు.. ఇప్పుడు నీకు!
నేను ఒక నవ్వు నవ్వి, అమాయకంగా చూస్తే ఎవరైన సరే పడిపోవాల్సిందే!!

వాన జల్లులో తడవటమంటే ఇష్టం.
తాను పంపే చినుకు చినుకునూ తాగి,
నాలో మకరందం నింపుకుని యవ్వనం పొందుతాను చూడూ..
ఆహా..ఆ క్షణం! అది ఎంత గొప్ప అనుభవమో!

నేను రెమ్మ పై బుద్దిగా కూచుని ఉంటే..
వాడు వచ్చి అలా తాకి పోతాడు ఒకసారి..
దెబ్బకి మత్తెక్కేస్తుంది నాకు..
మళ్ళా వచ్చి ఒక్క కుదుపు కుదిపాడంటే, ఎక్కింది కాస్తా దిగిపోతుంది. :)
నేనెవరి గురించి చెప్తున్నానో అర్థమయ్యిందా?
హ్మ్... కనిపించకుండా చుట్టేస్తాడు చూడు...వాడే..!
నాకు వాడి పేరు చెప్పాలంటేనే సిగ్గు బాబూ..అదేమిటో మరి...!
కదిపినా, కుదిపినా నాకు వీడి మీద కోపం మాత్రం రాదు. వాడి ప్రేమ అలాంటిది.
నాకు తెలీని రాగాలు పరిచయం చేస్తాడు.
వాడీతో నే గడిపిన క్షణాలన్నీ నాకు మధుర క్షణాలే...
వాడంటే నాకు ఇష్టమని ప్రత్యేకించి చెప్పాలా ? నాలాగే వాడికి ఇంకా బోలెడు మంది అభిమానులు. తెలుసా ?

ఇక ఆఖరుది... అన్నిటికంటే ముఖ్యమైనది...

పంచుకోవటం...
మీకు జ్ఞాపకాలుగానో, అనుభవాలుగానో, అనుభూతులుగానో
శాశ్వతంగా నిలిచిపోయే ప్రతి క్షణంలో,
నేను మీ మెడలోనో, చెతుల్లోనో, జడ కొప్పుల్లోనో...
లేక మీ మనసులోనో, చిరునవ్వుల్లోనో విరబూస్తూ..
మీతో పంచుకునే ప్రతి నిమిషం నాకు చాలా ఇష్టమయినది. అమూల్యమయినది.

"సున్నితమైనదాన్ని" అన్నానని నన్ను దూరం చేయకండి.
నాకు నచ్చిన పని చేయలేకపోవటం, చావు కన్నా దుర్భరం!
నన్ను మీరు గుర్తిస్తే చాలు... ఎన్ని సార్లైనా మరణిస్తాను..
మళ్ళీ పూవుగా జన్మించడానికి!!!

మీతో నా మనసులో మాట పంచుకోనిచ్చిన మీ అందరికి నా ధన్యవాదాలు. ప్రశ్న అడిగిన పూర్ణిమ గారికి ప్రత్యేకించి మొరోసారి ధన్యవాదాలు.. ఇక మోహనా... నీకు థాంక్స్ చెప్పాలా ?అంత అవసరమా ?? ;)

మోహన: ఓఓఓయి.... !!! :)

-------------------------------------------------------------------------

Special Thanks to everyone who inspired me write this post.

Wednesday, July 23, 2008

ఓ పూవును నేను....సిగ్గు మొగ్గలేస్తాను, సింగారంగా విరబూస్తాను.
పరిమళం వెదజల్లుతాను, పది మందినీ ఆకర్షిస్తాను.

నాలో ఎంత సొగసో, నేను ఎంత సున్నితమో..!
నాకై ఎన్ని రంగులో, నాపై అందరికీ ఎంత మక్కువో..!

ప్రతి పండక్కీ నేనుంటాను, ప్రతి పందిరినీ పలకరిస్తాను.
మగువలను ముస్తాబుచేస్తాను, విజేతలను అభినందిస్తాను.

అమాయకత్వమే తప్ప, అహం లేనిదానను.
పాడిని సైతం అలంకరిస్తాను, పీనుగులనూ కౌగిలిస్తాను.

ప్రతిచోటా ఇమిడిపోతాను, ప్రతివారికీ ఒదిగుంటాను.
ఇమిడిన చోటల్లా అలుసవుతాను, ఒదిగిన సారల్లా గాయపడతాను.

పీక నులిమినా కాదనను, సుది దించినా వద్దనను.
ఎక్కడున్నా.., ఉన్నదంతా పంచుతాను.

ఓ పూవును నేను....
చిరునవ్వుతో జీవిస్తాను, చిరునవ్వుతో మరణిస్తాను!!

Sunday, July 20, 2008

"దేవుడు ఎక్కడ ఉన్నాడు?"

యశిర్ గారి బ్లాగులో "హిందువులు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారొ వారికే తేలియదు" అన్న టపాకి నే రాసిన వ్యాఖ్య తాలూకు సారాంసాన్ని మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ టపా రూపంలో ప్రచురిస్తున్నాను.
-----------------------------------------------------------------------------------

"దేవుళ్ళు ఎంత మంది ?"
దేవుడొక్కడే..!

ఐతే.. "ఆ ఒక్క దేవుడు ఎక్కడ ఉన్నాడు?"
దేవుడొక్కడే అయినా.. అతడు మనం ఊహించుకున్నట్టూ ఒక్క మనిషిలోనో, ఒక్క ప్రదేశంలోనో, ఒక్క మతంలోనో, ఒక్క వస్తువులోనో.. ఇలా యే ఒక్కదానిలోనో కాక, సమస్తమయిన విశ్వం కూడా ఆతడి శక్తితో నిండి ఉంది.

మరి "హిందూ మతంలో ఇంత మంది దేవుళ్ళు ఎందుకున్నారు?"
మనిషి తో సమానంగా గాలి, నీరు, నిప్పు, గ్రహాలు, నక్షత్రాలు, తాబేలు, చేప, సింహం, కూర్మం[పంది], ఏనుగు, పాము, ఎలుక, గుర్రం, చెట్లు ఇలా... ప్రకృతిలో భాగమయిన ప్రతి జీవిలోనూ భగవంతుని శక్తి జీవ శక్తిగా వెలుగొందుతుందనే నిగూఢమయిన సత్యం చెప్పటానికే హిందూ మతంలో ఇన్ని దేవుళ్ళు [ఇది నా అవగాహన]. తోటి వారిని [ప్రకృతి లో జీవరాసులన్నీ తోటి వారే కదా..!] గౌరవించి, ప్రేమించాలన్న విషయం ఇంతకన్నా సులువుగా చెప్పగలమా? ఇది అర్థం చేసుకున్న వారికి ప్రతి వారిలోనూ భగవంతుడు కనిపిస్తాడు కదా!


మతం అంటే?!
మతం అనేది మనం దేవుడిని చేరుకునేందుకు [అర్థం చేసుకునేందుకు] మన పూర్వీకులు మన కోసం వేసిన మార్గం. ఆహార విధానాలు, పదార్థాలు వేరైనా, గమ్యం ఒక్కటే! ఆకలితో ఉన్న వారికి ఏదైనా గొప్పదే! భగవంతుడిని చేరాలనే తపన ఉన్న వారికి ఏ మతమయినా (మార్గమయినా) గొప్పదే! ఈ రకమయిన ప్రయాణంలో వేరు వేరు మతాలకు చెందిన మనమంతా తోటి ప్రయాణికులం. మన అనుభవాలు పంచుకుందాం. ప్రతి ఒక్కరూ తోటి వారి భావాలను గౌరవించుకుందాం.

ఏ మతమయినా సూచించింది "మానవత్వాన్ని". మన దారులు [మతాలు] వేరైనా అవి కలిసిన కూడలి "మానవత్వం". ఎవరి దారి గొప్పది అని వాదించుకుంటూ, గెలవాలన్న ప్రయత్నంలో మనం దారి తప్పుతున్నాం అని నాకనిపిస్తోంది.

అలోచించండి..!

Saturday, July 19, 2008

..గుడ్డి ప్రేమ..


పగలు అలసటని పోగుచేసి కానుకగా ఇచ్చింది.
అది దాచుకున్న నా కళ్ళను, సంధ్య కిరణాలతో నిమురుతోంది.
తను వెళుతూ వెళుతూ, తెర వేస్తున్న నిశికి నన్ను అప్పగించింది.
అతడి కోసం చూసే ఎదురుచూపులో ఆమే నాకు తోడయ్యింది.
అతడి వెలుగు అనుభవించటానికి ఆమెను హత్తుకున్నాను.
తనని నాలో ఏకం చేసుకుని, ఒంటరిగా మిగిలాను.
అతడు వచ్చే వేళకి, అంధకారంగా నిలిచాను.

--------------------------------------------------------------------------
పెద్ద కిటికీ లో నుంచి కనబడే చందమామను చూసి ఆనందించేందుకు దీపాలు ఆర్పి మరీ వేచి చూసే నాది గుడ్డి ప్రేమే అనుకుంటా...!

Friday, July 18, 2008

జీవితం పాఠశాలలో జ్ఞాపకాల పాఠాలు...

[నా అవగాహన తప్పైతే మన్నించి సరిదిద్దగలరని భావించి ఈ సాహసం చేస్తున్నాను.]

మనసును కదిల్చిన ఎలాంటి సంఘటన అయినా సరే మనకి ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది
అలానే ఆ సంఘటనలో భాగమైన వారిని కూడా మనం ఎప్పటికి మరువలేం.

అలాంటి సంఘటనలు, మనుషులు మన జీవితాల్లో వేసిన చెరగని గుర్తులు జీవితం పట్ల, తోటి వ్యక్తుల పట్ల మన వైఖరిని ఎంతగానో మార్చేస్తాయి. ఆ అనుభవం మనకి తెలియకుండానే మన స్వభావంలో ఒక భాగమైపోతుంది.

ఐతే ఇది మంచి అయి ఉండచ్చు లేక చెడు అయి ఉండచ్చు. ఉదాహరణకి, ఒక అబ్బాయి బాల్యంలో ఎవరి చెతుల్లోనైన మోసపోవటమో లేక తనకి బాగా నచ్చిన వారు మోసపోవటమో జరిగితే అది తన స్వభావం మీద ఎంత ప్రభావం చూపిస్తుందంటే, ఇక తను ఎవరినీ నమ్మకూడదనే దృఢ నిర్ణయానికి వచ్చేయ్యచ్చు. అదే అలాంటి సమయంలో ఎవరి చేతనైనా సహాయమో లేక ఆశ్రయం వల్లనో అ కష్ఠ సమయం లోంచి బయట పడటం జరిగితే ఆ సంఘటన అతడికి తోటి వారి బాధను అర్థం చేసుకునే గుణం ఇస్తుంది. ప్రేమ అంటే ఏమిటో తెలియజేస్తుంది, నేను ఒంటరిని కాదు అన్న నమ్మకాన్నిస్తుంది. ప్రేమ, సహాయం పొందటమే కాక ఇవ్వటం ఎంత ముఖ్యమో నేర్పిస్తుంది.

కమలావతి టిచరు గారు దిలీప్ గారికి ఓర్పు, సహనం నేర్పిస్తే, హైదరాబాదు గొడవలు పూర్ణిమకి సమయస్పూర్తిని, సాహసాన్ని, ఐకమత్యం తాలూకు ప్రాముఖ్యతని నేర్పించాయి. తోటి వారి పరిస్థితిని అర్థం చేసుకునేలా చేసాయి. పూర్ణిమ గారి నాయనమ్మ, తాతగారుల గురించి చదివి నాకు పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళ పైన మరో సారి నమ్మకం కుదిరింది.

ఒక మంచి జ్ఞాపకం మనల్ని మనం చూసుకుని సవరించుకునే అద్దం లాంటిదయితే,
ఒక చేదు అనుభవంలో అందిన ప్రేమ మనలో మానవత్వాన్ని వెలికితీస్తుంది, ఒక బాధ్యతని అప్పచెబుతుంది.
ఎలాంటిదైనా,ప్రేమ నిండిన జ్ఞాపకం మనం మనిషిగా ఎదగటానికి దోహదపడుతుంది.

ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. ఈ రోజు ఆ పాఠాన్నంతా రెండు ముక్కల్లో పెట్టగలిగానంటే, ఆ ఘనత అంతా, వారి తీపి, చేదు అనుభవాలను గుండెలకు హత్తుకునేలా చెప్పిన ['రాసిన ' అనను. అవి చెప్తున్నట్టే ఉన్నాయి] పూర్ణిమ, దిలీప్ ల గారికే చెందుతుంది. నెనర్లు!

Wednesday, July 16, 2008

అపురూప జ్ఞాపకం

చాలా రోజుల తరువాత వాళ్ళని కలవటానికి వెళ్ళాను. ఎప్పటిలాగే నేరుగా వాళ్ళ గదిలోకి వెళ్ళి 'హాయి ' అనగానే, వారిలో సగం మందికి పైగా నా గొంతు గుర్తు పట్టి 'విశూ..' అంటూ నన్ను చుట్టేసారు. వారి మధ్య చేరిపోయి కబుర్లు చెప్తున్నాను. అంతా కుశల ప్రశ్నలు వేస్తున్నారు. నేను సుమ కోసం చూస్తున్నాను. తను ఎక్కడా కనిపించలేదు. రాధని అడిగితే సుమకి క్లాస్ జరుగుతోందని చెప్పింది. అలా అలా మాటల్లో, పాటల్లో తెలిపోయాం, నవ్వుల్లో మునిగిపోయాం కొంత సేపు. ఈలోగా ఒక బృందం గదిలోకి వచ్చారు. ఏదో ఫంక్షన్ కి హాజరయ్యే హడావుడిలో ఉన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దానికి తగిన వేషధారణ, అలంకరించుకోవటంలో ఒకరికొకరు సహాయం చెసుకుంటున్నారు. నా మాట నాకే వినిపించట్లేదు. ఇలా ఒక పది నిమిషాలు హెలికాఫ్టర్ కింద నించుని మాట్లడినట్టు, వారు మా చుట్టూ తిగుతుంటే, మధ్యలో మేము అలానే మాటలు కొనసాగించాము. కాసేపటికి అంతా బయలుదేరారు. ఈలోగా క్లాస్ ముగించుకుని సుమ వచ్చింది. 'హే సుమ్మీ ఎవరొచ్చారో చెప్పుకో' అని రాధ అడగంగాననే, 'ఎవరూ?' అంటూ నా చెయ్యి కోసం తడిమింది. అందించిన నా చెయ్యి పట్టి నన్ను గుర్తుపట్టింది. 'విశూ..!' అని నా బుగ్గలు పట్టి నన్ను దగ్గరకు తీసుకుని, ఒక్క క్షణం తరువాత 'పో విశూ.. నీతో మాట్లాడను. అంతే మమ్మల్ని మర్చిపోయవు అంటూ నా మీద కాసేపు అలగటం, నేను బ్రతిమలాడటం...తను కరిగిపోవటం అయిపోయాయి. ఉరిమినంత సేపు లేదు సుమ కోపం. తను చాలా తెలివైన అమ్మాయి. ఎప్పుడూ ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఇలోగా ఎవరో తలుపు కిర్ర్... మను శబ్దం చేసారు. అది విని వెనక్కి తిరిగి చూశాను.
ఒక చిన్న పాప. తెలుపు,గులాబి రంగులతో అందంగా ఉన్న గౌను వేసుకుని లోపలికి వచ్చింది.

5 ఏళ్ళు ఉంటాయి. ఎంత ముద్దు గా ఉందో! కానీ కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి. చెంపల పై అవి తుడుచుకున్న మరకలు. చాలా బాధను పైకి రానీయకుండా అణచుకున్నట్టు స్పష్ఠంగా తెలుస్తోంది. నా చూపును మరల్చలేక తనని అలానే చూస్తున్నాను. అది గమనించిన సావిత్రి గారు తనని నాకు పరిచయం చేశారు. "తిన పేరు చందన. ఈ మధ్యే ఒక కారు ప్రమాదంలో అమ్మా, నాన్న చనిపోయారు. వీళ్ళ బంధువులు తినని ఇక్కడ చేర్పించారు." అని చెప్పారు. నాకు ఒక్క క్షణం దేవుడిపైన పీకదాక కోపం వచ్చింది. మళ్ళా సర్దుకుని, తను ఎందుకు ఏడుస్తుంది అని అడిగాను. పక్క నుంచి ఎవరో చెప్తున్నారు.. "ఎవరో ఒక అక్క హాలు లో చాక్లెట్లు పంచుతుంది... చందన వద్దు అంటే తిట్టింది. అయినా తీసుకోకపోతే కొట్టింది". అది విని నాకు ఏడుపొచ్చినంత పని అయ్యింది. మిగతా వాళ్ళు ఆ ఇంకో అక్క గురించి మాట్లాడుకుంటున్నారు. నేను తనని నా దగ్గరకు తీసుకుని, ఒళ్ళో కూర్చోపెట్టుకుని "నీ పేరేంటి?" అని వచ్చీ రాని కన్నడ లో అడిగాను. సమాధానం లేదు...! "నాతో మాట్లాడవా?" అన్నాను. తను దానికీ సమాధానం చెప్పలేదు... నన్ను వదిలించుకుని లేచి వెళ్ళిపోయింది. నా మనసు కూడా తన వెంటే..వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నానే కానీ ఆలోచన అంతా ఆ పాపే నిండిపోయింది. ఏమీ లేదు. కాస్త సేపు ఆ పాపతో గడపాలన్న ఆలోచన తప్ప. ఆ పాప ఒక్క సారి నవ్వితే చూడాలన్న కోరిక తప్ప.

తలుపు శబ్దం అయిన ప్రతి సారీ తను వచ్చిందేమో అని చూస్తున్నాను నాకు తెలియకుండానే... బయట చీకటి పడుతోంది. ఇంటికి వెళ్ళటానికి దాదాపు 2 గంటలు పడుతుంది. ఇంకో అరగంట ఉండి వెళ్దాం అని అనుకున్నాను. మళ్ళా తలుపు శబ్దం అయ్యింది. ఈ సారి తనే.. నా దగ్గరకు లాక్కున్నాను. తనని వెనకగా తీసుకుని, తన చేతులని నా మెడ చుట్టూ వేసుకున్నాను. తను గించుకుంది. ఈ సారి నే పట్టు వదల్లేదు. చిన్నగా ఊపటం మొదలు పెట్టాను. 2-3 సెకన్లు విడిపించుకునే ప్రయత్నం చేసింది. తరువాత తన భారాన్నంతా నా పై వదిలేసి. తను తేలికైపోయింది. నా చెంపకు తన చెంపను ఆనించి అలానే కాసేపు ఉండిపోయింది. ఒక్క 2 నిమిషాల తరువాత మెల్లగా కదిలి లేచింది. నేను ఆపలేదు. తను తలుపు దగ్గరికి వెళ్తోంది. నా కళ్ళు తనని అనుసరించాయి. మూసి ఉన్న తలుపు దగ్గరకు వెళ్ళి తెరిచి ఒక్క క్షణం ఆగింది. నేను అలానే చూస్తున్నాను. వెనక్కి తిరిగి చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. నాకు మాటల్లేవు ఆ భావాన్ని వ్యక్తపరచటానికి.

ఆ తరువాత రెండు సార్లు తనని కలిసాను. చాలా హుషారుగా ఆడుకోవటం చూసి సంతోషం గా అనిపించింది. అల్లరి చాలా ఎక్కువ. మొదటి సారి వెళ్ళినప్పుడు తనకి ఒక చిన్న సల్సా స్టెప్ లాంటిది నేర్పించాను. ఆ రోజు నేను అక్కడ ఉన్నంతసేపు తను, ఇంకో పాప నాతో డాన్స్ చేస్తూనే ఉన్నారు. రెండవ సారి వెళ్ళినప్పుడు నేను వరండాలో సుమ, రాధ ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తను మధ్య మధ్యలో రివ్వు మంటూ వచ్చి నా ప్రమేయం లేకుండానే నాకో ముద్దిచ్చి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎన్ని సార్లో అలా.... నేను ప్రేమలో తడిచిపోయాను అని వేరే చెప్పాలా ? ఇంటికి బయలుదేరుతుంటే "అక్కా.. వెళ్ళద్దు" అని నా చున్నీ పట్టుకుని అల్లరిగానే అడిగింది. నాకూ వెళ్ళాలని లేదు. కాని తప్పదు కదా..! "మళ్ళీ వస్తాను కదా.." అని చెప్పి బయలుదేరాను. తనని చూడటం అదే ఆఖరు సారి.

మళ్ళీ వెళ్ళినప్పుడు తెలిసింది తనని వాళ్ళ చుట్టాలు తీసుకేళ్ళారని. సంతోషంగా అనిపించింది. కానీ సందేహాలు చాలానే వచ్చాయి. ఇలా నా బుర్ర తన పని తను చేస్తుండగా, "తను ఎక్కడ ఉన్నా తనని ప్రేమించే వాళ్ళు తన చుట్టూ ఎప్పుడూ ఉండాలి" అన్న ప్రార్థన నా మనసులో మెదిలింది. ఆ పాప తో నా అనుభవం ఒక అపురూప జ్ఞాపకం గా మిగిలిపోయింది.

Sunday, July 13, 2008

ఏది తప్పు ?

ఏది తప్పు ?

తప్పు చెయ్యటం తప్పా ?
చేసిన తప్పు ఓప్పుకోలేకపోవటం తప్పా ?
తప్పు చేసిన వారిని చూసి నవ్వటం తప్ప,
తప్పు ఒప్పుకున్నవారిని ఆదరించలేకపోవటం తప్పా?

ప్రతి ఒక్కరూ తమ జీవితంలో..
ఎదో ఒక సమయంలో, ఎదో ఒక విషయంలో,
కనీసం ఒక్కసారైనా..చిన్నదైన, పెద్దదైన...
'తప్పు' అనేది చేసే ఉంటారు. అది సహజం.

కానీ అది పక్క వాడు చేస్తే...,
తక్కువగా చూసో లేక ఎగతాళి చేసో,
వారి ఆత్మ గౌరవాన్ని చంపెసే మన సంస్కారం ముందు
వారి తప్పులేపాటివి?

తప్పు ఒప్పుకోవటానికి ఎంతో ధైర్యం కావాలి.
అది ఎదుర్కోవాలంటే మనలో ఎంతో ప్రేమ ఉండాలి.

------------------------------------------------------------------------------------
తప్పు తో పాటు, తప్పు చేసిన వాడిని కూడ వెలేస్తే ఎవరు మాత్రం చేసిన తప్పు ఒప్పుకునేందుకు ముందుకొస్తారు ?

Friday, July 11, 2008

..Shaayari conversat(sess)ion..

Here is my first experiment with writing shaayaris as a reponse to my friend when she shared her latest shaayaris with me.

Sudha:
1.
तुमसे है उम्मीद हज़ार मेरे
इनको तोडके न मज़ाक उडाओ
टूट्के जोड्ना आसान नही इन्हे
तुम आसान समझके नकार न दो!

2.
आपकी ख्वाहिश सर आखो पे
हमारी ख्वाहिश का भी लिहाज़ करो
साथ चलना है उम्र भर मगर
साथ इस पल चल के दिखाओ!

Mohana:

टूटॆगी अगर उम्मीद तॆरी...
क्या ऒ प्यार केहलाता है..?
अगर प्यार कॆ सिवा कुछ और नही..
तो क्या कॊयी उसकॊ हिला सकता है ?


Sudha:

दिल तो दॆही दिया हमने सालो पेहले
आपकी ताज मेहल केलिये जान भी दे देते!
मगर, बहुत खुद गर्ज है आपकी मल्लिका
आपके लिये जियेगे और मरेगे तो आप ही के साथ!


Mohana:

मै ने पेहेले ऐसे सोची है..
की आपके सिवा जिन्दगी ना रहेगा.
लेकिन आज मुझे यॆ एहसास हुआ है..
की आपके बिना जीना कहा, मरना भी मुश्किल रहा!

चल रही हू मै अब,
आपके यादो को साथ लेके..
मरने के लिये नही, बल्की..
जीने के लिये, मेरे जिन्दगी को सजाने के लिये!

------------------------------------------------------
Thanks to my friend Sudha for her shaayaris, encouragement and support were my inspiration to dare to write these shaayaris.

Wednesday, July 9, 2008

...గతి...

గాలి వీచే వేళ సాగే మేఘాల చాటున చందమామ...
అలజడి రేగిన వేళ కొలనులో అలల అడుగున గులకరాళ్ళు...
గతి తప్పుతున్నాయి.

ఆవేశం కలిగిన వేళ నా మాటల మాటున నేనూ అంతే..!

Friday, July 4, 2008

...కేళి...


వేణు గానం...
లీలా మోహనం...
జగం మాయా భరితం.
కృష్ణం వందే జగద్గురుం..!

-------------------
నాకు తృప్తి లేదు...
వాడికి అలుపు రాదు...
నా ప్రేమ కి హద్దు లేదు...
వాడి ఆటలకి అంతు లేదు...

Thursday, July 3, 2008

..సామాను కథ - The Story of STUFF..

ఈవిడ ఎవరో.. చాలా కష్ఠపడి చాలానే సమాచారం సేకరించారు.

http://www.storyofstuff.com/

ఇదివరకే చూస్తే సరి. చూడకపోతే, ఒక సారి చూడమని నా మనవి. మీ సూచనలు,అభిప్రాయాలు,ఆలోచనలు తెలుపగలరు.

Tuesday, July 1, 2008

నాన్న ప్రేమ...

అమ్మ ప్రేమ గురించి ఎంతో చెప్తారు, ఎన్నో కవితలు రాస్తారు...
మరి నాన్న ప్రేమ గురించి ఎవరూ మాటాడరే..? ఒక్కరూ రాయరే ?!!
నేనూరుకోను! ఇప్పుడే రాసేస్తాను..!!

****

నాన్నా, మీకు తెలుసా...

అమ్మ నాపై గర్జిస్తే, మీరు నా కోట గోడ.
అమ్మ కన్ను ఎర్రజేస్తే, మీ హస్తం నాకు అభయ హస్తం.

అప్పుడప్పుడు దొరికే చిన్ని ఏకాంతంలో, ప్రపంచమంతా మన ఊసుల్లోనే..
గణితం నుంచి తత్వం వరకు, శాస్త్రం నుంచి సాహిత్యం వరకు లెక్కలేని కబుర్లెన్నో..

నాన్న మల్లే కాక, నేస్తమై మెలిగారు. నడకతో పాటు నడత కూడ నేర్పించారు.
నా ప్రతి కార్యంలోనూ వెన్నంటే ఉండి, అండగా నిలిచి, "నేనున్నాను కదా.." అని ధైర్యాన్నిచ్చారు.

నా చిన్ని చిన్ని విజయాలను ప్రోత్సహిస్తూ, "నువ్వెంత మంచి తల్లివో, నిన్ను చూస్తే నాకు ఎంత గర్వమో.."
అంటూ పొగడ్తలతో ముంచేస్తారు. నా తల నిమిరి, నుదుటిపై చిట్టి ముద్దులిస్తారు.

తండ్రీ, కూతుళ్ళ అనుబంధాలు, ఆదర్శాల గురించి మాటాడితే...
ఆ నెహ్రూ, ఇందిరలకు ఏ మాత్రం తీసిపోం మనం. ఒకడుగు ముందే ఉంటాం!

జోల పాడలేకపోయినా, నేను ఎన్ని సార్లు నిదరొవలేదు మీ ఒళ్ళో..?!
పెదవి విప్పి చెప్పకపోయినా, ఆ లోటు తెలియలేదు నాన్నా మీ ప్రేమలో...!

-----------------------------------------------------------------------
అంటకుండా, ముట్టకుండా... మాటలస్సలు లేకుండా....
మౌనంగా కళ్ళతో ముద్దాడతారు నాన్న...!!

Monday, June 30, 2008

నను నే కోల్పోయి పొందిన వైనం...


బీడువారిన నా మది మైదానంలోకి అనుకోని అతిధిగా వచ్చావు. మేఘమై, ప్రేమగా కురిసావు.
నా ప్రతి అణువులో జీవం నింపి, వసంతాలను ఇచ్చావు. స్నేహమనే కంచె కట్టి, తోటమాలివై పరిరక్షించావు.
నా ఒడిని అనురాగ కుసుమాలతో నింపావు. వాటిని మాల కట్టి అందియ్యబోతే, అది ’నీద’న్నావు. ’నా దారి వేరు’ అన్నావు.
’నను నీ వెంట రానీ’ అంటే, ’నీకు ముల్లు దిగితే నే చూడలేన’న్నావు. నాకు దగ్గరగా ఉంటూనే నన్ను దూరంగా ఉంచావు.

నీ మాట కాదనలేక, నిను వీడి ఉండలేక నే విలవిలలాడితే, నాపై కఠినత్వం నటించావు. గుడ్డిగా నీ మాటను మాత్రమే విన్నాను.
అంతా శూన్యమయింది. నీ చిరునవ్వు కిరణం లేని ఆ చీకటిలో, దారి కానక, కాలు జారి విషాద లోయలో పడ్డాను. భయం ముసిరేసింది.
ఒంటరిగా ఉన్న నన్ను చూసి వెక్కిరించింది. ఎగతాళి చేసింది. తనదే జయం అంది. ఇక ’నువ్వు నా బందీవి’ అంది.
నమ్మకాన్ని ప్రమిదగా చేసి, నీ జ్ఞాపకాల వత్తిని వెలిగించి, ముందుకు నడిచాను. ఒంటరితనం పరుగుతీసింది. భయం భయపడి పారిపోయింది.

నీకై వెతుకుతూ, నడక సాగించాను. కంటి తడి ఆరి, నీటిపొరలు కరిగాక, నీ మాట కాక, నీ గొంతు వినిపించింది.
ఒక్క సారిగా శూన్యం, పూర్ణమయింది. నాలో అంధకారాన్ని చెదరగొడుతూ నవోఉదయం నాలో చైతన్యం నింపింది.
అంత ప్రేమను గొంతులో దాచిన నువ్వు గరళ కంఠుడిలా తోచావు. భగవంతుడు నాకై పంపిన ప్రేమ దూతలా అనిపించావు.
ఆ నింగి వీడి, అలజడి అలలను ఛేదించి, సాగర గర్భాన దాగిన నాలో స్వాతిచినుకై చేరి ముత్యమై మెరిసావు.

--------------------------------------------------------------------------------------------------------------------------------
నీ ప్రేమ వేడిలో నా అహం కరిగి ఆత్మ జ్యోతికి ఆహుతయింది, ఇంధనమయింది. ఆ వెలుగులో నా ఉనికి స్పష్ఠమయ్యింది.
ప్రేమ లో నన్ను నేను కోల్పోతున్నాను అనుకున్నానే కానీ, నిజానికి నన్ను నేను పొందుతున్నానని అప్పుడే అర్థమయింది.

Thursday, June 26, 2008

గూడ్సు బండి - In search of Love

జీవితం ఒక ఇనుప పట్టాల త్రోవలాగా,
కాలమే దిక్సూచి అయి మార్గం చూపుతుండగా,
నేను అనుభవ భారంతో అలసిన గూడ్సు బండిలాగా,
సాగుతోంది నా ప్రయాణం, నిదానంగా.. నిశ్శబ్దంగా...

బిగుసుకున్న పెట్టెల్లో, ఊపిరాడని నా మనసు..
ఒంటరిగా చేసే సుదూర ప్రయాణంలో,
దారంతా మూలుగుతూ నిట్టూరుస్తూ..
ఎవరికి వినబడతుందనో..?

ఊరొస్తుంది...
అంతటా సందడిగా తిరిగే జనాలుంటరు.
గేట్ల వద్ద టాటాలు చెప్పే పిల్లలుంటారు.
ఈ ఆలోచన వచ్చింది తరువాయి...
మనసు ఉల్లాసంగా ఉరకలేసింది...

అయితే..!
’వచ్చేసా..’ అని హుషారుగా పలకరిస్తే..
’వెళ్ళు తల్లీ.. మా బండి వస్తుంది’ అనే కసురుళ్ళు..
’వెళ్ళొస్తా..’ అని నే ఓ మాట చెబితే.. [గేటువద్ద]
’అబ్బా.! ఇప్పుడే రావాలా’ అని పని రాయుళ్ళ విసురుళ్ళు.

అనుకున్నది ఒకటి, అయినది ఒకటి!
అనుకున్నదే అయితే, అందులో వింత ఏముంది?
పక్క ఊరిలో...పలకరించే వారు ఉన్నారని నా నమ్మకం!
లేకపోతే, ఆ పక్క ఊరిలో.. వారి ఉనికి మాత్రం తధ్యం..!

అవునూ...!
నన్ను పలకరించే వారు ఎదురైతే..?
నా కూ/రో/మోత కు స్పందించే మనసు కనిపిస్తే..?
నేను ఏమని పలకరిస్తాను?
నా మనసు ఎలా స్పందిస్తుంది ?

మనసు పరవశించి...
ఊహల్లో విహరించి...
ప్రేమలో పడతానేమో..!
అవును.. అంతే.. నాకు తెలిసిపోయింది.
అలానే జరుగుతుంది...!

ఆ రోజు రానే వచ్చింది...
స్పందించే మనసు తారసపడింది..!
చిరునవ్వుకు నిలువెత్తు రూపం.
స్వచ్ఛమయిన స్నేహానికి మరో రూపం..!

నమ్మలేని నేను, తన కళ్ళలో వెతికాను...
ఆశ్చర్యం, ఆ కళ్ళలో నా ప్రతిబింబం...?!
కాదు, అది నేను. నిజమైన నేను..!!
అద్దమంటి ఆ స్వచ్ఛతపై ఇంకా అనుమానాలుంటాయా..?

అనుకున్నట్టుగానే..
మనసు పరవశించింది, ఊహల్లో విహరించింది.
కానీ, ప్రేమ అనుభూతికి వచ్చేసరికి,
చిరునవ్వు సాక్షిగా, మౌన రాగం ఆలపిస్తూ..
ఆనంద శిఖరాలను అధిరోహించింది.

-------------------------------------------------------------------------------
Life, in every fold, always manages to surprise us beyond our expecations.
Sometimes bitter, it might be. Sometimes, far more beautiful than imagined.
Whatever it is, it is OUR experience and a part of OUR life journey.
So, accept yourself. Take it, as it is and move on... with hope...
Life is beautiful.

Thursday, June 19, 2008

...Cloud Nine...

One day, we were in a garden.
walking through the trees,
Talking from the hearts,
Travelling through the thoughts...

Suddenly there was silence. [we stopped talking.]
Dawn or dusk, I did not notice.
All I could hear is birds chirping,
and not very far behind, a cukoo singing.

Surrounded by hundreds of colours,
and by the fragrance of flowers,
driving and feeding little butterflies. [nectar or colours ?]
Driving us too, through the woods. [to a colourful world]

All that we carried in that mile
is an untiring face with a smile.
Grabbed my hand in a flick,
you ran, that's so quick. [to me]

Not aware of the happening,
me and others were just following [you].
At the End of woods, you and I remained
still running, with the wind.

We crossed oceans and
flew across mountains.
Then we landed...
In the world of clouds.

For the first time ever,
I touched/sensed a Cloud!!
You introduced it to me.
Beyond that there is only Light!!

----------------------------------------------------------------
I have been through this way even before but never realised that,
Life is so beautiful!

Saturday, June 14, 2008

మన భవిష్యత్తు మన చెతుల్లోనే...

మన భవిష్యత్తు మన చెతుల్లోనే...

కార్పొరేట్ సంస్ధల్లో టిష్యూ పేపర్లు చాలా ఎక్కువగా వాడుతుంటారు. ఈ టిష్యూ పేపర్ల ఉత్పత్తికి ప్రపంచం మొత్తం మీద రోజుకు కొన్ని వేల చెట్లు నరికివేయబడుతున్నాయి. కాబట్టి, నా వంతు నేను వీటిని వాడటం మానివేసాను. రోజూ రుమాలు తెచ్చుకోవటం మొదలు పెట్టాను. అప్పటి వరకూ నాకు ఎప్పుడూ అలవాటు లేకపోవటం వల్ల, కొన్ని సార్లు మర్చిపోయేదాన్ని. నా మరుపుకు ఒక excuse లేకుండా ఆ రోజు నా ఓణీనే రుమాలుగా లేకపోతే గాలికే చేతులు ఆరబెట్టుకోవటం. ఇలా కొన్ని రోజులకు నాకు రుమాలు అలవాటు చేసుకోవటం కష్టం కాలేదు. కొంత మంది నవ్వినా, కొంత మంది విపరీతం అని పెదవి విరిచినా, నా ఈ విక్రమార్క ప్రయత్నం తో కొద్ది మందిలో మార్పు తీసుకురాగలిగాను. క్రమశిక్షణతో అసాధ్యమనేది లేదు!

రోజుకు ఎంతో మంది public transportaion వాడుతుంటారు. వారిలో కొంత మందికి నెలసరి పాస్ లు ఉన్నా, టికెట్ తో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువే! టికెట్ పరిమాణమ్ చాలా చిన్నది కావటం వల్ల, అవి రీసైకిలింగ్ కి వీలవకుండా, ఎక్కువగా మట్టిలో కలిసిపొతున్నాయి. దీనివల్ల నష్టం లేకపోయినా, ఒక్క రోజులో నరికిన ఆ చెట్లను తిరిగి ఆ స్దాయికి తేవటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ.. ఏ పుణ్యాత్ముడైనా నాటితే..! ఇలా చిన్నగా కనిపించినా పెద్ద మొత్తంలో మార్పు తీసుకురాగల అంశాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిష్కారం అంతుబట్టటంలేదు.

భావి తరాల గురించి ఎలా ఉన్నా, పర్యావరణం పట్ల మన వైఖరి ఇప్పటికైనా మార్చుకోకపోతే... మన కొంపకి మనమే నిప్పు పెట్టుకున్న వాళ్ళమవుతాం.
చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు.

గొడ్డలి పట్టి, చెట్టు నరికి, నాగలి పట్టి,
నేల దున్ని, పార తెచ్చి, గంప కెత్తి..
చెమటోడ్చి, ఖర్చుపెట్టి, రాళ్ళు పేల్చి,
ఇసుక తెచ్చి, కునుకులేక, ఆగకుండా...
మేడలేపి, మిద్దెలేపి, అద్దాల గోడలకు రంగులేసి,
పూలు కట్టి, బాండు పెట్టి, కల నిజమాయెగా అనుకునేవు...

అడవి నరికి, ఇసుకతో పూడ్చి,
ఎడారి తయారు చేసి, ఎదిగానని సంబరపడేవు...
ఓ మనవుడా...
సరి చూడు, నీ పాడిని నీవే సిద్దం చేసుకున్నావు!

ఈ సమస్య మనందరిది... బత్తీబంద్ లాగనే, సామూహికంగా మొక్కలు నాటే ఉద్యమం మొదలవ్వాలి. రోడ్ వెడల్పు చేయటానికో, మరే కారణం చెతనో చెట్లు నరకవలసి వస్తే, వేరే చోట పది మొక్కలు నాటాలి అనే నిబంధన ఉండాలి. వాటిని సంరక్షించాలి.

Tuesday, June 10, 2008

సూరీడమ్మ సూరీడు...

సూరీడమ్మ సూరీడు...

పొద్దేలకల్ల వచ్చేడు..
ఊరోళ్ళకంత మంచోడు..
పొద్దుపోయేదాక ఉంటాడు..
లాలి పాడేసి పోతాడు.

సూరీడమ్మ సూరీడు...
ఎఒరినీ వెంట రానీడు!

నిదరోడమ్మ మా సూరీడు..
అలుపులేకుండ తిరిగేడు..
ఆ ఊరికెళ్ళేసి వత్తాడు..
ఓ పాలు కూడ కూసోడు..

సూరీడమ్మ సూరీడు...
మాట వినడమ్మ మొండోడు..

ఎంత కోపమో పద్దు లేదు...
ఎపుడు సూడు మండుతుంటాడు..
ఆ తామరమ్మకే ఎరుకీడు...
సల్లగా సూసి మనసు దోచిండు.

సూరీడమ్మ సూరీడు...మా తామరమ్మకీడు సరిజోడు.
సూరీడమ్మ సూరీడు...మా తామరమ్మకీడు సరిజోడు.

Wednesday, June 4, 2008

..ఎదురు(దాడి)చూపు..


వెదురూ ఉంది, గాలీ ఉంది..
మురారీ, నీవు తాకక వేణుగాన వసంతమేది..?
రాధా ఉంది, ప్రేమ ఉంది..
మాధవా, నీవు లేక రసమయ రాగబంధమేది..?

ఇంతలో కోపమొచ్చింది, పలకరించింది, కన్నీరు కురిసింది...,
ఒంటరితనం నన్ను వరదై ముంచెత్తింది...,
విరహ సాగర మధనంలో, ఎదురుచూపు హాలాహలమైంది...
నీ మోహినీ హస్తామృతమందుకునేందుకు నేను సురకాంతను కాదాయే..!
(అసురకాంతను కూడ కాదు కదా...!)

వేచి ఉన్న ఈ మానవ కాంతను అలుసుగా చూడకు...
వేచి ఉన్నానని నాపై అలుక చేసుకోకు...
అంత గిరినెత్తితివి, నీకు ఇంతి మనసు భారమా..?
ఎంత గీత చెబితివి, నీకు ఇదో చిక్కు ప్రశ్నా..?![ఈ ఫైల్ కి నేను ముద్దుగా ’గోల’ అని పేరు పెట్టుకున్నాను. మీకూ అలానే అనిపించిందా..? :)]

Wednesday, May 14, 2008

~~Tide~~


Riding on the yacht, aware of the tides
and the currents, I might face.
That day too, was as any other day,
Until I met a friendly tide on my way.

Though friendly, tide he is!
Back to front, through he is. [surrounded]
Few times I was Worried and down,
But never he, let me drown.

A friendly tide he is,
back to front, through he is.
Strong enough to pull me over and
gentle enough to push me close. [to my destination]

Can I ride now, any other tide,
however it is, deep and wide.
To Love other tides, I learnt and
I remember, its just the start. [journey to eternity]

A friendly tide He is,
back to front, through He is.

Thursday, April 17, 2008

..Love cures..

"దేవుడైన రాముడైనది ప్రెమకోసం కదా...
ప్రతి జీవితం ఓ వెలుగు నీడల బొమ్మలాటే కదా..."

అక్షరాలా నిజం. ప్రతి నిమిషం ప్రతి ఒకరం ప్రేమ పొందటానికే తాపత్రయ పడుతూ ఉంటాం.

ఈ రోజుల్లో భార్యా, భర్త ఇద్దరూ ఉద్యోగాలతో, బాధ్యతలతో బిసీ గా ఉండటం, మారిన జీవన శైలి, మార్కుల పరుగు పందాల్లో అలసిపోతున్న పిల్లలు... ఇలా ఎవరికీ మానసిక విషయాలని పట్టించుకునే తీరిక లేకపోతోంది. యాంత్రిక ప్రపంచం. దీనిలో, ఎక్కడైనా చిన్న కష్టం కానీ, ఎదురుదెబ్బ గానీ తగిలితే, పునాదులు సరిగా లేని ఇల్లులా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం!
దీనికి కారణం ప్రేమ, ప్రోత్సాహం, అనుబంధం లాంటి, మానసికమైన పునాదులు బాల్యంలో కరువవటంవల్లనే అనిపిస్తోంది.

అసలు ’ప్రేమ’, ’ప్రోత్సాహం’ లాంటి చిన్ని చిన్ని ఆనుభూతులు లేని జీవితం ఎలా ఉంటుంది ?
అలాంటి బాల్యం వ్యక్తి భవిష్యత్తును ఎలా మలుస్తుంది ?

నా అనుభవం...
నిరాశక్తత, ఆసంతృప్తి, అభద్రత లాంటి పురుగులు మనసు పొరల్లో కొలువుతీరగలవు. చిరాకు, కోపం, అశాంతి తాలూకు నీలి నీడలు స్వభావంలో తల దాచుకోగలవు. ఈ రకమైన బాల్యం సృజనాత్మకతను దెబ్బతీయగలదు. మానసిక ఎదుగుదలకు అడ్డుగోడ కాగలదు. ఇలానే కొన్ని సంవత్సరాలు కొనసాగితే, తెలియకుండానే హింసకి పాల్పడటమ్! ఉద్రేకంవల్ల వారు, (కొన్ని సార్లు) చుట్టుపక్కలవారు కూడా బలి కావటం... !!

చాలా మంది (వారిలో నేనూ ఉన్నాను) ఈ కోరల్లోంచి (మిత్రుల, పరిస్థితుల వల్ల) సురక్షితంగా బయటపడగలిగినా.., ఆత్మహత్యలు, ఇల్లు వదిలి పారిపోవటాలు, ఇలా ఎన్నో.. చిన్న వయసుకి పెద్దవైన పైశాచిక చేష్ఠలు ... ఇంకా మన నాగరిక ప్రపంచం లో సంఖ్యని పెంచుకుంటూ పోతున్నాయి.

చిన్న చిన్న పిల్లలు వాళ్ళు. వారి పసి హృదయాలు, వారి నవ్వుల్లా స్వచ్చమైనవి. వారు ఉన్న పరిశరాలను జలపాతాల్లోని కేరింతలతో, మల్లెల్లోని సుమగంధాలతో నింపుతారు. చుట్టూ ఉన్నది ఎవరన్న బేధం లెకుండా ఆనందాలను, ప్రేమను పంచుతారు. అలాంటి వారికి ఆరోగ్యమైన భవిష్యత్తును ఇవ్వటం మన కనీస ధర్మం.

ఆలోచిస్తే గుండె చెరువవుతుంది. కళ్ళల్లో నీరు ఉబుకుతోంది.

మరి దీనికి ఏమిటి పరిష్కారం ?

మొక్కకు ఎదగటం నేర్పించనక్కర్లేదు. ఆరోగ్యంగా ఎదగటానికి కావలసిన, అవసరమైన వాతావరణం మరియు పోషణ ఏర్పరిస్తే చాలు. మొలిచే లేలేత చిగురులను ఎవరూ గిచ్చకుండా రక్షణ కల్పించటం కూడా ఎంతో ముఖ్యం.

అలాంటి వాతవరణం ఎర్పరచడంలో కుటుంబం చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. పిల్లలకు పెద్దలంటే భయం కాకుండా, ప్రెమ, గౌరవం కలిగేలా ప్రవర్తించాలి. పిల్లలకి పెద్దలు మార్గదర్శకులు కావాలి. స్వయంకృషి, సహాయం చెయ్యటం, సమభావన అలవడేలాంటి స్ఫూర్తి దాయకమైన కథలు చెప్పాలి.

పిల్లలు, ఆ మాటకొస్తే ఎవరూ, శిక్షకు అర్హులు కారు. ఎవరైన సరే "ఏమి చేశారు ?" అని కాకుండా, "ఎందుకు అలా చేశారు/చేశ్తున్నారు ?" అనేది అలోచిస్తే... మూలం వారి బాల్యంలో ఎదుర్కున్న పరిస్థితులే... దానికి మందు ప్రేమ ఒక్కటే..! ప్రేమ మాత్రమే జీవితంలో వెలుగు నింపగలదు.

Monday, March 31, 2008

..ప్రకృతికి ప్రేమ పుడితే..? (cont..)

బయట నల్లటి దట్టమయిన మబ్బులతో నిండి ఉంది ఆకాశం..
తన లాగే నా మనసంతా సందేహాల మబ్బులు ఆక్రమించి అల్లకల్లోలం గా ఉంది.

మళ్ళీ అదే ప్రశ్న... ప్రేమా? స్వభావమా..??
ఈ రెంటిలో ఏది ముఖ్యం ?? ప్రేమ స్వభావాన్ని త్యాగంగా కోరగలదా ?

లేదు.! అలా ఎప్పటికి జరగదు. స్వభావానికి స్పందించినపుడు, పరవశం సహజంగా పుడుతుంది.... అదే ప్రకృతి. ఆ పరవశంలో తడిసి ముద్దవటమే ప్రేమ.

భౌతికమైన చిరుగాలి స్పర్శ కు పరవశించిన మేఘం తనను తాను కోల్పోయి,
కరిగి, కురిసే ప్రతి చినుకులో ప్రేమను నింపగలుగుతుంది... (తన ఉనికి ఉన్నంత వరకు)
కాబట్టేనేమో..., అన్ని పసి చిరునవ్వులకు కారణం కాగలుగుతోంది...!
అన్ని వేల హృదయాలను తాకగలుగుతోంది...!

ఆ చినుకులను తాకి పరవశించిన కిరణాలు,
తమకి తాము కొత్త రంగులను అద్దుకుని,
హరివిల్లుగా విరియటం... ఒక అద్బుతం !
సమస్త లోకాలు మూకుమ్మడిగా వెచి చూసే క్షణం అది.

పరవశం లేని చోట ఇది సాధ్యమా ? సహజత్వం లేని చోట పరవశం కలుగునా ?? స్వభావం లేని చోట సహజత్వం కనిపించునా ???

ప్రేమకి హద్దులు లేవు. ప్రేమ నింపలేని కార్యం అంటూ లేదు. అయితే అన్ని పనులలో ప్రేమ ఒకటే నిండి లేదు. సహాయం అనుకుని చేసే దానిలో ప్రేమ (ఉన్నప్పటికీ) కంటే మానవత్వం, సంతృప్తి పాళ్ళే ఎక్కువ. అది ఒక బాధ్యత. సామాజిక బాధ్యత. నదులు పొంగుతున్నాయని మేఘం వర్షించటం మానుకుంటే అది బాధ్యత అవుతుంది. నేల ఎండుతోందని తను కరిగితే అది కరుణ అయి ఉండాలి.ప్రకృతికి బాద్యతలు, అమితం, అల్పం అన్న సరిహద్దులు లేవు.

Love is Freedom.
Beyond and much more,
Than Give and/Or Take.
Love is rising together.

కాబట్టి... ప్రకృతికి ప్రేమ పుడితే, తను మరిన్ని అందాలు జతపరచుకుంటుంది.

బయట వర్షం వెలిసింది. పరిశరాలు నా మనసుకి అద్దం పడుతున్నాయి.
తూర్పున విరిసిన లేలేత కిరణలు, నన్నంటి పెట్టుకున్న చిరునవ్వులా మెరుస్తున్నాయి.
రాలుతున్న పూలు, నా మనసులో కురుస్తున్న ఆనంద వర్షం లా అనిపిస్తుంది.
ఆ జడి వానలో తడుస్తూన్న నన్ను, నేను మరింతగా హత్తుకున్నాను.

Thursday, March 27, 2008

..భద్రం..

ఎప్పుడైనా వెన్నెలని దొసిలిలో పట్టారా? భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ.. ఓ పక్క అంతా ఒలికి చుట్టూ పారుతూనే... దొసిలి కూడా నిండుగా...
గాలిని హత్తుకోవటం... ఎంత చనువు ఉంటుందో ఆ స్పర్శలో...
రోడ్డు మీద పరుగుపెట్టారా? మారథాన్ కాదు! నేస్తం తో చేయి కలిపి, సిగ్నల్ నుంచి ఆ ట్రాఫిక్ మమ్మల్ని చేరేలోపు, జమ్.. అంటు రోడ్ అటు పక్కకి పరుగుతీయటం...
శీతాకోకచిలుక ఇల్లు ఎక్కడో తెలుసా ? ఆ రంగురంగుల చిలుక ని చాలా కష్టపడి follow అయ్యి, తన రూట్ ట్రాక్ చేశా... హా.... లాభం లేదండోయ్... రెక్కలు కావలసిందే...!
ఎప్పుడైనా రాత్రి పూట, ఆరుబయట గడ్డిలో పడుకున్నారా ? ఇంజినీరింగ్ రోజులవి... నేను నా ఫ్రెండ్, ఊసులాడుకుంటూ, పాటలు పాడుకుంటూ అలానే నిద్ర పోయాం. "మా ప్రదేశాన్ని ఆక్రమించారు.." అంటూ.. చిట్టి నేస్తాలు చిన్నగా గిచ్చితే గాని మెలకువ రాలేదు సుమీ....!
మరి... ఏడుపులో నవ్వు...?? అబ్బో బోలెడు సార్లు...
నాన్న నుదిటి పై పెట్టే ముత్యమంత ముద్దు...
అప్పుడప్పుడు అమ్మ తో గిల్లికజ్జాలు....
అన్నయ్య ఇచ్చిన "I Love U" key chain..
తమ్ముడు ఇచ్చిన "Nice To have a Sister Like U" pen stand...
అమ్మమ్మ తో అంతాక్షరీలు... అక్క తో సల్సా డాన్స్లూ... చెల్లి తో పాటల కచేరీలు...
తాతయ్య తో పేకాటలు... ఫ్రెండ్స్ తో గంటల తరబడి మాటలు...
మా కన్నయ్య ఓర చూపులు... కొంటె నవ్వులు...
అలకలూ, అసూయలూ.. ప్రేమలూ, పంతాలూ...
కోట్లాటలూ, కవ్వింతలూ.. చింతలూ, చిరునవ్వులూ...

ఇలాంటి ఎన్నో చిన్ని చిన్ని ఆనందాల జాజులతో కట్టిన పూలమాల నా జీవితం.
కాలం తో కొన్ని పూవులు వాడినా.. అవి వెదజల్లిన పరిమళాలు, నా జ్నాపకాల పెట్టెలో భద్రం.

Wednesday, March 26, 2008

మ్.పి.డి ?!!

నలుగురిలో ఉన్నప్పుడు సరదాగా గడిచిపోతుంది. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనసులో ఎదో తెలియని కలవరం... స్పష్టత లేని రకరకాల ఆలోచనలు. లెక్కలేనన్ని! నా జీవితం ఎటు వెళ్తోందా.. అని ఆలోచిస్తే గమ్యం లేని ప్రయాణం లా, ఎటు గాలి వీస్తే అటు మళ్ళే మేఘాం లా అనిపిస్తుంది. నా చుట్టూ అంతా పోరాట పటిమతో కృషి చేస్తున్నారు. ఎదగటానికో, లేకపోతే ఏదైనా సాధించటనికో ప్రయత్నిస్తున్నారు. మిగతా అమ్మాయిలని చూసినప్పుడు భలే అనిపిస్తుంది. తమ గురించి తాము పట్టించుకోవటం. శ్రద్ద తీసుకోవటం, అలంకరించుకోవటం, గుడి, పూజలు, ఉపవాసాలు... ఇవన్నీ వారు చేసేటప్పుడు చాలా అందంగా అనిపిస్తుంది. కనీ నాకు అలా ఉండాలనిపించదు. "నువ్వు ఏమి చేస్తున్నావు? ఒక దిశ, దీక్ష, లేకుండా ఇలా ఎలా ఉన్నావు? నువ్వు చేసేది తప్పు కాకపొయినా, సరైనదేనా? ఎందుకు అందరిలా ఉండలేకపొతున్నావు?" అని సినిమా రేంజి లో అంతరాత్మ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. ఈలోపు... మరో వైపు నుంచి నన్ను సమర్దించే ఇంకో పెర్సనాలిటీ ఎంట్రీ ఇస్తూ... "పక్కవారితో పోల్చుకుని నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలొచిస్తున్నావు. నువ్వు అందరిలా ఎందుకు ఉండాలి? నీకు నచ్చినట్టు నువ్వు ఉంటావు." అంటూ వాదిస్తుంది. "నీకు పైత్యం ఎక్కువయి కాకపోతే, ఇది మొండి వాదన కదటే..?" అంటూ నాలోని అచ్చమ్మ కలగజేసుకుని గదమాయిస్తుంది మధ్యలో..

కొంపతీసి నాకున్న ప్రత్యేకతలకి తోడు మ్.పి.డి కూడా ఉందా ?!!

Tuesday, March 18, 2008

..Emotional..


I am 'Emotional'
Is what I feel, also hear.
But am never clear, of
What exactly is being so..?

Known to me is,
to Express...
The nice, hard, stupid, crazy...
Also good, bad, ugly, naughty...
Anything that I feel,
For all, to whom, it is not a big deal!

Do I have to change ?
I was confused.
The challenge is to stand still.
later, I realised.

It felt good, expressing...
Taking the challenge, proud I am feeling.
Be it Good or bad, I am not bothered.
Me ready on the runway, fully feathered.
All is a process, and there is,
nothing I need or want to possess.

Flying...Floating...Flowing....
in fact, I am 'Freeing...' !

My 'Self' from 'myself' !!

Monday, March 17, 2008

..అమ్మాయి మనస్తత్వం..

అమ్మ ఇచ్చిన పట్టీలను సొగసుగా అలంకరించుకుని,
అపురూపంగా చూసుకునేది.
చల్లగాలినే ప్రియునిగా, తారలే చెలికత్తెలుగా,
ప్రకృతి మైదానం తన ఆస్ధిగా మురిసిపోయేది.
వట వటా మాట్లాడేది, పట పటా తిరిగేది.
ఊరిలో పండగైతే, సందడంతా ఈమెలోనే!

లయ బద్దం, ఆమె చేతి గాజుల శబ్దం,
ఆమె చేసే ప్రతి పనీ ఒక నాట్యం.
మల్లె తీగ ఆమె నేస్తమే,
మల్లె మొగ్గ విరిసేది ఆమె కోసమే!
ఆమె చిరు మందహాసం,
కలిగించు స్వర్గలోక నివాసం!

కనిపించేది ఆమె భౌతిక రూపం, కాదిది అసలు విషయం.
తరచి చూడు, ఆమె ఒక నిండైన మేఘం.
మనసు (గాలి) వాటం నిర్దేశించు ఆమె ప్రయాణం.
చెలిమి స్పర్శ తో కురియు, ఆభిమానపు వర్షం.
జీవితమంతా పారును, ప్రేమ ప్రవాహం.
బదులుగా కొరేది కేవలం నీ స్నేహం!

ఇది అమ్మాయి మనస్తత్వం!!

..భ్రమ..

పసుపు ఛాయల పడమటి నొసట,
వెలుగుతోంది అసుర సంధ్య, కస్తూరి తిలకమై...
చెదిరిన పావురాయి గుంపుల ముంగురులు,
నాట్యమాడె నల్లని, మబ్బుల చెంపలపై...
కాస్త క్రితం, నీటితో నిండుగా మెరిసిన, ఆ నీలి మేఘాల కన్నులు,
అలసి వాలెను, నిరీక్షణ ఇక భారమై...
ఇంతలో చల్లని వెన్నెల నవ్వు వరమిచ్చె,
పంచమి చంద్రుడు, నీ రూపు ప్రతిబింబమై...

ఒక్క క్షణం, ఈ దూరం నిజమన్న భ్రమలో మునిగిపోతున్న నాకు,
నీ ఆలోచన మళ్ళీ ఊపిరి పోసింది..!

Wednesday, March 5, 2008

Far from the world...


Far from the world, I live,
on the island of Love.

All the days through nights,
I spent there...
Sitting on the shore,
playing with its sands.
Looking at the waters,
helping you row...
Listening to the music of winds,
carrying your messages...
With my hope,
Is your Light...

waiting am I,
for u to join me.

And then...
Dreamt I that you came,
Not by the waters but by the wind,
Love had given you wings.

You soared over the seas,
and saw the Horizon,
The Giver of Life and His flaming chariot,
took you into His embrace.

Returning from His domain,
You came, just for me,
Or so I thought, true might not be.
Yet I could feel your warmth,
And in that, I breathed all Life safely.

Wednesday, February 13, 2008

..సంధ్యా సుందరి..సీతాకాలపు సాయంత్రం, చల్లగా గాలి వీస్తోంది.
శుక్ల పక్షపు నెలవంక వయ్యారంగా నిల్చొని హొయలొలకబోస్తోంది....
పస్చిమాన లేత ఎరుపు రంగు కాంతులతో మెరుస్తున్న ఆకాశం, సిగ్గులొలికే ఆమె బుగ్గల్లా ఉన్నాయి.
ఈ సుందరి అలసిపోకుండా, పక్షి నేస్తాలు రెక్కలతో విసురుతున్నాయి...

అంత దాకా ఎదురుచూపును ధరించి మెరిసిన ఆ జాణ, ప్రియుని ఉనికిని పసిగట్టగానే,
ఒక్క ఉదుటున, ఎటెళ్ళిందో...?? యే పడమటి తలుపు వెనుక దాగి ఉందో..?!!
కృష్ణ వర్ణం లో మెరుస్తు ఠీవి గా వచ్చిన రేరాజు, ఆమె జాడకై నలు దిక్కులనూ పరిశీలించాడు...
ఉరికినపుడు ఆమె కురుల్లోంచి జాలువారిన మల్లెల చుక్కలను చదువుతూ ఆతడు కూడా పడమటి వైపు ప్రయాణం సాగించాడు...

Monday, February 4, 2008

సొంత డబ్బా...

ఈరోజు నా గురించి రాసుకోవాలనిపిస్తోంది.

నా పేరు విశాల. నా పేరంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. అమ్మ నన్ను, క్రమశిక్షణ లో పెంచింది. బాధ్యత, శ్రద్ధ నేర్పింది. నాన్న నాకొక మంచి ఫ్రెండ్. ఏ విషయమైనా ఓపెన్ గా మాట్లాడుకుంటాం. ఇక తమ్ముడు... వాడంటే నాకు చాలా ఇష్టం. my first best friend అని పరిచయం చేస్తుంటాను అందరికీ..

ఇక నా గురించి... నేను చాలా తెలివైన దానిని అని నాకొక ఫీలింగ్. నా మీద నాకు నమ్మకం ఎక్కువ. నా అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోను. మార్పు అవసరం అనిపిస్తే వెనుకాడను. ఐతే బలవంతం చేస్తే, నా అంత మొండి, saddist ఇంకెవరూ ఉండరేమో..! చాలా మటుకు నా పనులు impulsive గా ఉంటాయి. friends ని ఏడిపించటం, వాళ్ళాపై జోకులెయ్యటం అంటే చాలా ఇష్టం. ఆడుకోవటం అంటే ఇంకా ఇష్టం. ఆడే వాళ్ళు ఉండాలేగానీ... AATR నేను. ఆదేనండీ.. "ఆటకి Any Time Ready" అనీ..

ఇంకా నాకు శ్రీ కృష్ణుడంటే చాలా ఇష్టం. అన్నిటిలోనూ ఉంటూనే, అన్నిటికీ అతీతంగా ఉండే అతని స్వభావం నాకు చాలా నచ్చుతుంది. నేను గీత చదవలేదు కానీ, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి విన్న దానికే అతడికి పెద్ద ఫాన్ అయిపోయాను. I feel that I am crazy about Him. అలాగే, నాకు చిన్న పిల్లలంటే ఇష్తం. ప్రకృతి అంటే కూడా చాలా ఇష్టం. అందుకేనేమో నాకు ఒంటరిటనం అంటే bore కొట్టదు. చుట్టూ పరిసరాలను observe చేస్తూ ఎంత సేపైనా గడిపేస్తుంటాను. అన్నట్టు bore అంటే గుర్తొచ్చిఇంది. నాకు bore కొట్టడం చాలా అరుదు. ఎలాంటి topic లో అయినా ఇట్టే ఇమిడిపోతాను. Spirituality, Philosophy, Psychology, Mathematics, Physics, Social issues, movies, Arts, Languages, Cricket, ఇంటి పని, వంట పని... ఇలా దేని గురించైనా మాట్లాడెస్తుంటాను. అది నా uniqueness అనిపిస్తుంది నాకు. నాన్న మాత్రం.."నీకు కబుర్లెక్కువ పని తక్కువ", అంటూ ఉడికిస్తుంటారు. ఐతే దేని గురించి మాట్లాడినా, నా intentions పక్క వాళ్ళకి అర్థం కావాలి అన్న తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఎదుటివారు నాతో ఏకీభవించకపోయినా నాకు ఎమి అనిపించదు. కాని, నా వాదన అర్థం కాలేదు అంటే మాత్రం, ఓపికగా మళ్ళా విడమర్చి చెప్పటానికి ప్రయత్నిస్తాను. వాళ్ళ ముఖం లో, "ఇక ఆపవే" అన్న భావన కనిపించినా ఆపను. అదేదో బయటకి చెప్పచ్చుకదా. ఎందుకో అంత మొహమాటం... చాలా సార్లు, నా బాధ భరించలేక, కొంతమంది friends, "You are right Visala" అని తప్పించేసుకుంటారు. "అలా అని చెప్పి బ్రతికిపొయావు" అని చెప్పి నేనూ నవ్వేస్తాను. అలా కాకుండ, "విశాలా, ఇప్పుడు కాదు, ఇంకెప్పుడైన.." అనో.. లేక "ఆ టాపిక్ ఇక్కడితో వదిలెయి" అనో.. చనువుగా చెప్తే నాకు బాగా అనిపిస్తుంది.

నా వెర్రి ఇక్కడితో ఆగలేదండోయ్... నేను పాటలు పాడుతుంటాను. మనలో మన మాట.. "ఏడారి లో ఆవదం చెట్టే.. మహా వృక్షం." అన్నట్టు, మా గ్యాంగ్ లో నెనే పెద్ద సింగర్. ఇంకా బొమ్మలు గీయటం..., చిన్న చిన్న రాతలు.. [వాటిని ఏమనాలో తెలియదు నాకు...], పుస్తకాలు చదవటం, చదివింది ఎంతైనా..., నాకు ఆంతా తెలిసిపోయినట్టు వాదించటం.. ఇలా ఎదో ఒకటి చేస్తుంటాను. మధ్యలో, ఎవరైనా పొగిడితే మురిసిపోతుంటాను. ఇలా రోజులు గడిపేస్తున్నాను...

సరే మరి.. మళ్ళా ఎప్పుడైనా, నాకు మూడ్ వస్తే మరికొన్ని రహస్యాలు చెప్తాను...

ఇట్లు,
విశాల.

Wednesday, January 2, 2008

...Magic of Friendship...

అన్ని బంధాల కంటే...
ఎందుకు స్నేహ పాశం ఇంత మధురం గా ఉంటుందో.. ?!!
ఎంత అంటే.. ఒక్కో సారి కళ్ళలో నీరు తెప్పించేంత...

ఎంతో అభిమానం, అంతులేని నమ్మకం..
no formalities.. no rules..
దసాబ్దాలు గడిచినా, అదే కమ్మని భావం..
ఏ గాయాన్నైనా మాయం చెయ్యగల మంత్రం..!!

నెస్తమా...
మనసు కరిగి కన్నీరు వర్షమైనప్పుడు,
వాటిని ప్రేమ కిరణాలతో తాకి, హరివిల్లు గా దిద్దావు!!