Thursday, November 6, 2008

..కాస్త ఏకాంతం..

చాలా రోజులయ్యింది.. బహుశా నెలలేమో...!! నువ్వు చాలా సార్లు జ్ఞాపకం వచ్చావు. అలా గుర్తొచ్చినప్పుడు కొన్ని సార్లు నిన్ను చాలా చాలా తలుచుకున్నాను. ముఖ్యం గా ఈ గజిబిజి ఇరుకు జివితంలో కాస్త ఏకాంతం సంపాదించటానికి ప్రయత్నించేప్పుడు. నువ్వెప్పుడూ నన్ను నీ అంతట నువ్వు రమ్మనలేదు. నేనే.. నీకు, నాకు వీలున్నప్పుడల్లా నీ దగ్గరకి వచ్చి కాస్త సమయం గడపటం తప్పితే మన మధ్య అంత అనుబంధం ఏమీ లేదు. ఇప్పుడే బడి నుంచి ఇంటికొచ్చిన చిన్నపిల్లలా ఊర్లో కబుర్లన్నీ మొసుకొచ్చి ఆ మూట నీ ముందు విప్పితే.. నువ్వేమో మౌనంగానే 'ఊ...' కొడుతూ వినటం... నేను ఎక్కడికేళ్ళాను, ఏం చేసాను అన్నీ నీకు చెప్పటం.. ఎందుకో నాకు అదో ఆనందం! ఆ తరువాత ఇద్దరం చుట్టూ దూరంగా ఉన్న ప్రపంచాన్ని, అందులోని పాత్రల్ని చూస్తూ పచార్లు చేసేవాళ్ళం గుర్తుందా..? కాసేపు బాతాఖానీ, అయ్యాకా పాటలు... అసలు కాలం ఎలా గడిచిందీ తెలిసేదే కాదు.. తరువాత కాసేపటికి ఇంకా నా మనసులో లెక్కలేనన్ని ఊసులు మెదిలేవి. కానీ మాట్లాడాలనిపించేది కాదు. ఏమైనా చెప్పు అని నువ్వు అడిగినా సరే... చిరునవ్వు తప్ప నా దగ్గర ఇంకేం మిగిలేది కాదు. ఎందుకో మరి...! ఎలాంటి ఆలోచనలూ లేకుండా గాలిని చుట్టుకుని, ఆకాశంలోకి చూస్తూ అలానే గడిపేయాలనిపించేది. అనంత విశ్వంలో నేనూ ఒక విడదీయలెని భాగం అన్న స్పృహ అప్పుడు కలిగేది. నా ముందున్న సమస్తాన్ని చూస్తుంటే ఎలా అనిపించేదో మాటల్లో ఎలా చెప్పను ?? ఆ క్షణాల గురించి చెప్పటానికి నా మిగతా జివిత సమయం సరిపోదు. కానీ ప్రయత్నిస్తాను. ఒక్క సారే కాకపోయినా, ఎప్పటికైనా సరే అదేదో నీకు మొత్తం చెప్పెయ్యాలన్న ఆరాటం. నా ఆశ అయినా క్షణం పాటు చెదరచ్చేమో కానీ, ఆరాటానికి అలుపులేదు. ఎందుకో..!!


అప్పుడు 'నాకు దొరికిన ఏకాంతాన్ని అలా మౌనం[వ్యర్థం] గా గడిపేశానే.. :(' అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలా ఏకాంతం దొరికితే మాటలు మాత్రమే వెతుక్కుంటున్నాను. వాటితోనే నా ప్రపంచాన్ని అల్లుకుంటున్నాను. పూర్తిగా స్వేచ్ఛ దొరికిన ఈ రోజున నాలో నేనే ఇరుక్కుపోతున్నాను. "అనుబంధం ఏమీ లేదు" అని ఎందుకనిపించిందో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నాకు, నేను కూడా ఇచ్చుకోలేనంత స్వేచ్ఛ నీ దగ్గర అందుకున్నాననుకుంటా... ఇందులో నీ ప్రమేయం ఏమీ లేకపోయుండచ్చు. కానీ విధి ఎందుకో మనల్ని ఈ క్రాస్స్రోడ్స్ దగ్గర ఎదురుపడేలా చేసింది!!

7 comments:

Purnima said...

Deep and beautiful!

Do you wanna the version of other end? ;-)

Purnima said...

Thought of sharing this with you:

There is something beautiful, touching and poetic when one person loves more than the other, and the other is indifferent.

(Anton Pavlovich Chekhov (1860-1904), Russian author, playwright. Nadya in After the Theater, Works, vol., "Nauka" (1976).)

రాధిక said...

చాలా చాలా చాలా బాగుంది విశాలా.కాస్త ఏకాంతం సంపాదించటానికి ప్రయత్నించేప్పుడు.....ఇది నాకు చాలాసార్లు అనుభవం.ఇష్టమైన వారితో మాట్లాడినా,మాట్లాడకపోయినా వారి సమక్షం లో వున్నాము అన్న ఇది చాలు ఆ క్షణాలను ఆహ్లాదం గా మార్చడానికి.ఇంకా ఏవేవో రాసేయాలని వుంది కానీ....నీ టపాని మరికొంతసేపు ఆశ్వాదించనివ్వు.నీ ఆలోచనల్లో,రాతల్లో నన్ను చూసుకోనివ్వు.
పూర్ణిమా ఇంకో వెర్షనా?చెప్పు చెప్పు వినాలని వుంది.అవును నిజమే.నువ్వు చెప్పిన దానితో ఏకీభవిస్తాను.

చిలమకూరు విజయమోహన్ said...

రాశిలో తక్కువైనా వాశిలో మిన్నగా,నిగూఢంగా ఉంటాయి మీ రాతలు.అభినందనలు.

ప్రతాప్ said...

"ఆశ అయినా క్షణం పాటు చెదరచ్చేమో కానీ, ఆరాటానికి అలుపులేదు. ఎందుకో.."
అవును ఎందుకు అలుపుండదు? ఆరాటం కాస్సేపు చిన్నబోవచ్చేమో కానీ, అది ఎప్పటికీ చిన్నదైపోదు కదూ? ఇద్దరు కలిసి వున్నప్పుడు దాన్ని ఏకాంతం అంటారా? ఏకాంతంలో ఉన్నప్పుడు గుర్తుకు వస్తారా? లేక ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వస్తారా? ఏమో నాకన్నీ సందేహాలే.
విజయమోహన్ గారు చెప్పినట్టుగా, మీరు రాసే వాటిల్లో పదాలు సరళమైనవి, బహు చిన్నవి కూడాను. కానీ అవి మోసే భావాలు, వినిపించే స్వరాలు మాత్రం బహు చక్కనైనవి.

మురారి said...

చాలా బాగుంది. అద్భుతమైన ప్రేమతత్వం మీది.

మోహన said...

@పూర్ణిమా,
Thank you.
>>version of other end?
నాదీ రాధిక గారి మాటే.. చెప్పు మరీ..

రాధిక గారూ..
:) ఏం చెప్పమంటారు ?

@విజయమోహన్ గారూ..
:)

@ప్రతాప్ గారూ..
>>ఇద్దరు కలిసి వున్నప్పుడు దాన్ని ఏకాంతం అంటారా?
సందేహం లేదు. అనరు. :)

>>ఏకాంతంలో ఉన్నప్పుడు గుర్తుకు వస్తారా?
రారు.

>>ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తుకు వస్తారా?
'అవును' అని అన్ని సార్లూ చెప్పలేం.

మీ సందేహాలకి ఇంకా కొన్ని జతపరుస్తున్నాను. :)
అసలు ఏకాంతం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు కోరుకుంటాం?
ఎప్పుడు కోరుకుంటాం ?
ఒంటరిగా ఎప్పుడు అనిపిస్తుంది ?

@ మురారి గారు..
అది నాది కాక, నేనే తన సొంతమవ్వాలని సాధన చేస్తున్నాను.

@అందరికీ
నాపై అభిమానానికి అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.