Thursday, March 26, 2009

...హృదయ రాగం...

నాలో ఎంత మార్పు..? ఈ రోజు అద్దం ముందు నిల్చుంటే, "ఇది నేనేనా? ఇది కలా, నిజమా?" అని తేల్చుకోలేకుండా ఉన్నాను. మార్పు నా పైకి ఎంత నెమ్మదిగా ఎగబాకిందంటే నేను అసలు గ్రహించనే లేదు. చుట్టు పక్కల జరిగే మార్పులను, అలాగే భౌతికంగా కొలవగలిగే మార్పులను మెదడు గ్రహించగలదేమో కానీ స్పందన, ప్రతి-స్పందన వల్ల అంతర్గతంగా జాగృతమైన మార్పును ఎలా గ్రహించగలదు? ఇప్పుడు మాత్రం ఎలా గ్రహించాననే కదా నీ సందేహం? ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు లేని స్పృహ, ఆ ఊపిరి ఆగిపోయేప్పుడు కలుగుతుంది కదా...!

ఎంత కష్టపడినా , నా రెక్కలు ఎంత వేగంగా ఆడించినా నిన్ను అందుకోలేను. అలా అని నిన్ను ఆపనూ లేను. నీవు కర్మ బధ్ధుడివి. నేను నీ అభిమానిని. కాల చక్రం మళ్ళీ నిన్ను నా దగ్గరకు చేర్చక పోదా అని గుండె ఆశగా కొట్టుకున్నా... ఈలోపే కాలమనే ఆ గానుగు చక్రంలో పడిపోతానేమో అన్న ఆలోచన వచ్చిన మరుక్షణం, మనసు భయం తో వణికిపోతూ తనలో నిలుపుకున్న నీ విగ్రహాన్ని పట్టి భోరున ఏడుస్తోంది. నా మనసుని పట్టించుకునే అంత సమయం లేదు ఇప్పుడు. మిగిలిన ఈ కాస్త సమయాన్నీ అర్థం పర్థం లేని, ఈ నిమిషానికి సంబంధం లేని భయాలతో నింపుకోలేను. నీతో నాకంటూ మిగిలినవి ఇంకొన్ని ఘడియలే...! ఇంకెంతో దూరం నా నడక సాగించలేను. నీవు రాక ముందు నేనెలా ఉన్నానో నాకు కనీసం గుర్తు కూడా లేదు. కొన్ని యుగాలయినట్టుంది. ప్రియా.. ఇకపై మాత్రం నువ్వు లేకుండా ఉండ లేను. ఏం చెప్పను ? ఏం చేసి నా భావాలను, నా అనుభూతులను ఈ కాస్త సమయంలో నీకు పంచను? నాకు మాటల్లేవు. చేతలు రావు. యే హద్దులూ లేని నా 'హృదయ రాగాన్ని' మాత్రం నీ జత పంపిస్తున్నాను. అంతకు మించి నీకిచ్చేందుకు నా వద్ద 'నావి' అనేవి వేరేమీ లేవు. ఉన్న వన్నీ కాలానికో, విధికో అర్పించక తప్పదు కదా........ అని ఆ కోయిల తను ప్రేమించిన వసంతుడికి వీడ్కోలు చెబుతూ రెక్కలు జాచి ప్రాణాలొదిలింది.

Saturday, March 14, 2009

..నమ్మకం..



ఎన్నాళ్ళని ఇలా ఇక్కడే ఒంటరిగా ఉంటావు?
భయాలన్నీ వదిలి, నాతో రారాదా..?

ప్రేమను నాటి, నమ్మకాల అంట్లు కట్టి,
నిత్య నూతన జీవితానికి నాంది పలుకుదాం.
ఎప్పటికీ వాడిపోని చిరునవ్వుల పూలు పూయిద్దాం.
కలలుగన్న కొత్త బంగారు లోకాన్ని నిర్మిద్దాం.

Thursday, March 5, 2009

అ(గె)లుపెరగని ఆరాటం...



నిను చేరేందుకు మనోవేగంతో వచ్చానే...
చేరే చివరి క్షణంలో, నాలో ఈ నిశ్శబ్దం !!
మాటల్లో చెప్పలేని నా భావావేశం కాదు.
నీ స్తబ్ధత ముందు ఓడి మౌనం గా నిలిచిన ఆరాటం.

ఈ అల విరిగింది.
నిరుత్సాహంగా వెనుతిరిగింది.
నీవు అలని చూసేవు.
నాకు అల వెనుక, అనంత సాగరమే కానవస్తుంది.