Wednesday, August 19, 2009

నీడలు...

మెర్కురీ దీప కాంతులను అడ్డగిస్తున్న ఆకుల నీడలు...
కిటికీ అద్దం మీద నల్లగా, మెల్లగా ఊగుతున్నాయి.

అరుగు మీద ఎర్పడ్డ చిన్ని కొలనులోని అలల నీడలు...
వరండా సీలింగ్ పై పసిడి వర్ణంలో మెరుస్తూ కదులుతున్నాయి.

బీడు వారిన మది మైదానంలో పాతుకుపోయిన జ్ఞాపకాల నీడలు...
ముఖం పై మౌనంగా, ఖాళీగా మెదులుతున్నాయి.

Friday, August 14, 2009

నన్నొదిలిపోతావా??.......

ఇంత మంచి నేస్తాన్ని, నన్నొదిలిపోతావా....ప్రేమా?
***
ఎందుకొచ్చింది నాకీ అనుమానం? రాదా మరి..?! ఇదే కాదు, ఇంకా చాలానే సందేహాలొస్తున్నాయి. నాకు కష్టాలొచ్చినప్పుడు, నిజంగా నీ అవసరం ఎక్కువ ఉన్నప్పుడే నువ్వు నన్నొదిలిపోతావనిపిస్తుంది. లేకపోతే నువ్వు లేనప్పుడు, "ఇదే మంచి చాన్స్" అనుకుంటూ కష్టాలొచ్చి నన్ను చుట్టు ముడుతున్నాయా?? ఇదేమీ కాదేమో!! నువ్వున్నప్పుడూ కష్టాలున్నాయేమో.. కానీ అసలు అవి కష్టాలనే అనిపించలేదేమో... అయ్యుండచ్చు. మంచి తోడుంటే యే దారిలో అయినా, ఎలాంటి ప్రయాణం అయినా ఇట్టే సులువైపోదూ!! నేస్తం ఉంటే నరకం కూడా నైస్ గా ఉంటుంది. ఎంటీ? కాస్త ఎక్కువయ్యింది అనిపిస్తుందా? నిజంగానే చెప్తున్నా... నేస్తం దూరమైతే స్వర్గంలో కూడా కష్టాలొచ్చి కాపురముంటాయి. పరీక్షలొచ్చి పలకరిస్తాయి. కావాలంటే సుధ ని అడుగు... "సంతోషం గానే ఉన్నా, నేస్తం దూరంగా ఉంటే ఎంత వెలితిగా ఉందో.. ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. " అని మొన్న తనే అంది. అందుకే.... ఎదేమైనా, నువ్వు నన్నొదిలిపోయినా, నేను మాత్రం ఒక్క సారి కమిట్ అయితే నా మాట నేనే వినను. నాలో ఉన్న నిన్ను ఎప్పటికీ వదులుకోను. నా హృదయాంతరాలలో నువ్వు నింపిన మకరందాన్ని అందరికీ పంచుతూనే ఉంటాను.

------------------------------------------------------------------------------
పంచేకొద్దీ పెరిగేది ప్రేమ.

Monday, August 3, 2009

వినిపించుకోను..........

నిశ్శబ్దం నా కాలు నిలవనీయట్లేదు.
తల బద్దలయ్యేలా ఢీకొడుతున్న ఆలోచనల అలలు.....
ఆ ఘోష అస్పష్టంగా వినపడుతోంది.
ఆ హోరు చెవులను చీల్చేస్తోంది.

ప్రతి క్షణం చూసిన ఎదురుచూపుకు,
అను క్షణం గుర్తుండిపోయేలా ఇచ్చిన ఆ
పిడికెడు మాటల కన్న,
పిడి బాకుతో గుండెను ఒకేసారి చీల్చేసి పో.......

తీయని కలలను నిర్దాక్షణ్యం గా తుడిచేసే ఆ,
మాటలతో ఎందుకు ఇలా చిత్ర వధ???
ఈ మాటల మూటల భారం, జీవితాంతం!
మోయగలననుకుంటున్నావా....?

గలనో.. లేదో....... ఎవరికి నిరూపించాలి???
మోయాలేకపోతే, ఈడ్చుకుంటూ వెళ్ళను.
ఉన్న ఫళాన విదిలించుకోగలను, విడిపించుకోగలను!!
ప్రస్తుతానికి మాత్రం వినిపించుకోను.

---------------------------------------------------------------------------------------
అటు నిశ్శబ్ధం భరించలేక, ఇటు మాటలు వినలేకపోతే, వినటం మానెయ్యాలంతే...!!!