Friday, January 23, 2009

...మౌన సంభాషణ...

టైం 10:10. పని వత్తిడి వల్ల పడుకోవటం, అందువల్ల లేవటం, బయలుదేరటం, ప్లాన్ అంతా లేట్ అయిపోయింది. 'ఛ! వెళ్ళే సరికి మధ్యాహ్నం అయిపోతుంది' అనుకుంటూ బస్ ఎక్కాను. సిటీ బస్లో గంట పైనే ప్రయాణం చెయ్యాలి సుధ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి. సీట్ ఖాళీ లేదు. లేడీస్ సీట్ అని, ఒకతన్ని నిలబెట్టేసి కూర్చున్నాను. పక్క సీట్లో కూర్చున్న అబ్బాయి, [అతని కొడుకు అనుకుంటా..] ఖంగారు పడి అతనితో పాటూ లేచి వెళ్ళిపోతుంటే, ఇటు కూర్చో అని అయిల్ సీట్ ఇచ్చేసి నేను విండో సీట్లో స్థిరపడ్డాను. పరవాలేదు కూర్చో అని నాన్న సైగ చెయ్యటంతో వాడు కూడా కూర్చున్నాడు. ఎండ మండిపోతుంది. అద్దం లోంచి పడే సూర్య రశ్మికి కుడి చెంప, చేయ్యి వేడెక్కి సుర్రుమంటున్నాయి. చేసేదేమీ లేక అలానే కూర్చుని దిక్కులు చూడటం మొదలెట్టాను. బాగానే కాలక్షేపం అవుతోంది. ఆ పిల్లాడికి ఇంకా నా మీద కోపం ఉన్నట్టుంది, వాళ్ళ నాన్నని నిల్చోబెట్టినందుకు. వాడికి కూడా ఎండ బాగా తగులుతోంది. ఎండ వల్లో, మరి నా మీద కోపం వల్లనో వాడి ముఖం ఎర్రగా మారుతుంది. ఇంకా, నుదుటి పై సన్నగా చెమట కూడా...

మామూలుగా ఐతే పిల్లలు కనబడితే, అవకాశం వస్తే వాళ్ళతో ఎదో ఒకటి మాట్లాడతాను, నవ్వులు కలిపేస్తాను. కానీ ఆ రోజు ఎందుకో మాట్లాడే, నవ్వే, ఎమోషనల్ అయ్యే మూడ్ లేదు నాకు. సో వాడిని పెద్దగా పట్టించుకోలేదు. నా దిక్కులు చూట్టం పనిలో పడిపోయాను. అలా చూస్తూ చూస్తూ మధ్యలో వాడిని కూడా చూసాను. నిద్రొస్తున్నట్టుంది. తూగుతున్నాడు. వంగి పడుకునేందుకు ప్రయత్నించాడు. వీలు లేదనుకుంటా.. వెంటనే లేచాడు. నాకెందుకో కొంచం ఇంటరెస్టింగ్ గా అనిపించి, వాడిని చూడటం మొదలెట్టాను. వంగున్నాడు, పక్కన ఉన్న రాడ్ మీద వాలాడు, సీట్లోనే పక్కకు తిరిగి పడుకున్నాడు.. ఊహు!! లాభం లేదు మెదులుతూనే ఉన్నాడు. నిద్రేమో కుమ్మేస్తుందని తెలుస్తుంది. కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. నాకేమో ఏం చేస్తాడా అన్న కుతూహలం పెరుగుతోంది. ఇంకో పక్క జాలేస్తొంది. నిండా చూస్తే ఆరేడేళ్ళు ఉంటాయేమో అంతే. పక్కన వాళ్ళ అమ్మ ఉంటే వాడు ఇలా దూర ప్రయాణంలో ఇంత కష్టపడే అవసరం ఉండేది కాదేమో కదా అనిపించింది. వాడు ఇంకా నిద్రపోయేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను వాడినే చూస్తున్నాను. అన్ని యాంగిల్స్ ట్రై చేశాక, ఎదీ కుదరక, లేచి ఏం చెయ్యాలా అన్నట్టు ఆ ఎర్ర కళ్ళతో చుట్టూ చూస్తున్నాడు. ఇక నా మనసు ఆగలేదు. కానీ అప్పుడు కూడా మాట్లాడే మూడ్ లేదు నాకు. వళ్ళో పడుకుంటావా అన్నట్టు సైగ చేశాను. వాడు నన్ను అలానే చూస్తున్నాడు. మళ్ళీ సైగ చేశాను. ఊ.., ఆ.. అనలేదు. చటుక్కున ఒళ్ళో వాలిపోయాడు. గాఢ నిద్రలోకి జారుకుంటున్నాడు అనేందుకు సూచనగా మెల్లగా వాడి బరువు పెరుగుతోంది. నిద్రపోతున్న వాడిని చూసి ఎంతో సంతృప్తి గా అనిపించింది.

మేము ఇద్దరం ఒకరికొకరు తెలీదు. ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. కనీసం వాడిని చూసి నేను నవ్వలేదు. కానీ మా ఇద్దరి మధ్యా ఎదో ఆత్మీయతతో కూడిన సంభాషణ జరిగినంత ఫీలింగ్ కలిగింది నాకైతే. ఇలా ఉండగానే, నా మెదడు ఆలోచించటం మొదలు పెట్టింది [ఖాళీగా ఉన్నందు వల్ల కాబోలు]. ఎందుకో ఈ మధ్య నా ఆలోచన పద్ధతి, మాట్లాడే పద్ధతి చలా మారాయి అనిపించింది. ఐతే ఏ రకంగానో చెప్పలేను. మరైతే మార్పును ఎలా గమనించానంటే, ఎదుటి వారి స్పందన బట్టి... I am having a kind of smooth understanding and conversations with many people, which was not so very common before...

ఇలా ఉండగా ఒక పుస్తకంలో ఈ క్రింది లైన్లు తారసపడ్డాయి నాకు.


"All belief systems are destructive to communication. And the whole life is nothing but communicating - communicating with trees, communicating with rivers, communicating with sun and moon, communicating with people and animals. It is communication; life is communication.

Dialogue disappears when you are burdened with belief systems. So, if you want to see and hear and listen, then you will have to drop all belief systems. You have to be sensible enough to be with out beliefs. Caged in your own system you are unavailable and the other is unavailable to you.

People are moving like windowless houses. Yes, you come close, sometimes you clash with each other- but you never meet. Yes, sometimes you touch, but you never meet. You talk, but you never communicate. Everybody is imprisoned in his own conditionings; everybody is carrying his own prison around him. This has to be dropped."

And it made sense to me.
These days I am more conscious about how I communicate my point and what I am filling conversations with. Hope I can be so all the time! 'coz my mood often swings just like my heart does :D

Wednesday, January 14, 2009

అంతా శూన్యమే..!

జ్ఞాన జ్యోతిని సాధించటం మొదటి అంకం.
ఆ వెలుగు లేనిదే సత్యాన్వేషణ అసాధ్యం.

జ్ఞానమే సర్వస్వమనుకుంటే మూర్ఖత్వం.
ఆ జ్వాలలో మాడి మసవటం ఖాయం.

అజ్ఞానికి సైతం మోక్షాన్నిచ్చేది ప్రేమ తత్వం.
ప్రేమను సైతం పరిహసించగలిగేది విశ్వ సత్యం.

అజ్ఞానికి సత్యం తెరిచే తలుపు విరక్తి.
జ్ఞానమున్న నాడు అదే వైరాగ్యం, మోక్షానికి ముఖ ద్వారం.
ప్రవేశ రుసుము విలువ, పేర్చుకున్న జ్ఞానమంత!
ఆ తలుపు ఆవల అంతా శూన్యమే..!!

Monday, January 12, 2009

..శీతాకాలపు సాయంకాలం..

ఇంటికి కాస్త త్వరగా బయలుదేరేడు...
ఇంకాసేపుంటే మంచులో తడవాలని కాబోలు!
మళ్ళొస్తా అంటూ అతడి చివరి స్వర్ణ కాంతులు,
చిటారు కొమ్మలను ఓదారుస్తూ బుజ్జగిస్తున్నాయి.

ఆ ఆఖరి వెచ్చటి స్పర్శ కు కలిగిన చల్లటి పులకింతేనా..?
ఈ శీతాకాలపు సాయంకాలం ?

***

వీధి మలుపు తిరిగే వరకూ సాగనంపే అమ్మలా,
ఆకాశం అతడిని సాగనంపుతోంది.
చలికి వణుకుతున్న పుడమికి,
పండిన చెట్ల ఆకులు దారంతా దుప్పటి కప్పుతున్నాయి.

ఈ శీతాకాలపు సాయంకాలం,
వెచ్చని అభిమానాల సమాహారం.

***

పొగ మంచు తెరలో,
వెచ్చని ఊసుల్లో చలి కాచుకుంటూ,
చేతిలో చేయి వేసి నడుస్తున్న...
పండిన గోరింటాకంటి పడుచు జంట.

జ్ఞాపకాల కుంపటిని రాజేసేను,
ఈ శీతాకాలపు సాయంకాలం.