Monday, November 10, 2008

..రసీదు పత్రం..

మాధవుని సమక్షం బృందావనం కాగా...
వేయి వసంత ఋతువులే ఆక్రమించిన మనసు
కోటి కోకిల గానాలే పలికెనో... లేక,
మురళీ రవముకు మంజీరమై నర్తించెనో.. ఏమో..!

ఆనందం ప్రవాహమై ఉరకలు వేస్తూ పరవళ్ళు తొక్కుతూ,
ఈ లోకమునకు [స్వచ్ఛమైన గంగవోలె] చిరునవ్వులై జాలువారుతుండగా,
మౌన సామ్రాజ్యమునేలు నీవు, కడిగిన ముత్యమంటి నీ చిరునవ్వునే కానుకివ్వగా...
అది నా నిగూఢ ప్రేమకి నీ రసీదు పత్రమే అనుకోనా?

6 comments:

చిలమకూరు విజయమోహన్ said...

కృష్ణ దరహాసమా ! మీ రసీదు పత్రం.

Bolloju Baba said...

చిత్రమైన ఊహ. చాలా బాగుంది

మురారి said...

రవీంద్రుని గీతాంజలిని గుర్తుకు తెప్పించావు. బ్యూటిఫుల్.

కొండూరు కృష్ణ (ఆత్రేయ ) said...

మోహన గారి ఆలోచన చాలా బాగుంది.

మీకు తెలియని, వ్యక్త పరచని నిగూఢ నిస్వార్ధ ప్రేమకే
దేవుని చిరునవ్వును రసీదు అన్నారు. మీకు భగవంతుని పైన ఉన్న ప్రేమకు అసూయ పడుతున్నాను.

ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. ఎటువంటి ప్రేమ చూపకున్నా ఆయన ఆ నవ్వు చెరగదు గా ? ఆయన రూపం మారదుగా ?

ఆ నవ్వుకు అర్ధం మారేది, మన ఆశను బాహాటంగా వ్యక్తంచేసి, ఆర్తిగా అర్ధించి, ఆశగా ఎదురు చూసినా కలలు కల్లలుగానే మిగిలినప్పుడు, ఆ నవ్వు రసీదు గా కన్నా, కొన్ని వేల డాలర్ల క్రెడిట్ కార్డు బిల్లు లానే కనిపిస్తుంది.

నా పరిస్థితి అదే. అన్యధా భావించకండి. నా అభిప్రాయాన్ని నా కవితలో చూడగలరు.

http://naakavitalu.blogspot.com/2008/11/blog-post_2564.html

రాధిక said...

beautiful mohana

మోహన said...

@విజయమోహన్ గారూ..
అతడి బరువు తులసీ దళం బరువు...
మరి అతడి చిరునవ్వు లోతు ? :)

@బాబా గారూ..
చిత్రంగా ఉందికదండీ.. నాక్కూడా.. :)
ఈ కవిత లింకుని మీరు ఆత్రేయ గారి బ్లాగులొ ఇవ్వటం చూసి, చాలా మురిసిపోయాను. ధన్యవాదాలు.

@మురారి గారూ..
ఈ రోజు మామూలుగానే మేఘం-9 మీద ఉన్న నేను కాస్తా, మీ వ్యాఖ్య చూసాకా మేఘం-99 చేరిపోయాను ఏమాత్రం శ్రమపడకుండా.. :) ఎందుకంటే నేను ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ గురించి చదివి, అతడికి వీర ఫాన్, ఎసి, విసనకర్ర కూడా.. Thank you.
గీతాంజలి చదవలేదు. ఇప్పుడు చదవాలనిపిస్తుంది.

@ఆత్రేయ గారూ...
మీ అలోచనలు ఇక్కడ పంచుకున్నందుకు చాలా సంతోషం. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే ఎలాంటి అనుమానం లేకుండా పంచుకోవచ్చు. అభ్యంతరాలేమీ లేవు.

ఇకపోతే, మీరు అలా అన్నారని అస్సలేమీ అనుకోవట్లేదండీ.. మీ అక్షరాలు అక్షరాలా నిజం. ఆ బాధ రుచి చూశాను నేను కూడా. మనం రోజూ చూసే పరిశరాలే, ఒక్కో రోజు ఒక్కోలా, కొత్తగా కనిపిస్తుంటాయి. అదే చెట్టు, అదే చందమామ, అదే గాలి, అదే మాధవుడు. మరీ ఉన్నట్టుండి కొత్తగా ఎందుకు కనిపిస్తున్నాయి ?? ఎక్కడ ఉంది మార్పు ? ఆలోచించండి.

ఇదే విషయమై ఒక టపా రాయాలని చాలా రోజులనుంచి అనుకుంటున్నాను. తప్పకుండా రాస్తాను అతి త్వరలో..

@Radhika
Thank you :)