చాలా రోజుల తరువాత వాళ్ళని కలవటానికి వెళ్ళాను. ఎప్పటిలాగే నేరుగా వాళ్ళ గదిలోకి వెళ్ళి 'హాయి ' అనగానే, వారిలో సగం మందికి పైగా నా గొంతు గుర్తు పట్టి 'విశూ..' అంటూ నన్ను చుట్టేసారు. వారి మధ్య చేరిపోయి కబుర్లు చెప్తున్నాను. అంతా కుశల ప్రశ్నలు వేస్తున్నారు. నేను సుమ కోసం చూస్తున్నాను. తను ఎక్కడా కనిపించలేదు. రాధని అడిగితే సుమకి క్లాస్ జరుగుతోందని చెప్పింది. అలా అలా మాటల్లో, పాటల్లో తెలిపోయాం, నవ్వుల్లో మునిగిపోయాం కొంత సేపు. ఈలోగా ఒక బృందం గదిలోకి వచ్చారు. ఏదో ఫంక్షన్ కి హాజరయ్యే హడావుడిలో ఉన్నారు. నృత్య ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దానికి తగిన వేషధారణ, అలంకరించుకోవటంలో ఒకరికొకరు సహాయం చెసుకుంటున్నారు. నా మాట నాకే వినిపించట్లేదు. ఇలా ఒక పది నిమిషాలు హెలికాఫ్టర్ కింద నించుని మాట్లడినట్టు, వారు మా చుట్టూ తిగుతుంటే, మధ్యలో మేము అలానే మాటలు కొనసాగించాము. కాసేపటికి అంతా బయలుదేరారు. ఈలోగా క్లాస్ ముగించుకుని సుమ వచ్చింది. 'హే సుమ్మీ ఎవరొచ్చారో చెప్పుకో' అని రాధ అడగంగాననే, 'ఎవరూ?' అంటూ నా చెయ్యి కోసం తడిమింది. అందించిన నా చెయ్యి పట్టి నన్ను గుర్తుపట్టింది. 'విశూ..!' అని నా బుగ్గలు పట్టి నన్ను దగ్గరకు తీసుకుని, ఒక్క క్షణం తరువాత 'పో విశూ.. నీతో మాట్లాడను. అంతే మమ్మల్ని మర్చిపోయవు అంటూ నా మీద కాసేపు అలగటం, నేను బ్రతిమలాడటం...తను కరిగిపోవటం అయిపోయాయి. ఉరిమినంత సేపు లేదు సుమ కోపం. తను చాలా తెలివైన అమ్మాయి. ఎప్పుడూ ఉత్సాహంగా కూడా ఉంటుంది. ఇలోగా ఎవరో తలుపు కిర్ర్... మను శబ్దం చేసారు. అది విని వెనక్కి తిరిగి చూశాను.
ఒక చిన్న పాప. తెలుపు,గులాబి రంగులతో అందంగా ఉన్న గౌను వేసుకుని లోపలికి వచ్చింది.
5 ఏళ్ళు ఉంటాయి. ఎంత ముద్దు గా ఉందో! కానీ కళ్ళ నిండా నీళ్ళు ఉన్నాయి. చెంపల పై అవి తుడుచుకున్న మరకలు. చాలా బాధను పైకి రానీయకుండా అణచుకున్నట్టు స్పష్ఠంగా తెలుస్తోంది. నా చూపును మరల్చలేక తనని అలానే చూస్తున్నాను. అది గమనించిన సావిత్రి గారు తనని నాకు పరిచయం చేశారు. "తిన పేరు చందన. ఈ మధ్యే ఒక కారు ప్రమాదంలో అమ్మా, నాన్న చనిపోయారు. వీళ్ళ బంధువులు తినని ఇక్కడ చేర్పించారు." అని చెప్పారు. నాకు ఒక్క క్షణం దేవుడిపైన పీకదాక కోపం వచ్చింది. మళ్ళా సర్దుకుని, తను ఎందుకు ఏడుస్తుంది అని అడిగాను. పక్క నుంచి ఎవరో చెప్తున్నారు.. "ఎవరో ఒక అక్క హాలు లో చాక్లెట్లు పంచుతుంది... చందన వద్దు అంటే తిట్టింది. అయినా తీసుకోకపోతే కొట్టింది". అది విని నాకు ఏడుపొచ్చినంత పని అయ్యింది. మిగతా వాళ్ళు ఆ ఇంకో అక్క గురించి మాట్లాడుకుంటున్నారు. నేను తనని నా దగ్గరకు తీసుకుని, ఒళ్ళో కూర్చోపెట్టుకుని "నీ పేరేంటి?" అని వచ్చీ రాని కన్నడ లో అడిగాను. సమాధానం లేదు...! "నాతో మాట్లాడవా?" అన్నాను. తను దానికీ సమాధానం చెప్పలేదు... నన్ను వదిలించుకుని లేచి వెళ్ళిపోయింది. నా మనసు కూడా తన వెంటే..వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నానే కానీ ఆలోచన అంతా ఆ పాపే నిండిపోయింది. ఏమీ లేదు. కాస్త సేపు ఆ పాపతో గడపాలన్న ఆలోచన తప్ప. ఆ పాప ఒక్క సారి నవ్వితే చూడాలన్న కోరిక తప్ప.
తలుపు శబ్దం అయిన ప్రతి సారీ తను వచ్చిందేమో అని చూస్తున్నాను నాకు తెలియకుండానే... బయట చీకటి పడుతోంది. ఇంటికి వెళ్ళటానికి దాదాపు 2 గంటలు పడుతుంది. ఇంకో అరగంట ఉండి వెళ్దాం అని అనుకున్నాను. మళ్ళా తలుపు శబ్దం అయ్యింది. ఈ సారి తనే.. నా దగ్గరకు లాక్కున్నాను. తనని వెనకగా తీసుకుని, తన చేతులని నా మెడ చుట్టూ వేసుకున్నాను. తను గించుకుంది. ఈ సారి నే పట్టు వదల్లేదు. చిన్నగా ఊపటం మొదలు పెట్టాను. 2-3 సెకన్లు విడిపించుకునే ప్రయత్నం చేసింది. తరువాత తన భారాన్నంతా నా పై వదిలేసి. తను తేలికైపోయింది. నా చెంపకు తన చెంపను ఆనించి అలానే కాసేపు ఉండిపోయింది. ఒక్క 2 నిమిషాల తరువాత మెల్లగా కదిలి లేచింది. నేను ఆపలేదు. తను తలుపు దగ్గరికి వెళ్తోంది. నా కళ్ళు తనని అనుసరించాయి. మూసి ఉన్న తలుపు దగ్గరకు వెళ్ళి తెరిచి ఒక్క క్షణం ఆగింది. నేను అలానే చూస్తున్నాను. వెనక్కి తిరిగి చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. నాకు మాటల్లేవు ఆ భావాన్ని వ్యక్తపరచటానికి.
ఆ తరువాత రెండు సార్లు తనని కలిసాను. చాలా హుషారుగా ఆడుకోవటం చూసి సంతోషం గా అనిపించింది. అల్లరి చాలా ఎక్కువ. మొదటి సారి వెళ్ళినప్పుడు తనకి ఒక చిన్న సల్సా స్టెప్ లాంటిది నేర్పించాను. ఆ రోజు నేను అక్కడ ఉన్నంతసేపు తను, ఇంకో పాప నాతో డాన్స్ చేస్తూనే ఉన్నారు. రెండవ సారి వెళ్ళినప్పుడు నేను వరండాలో సుమ, రాధ ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తను మధ్య మధ్యలో రివ్వు మంటూ వచ్చి నా ప్రమేయం లేకుండానే నాకో ముద్దిచ్చి వెళ్ళిపోయింది. ఆ రోజు ఎన్ని సార్లో అలా.... నేను ప్రేమలో తడిచిపోయాను అని వేరే చెప్పాలా ? ఇంటికి బయలుదేరుతుంటే "అక్కా.. వెళ్ళద్దు" అని నా చున్నీ పట్టుకుని అల్లరిగానే అడిగింది. నాకూ వెళ్ళాలని లేదు. కాని తప్పదు కదా..! "మళ్ళీ వస్తాను కదా.." అని చెప్పి బయలుదేరాను. తనని చూడటం అదే ఆఖరు సారి.
మళ్ళీ వెళ్ళినప్పుడు తెలిసింది తనని వాళ్ళ చుట్టాలు తీసుకేళ్ళారని. సంతోషంగా అనిపించింది. కానీ సందేహాలు చాలానే వచ్చాయి. ఇలా నా బుర్ర తన పని తను చేస్తుండగా, "తను ఎక్కడ ఉన్నా తనని ప్రేమించే వాళ్ళు తన చుట్టూ ఎప్పుడూ ఉండాలి" అన్న ప్రార్థన నా మనసులో మెదిలింది. ఆ పాప తో నా అనుభవం ఒక అపురూప జ్ఞాపకం గా మిగిలిపోయింది.
12 comments:
Beautiful.
I too hope she is being looked after well.
చాలా బాగా వ్రాశారండీ!!
అనుభూతుల్ని వ్యక్త పరచడానికి స్పర్శని మించిన గొప్ప భాష మనకు లేదండి. ఇది చదువుతుంటే ఆ పాప తాలూకు ఆనందాలన్నీ మనస్సును తాకిన అనుభూతి. తనెక్కడ ఉన్నా హాయిగా ఉండాలని కోరుకుందాం.
Ituvanti kathalu (vethalu)...Aadi bhikshuvu vaadinedi koredi ani prathi saari nanni prasnichukuneela chesthundi...
hmmm...
-- Vamsi
ఆ పాపని ఒక్కసారి చూడాలని నాకు అనిపిస్తూ ఉందండీ.
కల్మషం లేని నవ్వులకోసం ఏం చేసినా తప్పులేదు.
మీరు పంచిన ప్రేమ తనలో కొత్త ఆశని పుట్టించి ఉండవచ్చు.. మీ జ్ఞాపకాన్ని తను ఎప్పటికీ మరచిపోకపోవచ్చు.. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని..
touching my heart in deep em ledu nenu koncham sentimental fellow lendi.Great feeling.
really touching.. kallalo neellu tirigayi..
ఎక్కడ ఉన్నా తను సంతోషం గా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండీ... తనకి ప్రెమ ను పంచడమే కాకుండా మీ అనుభవాన్ని బ్లాగ్ లో పంచుకుని ఇందరి ఆశీస్సులూ తనకి అందేలా చేసినందుకు మిమ్మల్నీ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా.
హ్మ్...touching
చాలా బాగా వ్రాశారండీ.. ఆ పాప ఎక్కడున్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ...
Post a Comment