Monday, October 6, 2008

కానుక

వైరాగ్యం కాదిది, విరక్తి...!!! లోపల ఒక అగ్ని పర్వతం బద్దలయినట్టు, ఉడుకుతూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న లావా బయటకి వేళ్ళే దారి లేక నన్ను లోలోపలే కాల్చేస్తున్నట్టూ ఉంది నాకు. ఏం చెయ్యాలో తోచక నడవటం ప్రారంభించాను.

నడుస్తున్నాను... ఎందుకో ఎక్కడికో తెలియదు. అలా నడుస్తూ ఉన్నాను. ఎంతసేపటి నుంచి నడుస్తున్నానో గుర్తులేదు. ఎంత దూరం వచ్చానో అన్న ఆలోచన లేదు. బయలుదేరినప్పుడు ఎదురుగా ఉన్న సూర్యుడు ఇప్పుడు నడి నెత్తి మీద ఉన్నాడు. అంటే చాలా దూరమే వచ్చానేమో...! తిరిగి వెనక్కి వెళ్ళలేను ఇప్పుడు. ఎలా వెళ్ళాలో తెలియదు కూడా... కాళ్ళు పీకేస్తున్నాయి. కానీ కుర్చోవాలని లేదు. గొంతు ఎండిపోతుంది. నీళ్ళ కోసం ఎక్కడా ఆగాలని లేదు. కళ్ళు తిరుగుతున్నాయి. స్పృహ తెలియకుండా పడిపోవాలే కానీ, ఆగే ఆలోచన లేదు. ఎందుకింత పట్టుదల..? ఏం సాధించటానికి ఇంత శ్రమ?? ఏమో..?!! "ఇది" అని స్పష్టంగా తెలియదు. కానీ ఎదో వెతుకుతున్నట్టు అనిపిస్తోంది. ఏం వెతుకుతున్నానో గుర్తులేదు! కలవరమో, కలతో.. లేక అయోమయమో.. మొత్తానికి ఒక చోట స్థిరంగా మాత్రం ఉండలేకుండా ఉన్నాను.

ఇంతసేపూ నేను గమనించ లేదా? లేక వీళ్ళంతా ఇప్పుడే వచ్చారా ?? ఎప్పట్నుంచి నా చుట్టూ ఇంత మంది ఉన్నారో..!! అంతా హడావుడిగా ఎవరి పనిలో వాళ్ళు తిరుగుతున్నారు. చుట్టూ ఉన్న మనుషులు అంతా తెర మీద కదులుతున్న పాత్రల్లా కనిపిస్తున్నారు. నేను వారికి కనిపించని ప్రేక్షకుడిలా... చూస్తున్నాను. చూస్తూ నడుస్తున్నాను... ఎంత పరిణితి చెందిన నటులో వీళ్ళు. వారి ముఖంలో ఎన్నో హావ భావాలు. వారి గొంతులో ఎన్నో స్థాయిలు. కొన్ని నాకు వినిపిస్తున్నాయి. కొన్ని నాకు వినపడననంత దూరంగా... నేను మాత్రం నడక సాగిస్తూనే ఉన్నాను. కొందరి కథ నా [??!] దారిలోనే సాగుతుండటంతో ఆ పాత్రల్ని ఎక్కువసేపు చూస్తున్నాను. నా ప్రయాణం మాత్రం నే అనుకున్నట్టు గానే [తరువాతి అడుగు ఎటు వెయ్యాలో ముందుగా నిర్ణయించుకోకుండా..], సాగుతోంది. సరిగ్గా అప్పుడే ఎవరో పిలిచారు నన్ను. ఉల్లిక్కిపడ్డాను!! ఇదేమిటి ఇక్కడ నే ఒక్కడినే ప్రేక్షకుడననుకున్నాను. కొత్తగా ఈ పిలుపు ఎవరిది ? పిలిచింది ప్రేక్షకుడా లేక పాత్రధారా? పాత్రధారి అయితే నేను కూడా...??!!! ఏమని పిలిచారు?? నా పేరు వాళ్ళకెలా తెలుసు ?? అసలు పేరుతోనే పిలిచారా?? లేకపోతే నేనెందుకు పలికాను, అటు వైపు ఎందుకు తిరిగాను ? అసలు పిలిచారా లేక ఇది నా అపోహా? ఇలా సాగుతున్న ప్రశ్నల పరంపర లోనుంచి తేరుకుని చూసే సరికి, అప్పటికే అడుగులు అతడి వైపు పడుతున్నాయి. ఇంత దాకా ఎలాంటి గమ్యం లేకుండా సాగిన ప్రయాణంలో ఉన్నట్టుండి ఒక ఒడ్డు కనిపించింది నాకు. ఆ పిలిచినవారి దగ్గరకెళ్ళి నా సందేహాలన్నీ తీర్చుకోవాలి. ఏదైతే నేమి, ఇది కూడా నా నిర్ణయం కాదు. నే నడుస్తున్నాను. నే నిర్ణయించని నా దారిలో....

అతడు కూడా నాలాగే నడుస్తూ వస్తున్నట్టున్నాడు. కాస్త గంభీరంగా ఉన్నాడు కూడా...! అది ప్రయాణం వల్ల కలిగిన అలసట వల్ల కాబోలు. చూపు చాలా తీక్ష్ణంగా ఉంది. తన గమ్యం తనకి కనిపిస్తుందనుకుంటా. దృష్టంతా దారి పైనే... అతడిలో స్పష్టత చూసి అలా అనిపించింది నాకు. ఇలా అనుకుంటూనే అతడిని చేరుకున్నాను. నే వెళ్ళగానే, అతడు కాస్త చతికిలబడి, కింద కూర్చున్నాడు. తన పక్కనున్న నేల పై అరచేతితో తట్టాడు, నన్ను కూర్చోమన్నట్టుగా... నేను కూర్చున్నాను. మంచినీళ్ళు తీసీ కావాలా అన్నట్టుగా సైగ చేశాడు. ఊ.. అన్నట్టుగా తలూపాను. ఎంత దాహంతో ఉన్నానో.. ఆ కాసిన్ని నీళ్ళు తాగగానే ప్రాణం లేచొచ్చింది. రాగానే, కృతజ్ఞతగా అతడికి ఓ చిరునవ్వు సమర్పించుకుంది, ప్రాణం. కాస్త సేపు ఇద్దరం ప్రయాణంలో ఎదురైన సంఘటనలు, ఎదుర్కొన్న సమస్యలు, వాటిని ఛేదించిన సందర్భాలు, అతడి దారిలో కలిసిన ఇతర బాటసారులు, వారితో కలిసి చేసిన ప్రయాణం, ఇలా ఎన్నో విశేషాలు పంచుకున్నాం. చూడ్డానికి ఎంతో సీదా, సాదా గా ఉన్నాడు. కానీ ఎన్నో విషయాలు చెప్తున్నాడు. చాలా లీనమై వింటున్నాను అవన్నీ... అంతే లీనమై చెప్తున్నాను కూడా..! ఎందుకో కాస్త సరదాగా అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది. నేను నా నడక ఆపి చాలా సేపయ్యింది అని.., తీర్చుకోవాలనుకున్న సందేహాలు ఒక్కటీ అడగనేలేదనీ..!! పెద్ద విషయంలా అనిపించలేదు. కాసేపు విశ్రాంతి తీసుకుని లేచి బయలుదేరాం ఇద్దరం. దారంతా మాటలు, నవ్వులు.., అప్పుడప్పుడు దాగుడుమూతలు.., మధ్య మధ్యలో వానలో పాటలు, ఆటలు...

ఇంకొంత దూరం ఈ దారి. అటు తరువాత అది వేరు వేరు దిక్కులకు విడిపోయింది. "నువ్వు ఎటు వెళ్తున్నావూ?" అని అతడు నన్నడిగాడు. తెలియదన్నాను. ఆ తరువాత కాసేపు మౌనంగా సాగింది నడక. ఇంతలోనే, ఆ కూడలికి చేరుకున్నాం. అతడు తన సంచిలోంచి లాకెట్ ఉన్న గొలుసొకటి నా చేతికిచ్చి తాను నిర్దేశించుకున్న దారిలో కదిలిపోయాడు. నేను మాత్రం అక్కడే కాసేపు ఆగిపోయాను ఆ గొలుసును చూస్తూ...!! అది గవ్వల గొలుసు. అతడు సముద్ర తీరాన చాలా సేపు ప్రయాణించాడని చెప్పాడు ఇందాక మాటల్లో. అక్కడ ఏరిన గవ్వల్లా ఉన్నాయి. అంత అపురూపమైన వస్తువును నాకు ఇచ్చాడా...?! నాకేమీ అర్థం కాలేదు. ఇప్పటి వరకు జరిగిన ఏ సంఘటనకీ, "ఎందుకు ఇలా.. ?" అన్న ప్రశ్న వేసుకోలేదు. మరి, ఇదేంటి ఇప్పుడు..? అతడితో గడిపిన ఆ కాస్త సమయంలో ఎదో అర్థాన్ని వెతుక్కుంటున్నాను? అక్కడే జీవించాలనా..? చాలా కొత్తగా ఉంది నాకు. ఉన్నట్టుండి ఏదో నొప్పి, లోలోపల జలపాతపు హోరులా, సాగర ఘోషలా, సుడిగాలిలా, ఎక్కడో తెలియనంత లోతుగా, నా కడుపులో ఎవరో మెలిపెడుతున్నట్టుగా..! మనసును ఇంట్లో కొక్కేనికి తగిలించి వచ్చినట్టుగా...... ఇప్పుడు నేను "మనస"న్నానా..???!!!

8 comments:

మురారి said...

చాలా బాగుంది. చాలా నిజాయితీతో చెప్పినట్లు అనిపించింది. ప్రతీ ఒక్కరికీ ఇలా ఎప్పుడో ఒకసారి అనిపిస్తుందేమో..

కొత్త పాళీ said...

మీరు మీరేనా? లేక మీకు కలంకలల ఫణీంద్ర పూనేడా? :)
అద్భుతంగా రాశారు!
అవునుగానీ వైరాగ్యానికీ విరక్తికీ తేడా ఏంటి? ఎకసెక్కంగా కాదు, నిజంగానే అడుగుతున్నా

Purnima said...

ఇది చదివి నాకేమనిపించిందో చెప్పదలచుకోలేదు. Lemme feel it! :-)

సూర్యుడు said...

వైరాగ్యమనేది ఒక ఆధ్యాత్మిక భావన, విరక్తంటే disgusting :)

మేధ said...

పూర్ణిమ గారి మాటే నా మాటానూ...

Srividya said...

చాలా చాలా బాగుంది.

భావకుడన్ said...

జీవిత గమనాన్ని అద్భుతంగా చిత్రీకరించారు--ఇంతకంటే చెప్పలేను.


వైరాగ్యము-----"రాగములు లేని స్థితి"---రాగము=ప్లెషర్ అఫ్ సెన్సెస్ (బ్రౌణ్యము)
విరక్తి--------ఒక రకమైన "రాగ భరిత" స్థితి---ప్రేమ, అనుభందము మొ స్థితులకు వ్యతిరేక స్థితి-ఇక్కడ "రాగము" ఉంది.


నా ప్రజ్ఞ కాదు బ్రౌణ్యం చెప్పింది :-)

మోహన said...

@మురారి
అనిపించింది చెప్పానండి. అంతే.. Thank you.

@కొత్త పాళీ
అవునండీ, నెను నేనే :) మీరేనా? నన్ను ఫణింద్ర గారితో పోల్చారా..??!! మీకు నచ్చినందుకు చాలా సంతోషం.
>>వైరాగ్యానికీ విరక్తికీ తేడా ఏంటి?
ఎవరు ఎలా చెప్పారో నాకు తెలియదు కానీ, నాకు తెలిసినంత వరకూ వైరాగ్యం అంటే.. ప్రాపంచిక విషయాలను సహజంగా వదిలేయగలగటం. విరక్తి అంటే.. అవి నచ్చక, వాటిని భరించలేక వదిలేయటం. భావకుడన్ గారు ఇంకొంచం బాగా చెప్పారు.

@Purnima
Feeling my post..? :) ;)

@సూర్యుడు
Thank you for reading and commenting :).

@మేధ
ఐతే మీరు కూడా.. Feeling my post ?? :)

@శ్రీవిద్య
చాలా చాలా థాంకులు :)

@భావకుడన్
థాంక్సండి. :)