Tuesday, October 21, 2008

ఏమో...!!!

మనసు చెదిరిపోయి, ముఖం మోకాళ్ళ పై పెట్టుకుని గుండెలు అవిసేలా ఏడ్చిన రోజు,
ఆ పసి దాని చేయి నా తల నిమరకుంటే నేను ఏం చేసేదాన్నో..!

కలత చెంది, కన్నీరు కూడా కరువై ఒంటరిగా మిగిలిననాడు,
ఆ తొలకరి వాన చినుకు పలకరించకుంటే, నేను ఏ ఎడారి పంచన చేరేదాన్నో..!

చిమ్మ చీకట్లు ముసిరి, దిక్కు తోచక, భయంతో దిక్కులు పెక్కటిల్లేలా అరిచినపుడు,
ఆనాటి ఏకాదశి వెన్నెల కిరణాలు ప్రశరించకపొతే, నేను ఏ అగాధంలో పడేదాన్నో..!

అన్నీ ఉన్నా, అనామకురాలినై జనారణ్యంలో బిక్కు బిక్కు మంటూ లోలోపల క్షీణిస్తున్న నాడు,
ఆ చిట్టి హృదయం నా చేయి పట్టి తనతో లాక్కెళ్ళకపోతే, నేను ఏ కౄర మృగానికి చిక్కేదాన్నో..!

చిరునవ్వు జాడ మరచి, ఎటెళ్ళాలో తెలియక అయోమయంలో దారి తప్పిన నాడు,
ఆ చిన్ని గడ్డి పూవు ఆహ్వానించి చిరునవ్వులు వడ్డించకపోతే, నేను ఏ వీధిల్లో పడి తిరిగేదాన్నో..!

పోగొట్టుకునేందుకు నా వద్ద ఇక ఎమీ మిగలలేదని, అసహనం గా మారిననాడు,
పంచేందుకు, నా దగ్గర అంతు లేని ప్రేమ ఉందని ఆ నేస్తం గుర్తుచెయ్యకపోతే, నేను ఏమై మిగిలేదాన్నో..!

ఏమో...!!!

7 comments:

చైతన్య.ఎస్ said...

బాగుంది, చివరి రెండు లైన్లు చాలా బాగున్నాయి

Purnima said...

I don't see anything more spontaneous and much better! Good work, gal!

KumarN said...

మోహన గారూ, మీర్రాసేవి చాలా రోజుల నుంచి చదువుతున్నా నేను. కొన్ని చాలా అద్భుతం, మరికొన్ని అద్భుతం. ఇది ఆ స్థాయిలో లేదనిపించింది నాకు.

'స్ప్లిట్టింగ్ ద హేయిర్స్" చేయడం లేదు నేనిక్కడ..మీరు రాసిన దాన్ని నిజ జీవితంలో అనుభవించిన వ్యక్తిగా చెపుతున్నా.. గాఢాంధకారంలో చిక్కుకుని, అగాధం అంచుల్లోంచి నిస్సహాయంగా దిక్కులు పిక్కటిల్లేలా ఆక్రందనలు పెట్టినప్పుడు... 2,3,4,5 చరణాల్లో చూపించిన తొలకరి వాన చినుకూ, వెన్నెల కిరణాలూ, గడ్డిపూవులూ అవ్వేవి కూడా హెల్ప్ చేయలేవు మోహన గారూ...ఒకవేళ వాటిని మనసంటూ గుర్తించందంటేనే, కన్నీరు కూడా కరవై ఒంటరైన స్థిథి లో మనసు లేదని అర్ధం.

ఏమైనా సహాయం చేయగలదు అంటే, ఓ నేస్తం హృదయం లోంచి చాచిన హస్తం మాత్రమే. అందుకే నాకు చివరివి నచ్చాయి. "పోగొట్టుకొనేందుకు నా వద్ద ఏమీ మిగలలేదని..."

థాంక్యూ మోహనా.

మోహన said...

@చైతన్య, పూర్ణిమ
Thank you.

@Kumar
గారూ..
ముందుగా, మీ అభిప్రాయం ఇక్కడ పంచుకున్నందుకు ధన్యవాదాలు.
'నిజ జీవిత అనుభవం' అని చదివి, ఆ విషయమై ఏమీ ప్రస్తావించకూడదు అనుకున్నాను. కానీ, నా మాటల్లో వాదించాలన్న ఉద్దేశం లేదని, కేవలం నా అభిప్రాయం తెలపాలన్న ఆలోచనేనని గుర్తించగలరని భావించి ఈ వ్యాఖ్య రాస్తున్నాను.

>>కన్నీరు కూడా కరువైన స్థితిలో మనసు లేదని అర్ధం.
మనసు మోడువారింది అని నేను అనుకుంటున్నాను.

>>ఏమైనా సహాయం చేయగలదు అంటే, ఓ నేస్తం హృదయం లోంచి చాచిన హస్తం మాత్రమే.

నిజమే..! అయితే ఆ నేస్తం ఎవరు ? మనిషి రూపం లోనే ఉంటారా?
నేను ప్రస్తావించిన పసి దానికి, ఆ చిట్టి హృదయానికీ వారి స్పర్శ/చేష్ఠ ద్వారా నాలో కలిగిన స్పందన ఏమిటీ అని తెలియదు. కనీసం ఊహించలేరు వాళ్ళు. స్నేహ హస్తం ఏ రూపంలో ఉన్నా, దాన్ని అందుకుంటానా లేదా అనేది [కేవలం] నా పై, ఆధార పడి ఉంది. 'అందుకున్నాను' అంటే మోడువారిన నా మనసు ఇంకా ఎక్కడో ప్రేమకు స్పందిస్తోందని నేను భావిస్తున్నాను.

చిగురించిన ఆ ప్రేమని, నేస్తం గుర్తుచేస్తే కానీ గుర్తించలేదు. అదే ఆఖరి లైన్లలో చెప్పాలనుకున్నాను. మీకు నచ్చినందుకు సంతోషం.

ప్రతాప్ said...

నిజమే,
ప్రతిదానికి మనస్సుతో స్పందిస్తే కలిగే భావసంచలనాన్ని కలంతో ఒడిసి పట్టాలన్న మీ ప్రయత్నం అభినందనీయం.
ఏడ్చేందుకు ఓపిక, కారేందుకు కన్నీరు లేని జీవితం నిజంగా ఆగిపోవలసిందేనా?
బ్రతుకన్నది మరుపురాని జ్ఞాపకం కావాలి కానీ, మర్చిపోయే కల కాకూడదు, అన్న ప్రయత్నం మీ కవితలో కనిపిస్తోంది.
అందుకోండి అభినందనలు.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బావుంది మోహన గారు...

మోహన said...

@ ప్రతాప్, @P L Sekhar
Thank you.