పొద్దున్నే ఆఫీసు కి బయలుదేరే హడావిడిలో ఉన్నాను. ఉన్నాను అన్నది పేరుకేనేమో! ఆలోచనంతా ఎక్కడో...
అద్దం ముందు నిల్చుని తిలకం దిద్దుకుంటున్నాను. అద్దం లో నన్ను చూసి 'ఏంటి ఈ రోజు స్పెషల్ ??' అని కొంటెగా నవ్వుతూ అడుగుతున్నాయి నా కళ్ళు... ఏమీ ఎరుగనట్టు..!!
అసలే ధ్యాస ఇక్కడ లేదంటే, అదే అలుసుగా ..'విషయం ఏంటో చెప్పు..' అని కురులు అందకుండా ఆటపట్టిస్తున్నాయి...
బుజ్జీ, ఈ రోజు జడ బాగా వేసుకున్నావే. గౌరీ దేవికి పెట్టిన విరజాజి మాల తెచ్చుకో పెడతాను అంది అమ్మ. ఆ దండ నా జడలో ఇలా ముడిచి అమ్మ అలా తిరిగిందో లేదో, 'ఏమిటి సంగతీ..' అంటూ దొరికిందే సందుగా బుగ్గ గిల్లేసాయి అమ్మలక్క జాజులు....
ఎలాగయితే తప్పించుకుని బయటపడ్డాను అనుకుంటూ, అడుగు బయటపెట్టగానే, చటుక్కున అల్లేసింది 'విషయం చెప్పకుండా..ఎక్కడికి పోతావు చిన్నదానా.. నా చేతుల్లో చిక్కుకున్న పిల్లదానా..' అంటూ సమీర....
విడిపించుకునే ప్రయత్నంలో తూలి మీద పడగానే, 'హమ్మ! దొరికింది దొంగ.. నా చేతబడకుండా జారుకుందాం అనుకున్నావా నీ పని చెప్తా ఉండు...' అని తను పోగు చేసిన పూసలన్నీ నా పై గుప్పించేసి, 'అయినా అంత ఖంగారు దేనికో..' అని బుగ్గ నొక్కుకుంది వర్ధనం...
చక చకా అడుగులేసుకుంటూ ముందుకు నడిచేసాను. బస్ లో కిటికీ లోంచి చూస్తూ, 'అబ్బా..ఉదయాన్నే వాతావరణం ఎంత బాగుందో' అనుకుంటూ పెదాలపై చిన్న నవ్వు మొలకెత్తగానే పక్కనే కూర్చున్న ఆంటీ విసిరేస్తోంది అదో రకమైన చూపులు...
నా మానాన నేను, 'మనసే కోవెలగా.. మమతలు మల్లెలుగా.. నిన్నే కొలిచెదరా.. నన్నెన్నడు విడువకురా... కృష్ణా...' అని పాట హం చేస్తుంటే.. 'whatsup dear? who is Krishna?? ' అని కళ్ళెగరేసేసింది పక్క స్టాపులో బస్ ఎక్కిన శ్రావణి...
ఇది చాలదన్నట్టు ఆఫీసులో అడుగుపెట్టగానే 'ఏమిటి, ఈ రోజు చాలా brightగా కనిపిస్తున్నావ్? ఓహ్..! జడలో పూలూ కూడా.. హ్మ్.. హ్మ్.. క్యా బాత్ హై మేడం??' అంటు రిసెప్టనిష్ట్ సీమ....
ఛ..!! ఎక్కడ చూసినా ఇదే గోల... నన్ను అందరూ ఆటపట్టించేవాళ్ళే.... తెలియకపోతే అనుకోవచ్చు. అంతా తెలిసీ ఇలా చేస్తే..??అందరినీ నీ వైపుకే లాగేసుకున్నావు! ఇప్పుడు నా వైపు నేను తప్ప ఇంకెవరూ లేరు :((
వాళ్ళ సంగతి సరే.. నువ్వు కూడానా..?! :( నా గురించి నీకు తెలియనిదా? అలా కనిపించకుండా దోబూచులాడతావేం? ఊరంతా పలకరిస్తావ్, వెళ్ళిన ప్రతి ఇంట్లో నీ అడుగుల ముద్రలు వేస్తావ్.. మరి నా కోవెలలోకి రావేం ? కనీసం తొంగి చూడవేం?? అంత కాని దాననైపోయానా?? నువ్వూ నన్ను చూసి నవ్వుతున్నావా....?? ఏమీ ఎరుగనట్టు..?!
అంతేలే నీకు అలానే ఉంటుంది. బాగా లోకువైపోయాను నేను నీకు. పో..! నేను అలిగాను. అంటే, నీతో మాట్లాడను. ఏమీ మాట్లాడను. అస్సలు మాట్లాడను. ఏదీ చెప్పను. చెప్పనంటే చెప్పను. అంతే..! నేను కూడా నీలానే ఉంటాను... ఏమీ ఎరుగనట్టు!!
3 comments:
ఏంటి deadlock ఆ? నువ్వూ అలిగి, ఆ పార్టీ అలిగితే ఎట్టా కుదురుతుందమ్మాయ్!
ఇక write up గురించి అయితే ఫ్లో సూపర్ గా నచ్చింది.
అమ్మలక్క జాజులు.... నవ్వు తెప్పించింది!
Beautiful!!
deadlock కాదు పూర్ణిమా.. నా ఊహలతో నన్ను గడపనివ్వట్లేదు అని కాస్త ఉక్రోషం, ఉడుకుమోత్తనం అంతే. అయినా నిజంగా అలిగే వాళ్ళు చెప్పి అలుగుతారా ఏంటి? ;)
Thank you.
@మురారి
Thank you
Post a Comment