బయట నల్లటి దట్టమయిన మబ్బులతో నిండి ఉంది ఆకాశం..
తన లాగే నా మనసంతా సందేహాల మబ్బులు ఆక్రమించి అల్లకల్లోలం గా ఉంది.
మళ్ళీ అదే ప్రశ్న... ప్రేమా? స్వభావమా..??
ఈ రెంటిలో ఏది ముఖ్యం ?? ప్రేమ స్వభావాన్ని త్యాగంగా కోరగలదా ?
లేదు.! అలా ఎప్పటికి జరగదు. స్వభావానికి స్పందించినపుడు, పరవశం సహజంగా పుడుతుంది.... అదే ప్రకృతి. ఆ పరవశంలో తడిసి ముద్దవటమే ప్రేమ.
భౌతికమైన చిరుగాలి స్పర్శ కు పరవశించిన మేఘం తనను తాను కోల్పోయి,
కరిగి, కురిసే ప్రతి చినుకులో ప్రేమను నింపగలుగుతుంది... (తన ఉనికి ఉన్నంత వరకు)
కాబట్టేనేమో..., అన్ని పసి చిరునవ్వులకు కారణం కాగలుగుతోంది...!
అన్ని వేల హృదయాలను తాకగలుగుతోంది...!
ఆ చినుకులను తాకి పరవశించిన కిరణాలు,
తమకి తాము కొత్త రంగులను అద్దుకుని,
హరివిల్లుగా విరియటం... ఒక అద్బుతం !
సమస్త లోకాలు మూకుమ్మడిగా వెచి చూసే క్షణం అది.
పరవశం లేని చోట ఇది సాధ్యమా ? సహజత్వం లేని చోట పరవశం కలుగునా ?? స్వభావం లేని చోట సహజత్వం కనిపించునా ???
ప్రేమకి హద్దులు లేవు. ప్రేమ నింపలేని కార్యం అంటూ లేదు. అయితే అన్ని పనులలో ప్రేమ ఒకటే నిండి లేదు. సహాయం అనుకుని చేసే దానిలో ప్రేమ (ఉన్నప్పటికీ) కంటే మానవత్వం, సంతృప్తి పాళ్ళే ఎక్కువ. అది ఒక బాధ్యత. సామాజిక బాధ్యత. నదులు పొంగుతున్నాయని మేఘం వర్షించటం మానుకుంటే అది బాధ్యత అవుతుంది. నేల ఎండుతోందని తను కరిగితే అది కరుణ అయి ఉండాలి.ప్రకృతికి బాద్యతలు, అమితం, అల్పం అన్న సరిహద్దులు లేవు.
Love is Freedom.
Beyond and much more,
Than Give and/Or Take.
Love is rising together.
కాబట్టి... ప్రకృతికి ప్రేమ పుడితే, తను మరిన్ని అందాలు జతపరచుకుంటుంది.
బయట వర్షం వెలిసింది. పరిశరాలు నా మనసుకి అద్దం పడుతున్నాయి.
తూర్పున విరిసిన లేలేత కిరణలు, నన్నంటి పెట్టుకున్న చిరునవ్వులా మెరుస్తున్నాయి.
రాలుతున్న పూలు, నా మనసులో కురుస్తున్న ఆనంద వర్షం లా అనిపిస్తుంది.
ఆ జడి వానలో తడుస్తూన్న నన్ను, నేను మరింతగా హత్తుకున్నాను.
4 comments:
అద్భుతమైన వర్ణన
Thank you.
some really beautiful expressions here.
"సమస్త లోకాలు మూకుమ్మడిగా వెచి చూసే క్షణం అది."
hmm .. సమస్త కి బదులు ముల్లోకాలు అంటే ఎఫెక్ట్ ఇంకా బావుంటుంది.
"పరిశరాలు నా మనసుకి అద్దం పడుతున్నాయి."
beautiful
మీ సూచనకు,మెప్పుకు థాంక్స్ కొత్తపాళీ గారూ..
Post a Comment