Friday, September 19, 2008

అహం - తాపత్రయం

ఎంటీ అసలూ..నువ్వు నా మాట వినవా..? భయం ఎలాగూ లేదు. కనీసం నేనంటే..లెక్క కూడా లేకుండా పోయింది. ఏదన్నా అంటే.. అన్నిటికీ ముందు ఆ ఏడుపొకటి.. నిన్ను చూసుకుని, ఆ చేతులకు, కాళ్ళకు కూడా సొంత అభిప్రాయాలు.. సొంత పెత్తనాలూ...! ఒకళ్ళు చక చకా సెల్ ఫోన్ అందిస్తే... ఇంకొకరు బయటికి పరుగు. మీకందరికీ నేను బా....గా..... లోకువైపోయాను అసలు. అసలు మిమ్మల్నంతా చెడగొట్టింది ఆ చెవులు కదూ.. ముందొచ్చినదాన్ని..! అని ఏంత పొగరు అసలు!! ఆ గొంతు వినకపోతే, ఏంటో అంత నష్టం...!! పోనీ జరిగిందేదో జరిగిపోయింది.. అని నోరు ఏమైనా.. కొంచమైనా... తిన్నంగా ఉంటుందా...???! తోచిందల్లా మాట్లాడేస్తే...ఎవరిది బాధ్యత?? నన్నెవరూ అర్థం చేసుకోరా అసలు ? మీరు చేసే చేష్టలకి మిమ్మల్ని ఎవరూ అనరు.. అన్నీ పడేది, భరించేది, బాధ పడేదీ నేను!! అంతా నన్ను అన్నేసి మాటలంటుంటే... దిష్టి బొమ్మల్లా గుడ్లప్పగించుకుని చూస్తారే తప్ప, "తప్పు నాది... ఆ క్షణంలో నేను తన మాట వినలేదు. కాబట్టి ఎదైనా తప్పు జరిగితే అది నాది." అని మీలో ఒక్కరంటే..ఒక్కరైనా ముందుకు వచ్చి చెప్తారా... ?? లేదు..! రారు... రాలేరు! నాకు తెలుసు. ఎన్ని సార్లు జరగలేదు నాకు ఇలాంటి సత్కారాలు..? సమయానికి నా స్నేహితురాలు వెన్నెల వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ... లేకపోతే ఈ పాటికి నువ్వు ఏ స్థితిలో ఉండేదానివో...ఆలోచించావా అసలు?!! మీకర్థం కావట్లేదు.. నన్ను మీలో చేరనిస్తే కదా.. అసలు నేనేదైనా చెయ్యగలిగేది?? అది వదిలేసి, నన్నో శతృవులా, అంటరానిదానిలా... చూస్తారు. నా ముసుగులో ఎవరో ఎక్కడో విచక్షణ లేకుండా ఏదో చేసారని, మీరు నన్ను పట్టించుకోకపోతే.... నష్టం ఎవరికీ? అని ఒక సారి బుద్ధిని అడిగి తెలుసుకోండి. ఇంతకంటే.. నేనేమీ చెప్పను..? ఎన్ని సార్లని చెప్పను ?? చెప్పి చెప్పి నే అలిసిపోయి, అరిగిపోయి, కరిగిపోవాలి అంతే... ఇప్పుడు కూడా ఒక్కళ్ళు కూడా నోరు విప్పట్లేదు..! అంతే.. మీలో మార్పు ఈ జన్మకి రాదంతే... కొన్ని జీవితాలంతే...!! మీ ఖర్మ.. అనుభవించండి!

7 comments:

వింజమూరి విజయకుమార్ said...

థీమ్ వెరైటీగా వుంది. కాళ్ళూ, చేతులూ, చెవులూ, ముక్కూ వాటి కర్మ మనమనుభవిస్తూ, మీ ఖర్మ మీరే అనుభవించండి అంటూ వాటిని విసుక్కోడం తమాషాగా వుంది. ధన్యవాదాలు.

ప్రతాప్ said...

అహం బ్రహ్మాస్మి (కరెక్టు గానే చెప్పానా?)

భావకుడన్ said...

చాలా బావుందండి .......పాపం అవన్నీ మెదడుకు "లో"బడి ఆ పనులన్నీ చేస్తాయి. దాన్ని, ఆ సూత్ర దారిని మరిచి పోయి , పాపం తోలుబొమ్మలను ఆడిపోసుకుంటే ఏం లాభం? తప్పోకరిది శిక్షోకరికీనా ?

చాలా బావుందండి మీ ఊహ.

మోహన said...

@వింజమూరి విజయకుమార్
Thank you.

@ప్రతాప్
కరక్టే అనుకుంటా.. అంటే.. "నేను దేవుడిని" అని అర్థం అనుకుంటా.. కానీ, ఇక్కడా నేను 'అహం' అని వాడింది ఇగో అన్న అర్థంలో..

@భావకుడన్
Thank you.

సుజ్జి said...

manchi aalochana.. baaga raasaru..

కొత్త పాళీ said...

"దిష్టి బొమ్మల్లా గుడ్లప్పగించుకుని చూస్తారే తప్ప.."
హ హ హ. అహం అంతర్ఘోష బాగుంది.
మధ్యలో వెన్నెల రాడం ఏంటో అర్ధం కాలేదు?

మోహన said...

@Sujji
Thank you.

@కొత్త పాళీ గారూ
Thank you.
"ఒకళ్ళు చక చకా సెల్ ఫోన్ అందిస్తే... ఇంకొకరు బయటికి పరుగు."
"ఆ గొంతు వినకపోతే, ఏంటో అంత నష్టం...!!"

ఇలా పరిగెడుతున్న మనసును ఆపే ప్రయత్నంలో విఫలమయ్యి, చివరికి వెన్నెలని చూసి కాస్త కుదుటపడిన మనసును, తన మాటకి సై అంటున్న మిగతావారిని అహం నిలదీస్తున్న సందర్భం.
అసందర్భంగా ఉంటే కొంచం క్షమించగలరు. :)