Tuesday, September 30, 2008

..సంఘర్షణ..

తెలి సంధ్యా సమయాన, ఆతడిని చూడాలని రెక్కలు కట్టుకు వచ్చి వాలాను. రవి, ఆతడి చుట్టూ చేరిన ప్రకృతి, ఆహా...! ఎంత మనోహరమైన దృశ్యం అది..! అతడిని, ఆ దృశ్యాన్నీ చూస్తూ, మైమరచి అలానే నిలుచుండిపోయాను. ఎవరు చెప్పారో మరి తనకి, ఉన్నట్టుండి తన చూపు నా పై..! అంత దాకా అతడినే తదేకం గా చూసేస్తున్నదానిని, అతడి చూపు నాపై పడేసరికి ఒక్కసారిగా నాలో ఎందుకో ఇంత అదిరిపాటు?!! కాస్త తమాయించుకుని, అతడిని అసలు చూడనట్టే తల దించాను, కనురెప్పలపై అతడి చూపు వేడిని ఇంకా అస్వాదిస్తూనే..! ఇంతలో, ఆ పక్క విచ్చుకుంటున్న ఎర్ర మందారాలతో పోటీపడుతున్న పెదవులను అదిమి పట్టలేక, మరి ఇక చేసేది లేక, దాచేందుకు ముఖం పక్కగా తిప్పాను. ఎంత తిప్పుకున్నా పువ్వు చుట్టూరా ప్రదక్షిణలు చేస్తూ ఆమెని అల్లరిపెడుతున్న భ్రమరంలాగ, అతడి చూపుల కిరణాలు ఇప్పుడు నా చెంపని గిల్లుతున్నాయి. ఆ గిల్లుడు చేతనో లేక సిగ్గు వలనో మరి, చెక్కిళ్ళు ఎరుపైతే ఎక్కాయి. నా కను కొనల్లో అతడి మసక రూపం. తలెత్తి చూడాలనే ఆతృత గుండె వేగాన్ని పెంచేస్తోంది. కానీ చూడలేను :(. కదిలిన చెట్ల ఆకుల సందుల్లోంచి జారిన మంచు బిందువుల్లా చల్లగా తాకుతున్న అతడి చిరునవ్వులు..... గోళ్ళన్నీ కొరికేస్తూ నేను...
ఏమిటో ఈ సంఘర్షణ !!

10 comments:

ప్రతాప్ said...

రవి అంటే సూర్యుడనా మీ ఉద్దేశ్యం?
పెదవులు స్థానభ్రంశం చెందటం ఏమిటి?
గిల్లుడు అన్న పదప్రయోగం గురించి ఇంకోసారి ఆలోచించగలరని మనవి.

కదిలిన చెట్ల ఆకుల సందుల్లోంచి జారిన మంచు బిందువుల్లా చల్లగా తాకుతున్న అతడి చిరునవ్వులు..... ఈ వాక్యం చాలా బావుంది.

మోహన said...

@ప్రతాప్
>>రవి అంటే సూర్యుడనా మీ ఉద్దేశ్యం?
అవును.
కొద్దిగా మార్చాను. చుసి మీ అభిప్రాయం తెలపండి.
>>గిల్లుడు అన్న పదప్రయోగం గురించి ఇంకోసారి ఆలోచించగలరని మనవి.
నాకు వేరే ఏమి తట్టట్లేదు. ఆలోచించాలండి..

Thank you.

కొత్త పాళీ said...

కను సన్న = కను సైగ = communicating or sending a signal through eyes
మీ ఉద్దేశం ఇక్కడ కడకన్ను లేదా, కనుకొలుకులు అయి ఉంటుంది. క్రీగన్ను లేదా ఓరగన్ను అని కూడ అనొచ్చు.
ఇలాంటి అంశాల మీద మీరు ఇదివరకు రాసినంత బలంగా లేదిది. బహుశా మీలో రేగిన "..సంఘర్షణ .." వల్లనేమో? :)

మోహన said...

@కొత్త పాళీ
'కనుసన్నల్లో' అన్నది సరిదిద్దాను.
Thank you sir.

>>ఇలాంటి అంశాల మీద మీరు ఇదివరకు రాసినంత బలంగా లేదిది. బహుశా మీలో రేగిన "..సంఘర్షణ .." వల్లనేమో? :)

:) ఏమోనండి.. అయిఉండచ్చు!

ప్రతాప్ said...

ఇప్పుడు బావుంది,
"అతడి చూపుల కిరణాలు ఇప్పుడు నా చెంపని గిల్లుతున్నాయి". బదులుగా,
"అతడి చూపుల కిరణాలు ఇప్పుడు నా చెంపని నులివెచ్చగా స్పృశిస్తున్నాయి".
"ఆ గిల్లుడు చేతనో లేక సిగ్గు వలనో మరి, చెక్కిళ్ళు ఎరుపైతే ఎక్కాయి". బదులుగా,
"ఆ మయూఖాల తీవ్రత చేతనో లేక సిగ్గు వలనో మరి, చెక్కిళ్ళు ఎరుపైతే ఎక్కాయి"
ఎలా వుంటుందో ఆలోచించండి.

మోహన said...

బావుంది ప్రతాప్..
కానీ క్షమించాలి, "మయూఖం" అంటే ఎమిటి?

ప్రతాప్ said...

మయూఖము అంటే కిరణము.

మోహన said...

@Pratap
Thank you.

Suneel Madhekar said...

Finally Telugu font is working in Firefox on my Ubuntu Linux box :-) Interesting blog... I'm poor at appreciating art, and most forms of literature, but this blog entry sure is interesting, to say the least... Your writing is expressive... Still not able to type in Telugu, so here we are :-)

మోహన said...

Hi Suneel.. welcome to 'Visala Prapancham' :) Thank you very much. check out this site. http://lekhini.org Hope it helps you to type in Telugu. Enjoy :)