Tuesday, September 9, 2008

కురిసేను విరిజల్లులే...


అతడిని ఇంతకు ముందు ఎన్నో సార్లు చూసాను. కానీ ఈ రోజు అతడిలో ఎదో తెలియని శోభ నన్ను ఆకర్షిస్తోంది. కళ్ళార్పకుండా తదేకంగా చూస్తున్నాను. చూసేకొలదీ బలపడుతున్న ఆకర్షణ... నాకు తెలియకుండానే నా పాదాలు అతడి వైపు కదులుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ దూరం కరుగుతుందా, ఎప్పుడెప్పుడు అతడిని చేరుకుంటానా అన్న ధ్యాసలో కళ్ళు తెరిచి తపస్సు చేస్తున్న మునీశ్వరిలా, ఐహిక సుఖలన్నీ మరచి అతడినే పూజిస్తున్నాను. అతడిని చేరే వరమివ్వమని ప్రార్ధిస్తున్నాను. ఇది కట్టలు తెగిన వయసు వ్యామోహమో.. లేక అదుపు, ఆంక్ష లేని వెర్రి ప్రేమ మైకమో లేక మరేదైనానో నాకు తెలియదు. అసలు ఎప్పటికైనా అతడిని చేరుకుంటానో లేదో అనేది కూడా ఆలోచించట్లేదు. ఎప్పుడు వచ్చింది నాలో ఇంత మూర్ఖత్వం? ఏమో ఈ ఆకర్షణ ముందు, నా భావం ముందు నాకేదీ అనిపించట్లేదు, కనిపించట్లేదు. అతడిని చేరుకోవటమే నా జీవిత లక్ష్యంలా తోస్తుంది. ఒక్కొక్కటిగా బంధాలన్నిటినీ విడిచిపెడుతున్నాను, మోక్షం పొందేందుకు బయలుదేరిన సన్యాసినిలా.... అతడు నా వైపు వస్తున్నాడు. నన్నే చూస్తున్నాడు... అది గమనించిన నా మనసైతే పురివిప్పిన నెమలల్లే నర్తిస్తోంది. నర్తించే నన్ను చూసి అతడిలో ఎలాంటి చలనం లేదు. గాంభీర్యమే కనిపిస్తోంది. కానీ ప్రతి క్షణం అతడిపై నా ఆకర్షణ మరింత బలపడుతుంది.

తొలి సందేశం...
అతడి మీదుగా వచ్చిన గాలి నన్ను సోకింది. నాలో సన్నగా మొదలయిన ప్రకంపన..

మొట్టమొదటి సారి అతడిలోని మొరటుతనాన్ని చూస్తున్నాను. నిప్పులు కురిపిస్తున్న అతడి కళ్ళను అదరకుండా చూస్తున్నాను, అతడిలోని ప్రతి భావాన్నీ అనుభవించాలని... గర్జిస్తున్న అతడిని బెదరకుండా ఆహ్వానిస్తున్నాను, ఆప్యాయంగా హత్తుకోవటానికి... అతడు చేసే పిడుగుపాటు లాంటి గాయాలను భరిస్తున్నాను సంతోషంగా... అతడు ఆక్రమిస్తున్న నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతున్నాను. అతడిని నాలో కలిపేసుకోవాలని అనుకున్నాను. కానీ నన్ను పెనవేసుకుపొతున్న అతడితో ఏకమై కరిగి, జారి, ప్రవహిస్తున్నాను. నా అన్న ఉనికి, తడిసి ముద్దై, మట్టిలో కలిసిపోయింది. కాసేపటికి తేలికై అతడు నా ఒడిలో సేద తీరుతున్నాడు. అలసి సొమ్మసిల్లేట్టుగా భారంగా నేను...

ఏంటీ? అలా చూస్తున్నావ్?? నీకిది వెర్రిగా తోస్తుందా? వీపరీతంగా కనిపిస్తుందా? మోహనా... నువ్వు చెప్పు.. నువ్వు కూడా అతడిని చుసి మైమరువలేదా? అతడి ప్రేమను చిరునవ్వుతో స్వాగతించలేదా?? అలా దిక్కులు చూస్తావే...? ఒక్క సారి, "ఇక్కడ ఎవరూ లేకుండా ఉంటే ఎంత బాగుండు" అని ఎన్ని సార్లు నీ రెక్కల్ని నువ్వే ముడుచుకోలేదూ? ఆ గొడుగును నువ్వు మనస్పూర్తిగానే తెస్తున్నావా రోజూ? లేక అతడి ప్రేమ వానలో తడిసే నిన్ను చూసి అసూయతో మాట్లాడే వాళ్ళకోసమా? గొడుగును కావాలనే తేవటం మర్చిపోయిన నాడు అతడు నన్ను కరుణించాలని నాతో పాటు నువ్వూ ఆర్ధ్రంగా ఎదురుచూడలేదూ?? నిజం చెప్పు... మా అనుబంధాన్ని చూసి ఆనందించే నువ్వు, మా భావాలను నేనిలా వ్యక్తపరిస్తే తప్పుగా, తెగింపుగా చూస్తున్నావా? నేను బరితెగించానా? లేక నా ధైర్యం చూసి, నువ్వు భయపడుతున్నావా?

నీ సమాధానాలు నీకోసమే...గుర్తుంచుకో..!!

లేదు.... నేనేమీ అనుకోవట్లేదు. నువ్వు చెప్పు...

కొంతసేపటికి ఇద్దరం తేరుకున్నాం. భౌతికతను కోల్పోయి, ఇప్పుడే విచ్చుకున్న మల్లెమొగ్గలా, ప్రకాశవంతంగా, అతడు. అతడి ప్రేమలో తడిసి దానిని అందరికీ పంచే ప్రేమమూర్తిగా నేను, ఒకరినొకరం చూసుకుని నవ్వుకున్నాం. సంతరించుకున్న కొత్త అందాలతో పులకరించి, ఒక్క సారి నా రెక్కలు విప్పి అతడిని చుట్టలేనని తెలిసీ, అతడిని అమాంతంగా కౌగిలించుకున్నాను. ఈ నిమిషం ఇలానే స్తంబించిపోవాలన్న దురాశ కలగకపోలేదు. కానీ అతడి ప్రేమతో పాటు అందిపుచ్చుకున్న బాధ్యతలను మరువలేను. ఆ నిమిషం కరిగింది. ముడి విడింది. దూరం దరిచేరింది...

కానీ నాకు తెలుసు అతడిని మళ్ళీ కలుస్తాననీ.. నా ప్రేమను దాయలేననీ...

:) నువ్వు దాయలేవు..ఒప్పుకుంటున్నాను.. ఈ భూమిపై వికసించే ప్రతి పువ్వూ.. దానికి సాక్ష్యం..!

23 comments:

Purnima said...

WOW!

Wud talk to u later on this. Very soon :-)

Kathi Mahesh Kumar said...

భావలాలిత్యం.పదాల పొందిక. అనుభూతుల్ని అక్షరబద్దం చేసిన తీరు.ఒక స్థాయిలో బౌతిక ప్రేమ కనబడినా, మరో కోణంలో అలౌకిక కలయికని అలవోకగా చెప్పి మరోస్థాయికి తీసుకెళ్ళావు. అభినందనలు.

కొత్త పాళీ said...

చాలా బాగా రాశారు అనడం అండర్ స్టేట్మెంట్.
అభినందనలు

Purnima said...

So.. here I'm again:

వానాగిపోయిననూ ఆకు పై చుక్కందం
అల చెదిరిపోయిననూ దరినున్న నురుగందం

ఆ అందాన్ని పదాల్లో పెడితే, అది నీ టపా! కలయిక క్షణికమే అయినా, అది మిగిల్చే అద్వితీయ ఆనందం అనిర్వచనీయం అనుకునేదాన్ని. ఇప్పుడు అర్ధమవుతోంది మాటలకందని భావాలూ మాటలు రాకే కానీ మాటలు లేక కాదని! :-)

Honestly, you swept me off my feet. దీన్ని ఓ రెండు మూడు సార్లు చదివేసి, నేనేదైనా రాసేశాననుకో, ఆ నేరం నీదే మరి! ;-)

కాకపోతే, ఒక చిన్ని కంప్లెంట్. అయితే obscurity ఇంకా పెంచాల్సింది. నాకు అది అమ్మాయి-అబ్బాయి, వానా-ప్రకృతి, లేక మరోటి అన్నది పూర్తిగా నాకే వదిలేసా ఉండాల్సింది. అలా కాక నువ్వే చెప్పాలనుకున్నప్పుడు, ఆ డైలాగు ఇంకా పెంచాల్సింది.

ఇది నేను రాసుంటే, "లేదు.... నేనేమీ అనుకోవట్లేదు. నువ్వు చెప్పు..." అని అనను. నిజంగా భయాలనూ, కండిషీనంగ్ నూ, అన్నింటినీ ఎత్తుకునే దాన్ని. సింపుల్గా చెప్పాలంటే పనిలో పని సమాజాన్ని ప్రశ్నించటమో, జాలిపడటమో ఏదో ఒకటి చేసేదాన్ని. But tht's me you see.

నా అభిప్రాయాలు మాత్రమే ఇవి. నువ్వు గానీ, ఈ టపా చదివే వాళ్ళు కానీ నన్ను అపార్ధం చేసుకోరని భావిస్తున్నాను. మంచి అనిపిస్తేనే ఆలోచించు. లేకపోతే లైట్!

పూర్ణిమ

మోహన said...

@ మహేష్,కొత్త పాళీ గారూ
థాంక్యూ.

@పూర్ణిమా..
నువ్విలా పొగుడుతూ ఉంటే.. నేనిక్కడ మునగ చెట్టు ఎక్కేస్తున్నాను.. :) నీకు రాయాలనిపిస్తే రాయి పూర్ణిమా... నేరం నాది కాదు. నీ స్పందించే మనసుది :)

ఇక విషయానికొస్తే..
ఈ భావం అపార్థం పాలు కాకూడదన్న ఒకే ఒక అభిప్రాయంతో పాఠకుడికి పూర్తి స్థాయి కంట్రోల్ ఇవ్వలేకపోయాను.. నా స్వార్థం :)

ఆత్మీయురాలిని అనుకొని తన అనుభవాన్ని ఎంతో లీనమై, ఆవేశంగా చెప్తున్న స్నేహితురాలికి, నా అనవసర భయాల గురించి, అర్థంలేని లోకం కండిషీనంగ్ గురించి మాట్లాడి ఆనకట్ట కట్టలేకపోయాను. ఐనా అవి ఆమెను అడగవలసిన ప్రశ్నలు కావనిపించింది. నేను మొహమాటపడినా, నా మనస్సును, అందులోని భయాలను చదివినట్టే తను గుక్క తిప్పుకోకుండా ప్రశ్నల వర్షం కురిపించేసింది, ఇక అడిగేందుకు,చెప్పేందుకు నాకేమి మిగల్చకుండా..!

అబ్బాయి రాస్తే.. "భావకుడ"ని మెచ్చుకుంటూ.. అదే భావాల గురించి ఒక అమ్మాయి రాస్తేనో లెక ప్రస్తావిస్తేనో.. "సిగ్గు లేకుండ నలుగురిలో ఎలా మాట్లాడుతుందో..!" అని బుగ్గలు నొక్కుకునే ఈ లోకాన్ని నే మార్చలేను. కానీ నన్ను నే మార్చుకోగలను. ధైర్యంగా... అచ్చం నాలా బ్రతికేలా...

నిషిగంధ said...

చాలా చాలా బావుంది.. ప్రింట్ చేసుకోవాల్సిన టపా ఇది!
పోతే పూర్ణిమ అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను.. చివర్లో ఏమీ చెప్పకుండా వదిలేసుంటే ఆ tingling ఇంకా బావుండేది :-)

Anonymous said...

simply superb...one of the best things to start a day...:)


--Vamsi

Bolloju Baba said...

ఎంత లాలితం గా వ్రాసారూ!
చాలా చాలా బాగుంది.
బొల్లోజు బాబా

మురారి said...

>>నర్తించే నన్ను చూసి అతడిలో ఎలాంటి చలనం లేదు. గాంభీర్యమే కనిపిస్తోంది.
..
>>అతడు ఆక్రమిస్తున్న నన్ను నేను చూసుకుంటూ మురిసిపోతున్నాను.
..
quite a fascinating post. I personally liked it very much. But, I wud like bring out a few observations of mine.

>>అలసి సొమ్మసిల్లేట్టుగా భారంగా నేను.
indulo "భారంగా" annadi enduko naaku apt gaa anipinchaledu.
alaage "తొలి సందేశం..." ki, aa taruvata vachche paragraph ki madhya konta continuity miss ayinattu anipinchindi.

>>గాంభీర్యమే కనిపిస్తోంది. కానీ ప్రతి క్షణం అతడిపై నా ఆకర్షణ మరింత బలపడుతుంది.
ikkada "కానీ " naaku nachchala.

>>లేక నా ధైర్యం చూసి, నువ్వు భయపడుతున్నావా?
chaala baagundi.

>>దూరం దరిచేరింది
naaku artham kaakapovadam valana asandarbhamgaa tochindemo!.

శేఖర్ పెద్దగోపు said...

" అబ్బాయి రాస్తే.. "భావకుడ"ని మెచ్చుకుంటూ.. అదే భావాల గురించి ఒక అమ్మాయి రాస్తేనో లెక ప్రస్తావిస్తేనో.. "సిగ్గు లేకుండ నలుగురిలో ఎలా మాట్లాడుతుందో..!" అని బుగ్గలు నొక్కుకునే ఈ లోకాన్ని నే మార్చలేను. కానీ నన్ను నే మార్చుకోగలను. ధైర్యంగా... అచ్చం నాలా బ్రతికేలా..."

It seems your attitude. Good Mohana.Keep it up. Your post is simply superb Mohana.Yourself and Poornima posts make me understanding girls better than ever.

మోహన said...

నిషిగంధ గారూ...
మీ అభిమానానానికి కృతజ్ఞతలు. పూర్ణిమ అడిగిన ప్రశ్నకు నే రాసిన సమాధానం చదివారని అనుకుంటున్నాను. మీ సూచనని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను.

@బొల్లోజు బాబా
ధన్యవాదాలు బాబా గారూ..

@Vamsi
your comment is One of the best to start a day... :-)

@P L Sekhar
Thank you very much.

"Yourself and Poornima posts make me understanding girls better than ever."

When i read this line I was flattered for a moment.. But..
అంత త్వరగా ఒక అభిప్రాయానికి రాకండి. Each one is unique. Just keep observing. Hope you will enjoy it.

మోహన said...

@మురారి gArU..

Many Thanks for observing the emotions so close and for sharing your observations and opinions.

>>"భారంగా" annadi enduko naaku apt gaa anipinchaledu.

మేఘంలోని నీరును(ప్రియునిలోని ప్రేమను, బాధ్యతను) తనలో నిండుగా నింపుకున్న ఆమె నాకు ఒక్క కాసేపు భారంగానే తోచిందండీ..

>> "తొలి సందేశం..." ki, aa taruvata vachche paragraph ki madhya konta continuity miss ayinattu anipinchindi.

Suggestions ఏమైనా ఇవ్వగలరా?

ఆమె అనుభవిస్తున్న ఆకర్షణకి అతడి బాహ్య రూపనికి సంబంధం లేదు అని చెప్పేందుకు "కానీ" అని వాడాను.

>>దూరం దరిచేరింది
Distance is imagined as a being which has filled the space between them after the rain.

శేఖర్ పెద్దగోపు said...

మోహనగారు... నేను మీ బ్లాగుకి కామెంట్ రాయడం ఇది మొదటి సారి కావచ్చు. కాని మీ బ్లాగు, పూర్ణిమా గారి బ్లాగు చాలాకాలం కిందటినుంచే సుపరిచితం. నేను ఎక్కువగా ఆఫీసులో మీ టపాలు చదువుతాను. అందుకని ఎప్పుడూ కామెంట్స్ రాయను. ఒకరకమైన బద్ధకం లాంటిది అని కూడా చెప్పొచ్చు. అజ్ఞాత బ్లాగు రీడర్ని అన్నమాట. సో నేను మొదటిసారే చదివి మీ టపాల మీద ఓక అభిప్రాయానికి రాలేదు.

ఏకాంతపు దిలీప్ said...

ప్రకృతితో మమేకమవ్వడం అంటే ఇదే కదా? !!!





ఇంకో విషయం ఏంటంటే నువ్వు నువ్వు నమ్మినదాన్ని ఎంత అందంగా,ఆసక్తిగా,ప్రేమగా నిలుపుకుంటావో తెలుసా? నాకు ఇంకో ఆటోగ్రాఫ్ కావాలి...

మురారి said...

My comments ar jus perceptional differences. I am being too critical coz i loved ur post. manaki baagaa nachchinadaanini manam anukunnatlu gaane choodaalane oka chadastam. coming to the point(s)..
>>భారంగా
(fulfillment of)love leads to a higher state, probably a lighter one. even varsham velisaaka koodaa nature lo oka rakamaina prakaashavantamaina telikatanam kanapadutundi. anduke "భారంగా " annadi apt gaa anipinchaledu.

>>continuity
On a visual plane, తొలి సందేశం fades in anticipating the beginning of some action and the next paragraph opens up in the midle of the action. Thats where i found a bit of discontinuity.

>> కానీ
గాంభీర్యమే కనిపిస్తోంది. కానీ ప్రతి క్షణం అతడిపై నా ఆకర్షణ మరింత బలపడుతుంది.
nenu atani gaambheeryata aamepai provocative gaa pani chestundani bhaavistaanu. ee కానీ aa feel ni konta dilute chesinattu anipinchindi.

మోహన said...

P L Sekhar
nEnu annadi ammAyila abhiprAyaM gurimchaMDi..

@దిలీప్
మీ అభిమానానికి కృతజ్ఞతలు.

@మురారి
May be it is just not perceptional differences.

>>భారంగా
మీరు కనిపిస్తున్న దాని గురించి చెప్తున్నారు. నేను అనుభవిస్తున్న దాని గురించి...

>>continuity
There is no action in the starting f the paragraph.. according to me, it started in the middle of the paragraph. again.. id depends on what u r imagining...

>>atani gaambheeryata aamepai provocative gaa pani chestundani bhaavistaanu.

That is true in some cases.. but I did not look at it that way...

>>manaki baagaa nachchinadaanini manam anukunnatlu gaane choodaalane oka chadastam.

adi kEvalam chAdastam kAdemo.. manaki nachinattugane choodalanukunte.. oka bhramalo undipotamemo.. just my opinion.. take lite.

మురారి said...

>>adi kEvalam chAdastam kAdemo.. manaki nachinattugane choodalanukunte.. oka bhramalo undipotamemo..

Thanks for your insight. I do think abt it.

రాధిక said...

ఏమిటి మోహనా అసలు?ఇంత క్లారిటీనా?నాకూ ఆటోగ్రాఫ్ కావాలి.

మోహన said...

రాధిక గారూ..

మధురానుభూతులు కేవలం ఊహల్లోనే..కాదు, చూడగలిగితే మనం అనుభవించే ప్రతి క్షణంలో ప్రతి బంధంలో, ప్రతి చోటా ఉంటాయి. వాటిని మృదువుగా స్పృశిస్తే, తెలియని ఎన్నో కొత్త రాగాలు పలికిస్తాయి. అలాంటి నాకు తెలియని, నేను వినని, విన్నా.. మరచిపోయిన ఎన్నో రాగాలను మీ కవితల మాధ్యమంతో సరికొత్తగా వింటూ ఉంటాను. మీ కవితలంటే నాకు చాలా ఇష్టం.

అలాంటి మీనుండి ఇలా ఒకే రోజు, నా టపాలకి బోలెడు వ్యాఖ్యలు వచ్చేసరికి... ఎప్పుడో పంపుకున్న ప్రేమలేఖ ఇప్పుడే అందిందంటూ ప్రియుడు పంపిన సందేశం అందుకున్న ప్రియురాలిలా ఉక్కిరిబిక్కిరై.... ఎగిరి గంతేశాను.... శృతి, తాళం లేవు నా ఆనందరాగానికి.... :-)

నేను ఎక్కువగా రాస్తే.. అందులో నా దోషం లేదు ;-)

మీకు నా రాతలు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండీ.. పైగా ఆటోగ్రాఫ్ అంటే... ఎలా చెప్పను, నాకెలా అనిపిస్తుందో..??! :-)

Thank you very much.

వింజమూరి విజయకుమార్ said...

చక్కని టపా. ఆ భావకతనలాగే ఉండనివ్వండి. కృతజ్ఞతలు.

మోహన said...

@వింజమూరి విజయకుమార్ said

Thank you very much

S said...

That was amazing!
మీ భావుకత బాగుందండీ.

మోహన said...

@S
Thank you very much