Thursday, August 7, 2008

..అంతర్యానం - భయం..

భయం... భయం.. భయం.... ఎందుకంత భయం ? దేని గురించి భయం?
ఆలోచిస్తున్నాను....
ఆలోచిస్తే తెలుస్తుందా ? అనుభవిస్తే కదా తెలుస్తుంది???
సరే... నా అనుభవంలోకి తొంగి చూస్తున్నాను....
ఆ నిమిషం లో ఏం జరిగింది ? అసలు ఈ ప్రక్రియ ఎలా మొదలయ్యింది ? ఇంతై, వటుడింతింతై అన్నట్టు ఎలా పెరిగి నన్ను మించే అంత పెద్దదయ్యింది ? నేను గుర్తు చేసుకుంటున్నాను...

ఆ.. అవును! అప్పుడు నాకు నచ్చని పని జరిగింది. నా మనశ్శాంతికి భంగం కలిగించేది. ఆ moment లొ ఎదో తెలియని disturbance. ఆ disturbance లో చాలా ఆలోచనలు రేగాయి. అవి నాకు రకరకాల కోణాలు చూపిస్తూ.. నన్ను తలో దిక్కుకి మోసుకెడుతున్నాయి.. నేను వాటిని అనుసరిస్తున్నాను.

ఒక్కో ఆలోచన మరి కొన్ని భయం నిండిన ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. అవి చెట్టు కొమ్మల్లా... ఎదిగిపోతున్నాయి. ఊడల్లా మనసులో పాతుకు పోతున్నాయి. ఒక్కో ఆలోచనని అనుసరిస్తూ నేను నా Integrity ని కోల్పోతున్నాను. నేను విడిపోతున్నాను!!! నా Integrity ని మళ్ళీ సాధించే ప్రయత్నం లో నేను వాటిని తెంచేస్తున్నాను... విరిచేస్తున్నాను... నన్ను పట్టిన వాటిని విదిలించుకుంటున్నాను... పోరాడుతున్నాను... కానీ ఏం చేసినా లాభం లేదు. అవి నాకంటే వేగంగా, ప్రతి సారి మరింత బలంగా పుట్టుకొస్తున్నాయి. ఇలా విడివిడిగా చాలా దూరం ప్రయాణించాను. విడిపోయిన నాకు, నా భయం నాకన్నా పెద్దగా కనిపించింది. నేను బలహీనపడుతున్నానా ? లేక నా భయం శక్తి పుంజుకుంటుందా ??? తెలియదు.

నా ఓపిక నశిస్తోంది. అలసిపోతున్నాను. వీటీతో ఎంత పోరాడినా నేను సాధించలేనని అర్థమయ్యింది. వీటిని నాశనం చెయ్యాలంటే, వీటి మూలాల్ని పట్టుకోవాలని గ్రహించాను. పోరాటంలో ఒక్క అడుగు వెనక్కి వేశాను. వాటిని అడ్డుకోవటం మాని, విడిపోయిన నన్ను నేను పోగుచేసుకుని, వెనుదిరిగి, ముందుకు నడిచాను.....

నా ఆలోచనల్ని అనుసరిస్తూ ఎన్నో దారులు చూశాను. కాని ఈ దారిన ఎప్పుడూ ప్రయాణించలేదు. ఇది అంత కష్టాంగా లేదు. నన్ను ఏది అడ్డగించట్లేదు... కానీ చీకటిగా ఉంది. కొత్త దారి అయినా, చీకటిగా ఉన్నా తెలిసిన త్రోవలా ఉండటం వల్ల తేలికగానే సాగిపోతున్నాను. ఈ దారి నన్ను ఎక్కడికి తీసుకెళుతుందో అని ఆత్రుతతో సాగిపోతున్నాన్ను....

కొంత దూరం వెళ్ళగానే కొంత వెలుతురు కనిపించింది. మబ్బు పట్టిన మేఘం లా ఉంది. మధ్య మధ్యలో మెరుపులు. ఆ కాంతే నాకు ముందు కనిపించిన వెలుతురు. ఏదో కర్మాగారంలో స్రామికులంతా చాలా తీవ్రం గా, ఆగకుండ పని చేస్తున్న ఫీలింగ్ కలిగింది నాకు. అరే..! అవి నా ఆలోచనలు..!! ఓహో.. ఐతే అవి ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయన్న మాట. ఈ ఫాక్టరీ కి పవర్ కట్ చేస్తే సరి.. అంతా కుదుటపడుతుంది. అది ఎక్కడా? అనుకుంటూ ముందుకు నడుస్తున్నాను. అక్కడ చాలా గొట్టలున్నాయి... ఏది పవర్ లైనో తెలియలేదు. అలా ముందుకు వెళ్తున్నాను....

అలా కొంత దూరం వెళ్ళాకా.. లయ బద్ధం గా ఒక చప్పుడు వినిపిస్తూ ఉంది. ఒక్క క్షణం ఆగి చూసాను. లయ బద్ధం గానే ఉంది కానీ వేగం గా ఉంది.. ఎవరో తరుముతున్నట్టు...

ఇంతలో "ఆగావేం ? రా.. పర్వాలేదు." అని ఒక కంఠం వినిపించింది.

కొంత ముందుకు వెళ్ళి చూస్తే ఏదో కదులుతోంది. దాని లోంచే అన్ని లైన్లూ వెళ్తున్నాయి. ఓహో.. మన టార్గెట్ ఇదన్నమాటా.. పోరాటానికి సిద్దం అవ్వాలి. ముందు అసలు రాయబారం నడిపి చూద్దాం.. అని..

"ఇలా చూడు... నువ్వు మాట్లాడుతున్నావ్, శాంతంగా కనిపిస్తున్నావ్ కాబట్టి చెబుతున్నాను. నాలో భయానికి గల కారణం తెలుసుకుని, దాన్ని అడ్డుకోవాలని.. అవసరమయితే నాశనం చెయ్యాలని బయలుదేరి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. కాబట్టి నువ్వు లొంగిపో!! లేదా యుద్ధం చేసైనా నేను నిన్ను గెలుస్తాను."

"సరే.. ముందుగా నికో విషయం చెప్పాలి. నువ్వు వింటుంది నా స్వరం. కానీ చూసేది నన్ను కాదు."

"కాదా?? ఆ కదిలేది నువ్వు కాదా??? అంటే.. నువ్వూ.... నువ్వు అంతరాత్మ వా?

"మ్మ్.. అలాంటిదే.. కానీ నువ్వు ఎవరికోసమైతే వెతుకుతున్నావో వారు ఇక్కడ లేరు."

"అంటే..?"

"అంటే... ఆ కదిలేది నీ గుండె. అది రక్తాన్ని తొడుతూ ఉండటం తప్ప, తనకి నీ భయం గురించి తెలీదు."

"అవునా..! అవును.. నీకివన్నీ ఎలా తెలుసు? నువ్వు నిజం చెప్తున్నావని నమ్మకం ఏంటి? అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావ్?"

"నాకు తెలుసు. నమ్మటం, నమ్మకపోవటం నీ ఇష్టం. అబద్దం చెప్పవలసిన అవసరం నాకు లేదు. నువ్వు దేని గురించైనా వెతుక్కుంటూ నా దాకా వస్తే నీకు నే చేయగలిగినంత సహాయం చెయ్యటమే నా కర్తవ్యం."

"సరే.. క్షమించు. తప్పయ్యింది. సహజం గా ప్రతి జీవిలోనూ ఉండే defencse mechanism వల్ల అనుకుంటా... నిన్ను కూడా అనుమానించాను."

"Thats ok.. I understand. నిజానికి నీలోని ఈ దృక్పదమే నీలో భయానికి ఒక కారణం."

"కొంచం వివరించగలవా..? "

"ఎదుటివారు మనకి ఏదో అపాయం చెయ్యటనికే మన దగ్గరకు వస్తారన్న అలోచన . అలా అపాయం చెస్టే 'నాదీ' అని నువ్వనుకునేది ఏదో కోల్పోతావన్న అపోహ. అది కోల్పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయమే ఈ భయం అన్న ప్రక్రియ. "

"మన జాగ్రత్తలో మనం ఉండటం తప్పా ?"

"కాదు. ముందు జాగ్రత్త మంచిదే. అతి జాగ్రత్త కాదు. ఉదాహరణకి..
పిల్లలు ఆడుకోవటనికి వెళ్ళారు. పడిపోతే? దెబ్బ తగిలించుకుంటే ??
ఊరెళుతున్నాను.. ఇంట్లో దొంగలు పడితే ? అన్నీ దోచేస్తే ?
బయట గేటు తాళం వెయ్యాలి. ఎవరైన వచ్చి నన్ను ఎత్తుకుపోతే??
చీకట్లో bathroom కి వెళ్ళాలి. ఆ చీకట్లోంచి ఎవరైనా వచ్చేస్తే? నన్ను మింగేస్తే ??

వీటన్నిటికీ ఓ పరిష్కారమో, ప్రత్యామ్నాయమో చేసుకోవచ్చు. భయం వేస్తుందని పనులు మానుకోలేము కదా.. చలా సార్లు అసలు విషయం కన్నా మన ఆలోచనలు, ఊహా శక్తి ఆ విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ఇంకా భయపెడతాయి."

చేతనైతే ఎదిరించాలి. లేకపోతే అన్నిటికీ సిద్ధంగా ఉండటం తప్ప భయపడి మనం ఏదీ సాధించలేం. ఉన్న ఆ కాస్త మనశ్శాంతిని కోల్పోవటం తప్ప..."

"నువ్వు అలానే అంటావ్..ఇప్పుడు రోజులు కూడా అలానే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా..."

"నీ ఆవేదన నాకర్థమయ్యింది... భయానికి కారణాలు చిన్నవవచ్చు, పెద్దవవచ్చు. అలాగే ఆ కారణాలు ఎన్నయినా ఉండచ్చు.. కానీ నువ్వు తెలివైన దానివి కదా... నువ్వు చెప్పు.. భయపడి ఏమి సాధిద్దాం అని ?? భయపడుతూ ఇంట్లో కూర్చుంటే, జీవితానికి అర్థమేముంది? అన్నిటికంటే పెద్ద భయం. మృత్యు భయం. మృత్యువు ఏదో ఒక రోజు వస్తుందని తెలుసు. అది ఎక్కడా, ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియదు, అని కూడా తెలుసు కదా నీకు..."

"తెలుసు. కానీ నా భయం నా ఒక్కదాని గురించి కాదు. నిజం చెప్పాలంటె నా గురించి కానే కాదు. నాకు నా చావంటే భయం లేదు. కానీ నాకు నా వారి క్షేమం ముఖ్యం. వాళ్ళు క్షేమంగా ఉండలి."

"నిజమే నీకంటే నీవారి మీదే మమకారం ఎక్కువ నీకు. కానీ నేను ఒక్కటే చెప్పగలను.వేరే ఎవరి చేతిలోనో మీట ఉందనుకుని నువ్వు ఇంతదాకా వచ్చావు. కానీ నిజానికి అది నీ చేతుల్లోనే ఉంది. అతిగా ఆలోచిస్తూ.., జీవించే ప్రతి నిమిషం భయంతో నరకం చేసుకునే కంటే, బ్రతికిన ఎంత సేపైనా ధైర్యంగా నవ్వుతూ బ్రతుకు. చనిపోయాకా స్వర్గానికి వెళతామో నరకానికి వెళతామో.., అసలు అవి ఉన్నాయో లేదో మనకి తెలియదు. కానీ నీ జీవితం నీ చెతుల్లో ఉంది. ఒక్క సారి నీ నరాల్లోని ఆ టెన్షన్ ని వదులు చేసి చూడు. ఈ క్షణం స్వర్గం చేసుకునే అవకాశం నీకుంది. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. ఎంతైనా ఇది నీ జీవితం కదా..! సలహా ఇవ్వటం వరకే నా పని. సారధ్యం కాదు."

"మ్మ్.. ప్రయత్నిస్తాను. నాకు చాలా ధైర్యాన్నిచ్చావు. నీకు చాలా థాంక్స్."

"నీ అభిమానం కానీ.. నిజానికి ధైర్యాన్ని ఎవరూ ఎవరికీ ఇవ్వలేరు. గుర్తు చెయ్యగలరు. అంతే...! నెను చేసింది అదే..

"పోనీ గుర్తుచేసినందుకు థాంక్స్."

"మ్మ్. వదలవుగా..!! సరే.. My pleasure and you are always welcome. Live your life courageously and enjoy every moment of it."

":-)"

లేచి చూస్తే బారెడు పొద్దెక్కింది.. ఎప్పుడు నిద్రపోయానో....!!


-------------------------------------------------------------------------------------------------------------------
జీవితం పూలబాట కాదు. కఠిన పరీక్షలే అడుగడుగునా.. పదునైన నాగలితో చదునుచేస్తే కాని, పంట పండించలేం. పరీక్షల్ని ఎదుర్కుంటే తప్ప గెలవలేం. "కోల్పోయేది ఏమి లేదు. సాధించేది ఎదైనా ఉంటె.. మనల్ని మనం."


నాకు ధైర్యాన్ని గుర్తుచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ...
- ఓ ధైర్యవంతురాలు :-)

11 comments:

జాన్‌హైడ్ కనుమూరి said...

అద్భుతంగా రాసావు.
భయం గురించీ, ధైర్యం గురించీ ఎమో ఎమో రాద్దామని రెండురోజులుగా జుట్టు పీక్కుంటున్నాను.

ఇక నేను ఆలోచించడం మానేసా.
ఎందుకా...
అభినందనలు రాయాలిగా...

Purnima said...

Awesome!! Excellent concept and brilliant execution!!

I'm impressed :-)

చిలమకూరు విజయమోహన్ said...

నిత్య జీవితంలో జరుగుతున్న భయంకర సంఘటనలను చూసి ఒక్కోసారి మనస్సు వికలమవుతుంది.అప్పుడు మనలో కలిగే సంఘర్షణను,భయాలను ఎలా అధిగమించాలో అంతరాత్మ ప్రభోధంగా బాగా తెలియపరచారు.అభినందనలు

Kathi Mahesh Kumar said...

impressive...very good.

ఏకాంతపు దిలీప్ said...

"ఒక్కో ఆలోచన మరి కొన్ని భయం నిండిన ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. అవి చెట్టు కొమ్మల్లా... ఎదిగిపోతున్నాయి. ఊడల్లా మనసులో పాతుకు పోతున్నాయి. ఒక్కో ఆలోచనని అనుసరిస్తూ నేను నా Integrity ని కోల్పోతున్నాను. నేను విడిపోతున్నాను!!! నా Integrity ని మళ్ళీ సాధించే ప్రయత్నం లో నేను వాటిని తెంచేస్తున్నాను... విరిచేస్తున్నాను... నన్ను పట్టిన వాటిని విదిలించుకుంటున్నాను... పోరాడుతున్నాను... కానీ ఏం చేసినా లాభం లేదు. అవి నాకంటే వేగంగా, ప్రతి సారి మరింత బలంగా పుట్టుకొస్తున్నాయి. ఇలా విడివిడిగా చాలా దూరం ప్రయాణించాను. విడిపోయిన నాకు, నా భయం నాకన్నా పెద్దగా కనిపించింది. నేను బలహీనపడుతున్నానా ? లేక నా భయం శక్తి పుంజుకుంటుందా ??? తెలియదు."

"ఎదుటివారు మనకి ఏదో అపాయం చెయ్యటనికే మన దగ్గరకు వస్తారన్న అలోచన . అలా అపాయం చెస్టే 'నాదీ' అని నువ్వనుకునేది ఏదో కోల్పోతావన్న అపోహ. అది కోల్పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రయమే ఈ భయం అన్న ప్రక్రియ. "

"తెలుసు. కానీ నా భయం నా ఒక్కదాని గురించి కాదు. నిజం చెప్పాలంటె నా గురించి కానే కాదు. నాకు నా చావంటే భయం లేదు. కానీ నాకు నా వారి క్షేమం ముఖ్యం. వాళ్ళు క్షేమంగా ఉండలి."



ఆ మూడు పేరాలు ఒకదానితో ఒకటి ముడిపడిపోయినవి... మొదటి పేరా చాలా ఆలోచిస్తే గానీ రాయలేము.. మన "integrity" తరవాత రెండు పేరాల్లో ఉన్న విషయాలని ప్రశ్నిస్తుంది. అవి నీతో లేకునప్పుడే నేను నీతో ఉన్నట్టు అంటుంది... నేను నీతో ఉన్నాను అని నువ్వు చెప్పుకోవాలంటే అవసరమైతే వాటిని వదిలెయ్యాలి అంటుంది...

వాటిని దూరం చేసుకునే ప్రయత్నంలో భయం,అభద్రత భావం కలుగుతుంది. ఎందుకంటే అవి మనకి అలవాటైపోయినవి... ఈ పోరాటంలో ఎక్కువమంది పూర్తిగా పోరాటం జరపరు... ఓడిపోయి భద్రంగా...,పోరాటం వల్ల ఏంజరుగుతుందో అనే భయం లేకుండా ఉండటానికి సన్నద్ధమైపోతారు...

మోహన said...
This comment has been removed by the author.
మోహన said...

@జాన్‌హైడ్ కనుమూరి, @ Purnima, @విజయమోహన్, @మహేష్
Thank you.

@దిలీప్
అర్థం కాలేదండి.. :(
అలోచనలు లేకపోతే integrity ఉన్నట్టనా మీ అభిప్రాయం?

ఏకాంతపు దిలీప్ said...

alaa kaadu mOhanaa... naa uddESam chaalaa aalOchinchaavu kaabaTTE integrity gurinchi alaa aa pEraalO raayagaligaavu...

mana integrity nilupukOvaalanTE okkOsaari manaki alavaaTu lEni praSnalu edurukOvaalsi vastundi...
nEnu quote chEsina nee renDu mooDu pEraallO alaanTi sandharbhaalE unnaayi...

andukE aa mooDu pEraalani okachOTa pETTaanu...

కల said...

భయం గురించి ఎంత చెప్పినా, ఎంత చేసినా దాన్ని మనలోనుంచి వేరు చెయ్యలేమని నా అభిప్రాయం. కాకపోతే దానితో పోరాడగలం అది మనల్ని ఓడించకుండా.
బాగా రాశారు.

కొత్త పాళీ said...

Very interesting write up.

బాగా రాస్తున్నారు. అభినందనలు.

మోహన said...

@Dileep
mana integrity nilupukOvaalanTE okkOsaari manaki alavaaTu lEni praSnalu edurukOvaalsi vastundi...

Right!
we grow/realise life only when we are out of our comfort zones. what say ?

@కల

అవును వేరుచెయ్యలేం. కానీ పోరాడి ఓడించలేమేమో! ఎందుకంటే.. కోల్పోతున్నాం అన్న భయం ఉన్నప్పుడే ఎదురు తిరుగుతాం. అలా ఎదురు తిరిగి దానికి[భయానికి] మరింత బలం చేకూరుస్తున్నాం అని నా అభిప్రాయం.

@కొత్తపాళీ గారూ..
ధన్యవాదాలు.