Saturday, December 13, 2008

..గ్రహణం..

నిత్యం నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు తను. అలా అని నేనే తన లోకం కాదు. లోకమంతా తనదే అని అందరికీ ప్రేమ పంచుతాడు. చంటి పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి మనసులో తనకో ప్రత్యేక స్థానం. తను పలకరించిన ప్రతి వారూ ఏదో కొత్త అందంతో, తేజంతో వెలుగుతారు, ప్రేమను ఒలకబోస్తారు. తను ఎక్కడుంటే అక్కడ వెన్నెలే.. తన సమక్షంలో ఆడుకుంటూ, పాడుకుంటూ, ఎలాంటి బెంగ, బాధా లేకుండా గడిచిపోతుంది. తను లేని నాడు ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

ప్రతి క్షణం నా కళ్ళ ముందు లేకపోయినా, నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడన్న స్పృహ ఎప్పుడూ ఉంటుంది నాకు. ప్రతి ఒక్కరికీ తను పంచే ప్రేమలో, ఆప్యాయతలో నాకూ కొంత భాగం అందుతోంది తెలుసా..? ఎలానో మరి నాకు తెలియదు. కానీ అందుతుంది. అంతే..! నాక్కూడా తనొక్కడే లోకం కాదు. లొకమంతా నాదే.. నా దాకా వస్తే అవతలి వారి బరువూ నేనే మోసేస్తుంటాను. దాని వల్ల అంతా నాకు ఓర్పు చాలా ఎక్కువ అనుకుంటారు. నిజమే.. ఎప్పుడూ కిల-కిల మంటూ, కళ కళలాడుతూ ఉంటాను. సప్త వర్ణాల కలయిక నేను. నా చుట్టూ నిత్యం, నవ్వుల పువ్వులే.. కోపం ఎప్పుడో కానీ రాదు. కానీ కోపం అంటూ వస్తే.. దయా, దాక్షిణ్యం లాంటివేమీ ఉండవు. అగ్ని పర్వతాలు బద్దలయిపోతాయి, సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. కానీ తను అలా కాదు. ఒకరి బరువు మొయ్యడు. తనతో గడిపిన క్షణాల్లో మాత్రం ఎవరికీ ఏ బరువులూ గుర్తు రావు. తను ఎప్పుడూ ఒకలాగే ఉంటాడు. మల్లెపూవులా చల్లగా, నవ్వుతూ...

ఈ రోజు తన వైపు అడుగేయబోయాను. నా రాక గమనించి తప్పుకుంటున్నాడనిపించింది. నా మీద కోపం వచ్చిందేమో అనిపించింది. 'ఎందుకో చెప్పకుండా ఇలా కోప్పడితే ఎలా..?' అని నాకూ చాలా కోపం వచ్చింది. కానీ........!!!

***
నా ఛాయే.. నిన్ను నాకు దూరం చేస్తుందని గ్రహించలేకపోయాను నేస్తం.. :(

6 comments:

శేఖర్ పెద్దగోపు said...
This comment has been removed by the author.
శేఖర్ పెద్దగోపు said...

మన చుట్టూ ఎంతో మంది ఇలాంటి ఆవేదనతో ఉంటారన్నది నగ్న సత్యం. చాలా సార్లు అంతః సౌందర్యం బాహ్య సౌందర్యం దగ్గర ఓడిపోతుంటుంది. మనిషి తనను తానూ ఎంత పరిణితి చెందిన జీవిగా అనుకున్నా ఆ కాలం నుండి ఈ కాలం దాకా బాహ్య సౌందర్యానికి, ఆకర్షణకి దాసోహుడే. అసలు భగవంతుడు మనుషులందరిని ఎందుకు ఇన్ని రంగుల్లో క్రియేట్ చేసాడన్నది అంతుచిక్కని ప్రశ్నే.

మోహన said...

@P L Sekhar
మీ కామెంట్ చదివి ముందు నాకేమీ అర్థం కాలేదు అసలు. అంతః సౌందర్యం బాహ్య సౌందర్యం గురించి ఎందుకు రాసారో నిజంగా అర్థం కాలేదు. చాలా ఆలోచించి లాభం లేక అలా వదిలేసాను. మళ్ళా సాయంత్రం వచ్చి, నా టపాతో పాటూ మీ కమెంట్ చదివాను. అప్పుడు అర్థమయ్యింది అసలు సంగతి..!!

నేను 'ఛాయ' అన్న పదం 'నీడ' అనే అర్థంలో మాత్రమే వాడాను. పైగా గ్రహణం అన్నానేమో, రంగు గురించిన ఆలోచన నాకు అసలు తట్టనేలేదు :) A nice catch!
అయినా ఆ హద్దులన్నీ దాటితేనే కదండీ స్నేహాన్ని చేరగలుగుతాం ??

>>భగవంతుడు మనుషులందరిని ఎందుకు ఇన్ని రంగుల్లో క్రియేట్ చేసాడన్నది అంతుచిక్కని ప్రశ్నే.
భగవంతుడు ప్రతి మనిషికి, అతడి/ఆమె purpose ని బట్టి resources allocate చేస్తాడేమో అని నాకనిపిస్తుంది. He is a good programmar u see... and no software is with out bugs!! ;)
ఇదిలా ఉండగా, నాలోని rationalist మాత్రం, మనకున్న resources ని బట్టి మనం purpose ఏర్పరుచుకుంటాం అంటుంటాడు!!

what do you say ?

శేఖర్ పెద్దగోపు said...

మీ జవాబు చూసిన తర్వాత నేను ఇంకోసారి మీ టపా చదివాను. కాని మీరు చెప్పిన దాని ప్రకారం 'నీడ' అనే పదం పెట్టి చూస్తే నేను ఏ భావాన్నీ గ్రహించలేక పోతున్నాను. మీరు 'నీడ'ని ఎలాంటి అర్ధం వచ్చేటట్టుగా వాడి స్నేహితుడు దూరమయ్యాడు అని చెప్పాలనుకున్నారో తెలియజేయగలరు.

మురారి said...

జాగ్రత్తగా చదివాక అర్థమయ్యింది మీరు భూమి.. అతను చంద్రుడని. మొదట్లో ఆమె ఛాయ అతడిని దూరం చేయడం ఏమిటని తెగ ఆలోచించేసాను. గ్రహణం ద్వారా ఒక మంచి కాంఫ్లిక్ట్ ని అందంగా ఆవిష్కరించారు.

మోహన said...

నే రాసే వాటిని నేను విశదీకరించి చెప్పేముందే అందులో ఉద్దేశాన్ని ఎవరైనా గ్రహిస్తే ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది. క్రమం తప్పకుండా నా బ్లాగు చదివే ఇంకో ఇద్దరు మిత్రులు కూడా, నే చెప్పాలనుకున్నది గ్రహించలేకపోయేసరికి, నాకే గ్రహణం పట్టేంత పని అయ్యింది.:)

మురారి గారూ, మీ వ్యాఖ్య ఆ గ్రహణం చివర మెరిసే 'డైమండ్ రింగ్' లా ఒక కొస మెరుపై నా భారం దించింది. Thank you. ఐతే ఆ భూమి నేనా కాదా అన్నది నేను ఇక్కడ చెప్పదలచుకోలేదు.

P L Sekhar గారూ,
ముందుగా ఓ మాట. ప్రశ్న చదివాక కూడా, జవాబివ్వటంలో నే చేసిన ఆలస్యాన్ని మన్నించగలరని భావిస్తున్నాను.

ఇకపోతే వివరణ నా మాటల్లో...
చందమామను అతడుగా, భూని ఆమె గా ఊహించుకుని, వారు స్నేహితులైతే, ప్రకృతిలో ఏర్పడే చంద్ర గ్రహణ ప్రక్రియ ఇలా ఉంటుందేమో అనిపించింది. గ్రహణం ఘడియల్లో భూమి నీడ పడి చంద్రుడు కనిపించడు. తన నీడే తన స్నేహితుడిని తనకు కనిపించకుండా చేస్తుందని గ్రహించలేకపోయింది భూమి.

ఒక్కో సారి, మానసిక స్థితుల వల్ల స్నేహితుల మధ్య కలిగే అపార్ధాలను, మానసిక దూరాలను గురించి చెప్పాలన్న ప్రయత్నంలో రాసిన టపా ఇది.

చదివి, అర్థం కాలేదని వదిలెయ్యకుండా వివరణ అడిగి తెలుసుకున్నారు. మీ అభిమానానికి, interest కి కృతజ్ఞతలు.