Wednesday, December 17, 2008

ఆరయ్యింది..!

తల నిమురుతూ నాన్న నిద్రలేపారు. ఇంకో 5 నిమిషాలు డాడీ అంటూ ఇటు తిరిగి ముడుచుకుని పడుకున్నాను. 'ఏయ్.. ఇందాకే లేపి వెళ్తే, ఇంకా పడుకున్నావా...? లే..! అసలు చెప్పలేకపోతున్నాను నీకు. లే ఇంక. సరిపోయారు తండ్రీ, కూతుర్లు..' అన్న అమ్మ మాట విని, ఎదో గొణుక్కుంటూ లేచాను. ఇంకా ఏమంత వెలుగు రాలేదు. అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది. నాన్న ఎవరితోనో మాట్లాడుతున్నారు. చుట్టూ చూస్తే నేను తోటలో ఉన్న మడత మంచం మీద ఉన్నాను. ఇక్కడికి ఎప్పుడొచ్చాను?? అనుకుంటూ లేచి కళ్ళు నులుముకుంటూ నడిచాను. అంతా ఎప్పుడో లేచినట్టున్నారు..! అయినా పెళ్ళి రేపు కదా.. అనుకుంటూ గుమ్మం ముందు దాకా వచ్చాను. అత్త ఎదురయ్యి, 'ఏమ్మా, సరిపోయిందా నిద్రా?' అని వెటకారంగా అడిగింది. ఏదో అనబోయాను. ఇంతలో మొన్న అందరిలో ఏదో వాగినందుకు అమ్మ లోపలికి తీసుకెళ్ళి, 'ఇంకోసారి అత్తకి అలా తిక్క సమాధానలు చెప్పావంటే చూడు..' అని వార్నింగ్ ఇచ్చింది గుర్తొచ్చి, 'హిహి ' అని నవ్వేసి ఇంట్లోకి నడిచాను. అమ్మకోసం వెతుకుతున్నాను. అసలెక్కడా కనిపించదే..! ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళినట్టు...? ఇంతలో బెడ్రూంలోంచి పెద్దగా ఆడవాళ్ళ నవ్వులు వినిపించాయి. అక్కడుందేమో చూద్దాం అని అటు వెళ్ళాను. అమ్మ కింద కూర్చుని మల్లెపూల మాలలు కడుతుంది. ఇంకో నలుగురు ఆడవాళ్ళు[వాళ్ళు నాకేమవుతారో నాకు తెలియదు.] కూడా పూలు కడుతున్నారు... 'మమ్మీ!' అని పిలిచాను. పలకలేదు. ఇంకా మాటల్లోనే ఉంది. 'మమ్మీ... మమ్మీ..!' అని మళ్ళీ పిలిచాను. 'ఆ...!' అంటూ నా వైపు తిరిగి, 'ఏం తల్లీ, అయ్యిందా నిద్ర..? ఇంకా లేదా??' అని అడిగింది. అందరూ నవ్వేశారు. ఇప్పుడు అందరి మధ్యలో కూర్చుని ఆ మాట అడగటం అవసరమా.. అనుకుంటూ... ఆ మాటలు పైకి అనలేక, ఉక్రోషంతో.. 'బ్రష్ ఇవ్వు..' అని గట్టిగా అడిగాను. 'బ్రష్షా..? దేనికి?'. నాకేం అర్థం కాలేదు. నేను అమ్మని అలానే చూస్తున్నా. తను నవ్వాపుకుంటూ.. 'అసలిప్పుడు టైం ఎంతయ్యిందనుకుంటున్నావ్??' అని అడిగింది. ఆలోచించకుండా, 'ఎంతయ్యింది..?' అని వెంటనే ఎదురు ప్రశ్న వేసాను. 'ఎంతా..., సాయంత్రం ఆరయ్యింది..!' అని చెప్పగానే, తనతో సహా అంతా గట్టిగా నవ్వేసారు. అప్పుడు కానీ అర్థం అవ్వలేదు నాకు, నేను మధ్యాహ్నం మిగతా పిల్లలతో కలిసి చెరువు దగ్గర ఆడుకుని వచ్చి, వాళ్ళతో పాటూ తోటలోని మంచాల మీద పడుకుని నిద్రపోయానని, వాళ్ళు తరువాత లేచి నన్ను ఒక్కతినే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారని..! ఏం చెయ్యాలో తెలియక, నాలిక్కరుచుకుంటూ బయటికి పరుగెత్తాను.....

ఆ రోజు మళ్ళీ యే ఆంటీ కంటైనా పడితే ఒట్టు..! :P

13 comments:

KumarN said...

అంతకు ముందెప్పుడో కూడా మీరు అన్ నోటీస్డ్ వర్ల్డ్ లో అనుకుంటా, మీ అవతలి ప్రపంచం లోకి మీరు తలచినదే తడవుగా వెళ్ళిపోగలనన్నట్లుగా చెప్పినట్లు గుర్తు.

ఇప్పుడు ఇక్కడ కూడా, మీరు నిద్ర వారధినెక్కి నిశ్చింత అనే ప్రపంచంలోకి పోయి, ఎక్కణ్ణుంచి అక్కడికెళ్ళారో పూర్తిగా చెరిపేసుకోగలరని తెలుస్తోంది.

అదృష్టవంతులు! అలాగే కాపాడుకోండి.

Kathi Mahesh Kumar said...

చాలా ఆసక్తికరంగా ఉంది. చివర్లో మెలిక కేక!

లక్ష్మి said...

Bhale raasaarE!!!

ప్రపుల్ల చంద్ర said...

బాగా వ్రాశారు... నాకు ఇలాంటి అనుభవాలు జరిగాయి..
ఒకసారి అచ్చు ఇలాగే మా బావ పెళ్లప్పుడు జరిగింది !!!

ప్రతాప్ said...

Nice one :-)

మేధ said...

హ్హహ్హ.. నాకు ఉన్నాయి ఇలాంటివి :)
ఈ ఆరింటితో వచ్చే చిక్కే ఇది.. ప్రొద్దునో, సాయంత్రమో అర్ధమవనివ్వదు!

నాగప్రసాద్ said...

బాగుంది. :)))

Purnima said...

hehehehe.. shd hav been an embarrassing moment!:-)

మురారి said...

నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. అప్పట్లో అంత నిశ్చింతగా నిద్రపోయే వాళ్లము మరి. ఇప్పుడలాంటి హాయైన నిద్ర ఎక్కడిది. అప్పుడప్పుడు అనిపిస్తుంది- పెద్దవాళ్లమయి పాడయిపోయామేమోనని. బాగా రాసారు.

శేఖర్ పెద్దగోపు said...

నాకు కూడా చిన్నప్పుడు ఇలాంటి అనుభవం ఎదురైంది. కానీ నేను ఎంతలా మరచిపోయానంటే మళ్ళీ మీ టపా చదివిన తర్వాత గాని గుర్తుకు రాలేదు. ఒక మంచి అనుభవాన్ని మాతో పంచుకుని నా జీవీతంలో కూడా ఇలాంటిది ఒకటివుంది అని స్ఫురణకు తెచ్చుకునేలా చేసిన మీకు ధన్యవాదాలు.

రాధిక said...

:) నాకు కూడా :)

వేణూశ్రీకాంత్ said...

హ హ బాగుంది.

కొత్త పాళీ said...

నాకూ జరిగిందిలా! Medha said it right