Wednesday, February 11, 2009

తరుగుతుందంటారా..?


హే.. ట్రై దిస్..

ఐ నో. 'ఆల్మండ్ జాయ్'. రైట్?

హ్మ్.. వాట్ ఈస్ ఇన్సైడ్ ?

కొకొనట్. :)

హ్మ్.. :)

యు లైక్ కొకొనట్ సో మచ్ నా? :)

హ హ హ....


ఈ రోజు అఫీసులో శ్రీజిత్ తో జరిగిన సంఘటన ఇది. తనకి నచ్చినదాన్ని నాతో పంచుకుంటున్నాడు అన్న ఆలోచన మనసులో చాలా ఆలోచనలని, జ్ఞాపకాలని రేపింది.....

చిన్నప్పుడు క్లాస్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఐతే తలా ఒక చాక్లెట్ ఇచ్చేవారు. అది తినకుండా దాచి, ఇంటికెళ్ళాక చెరిసగం చేసి తమ్ముడితో పంచుకుని తినేదాన్ని. నాకిష్టమైన రకం చాక్లెట్ ఐతే ఇంటికెళ్ళే వరకు తినకుండా ఉండటం కొంచం కష్టమయ్యేది. వేళ్ళే లోపు ఓ వంద సార్లు బయటకు తీసి చూసుకునేదాన్ని :) ఎవరైనా ఇస్తే తమ్ముడితో పంచుకోవటానికి నాకేం అభ్యంతరం ఉండేది కాదు కానీ, నాన్న కొన్న వాటి పై 'నాది ' అన్న భావం ఎంత ఉండేదో..!! నాకు ఎంతో ఇష్టమైన గన్ బొమ్మని వాడు విరిచేసినప్పుడు 'నా బొమ్మలన్నీ వీడు పుట్టాకా విరగ్గొట్టేశాడు ' అని ఎంత ఏడ్చానో. ఆ ఉక్రోషానికి అసలు కారణం వేరే. అదేంటంటే... నాకు తమ్ముడంటే చాలా ఇష్టం. వాడు అమ్మ కడుపులో ఉండగా మడి కట్టుకుని ఎన్ని పూజలు చేశానని??!! కానీ వాడు పుట్టాకా ఏదో తేడా నాలో... అమ్మ నాకన్నా వాడినే ఎక్కువ ఎత్తుకుంటుంది. వాడినే ఎక్కువ పట్టించుకుంటుంది. వాడి వైపు తిరిగి పడుకుని, నన్ను వెనక పడుకోమంటుంది. అమ్మ కి నా మీద ప్రేమ తగ్గిపోతుంది. అంతా వీడీవల్లే. వీడు పుట్టాకనే అమ్మ నన్ను సరిగ్గా చూడట్లేదు అని చాలా కుళ్ళు ఉండేది. దానివల్ల అవకాశం దొరికినప్పుడల్లా ఇలా బయట పడేదాన్నన్నమాట. లొడ లొడా వాగే నేను ఉన్నట్టుండి కాం అయిపోయాను. అమ్మ, నాన్న నన్ను గమనిస్తూనే ఉన్నారు. వాడు కొంచెం పెద్దయ్యి, నేను కూడా వాడిని ఎత్తుకోగలిగే సమయానికి, ఈ ఆలోచనలు కాస్త తగ్గాయి. ఇదే కాదు, అమ్మ వేరే పిల్లల మీద ప్రేమ చూపిస్తే ఏదోలా ఉండేది. సమయంతో పాటు మానసికంగా ఎదిగాక మనసులో అలాంటి ఆలోచనలు పోయాయి. కానీ ఇప్పుడనిపిస్తోంది....

తమ్ముడితో అన్నీ పంచుకోగలిగిన నేను అమ్మ ప్రేమని పంచుకునేందుకు ఎందుకు అంత కష్టపడ్డాను?? పిల్లలంటే చాలా ఇష్టం ఉన్నా, అమ్మ వాళ్ళని దగ్గరకు తీసుకుంటే నాకు ఎందుకు అంత కుళ్ళు ఉండేది ? అప్పుడు,ఇప్పుడు,ఎప్పుడూ నా బుర్రలో ఒక్కటే ప్రశ్న. "అమ్మకి వీళ్ళంటే 'నాకంటే' ఎక్కువ ఇష్టమా..?" అని. అమ్మని ఎప్పుడూ అడగలేదు. కానీ ఈ ప్రశ్న నా మనసులో చాలా కాలం అలానే ఉంది. ఎందుకంటే బాహ్యం గా అమ్మ నా మీద చూపించే ప్రేమ, వారి మీద చూపించే ప్రేమ ఒక లాగే ఉండేవి. కొన్ని సార్లు నా మీద చూపించేదే తక్కువ అనిపించేది. అప్పుడప్పుడు తగిలే తిట్లు, మొట్టికాయలు ఇలాంటి ఆలోచనల్ని మరింత బలపరిచేవి. తమ్ముడికి ఈ సంగతేమీ తెలీదు. వాడెప్పుడూ అలా కుళ్ళుకున్నట్టు నాకు కనిపించలేదు. బహుశా నేను కూడా అమ్మ, నాన్న తో పాటుగానే పరిచయం కావటం వల్ల కాబోలు. ఈ చిక్కంతా కొత్త బంధాలతోనేనేమో..!

పక్క వారికి పంచితే, నాకు అందేది తగ్గిపోతుంది అనే ఆలోచన ప్రేమ కు పుష్టుగా అప్ప్లై చేసేసుకున్నాను అనుకుంటా..:) గమ్మత్తు ఏంటంటే, నిజంగా తరిగిపోయే చాక్లెట్లు, బొమ్మలు వగైరా పంచుకునేందుకు నాకెప్పుడూ మనసు కష్టం అనిపించలా... కానీ కొద్దిగా ప్రేమ దగ్గరే బోల్తా పడ్డాను :) ఇప్పుడు కూడా అప్పుడప్పుడూ దేని గురించైనా అలా పొశెసివ్ గా అనిపించినా [అంతే, కుక్క తోక, నా బుద్ధి ఒకే రకం..], నాకు సీక్రెట్ తెలిసిపోవటం వల్ల, 'హహ, నువ్వు మరీ విశూ...' అని నన్ను చూసి నేనే నవ్వేసుకుంటాను.:) దానితో ఆ ఫీల్ మనసులో ఎంతో సేపు ఉండదు.

ఇంతకీ, పంచుకుంటే ప్రేమ తరుగుతుందంటారా..? నిజంగా తరగకపోయినా, అలా అనిపిస్తే ఏం చెయ్యాలో..!

2 comments:

Purnima said...

:-)

మురారి said...

>>నాకు సీక్రెట్ తెలిసిపోవటం వల్ల, 'హహ, నువ్వు మరీ విశూ...' అని నన్ను చూసి నేనే నవ్వేసుకుంటాను.:)
చాలా బాగుంది.