Wednesday, September 16, 2009

ఎక్కడికీ పయనం?

ప్రతి నిమిషం, ప్రతి ఒక్కరం ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటామని అంత ముందు ఎక్కడో రాసుకున్నను. క్రితం నిమిషం వరకూ కూడా అలానే అనుకున్నాను. ఇప్పుడు నా ఆలోచన మారుతున్నట్టు అనిపిస్తుంది.

ప్రతి నిమిషం, ప్రతి ఒక్కరం స్థిరత్వం కోసం పరితపిస్తున్నామని అనిపిస్తుంది....

ఒకడు ఇస్తున్నాడు. ఒకడు పుచ్చుకుంటున్నాడు. ఒకడు నవ్వుతున్నాడు. వేరొకడు ఏడుస్తున్నాడు. ఒకడు పూజిస్తున్నాడు. ఇంకెవడో కక్ష సాధిస్తున్నాడు. ఒకడు కష్టపడుతున్నాడు. ఒకడు సర్దుకుపోతున్నాడు. ఇలా ఎవరేం చేసినా వారు నమ్మిన ఎదో ఒక విషయంలో స్థిరత్వం పొందటానికే ప్రయత్నిస్తున్నామేమో! సరిగా చూస్తే మనుషులే కాదు, వస్తువులు కూడా.. ఎత్తు నుంచి పడుతుంది, జారుతుంది, స్థిరత్వం పొందే వరకూ. అణు స్థాయిలో కూడా ఒక స్థిరమైన స్థితి పొందే వరకూ ఇచ్చి-పుచ్చుకోవటాలు జరుగుతుంటాయి. నీరు వాలు వెంట పారుతుంది.

ఇలా సృష్ఠిలో ఏ పదార్ధం అయినా, జీవి అయినా, వస్తువు అయినా సరే తన పరిధిలో భౌతిక, సామాజిక, మానసిక మరేదైనా దృక్పథాల్లో ఎక్కడైతే తనకు స్థిరత్వం లేదో ఆ విషయంలో స్థిరత్వం పొందే దిశగా జీవిత ప్రయాణం సాగిస్తుంది. ఇదే సృష్ఠి తనను తాను అలవోకగా నడుపుకునే విధానం?!!

ఒక అద్భుతం ఏమిటంటే జ్ఞానం స్థాయితో పాటుగా ఈ నిర్దేశికాల సంఖ్య పెరగటం! అంటే రాయి, నీరు, గాలి లాంటి వాటిలో భౌతిక; మొక్కలు, జంతువుల్లో భౌతిక, రసాయన, జైవిక; అంశాలు నిర్దేశికాలవుతాయి. మనిషి విషయానికొచ్చేసరికి వీటన్నితోపాటు సామాజిక, మానసిక, మనస్తత్వ స్థితులు కూడా అంశాలవుతాయి. ఇలా ఇన్ని అంశాల స్థితి గతుల ఫలితం మనిషి జీవన పయన మార్గం. అదే మనిషి జీవితానికి అందం, అబ్బురం చేకూరుస్తుందనుకుంటా... అలానే క్లిష్ఠతను కూడా!!

ఇలా కొనసాగే పయనాల్లో ప్రేమ అనేది ఒక ముఖ్యమైన ఉత్పాదకం మాత్రమే?!!

ఒకప్పుడు ఇలా... అనుకున్న ఒక ఆలోచనని ఈ రోజు అలా కాదు ఇలా.. అని కొత్తగా అవిష్కరించుకున్నాను. చూడాలి నా పయనం ఎటు సాగుతుందో!! :)


*******************
నాలో ఆలోచనని ఈ దిశగా ప్రేరేపితం చేసిన నేస్తానికి కృతజ్ఞతలు.

2 comments:

Kathi Mahesh Kumar said...

ఝడత్వాన్ని స్థిరత్వంగా భావిస్తేఎలా?
‘ప్రేమప్రవాహాన్ని మించింది స్థిరత్వం’ అనుకుంటే ఎలా?

శేఖర్ పెద్దగోపు said...

ప్రేమ దొరికే చోట స్థిరత్వం వెనువెంటనే రెక్కలు కట్టుకుని అక్కడకి వాలిపోతుందని నా ఫీలింగ్. ఆ స్థిరత్వమే మనల్ని మరింత బెటర్ గా,సెక్యూర్ గా ఫీలయ్యేటట్టు చేస్తుందేమో!! అయితే ప్రేమ వల్ల వచ్చిన స్థిరత్వానికే ఆ గుణం ఉంటుందనుకొంటా... సృష్టి ధర్మాన్ని అనుసరించి వచ్చే స్థిరత్వం మనకు అన్ని సందర్భాల్లో సాంత్వన కలిగిస్తుందని చెప్పలేం.