Tuesday, February 16, 2010

మాసిపోయింది...

రాత్రి పూట చీకట్లో వెల్లకిలా పడుకుని సీలింగ్ ని చూస్తున్నా.., నిశ్శబ్దంగా ఉంది. మంచం పక్కన అలవాటైన గోడ మీద యాదాలాపంగా ఎడమ చేతి వేళ్ళు ఆడుతున్నాయి. మడిచి పెట్టిన కుడి చెయ్యి తల కింద నలుగుతోంది. కిటికీ మీద ఆడుతున్న నీడల్లో కళ్ళు ఏవో అర్ధాలు వెతుకుతున్నాయి. మనసులో మెదులుతున్న రాగ తరంగం... పెదవుల్ని చేరే లోపే పల్చబడిపోతుందేమో, పెదవులు చిన్నగా శబ్దం లేకుండా కదులుతున్నాయి. తిమ్మిరెక్కుతున్న చేతిని తల కింద నుండి తీసే ప్రయత్నం లో మైమరపు దుప్పటి చెదిరినట్టుంది, గోడ మీద వేళ్ళు నిలిచాయి. పాట ఆగింది. క్షణకాలం ఆ సీలింగ్ ఏం చూపిందో, ఆ చీకట్లో ఏ ప్రకాశం తారసపడిందో మరి, మసక బారిన కళ్ళలోంచి నీరు కారుతోంది. దిబ్బడేస్తున్న ముక్కు ఊపిరందనివ్వటం లేదు. ఊపిరి కోసం పక్కకు తిరిగితే జారుతున్న నీళ్ళు వాటి రూటు మార్చాయి. ఎప్పుడొచ్చిందో ఆమె, తన రెక్కలపై నన్ను తీసుకుపోయింది. ఎక్కడికెళ్ళానో, ఎంత సేపయ్యిందో తెలీదు... మెల్ల మెల్లగా కళ్ళు కొద్దిగా తెరుచుకున్నాయి. గది ఇంకా చీకటిగానే ఉంది. ఇంకాస్త విచ్చుకున్న కళ్ళు గోడ మీదున్న కేలెండర్ లోని చిన్ని కృష్ణుడి పైన వాలాయి. కిటికీ లోంచి పడుతున్న లేలేత సూర్య కిరణాల వెలుగులో వేణువూదుతున్న అతడు చిలిపిగా చూస్తూ ఏదో అడిగినట్టు!, ఊహ... మొహం పక్కకు తిప్పుకున్నాను. దిండు మీది నీటి మరక వెక్కిరించింది. ఒళ్ళు విరిచి, దిగ్గున లేచి, బయటకు నడిచాను.