Sunday, April 18, 2010

తొలి చూపులోనే...

చీకట్లో మెట్ల మీద కూర్చున్న ఆమె,
మదిలో అలల హోరు జ్ఞాపకాలతో
సాగరాన్ని తలుస్తూ మురుస్తూ..
విరహాన్ని చిరునవ్వుగా పేర్చి,
జారిపోకుండా పట్టుకుంది గెడ్డం కింది చేతిలో...

అలిగిన మేఘమో,
మరి కలిగిన మేఘమో!
కరిగే సందడి చేస్తుంటే..
తల పైకెత్తి చూసిందామె.

పక్కింట్లో కొబ్బరాకు నీడన ఎదిగిన,
వంపు సొంపుల సన్నజాజి పందిరి...
వీస్తున్న సమీరానికి లయబద్దంగా
ఊగుతోంది వయ్యారంగా...

విచ్చుకున్న జాజులనే ఆభరణాలుగా ధరించి
వెలుగుతున్న పందిరిని తదేకంగా చూస్తూ,
మదిలో పరవళ్ళు తొక్కుతున్న ఊహలతో
అసంకల్పితంగా అటు వైపు అడుగులేసిందామె.

తన్మయత్వంతో అలా చూస్తుండగానే,
గాలికో జాజి ఆమె ముందు రాలింది.
పరవశం తో జాజిని స్వీకరించి,
ప్రేమగా తాకి, ముద్దాడి జడలో తురిమింది.

ఎవరి గుమ్మానికి కట్టిన చిరు గంటలో
గాలికి శ్రావ్యంగా మోగుతున్నాయి.

Tuesday, April 6, 2010

కవిత

అక్కసు ఆరాటం ఆక్రోశం ఆవేశం...
రాక పోకల ఆనవాలు లేని చీకటి ఇరుకు డొంక.
ఊపిరి సలపని ఉక్కిరిబిక్కిరి మైకపు ఆలింగనం.
విశ్వాంతరాళంలో వ్యాపించిన శబ్ద(పద) ఝరి కాఠిన్యం.
ఒకటిని రెండుగ చీల్చి ఒకటన్న భావన చెరిపి పారి ఏలిన
ఆమె సోయగం, ఆ దర్పం...
అనిర్వచనీయం అమోఘం అనంతం అమరం.


****