ఈ రోజు పూర్ణిమ.
ఒరిగిన కుండలోంచి కారుతున్న వెన్నలా... ఆకాశంనుండి వెన్నెల కారుతుందా అన్నట్టుంది.
చుక్కలు మిలుకుమంటున్నాయి హుషారుగా...
చల్లగాలి కౌగిలింతలా బిగుస్తూ కూడా హాయిగా ఉంది.
సన్నగా చిరునవ్వోటి తొంగి చూస్తుంది. తెలుస్తుంది.
కొంటెగా పరిహాసాలాడే జుట్టు ఎప్పటిలాగే గిలిగింతలు పెడుతుంది.
అయితే నా చిరునవ్వుకు ఇవేమీ కారణాలు కావుగా...
పిల్లలు నవ్వితే మనమూ నవ్వుతాం. వాళ్ళెందుకు నవ్వారో తెలియకపోయినా! అలానే ఇవన్నీ, నా నవ్వుకు కారణం తెలియకుండానే నన్ను ఒకింత అనుమానంతో, 'ఎందుకో అంత ఆనందం' అని కొంటెగా అడుగుతున్నాయి. అనుమానం సరే, అడగటమూ సరే... కానీ చెప్పానంటే నమ్ముతారా? అసలు అర్ధమవుతుందా?అయ్యేలా చెప్పగలనా? అని! అయినా ఏం చెప్తాం!
మాటలు కుప్పలు కుప్పలుగా పోసేసి వెతికేస్తున్నాను. ఊ... హూ! కుదరటంలేదు. కలవటంలేదు. అసలు సరిపోవటంలేదు. ఇలా కాదు. పోనీ ఉదాహరణ తీసుకుని ప్రయత్నిస్తే! మ్... కుదరొచ్చు. ప్రయత్నిస్తా....
అదే... ఒక విత్తు చెట్టుగా ఎదుగుతుంది, భూమి, గాలి, నీరు తీసుకుని. ఆ చెట్టు వలన వాన పడి, వాన వలన నీరు సమకూరుతుంది. నీటి వలన చెట్టు వలన నీటి వలన చెట్టు....... ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కదా! మ్....
అయితే.. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఎవరికి ఏమిస్తున్నారు?
ఇది సగం ప్రశ్న!
ఎవరు ఎవరికి ఏమిచ్చి ఏమి పుచ్చుకుంటున్నారు? ఇది పూర్తి ప్రశ్న! :)
జీవితం. ఆహా! ఒకరికి ఒకరు పరస్పరం జీవితం ఇచ్చి పుచ్చుకుంటున్నారు. ఒకరు లేకుండా మరొకరు లేరు. పరస్పరం ఇచ్చి పుచ్చుకునే ఈ క్రమంలో ఈ పరంపరలో వారి జీవితాలే కాదు మరెన్నో జీవితాలు ఆవిష్కరింపబడుతున్నాయి.
ఒక తల్లి, బిడ్డ పరస్పరం ప్రేమ చూపించుకునేప్పుడు ఎవరు ఎక్కువ ఆనందిస్తున్నారంటే ఏం చెప్పగలం? పరస్పరం ఇచ్చి-పుచ్చుకుంటున్నారు. ఆ లీలలో, కేళిలో ఇది తల్లి, ఇది బిడ్డ అని వేరుగా చూడలేం. వారిద్దరూ ఉన్నారు. ఒకటిగా!! ఆ ప్రవాహం రెండు వైపులనుండీ ప్రవహిస్తుంది.
ఆ అలౌకిక అనుభవం, అనుభూతి, ఆనందం కొలవలేం.
ఆ సన్నివేశాన్ని ప్రత్యక్ష్యంగా చూస్తున్న నా స్థితిని వర్ణించటం అసాధ్యం.
ఆ నా స్థితి ఈ రోజు నా చిరునవ్వుకు కారణం!