మధురం.. ఈ అనుభవం
మధురం.. నీ పరిచయం
మావితోటలోని కొయిలలా..
పండు రేయిలోని వెన్నెలలా..
దట్టమయిన లోయలోని సరస్సులా..
నా మది సొరుగుల్లోని సుగంధం నువ్వా!
ఆ చిన్ని తార లేని నాడు
ఈ అనంతమయిన ఆకాశానికి అస్థిత్వం ఏది?
అహం విడిచిపెట్టి
ఎండమావి తలుపుతట్టి
కుదరదంటే కాదంటూ
వద్దంటే వదలనంటూ
మొండి మహర్షిలా
నీ పట్టునే తపస్సుగా చేసి
నా మది పొడుపు కథ విప్పి
ఆవలున్న అనంత ప్రేమ సాగరాన్ని తాకావు.
సోయగాల గవ్వల సడిలో
వలపుల అలల తడిని
చిరునవ్వుల కేరింతలతో కలిపి
నా మది సముద్ర తీరాన
నీ అనురాగపు తేనె పూసి
అపురూపమైన సంధ్యను ఆవిష్కరించావు.
ప్రేమగా చూసి నన్నొక
అందమైన చిత్రంగా మలిచావు.
మధురం.. ఈ అనుభవం
మధురం.. నీ పరిచయం
మధురమే.. నీ సంగమం
సరిరాదు.. ఏ.. బంధం!