Tuesday, April 28, 2009

"హ్మ్.."

న్యూస్ పేపర్ చదువుతున్నా, గడియారం ప్రతి సెకను లెక్కపెడుతున్న సంగతి వినిపిస్తూనే ఉంది. సమయం ఎంత అయ్యిందా అని గోడకి వేలాడుతున్న గడియారాన్ని చూసాను. ఏడవటానికి ఇంకా 10 నిమిషాలు ఉంది. రోజూ ఈ పాటికి స్వాతి ఇంటికి వచ్చేస్తుంది. ఈవాళ లేట్ అయ్యిందంటే.. అసలే ఈ రోజు ఆటో స్ట్రైక్! బస్ దొరికిందో లేదో అనుకుంటూ వరండాలోకి వచ్చి వీధి మలుపు వైపు చూస్తున్నాను. ఈ లోగా గేట్ అలికిడి విని కిందికి చూసాను. స్వాతి, గేట్ వేస్తోంది. నీరసంగా కనిపించింది. మా ఆఫిసులు చాలా దగ్గర. రోజు తనని వాళ్ళ ఆఫీసు వీధి చివర పిక్ చేసుకుని ఇద్దరం నా బండి మీద కలిసే ఇంటికి వస్తాం. ఆ రోజు ఆ గొడవ జరిగిన సాయంత్రం నేను తనెప్పుడూ ఎదురు చూసే చోటకి వెళ్ళాను. తనక్కడ లేదు. ఎప్పుడైనా నేను లేట్ అవుతానేమో కానీ తనెప్పుడూ లేట్ కాదు. ఒక వేళ ఎటైనా వెళ్ళాలన్నా నేనొచ్చే వరకు ఆగి చెప్పి వెళ్తుంది. లేదా ఒక SMS ఇస్తుంది. ఈ రోజు ఏమైంది అనుకుంటూ చుట్టూ చూసాను. ఒక రెండొందల అడుగుల ముందు తను నడుస్తోంది. పక్కగా వచ్చిన ఆటోని ఆపి ఎక్కింది. నేను రాననుకుందా? భార్యా భర్తలన్నాకా గొడవలు లేకుండా ఉంటాయా? ఆ మాత్రానికి నేను తనని పిక్ చేసుకోను అనుకుందా? ఛ! లేదు. తను అంత సంకుచిత మనస్కురాలు కాదు. నేను వస్తానని తెలుసు. ఐతే నాతో రావటం తనకి ఇష్టం లేదా?? ఆ ఆలోచనతో మనసు ఒక్క సారి చివుక్కుమంది. గుక్క పెట్టిన పసి పిల్లాడిలా ఊపిరాడలేదు. రెండు నిమిషాల తరువాత బండి స్టార్ట్ చేసి బయలుదేరాను. ఆ రోజు నుంచీ ఇప్పటి వరకు తను నాతో కలిసి రాలేదు. ఇంట్లో కూడా మాటలు లేవు. కనీసం చూపులు కూడా కలవటం కరువయ్యింది. సాయంత్రం ఇంటికి రాగానే వండి టేబుల్ మీద పెట్టి తన గదిలో ఏదో పనిలో నిమగ్నమవుతుంది. ఆకలేసినప్పుడు నేను నాలుగు మెతుకులు తినేసి వెళ్ళి పడుకోవటం. పోనీ రమ్మని పిలుద్దామా అంటే, ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి మాటాడే ధైర్యం లేదు ఇప్పుడు. నవ్వితే ఆ కళ్ళు వెన్నెల కురిపిస్తాయి, తన మూడ్ బాగాలేకపోతే నిప్పులు కురిపిస్తాయి. ఒకసారి ఎదో మాటా మాటా పెరిగి తన మీద అలిగి భోజనం చెయ్యకుండానే నిద్రపోయాను. ఆ మర్నాడు, "అన్నం మాని ఎవరి మీద కక్ష సాధిద్దాం అనుకుంటున్నావు?" అని తను అడిగినప్పుడు తను చూసిన చూపు మర్చిపోలేను. నా బిహేవియర్ కీ నాకే సిగ్గేసింది. ఒకరి మీద అలిగి అన్నం మానేయటం, పనులు మానేయటం లాంటివి తనకు నచ్చవు. చాలా స్వతంత్ర్య భావాలు కలది తను. తనకి సమయం ఇవ్వటం తప్ప నాకు వేరే దారి కనబడలేదు. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే తను లోపలికి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

గదిలోకెళ్ళి 5 నిమిషాలయ్యింది. తనింకా తలుపు తియ్యలేదు. తలుపు కొట్టి పిలవాలనుంది. ఇంకో అయిదు నిమిషాలు ఆగేదా అనుకుంటూ వంట గదిలోకి నడిచాను. పొయ్యి మీద పప్పు ఉడుకుతోంది. తను ఆఫీసు నుంచి రావటం లేటయితే వంట నేనే చేస్తాను. హాల్ లోకి నడుస్తూ బెడ్రూం వైపు చూసాను. తలుపు కింద ఖాళీ లోంచి పడుతున్న వెలుగులో తన నీడ కదులుతోంది. తను పడుకోలేదు. హాల్ లో మూల ఉన్న కుర్చీలో చతికిలబడి స్వాతి మాగజైన్ తిరగేస్తున్నాను. అందులో ఒక జోక్... చెవులకు పెద్ద పెద్ద కట్లు ఉన్న అతనిని అతని మితృడు, "ఏమయింది??" అంటూ పలకరిస్తాడు. "పెళ్ళి చేసుకున్నాకా మా ఆవిడ కబుర్లు వినీ వినీ..!" అని ఆ కట్లు కట్టుకున్న అతను భోరుమంటాడు. అది చూసి ఠక్కున చిన్న నవ్వు వచ్చింది నాకు. ఈ మౌనం కన్నా ఎక్కువ బాధ ఉంటుందా అనిపించింది. ఒక్కోసారి మనసు బాగోక ఎవరితోనూ మట్లాడాలనిపించదు. అలాంటప్పుడు ఏదైనా రాయి అని చదువుకునే రోజుల్లో నా స్నేహితుడు హరి నాకు చెప్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న కథలు రాసే వాడిని. స్వతహాగా రచయితని కాకపోయినా మనసులో మాటలే పెన్నుతో ముచ్చటిస్తూ ఉంటే అవి కాగితం మీద ఒలికేవి. కానీ మనసు అలిగి గదిలో తలుపేసుకుని కూర్చుంటే మాటలెలా వచ్చేది?

బెడ్రూం తలుపు తెరుచుకుంది. శబ్దం విన్నా తల ఎత్తకుండా పుస్తకం చూస్తున్నాను. తన అడుగులు వంటగది వైపు పడ్డాయి. స్టీల్ బిందెకు గ్లాస్, అటు పై తన గాజులు తగిలి ఒక మృదువైన శబ్దం చేశాయి. ఒక నిమిషం తరువాత తను హాల్లోకి వచ్చి, అల్మరలోని చలం 'మ్యూజింగ్స్ ' తీసి నేను కూర్చున్న కుర్చీ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుని చదువుతోంది. మొదటి పేజీ... ఈ పుస్తకాలనేవి భలే గమ్మత్తయిన విషయాలు. తనని పలకరించిన ప్రతి వారికీ పేజి పేజికీ గుప్పెడు అక్షరాలలో బోలెడు కబుర్లు చెబుతూ ఉంటాయి. ఆలోచనల్లోనే ఎన్నో ప్రదేశాలు తిప్పేస్తాయి. మనసు బాగాలేనప్పుడు ఎవరితో మట్లాడాలని ఉండదు కానీ ఎవరైన చక్కగా మాట్లాడుతూ ఉంటే వినాలనిపిస్తుంది. ఆ కబుర్ల గగనంలో మనన్సు కాసేపు విహరించాకా కాస్త తేలికవుతుంది. అందుకేనేమో పుస్తకాలు మనిషికి మంచి నేస్తాలు అంటారు. ఏదో శబ్దం విని ఈ లోకంలోకి వచ్చాను. పప్పు ఉడుకుతోంది. ఇప్పుడు వెళ్ళి స్టవ్ కట్టకపోతే మాడటం మొదలెట్టి ఆ వాసన ఇల్లంతా పరుచుకుంటుంది. కుర్చీకి ఎదురుగా ఉన్న టీపాయి మీద కాళ్ళు పెట్టి తను పుస్తకం చదువుతోంది. ఈ మూల కుర్చీలో కూర్చుంటే ఇదొకటే దారి. తనని డిస్టర్బ్ చెయ్యాలని లేదు. తను పేజీలు తిప్పుతోంది. అక్కడ పప్పు మాడుతోంది. నేను తలెత్తి వంటగది వైపు చూసాను. పుస్తకం టీపాయి మీద బోర్లించి తను లేచి కిచెన్ లోకి వెళ్ళింది. నిజానికి తనది చాలా అర్థం చేసుకునే మనస్తత్వం. మా ఇద్దరి మధ్యా తగాదాలు ఎంతో కాలం ఉండవు. అలాంటిది ఆ రోజు మాకు తెలియకుండానే చిన్న విషయం మా మధ్య పెద్ద తుఫాను సృష్టించింది. ఇప్పుడు తలుచుకుంటే అంత చిన్ని విషయానికి వారం రోజులు ఈ మౌన పోరాటామా? అని నవ్వు వస్తుంది. స్వాతి కూడా ఇలానే ఆలోచిస్తే బాగుండు!

తనొచ్చి మళ్ళీ యధాస్తానంలో కూర్చుని పుస్తకం చదువుతోంది. తనకా పుస్తకం ఎన్ని కబుర్లు చెప్తోందో.. నాకు మాత్రం గడియారం సెకన్ల ముల్లు ఆగకుండా చేస్తున్న రొద.. ఈ నిశ్శబ్దంలో ఆ అలికిడి నాకు టార్చర్ లా ఉంది. కూర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాను. "నాకు ఆకలేస్తోంది.." అన్న తన మాట విని నేను తన కళ్ళని ఎదుర్కుంటానన్న ఆలోచన వచ్చేలోపే నా కళ్ళు తన కళ్ళతో కలిసాయి. ఆ కళ్ళు, వాటిలో కోపం లేదు, బాధ లేదు, ఎలాంటి భావమూ లేదు. నిశ్చలంగా నిశ్శబ్దం గా ఉన్నాయి. "భోజనం వడ్డించమంటావా?" అని తనడిగిన ప్రశ్నకు చిన్న చిరునవ్వుతో "హ్మ్.." అని మాత్రమే సమాధానం ఇవ్వగలిగాను. తన వెనుకే అడుగులేస్తూ..
"అన్నట్టు పప్పులో నేను ఉప్పు వెయ్యలేదు!"
"ఉప్పే కాదు, ఏమీ వెయ్యలేదు :) నే వేసాలే...."

Saturday, April 25, 2009

..Interval..

రావద్దనే తీరానికి,
అడ్డగిస్తున్న గాలులతో
ఎగసి పడుతున్న ఎర్రని అలల మధ్య,
ఒంటరిగా సాగే ఈ పయనంలో...
ఒక్క క్షణం ఆగే వీలుంటే..!!

*************************
ఎప్పుడో?? ఒక చిన్న బ్రేక్!

Friday, April 24, 2009

Flower



Pluck this little flower and take it, delay not! I fear lest it
droop and drop into the dust.

I may not find a place in thy garland, but honour it with a touch of
pain from thy hand and pluck it. I fear lest the day end before I am
aware, and the time of offering go by.

Though its colour be not deep and its smell be faint, use this flower
in thy service and pluck it while there is time.


- Gitanjali

Tuesday, April 14, 2009

మోసం - నిజం

నాకు నవ్వు రావటం లేదు. రాకుండా నవ్వే నవ్వు ఎంత కృత్రిమంగా ఉంటుందో తెలియదా.. అయినా నవ్వితేనే ఆనందంగా ఉన్నట్టా? నవ్వితే చాలా? ఆనందమో కాదో అన్నది నీకు పట్టదా? ఒక్క రోజు నవ్వుతూ లేకపొతే ఏమైంది అని ఎంతో కంగారు పడుతూ అడుగుతావు. నీ బరువుకి నా జారుడు మొహం కూడా తోడైతే నువ్వు మోయలేవనిపిస్తుంది. ఒక సారి నవ్వుతాను. బాగానే ఉన్నానంటాను. ఇంత దూరం నుంచి నేనిచ్చే ఆ సామాధానం నిజమనుకుని సమాధానపడతావు నువ్వు. ఎంత వెర్రి నేస్తానివి... నిన్ను మోసం చేయటం ఎంత సులువో..! 'నమ్మిన వాళ్ళని మోసం చేస్తావా?' అని నీ ఆ నమ్మకం నన్ను ప్రశ్నిస్తోంది. తనకేం తెలుసు? నేను బాధపడేప్పుడు ఆ బాధ కంటే ఆ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవన్న ఆలొచన నన్నింకా బాధపెడుతుందని, అందుకే ఆ మోసాన్నే నిజం చెయ్యటానికి వచ్చే ఆ అలకి ఆనకట్ట కట్టేస్తున్నానని...

అల లేనినాడు సముద్రపు ఒడ్డు కూడా ఎడారితో సమానమే కదా...