Sunday, June 12, 2011

సముద్రం - ఓ అనుభవం

అబ్బ సముద్రం!! ఎంత బాగుందో!
ఇక్కడ దేనికీ అంతు లేదు. లోటు లేదు. దాయలేనంత ఆకాశం, పట్టుకోలేనన్ని అలలూ.... ఎప్పుడూ సరదాగా అలరిస్తూ కవ్విస్తూనే ఉన్నాయి. అలల సవ్వడి నాకు చాలా చాలా నచ్చేస్తుంది. గట్టిగా వీస్తున్న గాలికి ఎదురు నిల్చున్నా, పక్కగా నిల్చున్నా భలే సరదాగా ఉంది. ఎంత బాగుందో ఆ గాలితో పాటు పరుగుపెడుతూ తడి ఇసుకలో చిన్నగా అలల్ని తాకటం. వచ్చే అలని తప్పించుకుంటూ ఆడే ఆటలు..... తడిచి, మునిగి చేసే అల్లర్లూ... ఇసక మేడలూ... అబ్బ సముద్రం!! నాకు తెగ నచ్చేసింది. నేను ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉండిపోతా...... ఎప్పటికీఈ.......

సాయం సంధ్య. అలసటతో ఇసకలో కూర్చుని ఆకాశాన్ని చూస్తున్నాను. అలా చూస్తూ కాసేపటికి మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ ఇసుకలో పడుకున్నాను. వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని అలా చూడటం, భలే బాగుంది. మెల్లగా చీకటి దట్టమైంది. ఎవరో పిలిచినట్టు గా అనిపించింది. తల తిప్పి చూసాను. ఎవరూ లేరు!! అక్కడ నేను తప్ప ఎవరూ లేరు. మరి పిలిచిందెవరు??!! సన్నగా ఏదో భయం. పగలంతా స్నేహం గా ఉన్న అలలు ఇప్పుడు ఎందుకో బెదిరిస్తూ మీదికొస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ముసుగు బూచాడొచ్చేస్తాడని, అమ్మ చెప్పేది. ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు అవి నల్లగా ఆ బూచాడులాగే కనిపిస్తున్నాయి. ఒక బూచాడు కాదు. బోలెడంతమంది!! గాలి ఈలలు వేస్తుంది. నాతో పరుగుపందాలేసిన ఆ గాలేనా! వణుకుతున్నాను. భయంతోనే అని తెలిసి ఇంకా భయమేసింది. చెమటలు పట్టేసిన చర్మాన్ని ఇసుక చల్లని కత్తిలా కోస్తుంది. నా కింది నేల కదులుతున్నట్టు, ఎక్కడికో అగాథం లోకి పడిపోబోతున్నా అన్నట్టుంది. పట్టుకుందామని పిడికిలి బిగించాను, పట్టు దొరకట్లేదు ఇసుక జారిపోతుంది. ఏవేవో గొంతులు కూడా వినిపిస్తున్నాయి, ఎవరివో చాలా ఉన్నాయి. కానీ ఏమీ మాటలు అర్ధం కావట్లేదు. కొన్ని ఏడుస్తున్నాయి, కొన్ని నవ్వుతున్నాయి. కొన్ని చిన్నగా మాట్లాడుతున్నాయి. సముద్రం లో ఏది విసిరినా వెనక్కొచ్చేస్తుందట. అంటే ఇవన్నీ ఇక్కడ మనుషులు గతంలో మాట్లాడుకున్న మాటలా.... లేక సముద్రం లో మునిగిపోయి చనిపోయిన వాళ్ళా? భూతాలై తిరుగుతున్నారా..??!!! "ఎవరూ?" అని గట్టిగా అడగాలనిపించిది కానీ గొంతు పెగలటం లేదు. కదలాలంటే భయం. చూపు తిప్పాలంటే భయం. కళ్ళు మూయాలంటే భయం. ఎంతో దగ్గరగా తోచిన ఆకాశం, ఇప్పుడు నాకేం తెలీదన్నట్టు దూరం గా నిల్చుని ఏటో చూస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. నన్ను ఇక్కడ్నుంచి తీసుకెళ్ళిపో అని పైకి అరవలేకపొతున్నాను. అయినా ఎందుకు ఎవరికీ అర్ధం కావటం లేదు?! ఒక్కతినే ఉన్నా కదా... ఇలా నన్ను ఇన్ని రకాలుగా బెదిరించచ్చ్చా.. ? నేనేంచెసా అని??!! పోనీ దేవుడైనా వచ్చి నన్ను భయపెడుతున్న వాళ్ళని కొట్టాలి కదా. ఏదో ఒక రూపం లో రావచ్చు కదా. కానీ ఎవరికీ ఇవేం పట్టటంలేదు. అదిగో బూచాడొచ్చేసాడు. అలలు నా అరికాళ్ళను తాకుతున్నాయి. ఇంకొంచంసేపట్లో నన్ను మింగేస్తాడు. ఎవరూ రావటం లేదేం ఇంకా?!! దేవుడు లేడా? ఉంటే రాడేం?? నన్నెందుకు ఇంత కష్టపెడుతున్నాడు? ఒంటరిని చేసి పరీక్షిస్తున్నడు??!!

అమ్మా! నేను ఇంటికి రాలేదు కదా, నా కోసం వెతుకుతూ నువ్వైనా నన్ను తీసుకెళ్ళటానికి రావాఆఅ....... Plzzzzzzzzzz..........




*****************
People are disturbed not by things but by the view they take of them.
- Epictetus, c 200 AD

The only devils in this world are those running around inside our own hearts, and that is where all our battles should be fought.
-Mahatma Gandhi

3 comments:

Pranav Ainavolu said...

చాలా బాగుంది. అయితే అంతా మన ఆలోచనాలవల్లే అంటారు.
కింద ఉటంకించిన గాంధీ గారి మాటలు కూడా బాగున్నాయి.

kiran said...

chaala bagundi..:)

RAANAM said...

Nice
raanam.blogspot.com