తెలీని భాష, కొత్త మనుషుల మధ్య
సునాయాసం గా నాకు చోటు చూపించావ్
ఇరుకు గదులు, ఇంటి నుండి దూరాలు నన్ను కష్టపెట్టకుండా
నీతో నడిపిస్తూ బజ్జీలు, బుట్టాలు అలవాటు చేసేసావ్
మనసు దారి తప్పి అగాథాల్లోకి పడబోయేప్పుడు
చేయందుకుని ఓదార్చి, తలనిమిరి దారి చూపించావ్
ఎన్నో బరువైన రోజులు, వక్రించిన విధి చేసిన గాయాలు నన్ను మింగెయ్యకుండా అడ్డుపడ్డావ్.
అదేమిటో నువ్వున్నప్పుడు అవెప్పుడూ చిన్నవైపోతాయ్.
అలాంటి నీకు, 'నీతోనే ఉంటా' అని ప్రమాణం చేసి కూడా, నీ వేలు విడిచిన ఆ 30 నిమిషాలు నాకింకా జ్ఞాపకమే సుమా!
ఆ రోజు నీ కళ్ళలో కనిపించిన ఆ ప్రశ్నలకు సమధానం చెప్పలేని నేనెంత సిగ్గుపడ్డానో!! నిన్నెంత కష్టపెట్టానో!!
సరిచేసుకోలేని తప్పు, ఏం చేసినా నేను భర్తీ చెయ్యలేని ఖాళీ అది...
దాన్ని నువ్వు స్నేహం తో నింపేసి, నాచేత నాకు క్షమాపణ ఇప్పించేసావ్.
నువ్వు ఏర్పరుచుకున్న కొత్త దారుల్లో సాగే నీతో నేనిక కలిసి రాలేనని చతికిలబడి చూస్తున్న రోజున
కేకపెట్టి పిలిచి నీ కొత్త జీవితంలో నేనూ ఉన్నానన్నావ్.... 'పరవాలేదు, రా....' అంటూ నీ రంగుల ప్రపంచాన్ని పరిచయం చేసావ్
మనసులోని మాటలన్నీ... ఊహల్లో ఊసులన్నీ నీతో పంచుకున్నాను.
నా తెలివి తక్కువ పనులు, ఆకతాయి ఆలోచనలు అన్నీ నీకు తెలుసు.
నీ చమత్కారంతో నా మొండితనం
నీ స్నేహంతో నా ఒంటరితనం
వానల్లో వడగళ్ళలా కురిసి కరిగి కనుమరుగైపోయేవి
అప్పుడు ఏమార్చి, నవ్వించేసావ్.
ఇప్పుడవన్నీ గుర్తుచేసి... ఏడిపిస్తున్నావ్..
పెను తుఫాను ఎదురున్నా భయమేసేది కాదు.
ఏటవాలు మెలికె దారి దాటాలన్నా జడవలేదు.
తెల్లారితే నువ్వొచ్చేస్తావ్... అని నా మనసుకు తెలుసును మరి!!
నీ నిబ్బరాన్ని చూస్తే ధైర్యం వచ్చేసేది నాకు.
మరి ఇక అలాంటి రోజు రాదు, ఈ రోజు వచ్చేసింది. మన దారులు వేరయ్యాయి.
అవును ఇక మీదట కూడా కలుస్తాం.... నిజమే!
కానీ అన్నీ చుట్టపు చూపులే, formal కబుర్లే.....
చిరాకులుండవ్, పరాకులుండవ్.
బై2 లుండవ్, పానీపూరీలుండవ్.
జొన్న పొత్తులుండవ్! టైంపాస్ నడకలుండవ్!!
సరదాలుండవ్, కబుర్లుండవ్
స్నేహాలుండవ్, కలహాలుండవ్.
రేపట్నుంచి నేనెవరికోసం ఎదురుచూస్తాను??
సరిగ్గా భోజనం చేస్తున్నారా లేదా అని ఎవర్ని పట్టించుకుంటాను?!
వంతులెవరితో వేసుకోను?!? ఇదంటే కాదిదంటూ గొడవలెవరితో పడతాను???
అర్రే.... 'సేం పించ్' 'న్యూ పించ్' లు ఎవరికిస్తాను??!!
ఇన్నేళ్ళలో నీకెన్ని కబుర్లు చెప్పానో, ఎన్నెన్ని కథలు వినిపించానో కదా....వద్దన్నా ఆపేదాన్ని కాదే.....
అలాంటిది ఈరోజు మొట్ట మొదటి సారి, 3 వాక్యాలు చెప్పలేకపోయాను నీతో!!.
ఎప్పుడూ అన్నీనీతో పంచుకునే నేను, కన్నీళ్లన్నీ దాచేసాను నీకు కనపడకూడదని.
రేపట్నుంచీ దాచేది లేదు, ఇచ్చేది లేదు....
I am all on my own.
This would be the biggest steep turn of my life so far...
ఒక మెట్రో కూడా ఎంతో ఆప్యాయం గా అనిపించింది అంటే నీ వల్లే!
నన్ను ఋణఘ్రస్తురాలిని చేసేసావ్!!
My Dear, I wish you All the very Best.
Love you loads!
I will miss you. :)
[అప్పుడెప్పుడో తీసిన ఫోటోలు, ఈ రోజు ఈ సందర్భంలో ఇక్కడ పెడతా అనుకోలేదు!!!]
PS - హహహాహా.... ఏదో నా పిచ్చికొద్దీ ఇంత రాసా కానీ, అసలేం చెప్పినట్టే లేదు నీ గురించి!! :D
7 comments:
విశాల గారూ,
GREAT!
ఇంతకన్నా మాటల్లేవు చెప్పడానికి.
నన్ను బాగా ఆకట్టుకునే ఈ శైలి బ్లాగర్లలో చాలా కొద్ది మందికి మాత్రమే సొంతం. అందులోనూ ప్రత్యేకంగా మీది చదివినప్పుడు ఆ ఫీలింగ్ వేరు. చందువుతున్నంత సేపూ ఏం జరుగుతుందో నాకూ తెలుసు అనిపిస్తుంది. కానీ ఎవరయినా వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పుకో అంటే తెల్ల మొహం వేస్తాను. మీకు తెలిసిన ఒక భాష, బాధ మాకు కూడా తెలుసేమో అనే భ్రమ కలిగిస్తారు. హ్యాట్సాఫ్ విశాల.
Beautiful monologue! ఎవరికి తెలుసు?మళ్ళీ రోజుని మీ సరదాలు స్నేహాలు, కబుర్లు, కలహాలతో నింపే మలుపు వస్తుందేమో!
చివర్లో "ఐనా నువ్వు నాకు నచ్చావ్" అంటారనుకున్నా! :)
చాలా బాగుంది....!!!!! :)
కుమ్మేశావ్. నా ఫీలింగ్స్ రాస్తే మురళి కామెంట్ నుంచి కాపీ కొట్టాను అనుకుంటావని రాయట్లేదు. కీప్ కుమ్మింగ్.
చాలా బాగుంది శైలి, సంవిధానం. గుండె బరువెక్కింది
Post a Comment