Sunday, May 27, 2012

తను-నువ్వు

      తనెన్ని మాటలు నేర్చిందో తెలుసా నువ్వెళ్ళాకా! ఇప్పుడు తనకెన్ని ఆశలో, ఎన్ని ఊసులో.... అన్నీ నీ గురించే!! ఏకాంతం పరదా పడగానే నన్ను అల్లేసుకుని నాతో సాల్సానో సామ్బానో ఆడటం ఇప్పుడు తనకో హాబీ!

అది కాకపోతే కబుర్లు కబుర్లు కబుర్లు.......

       ఆ కబుర్లు ఏంటో తెలుసా? నువ్వు వస్తే నిన్ను చూస్తే.. ఎలా ఉండాలో ఏం చెయ్యాలో, ఎలా మాట్లాడాలో... అని ఎన్నో రిహార్సల్స్ వేస్తుంది. నిన్ను చూడగానే నవ్వుతూ 'Welcome Back' అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వాలో లేక 'I missed you' అంటూ అమాంతం గా వాటేసుకోవాలో.. మరి 'hi' అని నువ్వేం చేస్తావో చూద్దామా లేక దాక్కుని నిన్ను ఆటపట్టించాలా... అని...

        తరువాత నీతో కాస్త ఏకాంతం దొరికితే తన భావాలన్నీ చెప్పాలా లేక వాటిని పెదవుల వద్దే ఆపి కళ్ళలో దాచి నిన్ను వెతకనివ్వాలా లేక చిలిపి ఆటలతో నిన్ను మురిపించాలా అని...

         ఇలా నిత్యం నీతో గడపాలనుకునే ప్రతి నిముషాన్నీతన ఊహల్లో అలంకరించుకుంటూ వాటిని ఎప్పుడెప్పుడు మాలగా గుచ్చి నీకివ్వగలనో అని తహతహలాడుతూ తిరిగే తను నడిచే రంగవల్లికలా మురిపెంగా కనిపిస్తుంది. ఎప్పుడూ పరవశం, తన్మయత్వం తప్ప వేరే ఊసేరుగని తన సాంగత్యం నాకు వెన్నెల వెలుగును తలపించేది.

కాల్చే విరహం ఇంత చల్లగా ఉంటుందని వినలేదు నేనెప్పుడూ....



******************************


           తనలో ఏదో చిటపట. వెన్నెల ఎంత నిండుగా ఉన్నా పాలిపోయినట్టు ఉండదు. అలాంటిది ఈ మధ్య తనెందుకో పాలిపోయినట్టనిపిస్తుంది. నిరుత్సాహంగా తిరుగుతుంది. అద్దిన రంగవల్లికలా నిండుగా నవ్వే తానిప్పుడు నడుస్తున్న నిశిలా భారంగా, గంభీరంగా లోతైన కళ్ళతో పేలవంగా తిరుగుతుంది. ఏమంటే ఏమీ లేదంటుంది. వీటన్నిటికన్నా ముఖ్యంగా నీ ఊసులేదు. నీ ఊసు లేనంత మాత్రాన, నీ ఊహ లేదనుకోను!! ఎందుకంటే తడిసిన మట్టి వాసనో, నీకిష్టమైన పాటో తాకిన ప్రతి సారీ ఆ లోతైన కళ్ళలో నల్లని మేఘాలు కమ్ముకోవటం చూసాను. లోయలో పడిన పిడుగు  కొండా,కోనా ప్రతిధ్వనించినట్టు తను నిలువునా స్థంబించి కంపిస్తుంది అలాంటప్పుడు. ఆ కనులు నీరు కారటం నేను చూడలేదు. కానీ తడిపొర కమ్మిన కన్నులు చూసే పదునైన చూపును చూసాను. ఎన్ని వరదలు ఆ కనుకొనలకా పదును చేసాయో!!

వియోగం మంచు ముక్కలా నరాలు తెగేలా కోస్తుందంటే నమ్మలేదు నేను. మీ మధ్యా?  వియోగం??!! ఇదేదో మనస్పర్ధలా అనిపిస్తుంది నాకు.

నువ్వు రా!! నువ్వు త్వరగా వచ్చి ఈ మంచును కరిగించు.

Break the ice, before it cuts through.

7 comments:

చిలమకూరు విజయమోహన్ said...

చాన్నాళ్ళకు

MURALI said...

ఏం చెప్పాలో తెలియక, వచ్చి వెళ్ళానని తెలుస్తుందని.

వేణూశ్రీకాంత్ said...

హ్మ్.. ఏం చెప్పాలో తెలియడంలేదండీ...
వియోగం మంచు ముక్కలా నరాలు తెగేలా కూడా కోస్తుంది నిజం :((
కనపడడాన్కి మంచు(Ice)లాగానే ఉంటుంది కానీ కొన్నిసార్లు అది వజ్రమంత కఠినమైనదిగా మిగిలిపోతుంది ఛేధించడం దుస్సాధ్యమౌతుంది.

Murthy Ravi said...
This comment has been removed by a blog administrator.
Murthy Ravi said...

ఆకాశమంత ఎత్తులో రాస్తావో, సముద్రమంత లోతులో రాస్తావో గాని నాకెప్పటికీ అర్ధం కావు నీ కవితలు. కొన్ని మేఘాలు, కొన్ని కెరటాలు తప్ప. పోని అర్ధం చేసుకుందామా అంటే లోపలన్నీ సుడిగుండాలు. అందుకే భయం నీ కవితలంటే నాకు.

మురారి said...

పూర్తిగా అర్ధం కాలేదు. మగువ హృదయం లానే అర్ధమయి, కానట్టు ఉంది. కానీ కొన్ని వ్యక్తీకరణలు అద్భుతంగా ఉన్నాయి.

>>మరి 'hi' అని నువ్వేం చేస్తావో చూద్దామా లేక దాక్కుని నిన్ను ఆటపట్టించాలా... అని...

>>వాటిని పెదవుల వద్దే ఆపి కళ్ళలో దాచి నిన్ను వెతకనివ్వాలా..

>>లోయలో పడిన పిడుగు కొండా,కోనా ప్రతిధ్వనించినట్టు తను నిలువునా స్థంబించి కంపిస్తుంది అలాంటప్పుడు.

>>మీ మధ్యా? వియోగం??!! ఇదేదో మనస్పర్ధలా అనిపిస్తుంది నాకు.

మేఘన ఎప్పుడూ గుంభనంగా ఉంటూనే లలితంగా.. అద్భుతంగా.. అనిపిస్తుంది.

Unknown said...

any love failure case of any of ur friend?