దట్టమైన అడవి మునిచీకటి అంగీ ధరించి;
తనను వలపు జల్లుల్లో తడిపిన నీలినింగికేసి
అరమోడ్పు కళ్ళతో, తడిసిన మేనుతో చూస్తోంది.
ఇది ఆశ చిగురించిన అడవి మనసు ఒలకబోసే ఆరాధనా భావం.
అవునంటూ ఒక కొమ్మ ఊగింది.
తడబాటు తత్తరపాటు లేని ఆ చేష్ఠకి,
పూలు రెమ్మలు గుసగుసలాడి మురిపెంగా ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నాయి
ఈ అలజడికి వాటి మీదుగా జలజలా రాలిన నీటి బిందువులే ఆ కలయిక లోని హర్షాతిరేకానికి సాక్ష్యం.
-----------------------------------------
ఇది శాశ్వతం కాదంటూ ఆకాశం పయనమయ్యే ప్రయత్నం చేస్తూ గర్జిస్తుంది.
ఈ నిమిషం నిజం. ఈ మమేకం తన్మయత్వం నా అస్థిత్వానికి చిహ్నం. ఆ మర్మం నాలో నాతో ఆజన్మాంతం నా సొంతం.
అంటూ అడవి చీకటి ఒడిలో ప్రశాంతంగా నిదురించింది.
No comments:
Post a Comment