పీకల దాకా కోపం, నరనరం లో ప్రవహిస్తుందా అన్నట్టు ఆమె వళ్ళంతా ఎర్రగా కందిపోయింది. భరించలేని నిస్సహాయత పళ్ళ కింద నలిగిపోతూ కన్నీటి రూపం లో పారుతోంది. జనాభా లేఖ్ఖల్లో కూడా కనిపించని ఆ బంధానికి ఆమె ఎంతో విలువ ఇచ్చింది. ఆ విలువే ఇప్పుడు తన ముందరికాళ్ళ బంధమై, సంకెలై కూర్చుంది. తన మానవత్వానికి, సహనానికి అగ్నిపరీక్ష పెడుతుంది పదే.. పదే..! ఎలాంటి పరిస్థితిలో అయినా మానవత్వం మర్చిపోయి పశువులా ప్రవర్తించకూడదన్న ఒకే ఒక్క కారణంతో మౌనంగా సహనం వహిస్తుంది. తన సహనానికి తగలబడేది తానేనని తెలిసినా, తనలో కర్కసత్వాన్ని కేవలం తనదైన ప్రపంచంలో ఎక్కడో చీకటి మూల లోతైన గోతిలో సమాధి చేస్తూ వచ్చింది. కాష్మోరా మళ్ళీ నిద్ర లేచినట్టు, ఇలా గాలి వీచినప్పుడల్లా పేట్రేగుతున్న అతడి అహంకారాన్ని ఇక సహించలేకపోతుంది. అయినా గతంలో కూడా ఎన్ని సార్లని జరగలేదు ఈ తంతు?! తలచిన ప్రతి సారి పైకి వినపడకుండా లోలోపలే దహించిపోయేట్టు ఏడ్చిన పైశాచిక రాత్రులేన్ని లేవని..! అలా లోలోపల కుమిలిపోవటం తప్పితే ఏం చేయగలిగింది? అయినా ఏదైనా ఆ రాత్రికేగా... ఆ రాత్రి గడిస్తే తుఫాను తరువాతి ప్రశాంతత లా ఉన్నా, చెల్లాచెదురైన బంధాన్ని ఏరికొచ్చి మళ్ళీ గూడు కట్టాలి, తనే... ప్రతిసారీ! కట్టినా అదేన్నా...ఆళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసును?! ఆమె కట్టడం - అతడు కూల్చనం... ఇదో ఖరీదైన అలవాటైపోయింది వారికి. ఎంత మూల్యం చెల్లించాల్సివచ్చినా సరే ఒక్కసారి కూడా ఆమె వెనుదిరగలేదు, వదిలేయలేదు?! "ఎలాగూ పోయేదే కదా అని ఊపిరి పీల్చకుండా ఉంటామా? ఇదీ అలానే." అంటుంది. తప్పదు... దీర్ఘరోగంతో బాధపడుతున్న తన సహచరిని భరించక తప్పదు. ఆమె శరీరం ఉన్నంత కాలం వారి బంధాన్ని ఆమె మోయక తప్పదు. నచ్చని వ్యవహారాలను, అసహ్యం కలిగించే రీతిని ఒప్పుకోక తప్పదు. చావైనా, బ్రతుకైనా.. ఏదేమైనా నీతోనే అనుకోక తప్పదు. ఏదో ఒక రోజున మారకపోతాడా అన్న ఆశతో కాలం గడపక తప్పదు......
తప్పదు, ఎందుకంటే వారిది వీడిపోని బంధం కాదు.. విడదీయలేని బంధం. తప్పుడు బంధం కాదు.. తప్పని బంధం!!
2 comments:
నిజమే వారిది విడదీయరాని బంధం!
:( - valla bandhaniki....
:) - mammalni antha la feel ayyela chesinatlu rasinanduku.... :D
Post a Comment