కష్టకాలంలో, నన్ను ఓదార్చటానికి కాక, ఆ సమయంలోనూ వినబడే శ్రావ్యమైన రాగాన్ని గుర్తుచేసేందుకు నా తోడుంటావని…
అపజయాల పాలైన సమయంలో నాకు ఊరట కలిగించేందుకు కాక, నా శక్తి పై నమ్మకంతో నా సామర్ధ్యాన్ని నాకు గుర్తుచేసేందుకు నా వెన్నంటి ఉంటావని…
నాలోని లోపాలను సమర్ధించేదుకు కాక, ‘అన్ని వేళాలా నీవు నా ప్రేమకు పాత్రురాలివి’ అని నమ్మకం కలిగించేందుకు నా ఫిర్యాదులను సైతం ఓపికగా వింటున్నావని…
ఒంటరిగా ఉండాలనిపించిన వేళల్లో సైతం, నా వెంట ఉండటం ద్వారా కాక, తిరిగి వచ్చేందుకు ఒకే ఒక కారనమవటం ద్వారా, ‘నేను ఒంటరిని’ అన్న భావన నాకు కలుగనివ్వవని…
బహుమతులిచ్చో లేక మేలు చేసో కాక, ఒక చిన్ని చిరునవ్వుతో నా మనసును గెలుచుకోగలవని…
నన్ను మాత్రమే కాక ప్రకృతిలోని ప్రాణులన్నిటినీ ఇదే భావంతో ఆదరిస్తావని…
‘మోక్ష సాధన’ అన్న భావావేశానికి అతీతమై, వైరాగ్యం నుండి సైతం వైరాగ్యం పొందిన విరాగి, యోగివని...
ఎవరిమీదైతే నమ్మకం ఉంచానో...
అలాంటి నీవు, నీ తత్వమే నాలో ప్రవహిస్తూన్న వేళ, నీవు శ్రుతింపగా మోగే మురళి కావాలనుకునే నన్ను, వెండి మురళి కోరటం న్యాయమా? విన్న వెంటనే ఆక్రోశంతో ఊగిపోయాను. తక్కెడలో భక్తితో వేసిన తులసీ దళం కన్న తేలికైన నీవేనా ఈ మాటన్నది? కోరావని, నీకు లోహపు మురళిని సమర్పించి నా ఆత్మను నేనే పరిహసించుకోలేను. ఒక వెదురు ముక్క తేవటం తేలికే... అలా అని దొరికిన వెదురు ముక్కను నీ చేత పెట్టి మురళి అనలేను. ఇటు మురళి లేకుండా నీ విగ్రహాన్ని చూడలేను. ఈ పరీక్ష, నా నమ్మకానికా? లేక నాకు నీ పై ఉన్న మమకారానికా? లేదా 'నీవు, నేను ' అని... నేనే ఒక భ్రమలో జీవిస్తున్నానా???
హ్మ్.. భ్రమలో జీవిస్తేనేం!! వీడేవరకూ అదే నిజం. నా నమ్మకమే నాకు ముఖ్యం. నా నమ్మకం పై నమ్మకముంచి, భారం అంతా నీపై మోపి, విరిగిన నీ మురళిని జోడించి దానినే నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించటం, లేకపోవటం నీకే వదిలేస్తున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం.
*******************************************************************************************
నా కృష్ణుడి బొమ్మ కున్న మురళిని నా స్నేహితులు తెలియక పుల్ల ముక్కనుకుని విరగొట్టేశారు. అదీ సంగతి. ఆ విషయం చెప్తే విని, 'వెండిది పెట్టు ' అన్న సలహా ఇస్తే వచ్చిన ఆవేశం ఇది... ఆ మాత్రం దానికే ఇంత చెయ్యాలా అంటే.... ఏం చేస్తాం, కొన్ని జీవితాలంతే!! ఏమీ చెయ్యలేం.
4 comments:
మీరందించిన వేణువుని వేదనాదంలా పూరిస్తున్నాడు. సకల చరాచర జీవకోటిని ఆకర్షిస్తున్నాడు- అమ్మలా నాన్నలా గురువులా దైవంలా బిడ్డలా బంటులా భార్యలా నేస్తంలా....
వేణుగానం ’మది’ బృందావనం అంతటా విహరిస్తోంది అప్పుడది వెన్నెలవేళ మల్లెలవేళ నవ్వులవేళ వేయివేణువులుమోగేవేళ హాయిగా చల్లగా పాడేవేళ
రాధా మీరాల్ని మరిపిస్తున్నారే!
మీ టపా రాధ గాని చదివితే, కృష్ణుడి పై మీ ఆరాధనను చూసి ఈర్ష్య పడుతుందేమో! అదే యశోద అయితే ఈ కాలం లోనూ తనబిడ్డకు మోహన గారి లాంటి ఆరాధకులు ఉన్నందుకు తప్పకుండా మురిసిపోతుంది.
మీ ఆరాధన ప్రతి వాక్యం లోనూ స్పష్టంగా కనిపిస్తున్నది.
కన్నయ్య అంతే ! వున్నవాడు అడిగినవన్నీ ఇదామని వేచి వుండి అహ్వానించినా వెళ్ళడు.లేనివాడు నావల్ల కాదన్నా వదలక వెంట తిరుగుతూ లేవన్నా కావాలని వేధిస్తుంటాడు.
Post a Comment