Friday, July 31, 2009

నీ ప్రశ్నలు నీవే... [Lyrics]

ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన పాటల్లో ఈ పాట ఒకటి. 'కొత్త బంగారులోకం' చిత్రంలోని ఈ పాట బాలు గారి స్వరంలో వినేప్పుడు మనసులో కలిగే స్పందన నా మాటల్లో చెప్పలేను. ఎందుకో ఇక్కడ భద్రపరుచుకోవాలనిపించి......

*******

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరో బదులివ్వరుగా..
నీ చిక్కులు నీవే ఎవ్వరూ విడిపించరుగా..!

ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో తెలియదంటే చెల్లదుగా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..!

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా...
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..!

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా...
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా...
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా...!


అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా?
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా?
గతముందని గమనించని నడిరేయికి రేపుందా?
గతి తోచని గమనానికి గమ్యం అంటు ఉందా..?

వలపేదో వల వేసింది వయసేమో అటు తోస్తుంది.
గెలుపంటే ఏదో ఇంత వరకు వివరించే ఋజువేముంది??
సుడిలో పడు ప్రతి నావ... చెబుతున్నది వినలేవా..?


పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా?
ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా?
మన కోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా??

కడ తేరని పయనాలెన్ని..! పడదోసిన ప్రణయాలెన్ని..!
అని తిరగేశాయా చరిత పుటలు వెనుజూడక ఉరికే వెతలు.
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు???
ఇది కాదే విధి రాత..! అనుకోదేం ఎదురీత...!!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా...
అపుడో ఇపుడో కననే కనను అంటుందా..

ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా...
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..

బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా...
పొరబడినా పడినా జాలిపడదే కాలం మనలాగా...
ఒక నిమిషం కూడ ఆగిపోదే నువ్వొచ్చేదాకా.....

Tuesday, July 28, 2009

స్వేచ్ఛ

అనంతమైన నీ నుండి స్వేచ్ఛానుభవము గోరి, ఉప్పొంగి, విడివడి సంకల్పపు రెక్కలు తొడిగి అత్యున్నత శిఖరాలను అధిరోహించితిని..
సంతృప్తి లేని ఒంటరి జీవినై, నిత్యానందము ప్రసాదించు ప్రేమ కొరకు వెదకుచు దేశాటనము చేసితిని...
విరహమో, వేదనో మరి వెతుకులాటయో... ఒక తోడు కొరకు తహతహలాడుతు విధి చూపిన మార్గముననుసరించితిని...
ఒక నాడు, ఊహించని రీతిన భగవంతుని దూతయనిపించెడి అదృశ్య హస్త ద్వయముల ఆలింగన స్పర్శచే పరవశించితిని..
అట్టి అనుభవమును శాశ్వతముగ పొందవలెననెడి బలీయమైన కాంక్ష మనసును ముసరగ ఆ క్షణమును ఒడిసిపట్టితిని...
ప్రేమామృతము సేవించిన మరు క్షణమున అహము నశించి, స్వేచ్చా స్వాతంత్ర్యములతో ఆనందమై జాలువారితిని...
ఉరకలెత్తు నవ చైతన్యము సంతరించుకున్న నేనిదివరకెరుగని నేను సరికొత్త పుంతలు త్రొక్కుతు ప్రవహించితిని....
ప్రేమైక మైకమున, ప్రకృతితొ మమేకమై, జీవితముననుభవించినట్టి ఉత్సాహముతో సంతుష్ఠుడనైతిని...
నీ చెంత చేరవలెనన్న ఆశతో, ఎగసిపడు ఉద్వేగముతో పరుగులెత్తుతు, విజయోత్సాహముతో నీలో చేరితిని....




తండ్రీ, ఇట్టి స్వేచ్ఛను ప్రసాదించిన నీ ప్రేమ అపారము, అనిర్వచనీయము.....

Friday, July 17, 2009

హ హ హా... హహహహహ హ హ హా..................

"హ హ హా... హహహహహ హ హ హా.................."

"ఊరికే ఎందుకు అంతగా నవ్వుతున్నావు?"
భయపెట్టే ప్రశ్న ఇది!!. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనందుకు విక్రమార్కుడి తల వంద చెక్కలవుతుంది అని బేతాళూడంటాడు. కానీ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిపోతే నీ గుండె వేయి ముక్కలవుతుంది అని ఆత్మారాముడు హెచ్చరిస్తూ ఉంటాడు. అందుకే.... ఇలా కాదని, ఒక సారి చెవులు ఘట్టిగా మూసుకుని ఆలోచించేసాను.......

"ఊరికే ఎందుకు అంతగా నవ్వుతున్నావు?"
ఇది.. బయటపడలేని పైశాచిక చేష్ఠకు మారు రూపం కావచ్చు. అవగతం చేసుకున్న నిస్సహాయత మింగెయ్యకుండా అడ్డుపెట్టుకున్న చిన్న కవచం కూడా కావచ్చు. లోనుండి భయపెట్టే నిశ్శబ్ధమైన అగాధం హోరు నుండి తప్పించుకునేందుకు చేసే షోరు కావచ్చు. ఒక హిపోక్రట్ కు ప్రాణం పోసే ఊపిరి కావచ్చు. వచ్చే కన్నీరుకు "ఆనందం" పేరిచ్చే ప్రయత్నం కూడా కావచ్చు.

ఒక్క మాటలో... లోపల ఉన్న విషాన్ని హుందాగా బయటకు కక్కేసి నెక్ష్ట్ ఛాలెంజ్ కు రెడీ అయ్యేందుకు నాకు తెలిసిన ఒకే ఒక మార్గం కావచ్చు.


--------------------------------------------------------------------------------------------
అర్రే... నా గుండె ఇప్పుడు వేయి ముక్కలయ్యిందా? లేనట్టుందే!! అంటే, ఆత్మారాముడు కూడా అప్పుడప్పుడూ అనవసరంగా భయపె(ప)డతాడన్నమాట!! హ హ హా... హహహహహ హ హ హా..................

Thursday, July 16, 2009

మౌనం, మాటల - దాగుడుమూతలు

అఫీసుకు బయలుదేరినదాన్ని, ఏదో మాటల్లో పడి అలానే కుర్చీలో కూర్చున్నాను. షేర్ మార్కెట్ గురించి అత్త, నాన్న ఏదో మాట్లాడుతున్నారు.

"నా ఫ్రెండ్ కుమార్, బోలెడంత డబ్బు సంపాదించాడు. మార్కెట్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తూ, టెన్షన్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ పెరగటం, తగ్గటం మామూలే. తీసుకునే రిస్క్ మీద ఒక అవగాహన ఉండాలి..."

"కాస్త తెలివి ఉంటే ఇక్కడ సంపాదించటం చాలా తేలిక అన్నయ్యా గారూ.. ఒక వారం లొ 10 కి 5 సంపాదించచ్చు. బ్యాంక్ లో వేస్తే ఎప్పటికి వచ్చేను ఆ 5?!" అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది అత్త.

"అత్తా నాకు తెలియకడుగుతాను, మార్కెట్ లో మనీ ఏమీ మేనుఫాక్చర్ అవ్వదు కదా...! అంటే నీ డబ్బు వేగంగా పెరుగుతుంది అంటే ఆ డబ్బు ఎవడో పోగొట్టుకున్నదనే కదా?"

"అలా కాదే.. ఇక్కడ ఎవడికి తెలివుంటే వాడు సంపాదించుకుంటాడు. అంతే..."

"నిజమే షేర్ మార్కెట్ అంటే పేకాటలాంటిది." అని నాన్న గొంతు వినిపించింది.

"అందుకే నాన్నా, నాకు అందులో డబ్బు ఇన్వెస్ట్ చెయ్యటమంటే నచ్చదు."

నాన్న నన్ను చూసారు. ఆ చూపులో అదో రకమైన అంగీకారం లేని స్వీకారం కనిపించింది. నేను అత్తను చూసాను.

మధ్యలో ఇవేమి సరిగా అర్థం కాని అమ్మ ఏదేదో అంటూ అమాయకంగా నవ్వుతుంది. మాటల్లో పడ్డాను అన్నది ఒక వంక. నిజానికి ఉన్న చోట నుండి అడుగు ముందుకు పడట్లేదు. "ఇక బయలుదేరతానమ్మా.." అని చెప్పి లేచి నిల్చున్నాను. అమ్మ వచ్చి దగ్గరకు తీసుకుంది. నా ముఖంలో ఎలాంటి హావ భావాలు రావట్లేదు. అమ్మ శరీరం నాకు తగులుతూ ఉన్నా, తనని చేతులతో ముడివెయ్యాలనిపించినా మరి ఎందుకో అలాగే నిల్చున్నాను. ఉంటానని చెప్పి రెండడుగులు వేసి, మళ్ళా వెనక్కి తిరిగి,

"మొబైల్ చార్జర్ పెట్టుకో అక్కడ టేబుల్ పైన ఉంది"

"సరే..", అంటూ అమ్మ నాతో పాటు గుమ్మం బయటకొచ్చింది.

"బయట మబ్బుగా ఉంది. వర్షం పడచ్చు. ఒక పావుగంట త్వరగా బయలుదేరండి."

"అలాగే.."

"స్టేషన్ లో జాగ్రత్త...."

"మేము జాగ్రత్తగానే ఉంటాం గానీ నువ్వు జాగ్రత్త. ఆఫీసులో ఎక్కువ సేపు ఉండకు. ఇంటికి త్వరగ వెళ్ళిపోతూ ఉండు."

"సరే.. వెళ్ళి త్వరగా స్నానం చేసెయ్యి. ఇంకో అరగంటలో కారొస్తుంది."

"అవును. సరే జాగ్రత్త.."

"హ్మ్.. ఇంటికెళ్ళాకా ఫోన్ చెయ్యండి.

"సరే.."

"ఉంటాను, బై"

"హ్మ్.. బై"

భారంగానే అడుగులు ముందుకు పడ్డాయి......


----------------------------------------------------------------------------------------------------------------------
కొన్ని సార్లు ఎంతో express చెయ్యాలనిపించి కూడా... చెయ్యలేకో, ఎలా చెయ్యాలో తెలియకో మరి... చెయ్యకుండానే ఉండిపోతాం. అలా అని అస్సలు చెయ్యకుండా ఉండం. అసలు విషయాన్ని కప్పేస్తూ ఎదో ఒకటి చెప్తుంటాం!! :). ఒకవేళ ఆ సమయంలో, "ఏదో ఉంది, ఏంటో చెప్పు!!" అని అవతలి వ్యక్తి నిలదీస్తే గనక చెప్పేందుకు మాటలు రావు. బయటకు అంతా మౌనమే.. లోపల మాత్రం, చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ కోసం తన్నుకుంటున్న అభిమానుల్లా ఉంటాయి మాటలు!!

ఏంటో ఈ.........

Tuesday, July 14, 2009



You pour down all your Love on me.
You are Rich and Generous.
You are Beautiful and Loving.
But I cant take it anymore.
- said the valley

"Take??!!!"
Your Depth is my Height.
You "Give" me Space.
You "Gave" me Life.
I never Gave. Thats my flow.
- replied the waterfall