Thursday, July 16, 2009

మౌనం, మాటల - దాగుడుమూతలు

అఫీసుకు బయలుదేరినదాన్ని, ఏదో మాటల్లో పడి అలానే కుర్చీలో కూర్చున్నాను. షేర్ మార్కెట్ గురించి అత్త, నాన్న ఏదో మాట్లాడుతున్నారు.

"నా ఫ్రెండ్ కుమార్, బోలెడంత డబ్బు సంపాదించాడు. మార్కెట్ ని జాగ్రత్తగా స్టడీ చేస్తూ, టెన్షన్ అవ్వకుండా ఉండాలి. ఇక్కడ పెరగటం, తగ్గటం మామూలే. తీసుకునే రిస్క్ మీద ఒక అవగాహన ఉండాలి..."

"కాస్త తెలివి ఉంటే ఇక్కడ సంపాదించటం చాలా తేలిక అన్నయ్యా గారూ.. ఒక వారం లొ 10 కి 5 సంపాదించచ్చు. బ్యాంక్ లో వేస్తే ఎప్పటికి వచ్చేను ఆ 5?!" అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది అత్త.

"అత్తా నాకు తెలియకడుగుతాను, మార్కెట్ లో మనీ ఏమీ మేనుఫాక్చర్ అవ్వదు కదా...! అంటే నీ డబ్బు వేగంగా పెరుగుతుంది అంటే ఆ డబ్బు ఎవడో పోగొట్టుకున్నదనే కదా?"

"అలా కాదే.. ఇక్కడ ఎవడికి తెలివుంటే వాడు సంపాదించుకుంటాడు. అంతే..."

"నిజమే షేర్ మార్కెట్ అంటే పేకాటలాంటిది." అని నాన్న గొంతు వినిపించింది.

"అందుకే నాన్నా, నాకు అందులో డబ్బు ఇన్వెస్ట్ చెయ్యటమంటే నచ్చదు."

నాన్న నన్ను చూసారు. ఆ చూపులో అదో రకమైన అంగీకారం లేని స్వీకారం కనిపించింది. నేను అత్తను చూసాను.

మధ్యలో ఇవేమి సరిగా అర్థం కాని అమ్మ ఏదేదో అంటూ అమాయకంగా నవ్వుతుంది. మాటల్లో పడ్డాను అన్నది ఒక వంక. నిజానికి ఉన్న చోట నుండి అడుగు ముందుకు పడట్లేదు. "ఇక బయలుదేరతానమ్మా.." అని చెప్పి లేచి నిల్చున్నాను. అమ్మ వచ్చి దగ్గరకు తీసుకుంది. నా ముఖంలో ఎలాంటి హావ భావాలు రావట్లేదు. అమ్మ శరీరం నాకు తగులుతూ ఉన్నా, తనని చేతులతో ముడివెయ్యాలనిపించినా మరి ఎందుకో అలాగే నిల్చున్నాను. ఉంటానని చెప్పి రెండడుగులు వేసి, మళ్ళా వెనక్కి తిరిగి,

"మొబైల్ చార్జర్ పెట్టుకో అక్కడ టేబుల్ పైన ఉంది"

"సరే..", అంటూ అమ్మ నాతో పాటు గుమ్మం బయటకొచ్చింది.

"బయట మబ్బుగా ఉంది. వర్షం పడచ్చు. ఒక పావుగంట త్వరగా బయలుదేరండి."

"అలాగే.."

"స్టేషన్ లో జాగ్రత్త...."

"మేము జాగ్రత్తగానే ఉంటాం గానీ నువ్వు జాగ్రత్త. ఆఫీసులో ఎక్కువ సేపు ఉండకు. ఇంటికి త్వరగ వెళ్ళిపోతూ ఉండు."

"సరే.. వెళ్ళి త్వరగా స్నానం చేసెయ్యి. ఇంకో అరగంటలో కారొస్తుంది."

"అవును. సరే జాగ్రత్త.."

"హ్మ్.. ఇంటికెళ్ళాకా ఫోన్ చెయ్యండి.

"సరే.."

"ఉంటాను, బై"

"హ్మ్.. బై"

భారంగానే అడుగులు ముందుకు పడ్డాయి......


----------------------------------------------------------------------------------------------------------------------
కొన్ని సార్లు ఎంతో express చెయ్యాలనిపించి కూడా... చెయ్యలేకో, ఎలా చెయ్యాలో తెలియకో మరి... చెయ్యకుండానే ఉండిపోతాం. అలా అని అస్సలు చెయ్యకుండా ఉండం. అసలు విషయాన్ని కప్పేస్తూ ఎదో ఒకటి చెప్తుంటాం!! :). ఒకవేళ ఆ సమయంలో, "ఏదో ఉంది, ఏంటో చెప్పు!!" అని అవతలి వ్యక్తి నిలదీస్తే గనక చెప్పేందుకు మాటలు రావు. బయటకు అంతా మౌనమే.. లోపల మాత్రం, చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ కోసం తన్నుకుంటున్న అభిమానుల్లా ఉంటాయి మాటలు!!

ఏంటో ఈ.........

4 comments:

Kathi Mahesh Kumar said...

" లోపల మాత్రం, చిరంజీవి సినిమా మొదటి ఆట టికెట్ కోసం తన్నుకుంటున్న అభిమానుల్లా ఉంటాయి మాటలు!! " అందుకేగా బ్లాగులున్నది...కానిచ్చెయ్యండి. మొదటి ఆట షురూ!!!

శేఖర్ పెద్దగోపు said...

కొన్ని భావోద్వేగాలను మాటల్లో పెట్టకుండా ఉంటేనే బావుంటాయి. ఆ రోజు మీరు ఆఫీస్ కి సెలవు పెట్టుకుని ఉండాల్సింది కదా..
>>"మార్కెట్ లో మనీ ఏమీ మేనుఫాక్చర్ అవ్వదు కదా...! అంటే నీ డబ్బు వేగంగా పెరుగుతుంది అంటే ఆ డబ్బు ఎవడో పోగొట్టుకున్నదనే కదా?"
ఈ మాటలకు ఒక్కసారిగా నా స్నేహితుడు స్ట్రైక్ అయ్యాడు.

Purnima said...

hhahahahahahahhahahhahahaahhahaha!

Unknown said...

awesome !!

really loved it