Monday, November 30, 2009

మేఘన - 1

ఆకాశం అంతా నల్లగా, కాటుక చెదిరిన ఆమె కళ్ళలా...
సుడులు తిరుగుతూ యే నిమిషమైనా కురిసేలా ఉన్న ఆ ఆకాశాన్ని ఆమె కళ్ళు తదేకంగా చూస్తున్నాయి, నువ్వు ముందా నేను ముందా అన్నట్టుగా.......

ఒక్కసారిగా గాలి వేగం పెరిగి ఉధృతమయ్యింది. వరండాలో నిల్చున్న మేఘన గాలి ధాటికి కళ్ళు మూసుకుంది. పండిన నిన్నటి ఆకులు నిస్సహాయంగా రాలుతున్నాయి. మూసిన ఆమె కళ్ళలోంచి నిన్నటి జ్ఞాపకాల ఆనవాళ్ళలా...

*****


ఆకాశం లో నీలం రంగు డబ్బా ఒలికినట్టు ఉంది, అబ్బ.. ఎంత నీలమో!
మేఘనా... రోజూ చూసేదే కదా.. ఆ ఆకాశం. ఈ రోజు కొత్తేముంది?? ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు నువ్వు.
హే.. కాంట్ యూ సీ?? ఈ రోజు ఎంత ప్రకాశవంతం గా ఉందో..? నిన్న వేరేగా ఉంది.
సరే తల్లీ..ఉంది. చాలా బాగుంది. ఓకే నా! ఇక పద. లంచ్ బ్రేక్ అయిపోయింది. టీం మీటింగ్ ఉంది ఈవాళ గుర్తుందా?
ఓ!! యెస్. మర్చిపోయాను. ఈవాళ మేనేజర్ తో నెక్ష్ట్ క్వార్టర్ కి వచ్చిన టాస్క్ లిస్ట్ లో సెకెండ్ దాని గురించి డిస్కస్ చెయ్యాలి. యాక్ట్యూల్లీ అందులో క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం.....
అబ్బా..పొరపాటున మా నోట్లోంచి ఒక్క పదం వస్తే, నువ్వు 100 మాట్లాడేస్తావు కదా...
ఏంటీ? పదాలా? వాక్యాలా?!!
నిన్నూ... ఆగు..
(హహహహ....)

*****

మేఘనా, టైమవుతోంది. బయలుదేరదామా?
హ్మ్..
మళ్ళీ ఒకసారి ఆలోచించుకోమ్మా, ఇదే ఆఖరి అవకాశం.
అవును, జరిగిన తప్పును సరిదిద్దేందుకు నాకిదే ఆఖరి అవకాశం. దీన్ని జారవిడుచుకోలేను.
ఎంటో!! నీలాంటి అమ్మాయికి...
టైమవుతుంది బాబాయ్.
సరే పద. అంతా దైవేచ్ఛ.
ఇంతకీ జయంత్ ఎక్కడ? ఈ రోజు కూడా లేటేనా!

(బైక్ ఆగింది.)
సోరీ అంకుల్. వచ్చే దారిలో శృజన వాళ్ళ అక్కని కలవాల్సి వచ్చింది. బయలుదేరదామా?
మీ గురించే చూస్తున్నాం. నువ్వు, శృజన, మేఘన వెనక కూర్చోండి. నేను ముందు కూర్చుంటాను.
జయ్, మేఘనను అడుగుతా అన్నావ్ కదా.
గుర్తుంది. మేఘనా, ఒకసారి ఇలా వస్తావా?
నువ్వు ఇష్టం గానే చేస్తున్నావు కదా. ఏమీ బలవంతం ఫీల్ అవ్వట్లేదు కదా?
ఈ నిర్ణయం నా ఇష్ట ప్రకారమే తీసుకున్నాను. ఎవరి బలవంతం లేదు.
నా వల్ల మీ ఇద్దరి మధ్యా...
నువ్వంటూ లేకపోయినా నేను ఈ నిర్ణయమే తీసుకునేదాన్ని శృజన. సో, నువ్వు గిల్ట్ ఫీలయ్యేందుకు ఏమీ లేదు.
థాంక్యూ మేఘనా. నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయి నాకు స్నేహితురాలు కావటం నాకు చాలా సంతోషం గా ఉంది.
కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకముందే నన్ను స్నేహితురాలిని చేసేసావా జయంత్?
హే, అలా కాదు. ఫ్లో లో...
పదండి టైమవుతుంది. బాబాయ్ వెయిట్ చేస్తున్నారు.

(ఇష్టం లేని జీవితం చావు కన్నా దుర్భరం కదూ... నీకు ఆ పరిస్థితి రానీయను జయంత్.)

(ఇది అదృష్టమనుకోవాలో, విధి రాత అనుకోవాలో... ఒకే కార్ లో వెళ్ళి విడాకులు తీసుకునేంత చనువు, ఫ్రీడం వీళ్ళ మధ్య..! ఇలాంటి కార్యం నా చేతుల మీదుగా!! హ్మ్....)

అంకుల్, అక్కడ ఈరోజు మేము చెయ్యాల్సిన పని ఏమైనా ఉందా?
ఒక్క సంతకం పెట్టటమే... అంతకన్నా ఏమీ లేదు.
ఓకె.

*****
ఆకాశం ఇంకా గర్జిస్తునే ఉంది. కారు కిటికీలోంచి బయటకు చూస్తున్న మేఘన ముంగురులు ఎవరో హడావుడిపెడుతున్నట్టు ఆమె చెంపలపై కదులుతున్నాయి. ఆమె దృష్టి మాత్రం ఎక్కడో... అంతరాల్లో ఎవో పేజీలను గబ గబా తిరగేస్తూ.... పరీక్షకు వెళ్ళే ముందు విద్యార్ధి లా ఆమె ధ్యాస అంతా ఆ పేజీల మీదనే... ఆమె ఆలోచనలు యే పేజీలను మీటుతున్నాయో.. అవి యే రాగాలు పలుకుతున్నాయో..! ఆ రాగాలను వినగలిగేది మాత్రం కేవలం ఆమె మనసు మాత్రమే!!
*****

మేఘనా..... I am coming to India next monday. నీ పెళ్ళి తరువాత ఇన్నాళ్ళాకి కలుసుకోగలుగుతున్నాం. I am so excited!!!!
హ్మ్... me too..
మిమ్మల్ని ఇద్దరినీ ఎప్పుడెప్పుడు కలుస్తానా అని నాకు ఎంత ఆత్రం గా ఉందో తెలుసా!! నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్ళి చెసుకున్నావ్. I am soooo happy for you dear.. ఫోటోలు పంపలేదేం అని అడిగినప్పుడల్లా నువ్వు చెప్పిన సాకులు వినీ వినీ విసుగెత్తిపోయాను. నీకు తీరిక అయ్యే లోపు నేనే వచ్చేస్తున్నా.... కనీసం అక్కడైనా నాకు మీ ఫోటోలు చూపిస్తావా?
Sure. ఇక్కడికి రా... అన్నీ వివరంగా మాట్లాడదాం.
Sure.. Sure. ఒక్క విషయం కూడా వదలకుండా అన్నీ చెప్పాలి, నేను వినాలి. I want to know everything. Ok then. You take care. see you soon. Bye
Bye.

[టూట్....టూట్....]
*****

(ఒక పెద్ద మెరుపు మెరిసింది.)
మేఘనా... కోర్ట్ మీకు విడకులు మంజూరు చేసిందమ్మా.
(దూరంగా పిడుగుపాటు శబ్దం. బాబాయ్ మాటలు ఆ శబ్దం లో కలిసిపోయాయి.)

మేఘనా... నువ్వు బలవంతం చేసావనే తప్పితే నాకు ఇలా...... ఇదంతా నాకు మనస్పూర్తిగా ఇష్టం లేదు. సృజనను నేను ఇష్టపడటం నిజం. కానీ నీకు ఇలా అన్యాయం చేసి....
ఇప్పుడు ఈ వివరణలు దేనికి జయంత్? నీ గురించి నాకు తెలియనిదా చెప్పు? న్యాయం, అన్యాయం లాంటీ పెద్ద మాటలు అవసరం లేదు. నేను చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దీని వల్ల నాకేదో తీరని నష్టం జరిగిపోయిన రేంజిలో చూడకు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది.
సరే... నిన్ను కష్టపెట్టను. ఐతే ఒక విషయం. ఈ సంతకాలు, విడాకులు, ఫార్మాలిటిస్ ఇవన్ని మన పెళ్ళికి మాత్రమే, స్నేహానికి కాదు. నువ్వంటే నాకు ఎనలేని గౌరవం, అభిమానం. ఇవి ఎప్పటికీ అలానే ఉంటాయి. నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా నీకు నేను ఉన్నానని మర్చిపోకు.

జయంత్?! నువ్వు చెప్పిన ఈ విషయాలన్నీ నాకు తెలిసినవే. నాకు తెలుసును అన్న సంగతి నీకు కూడా తెలుసు. తెలిసీ ఇప్పుడు ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావ్? నీకు లోపల యేమైన గిల్టీ ఫీలింగ్ ఉంటే ముందు అది వదులు.

ఎలా మేఘనా...?? నాకు అన్ని విధాలా అన్నీ సమకూర్చిన నిన్ను ఈ రోజు ఇలా వదిలేస్తున్నా అంటే... నా అంత స్వార్ధపరుడు ఇంకొకరు ఉండరు.
సృజన, ఏమీ అనుకోనంటే నేను జయంత్ తో కొంచం ఎకాంతం గా మాట్లాడాలి.
Sure.. నేను కార్ లో వెయిట్ చేస్తాను.
Thank you. బాబాయ్, మీరు కూడా...
చూడూ జయంత్. ఇన్నాళ్ళు ఒకరి బాధ్యత ఒకరు తీసుకున్నాం. నిర్వర్తించాం. స్నేహపూర్వకం గా మెలిగాం. అభిమానించుకున్నాం. ఒకరికొకరు అండగా నిలిచాం. కానీ ఒకరినొకరు ప్రేమించుకోలేదు. అలాంటి మన మధ్య ఈ పెళ్ళి అనే బంధం ఒకరినొకరికి బాధ్యత గానే మిగులుస్తుంది తప్ప సహచరునిగా కాదు. ఇన్నాళ్ళూ నేను అనుభవించని ఒక రకమైన స్వాతంత్ర్యం ఈ రోజు ఆ కోర్ట్ హాలులో ఆ కాగితం మీద చిన్న సంతకంతో లభించింది. నువ్వంటే ఇష్టం లేదని నా అభిప్రాయం కాదు సుమా.. కానీ అలా అనిపించింది. నాకు బాధ లేదని అనటం లేదు. కష్టమో, నష్టమో ఇన్నాళ్ళు కలిసి ఉన్న మనం ఇలా ఇప్పుడు విడిపోవటం నాకూ బాధ గానే ఉంది. కానీ నీకు-నాకు కూడా ఇదే మంచిది. అది కాలం తో పాటు మనకి అవగతం అవుతుందని భావిస్తున్నాను. కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే నీకే అంతా అర్థమవుతుంది. ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నా, నీ ఉద్దేశాలు, భావాల విషయంలో నిజాయితీగా ఉండి నువ్వు నాకు కొంత మేలే చేసావు. నా జీవితంలో ఒక స్నేహితుడి అవసరం ఉన్న సమయంలో, నేస్తాలన్నీ దూరమై ఒంటరిగా మిగిలినప్పుడు అన్నీ అయ్యి నేను కోల్పోయిన నా పై నా నమ్మకాన్ని నిలిపి, ప్రతి మనిషికీ అవసరమైన ఆత్మ స్థైర్యాన్ని నీ సావాసం లో పొందేలా చేసావు. ఈ బంధం నుండి నేను ఉత్త చేతులతో వెళ్ళట్లేదు. ఎన్నో అనుభవాలను తీసుకెడుతున్నాను. ముఖ్యం గా నన్ను నేను పొందాను. నువ్వు నా గురించి గాభరా పడకు.

హ్మ్మ్...
అన్నట్టు ఈ రోజు సాయంత్రం నేను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను.
అదేంటీ???
మరోలా అనుకోకు జయంత్. ప్రస్తుతం నా జీవితంలో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. You know it. వాటికి నేను ఎంత త్వరగా అలవాటుపడితే అంత మంచిది. అందుకే, I need a change.
అది కాదు....
కాదనకు జయంత్. ప్లీజ్!!
Ok. Whatever pleases you.
Thanks. I know you would understand.

*****
కుండపోత వర్షం. కారు అద్దం పై నీటి చారికలు ఎవరి మనోగతాన్ని వివరించాలనో తాపత్రయపడుతున్నాయి!
*****

to be contd.......

9 comments:

మధురవాణి said...

very interesting start.!
waiting for the next episodes..

చిలమకూరు విజయమోహన్ said...

ఎదురుచూపులు

భావన said...

చాలా కొత్త గా వుంది థీమ్ కాని బాగుంది.

మురారి said...

A sensible conflict point. పాత్రధారులందరూ పరిణితి చెందిన వారవ్వడంతో టపా మరింత హుందాగా ఉంది.

వర్షపు ఆకాశం తో mood ని establish చెయ్యడం తెగనచ్చింది. కేవలం డైలాగుల ద్వారా నెరేట్ చెయ్యడం.. బ్రాకెట్ల ఉపయోగం బాగున్నాయి.

>>ఆకాశాన్ని ఆమె కళ్ళు తదేకంగా చూస్తున్నాయి, నువ్వు ముందా నేను ముందా అన్నట్టుగా..

>>కుండపోత వర్షం. కారు అద్దం పై నీటి చారికలు ఎవరి మనోగతాన్ని వివరించాలనో తాపత్రయపడుతున్నాయి!

పై రెండూ హత్తుకున్నాయి.

ఇక నచ్చని technicalities:

>>కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకముందే నన్ను స్నేహితురాలిని చేసేసావా జయంత్?

ఈ డైలాగు వరకూ ప్లాట్ రివీల్ కాకపోవడం. కొంచం ముందే చెప్పుంటే బాగుండేది.

>>ఆకాశం లో నీలం రంగు డబ్బా ఒలికినట్టు ఉంది..

ఈ పారాలో తన character ని ఇంకా లోతుగా వివరించి ఉంటే బాగుండేది.

ఇవన్నీ చిన్న చిన్న డీటైల్స్ మాత్రమే.

ఫైనల్ గా చక్కని ఆవిష్కరణ. అభినందనలు.

మోహన said...

Thanks everyone.

కార్తీక్ said...

మోహన గారు బాగుంది మేఘన-2 కోసం ఎదురు చూస్తున్నను ..

www.tholiadugu.blogspot.com

ఏకాంతపు దిలీప్ said...

>>కోర్ట్ విడాకులు మంజూరు చెయ్యకముందే నన్ను స్నేహితురాలిని చేసేసావా జయంత్?

ఇక్కడ పాత్ర మాట్లాడుతున్నట్టు కాకుండా, రచయిత పాత్ర చేత మాట్లాడించినట్టు అనిపించింది.

అవును, ఎదురు చూపులు...

Indeevara said...

chaala baagundandi

Unknown said...

beautiful! ఇంతకు మించి ఇంకేమీ చెప్పలేను. :)