Tuesday, December 15, 2009

మేఘన - 2

మేఘం కరిగింది. వాన వెలిసింది. ప్రకృతి మాత్రం ఇంకా అలానే ఉంది. తడిగా, స్తబ్ధుగా....
*****

బాబాయ్, కార్ ఇక్కడ ఆపండి. నాకు ఇక్కడ కొంచెం పనుంది. అది చూసుకుని ఇంటికెళ్తాను.
సరే, జాగ్రత్త. త్వరగా ఇంటికెళ్ళిపో. [ఎన్ని అర్థాలో!!]
బై.
బై.
..................
..................
(ఆమె చక చకా నడుస్తోంది. చూపంతా ఎదురుగా ఉన్న రోడ్ పైన. అమె దృష్ఠి మాత్రం ఇక్కడ లేదు. ఎక్కడ ఉందో ఆమెకు కూడా తెలిసినట్టు లేదు. హడావుడిగా కదులుతున్న జనంతో రోడ్ అంతా రద్దీగా ఉంది. పక్కన్నుంచి పోయిన ట్రక్, హార్న్ శబ్దంతో ఆమెను కుదిపింది. ఒక్క సారిగా రద్దీని గమనించిన మేఘన...)

అంతా వారి వారి గమ్యాలవైపు కదులుతున్నారు. మరి నాకెందుకు ఏమీ తెలీటంలేదు? ఎటెళ్ళాలి నేను?

(ఈ ఆలోచన ఉప్పెనై పొంగి ఒక్క సారిగా ఆమెను ముంచేసింది. తన్నుకొస్తున్న బాధని పంటి కింద నొక్కిపెట్టి....)

ఆటో....!!
(ఆటో గిర్రున వెనక్కి తిరిగింది)
బీచ్ కి వస్తావా?
మీటర్ మీద 5 రుపీస్ ఎక్స్ట్రా....
హ్మ్.

('ఒంటరిని' అన్న ఊహతో, మనసు మరుగున పడ్డ ఎన్నో సంఘటనలు ఆలోచనలై ఆమెపై దాడి చెసాయి. గుచ్చి గుచ్చి వేధిస్తున్నాయి. తనని చూసి వెకిలిగా నవ్వుతున్నాయి. పైకి కనిపించకుండా ఆమె రక్తాన్ని తోడేస్తున్నాయి. నక్కల్లా ఆమెను పీక్కు తింటున్నాయి. ఆ బాధకి కళ్ళంట నీరు ధారలుగా ప్రవహిస్తుంది. తన పైట కొంగును పంటితో కరిచిపెట్టి ఒక్క గుక్క కూడా పైకి వినపడకుండా ఉండేందుకు ఆమె విశ్వ ప్రయత్నం చేస్తుంది.)
....

(ఆటో ఆగింది.)
ఇంకో అయిదు ఇయ్యమ్మా.
(మేఘన విసిరిన చూపుకు ఆటో వాడు పళ్ళికిలించి...)
వానలో బీచ్ ఏటి తల్లీ?
(సమాధానం లేని మేఘన, చక చకా రోడ్డు దాటి అటువైపున్న వినాయకుడి గుడిలోకెళ్ళి మెట్లపై కూలబడింది.)

*****
Time and Tide waits for none, వానలో అయినా వరదలో అయినా...! వారం గిర్రున తిరిగింది.
*****

మనసెప్పుడు మూగైనా, వాగైనా ఏదో వెతుకుతూ ఉంటుంది. దాన్ని ఏమనాలి? ఒక ఊతం?? అది దొరగ్గానే భుజం మీద వాలిపోయో, కౌగిలిలో ఇమిడిపోయో, వడిలో చేరిపోయో... ముఖం దాచేసుకోవాలంతే! పొంగుతున్న పాల మీద కాసిన్ని నీటి చుక్కల్లా... ఓదార్పులు ఆ నిముషానికే! లోపల రగులుతున్న జ్వాలాగ్ని చల్లారే దాకా ఆ పొంగటాలు, పొర్లటాలు ఆగవు. సమయం చూసుకుని విజృంభిస్తూ ఉంటుంది. అసలు ఆ మూగ, వాగు.. ఏమిటో, అర్థం లేకుండా...! దాన్నెవరూ పట్టించుకోవట్లేదని బాధా? పోనీ పట్టించుకుంటే చాలా? సరిగా అర్థం చేసుకోనక్కర్లేదూ? నిజమే, అసలు బాధ అదే అనుకుంటా! అర్థం చేసుకోవట్లేదని. నిజానికి, పట్టించుకోపోయినా అంత బాధ ఉండదు. ఎంత ఆశో!! ఒక మనసు ఇంకో మనసుకు అనుకున్నట్టుగా స్పందించాలనీ... మొత్తంగా అర్థం చేసుకోవాలనీ!! అయ్యే పనేనా?? కాదని తెలుసు. కానీ ఒప్పుకుంటే కదా! ఇంత మొండి పట్టు ఎందుకో మరి. ఒక మత్తైన, గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ మనసుందే, అది మర్చిపోతుంది. జ్వాలాగ్ని, స్టవ్ లో గాస్ లాగా ఆగకపోయినా ఏదో ఒక రోజుకు అయిపోతుంది. తెలివైన వాళ్ళు గిన్ని మార్చేస్తారు. ఆ అగ్నిని వేరే దానికి ఉపయోగిస్తారు. నాలాటి మూర్ఖులు దాన్నలానే మండనిస్తారు. పూర్తిగా కాలిపోరు. ఎందుకంటే పూర్తిగా తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా! So..... ఎంత గాస్ కి, అంత మంట. ఎంత మంట కి అంత మాడు. ఈలోపు మెదడే గెలుస్తుంది. బ్రతకాలి కదా మరి?? అదన్నమాట. ఏమన్నా అర్థమయ్యిందా?

లేదు?! 'ఎలా ఉన్నావు, how is married life?' అంటే ఏమిటో చెప్తున్నావ్!! నాకేం అర్థం కావట్లేదు. మీ మధ్య ఏమైనా గొడవలా?
చ, ఛ! అదేం లేదు. తను చాలా మంచి వాడు. మా మధ్య అసలు గొడవలెప్పుడూ రావు. పొరపాటున వద్దామన్నా ఇక మీదట రావు. ఇప్పుడు మేము కలిసి ఉండట్లేదు. విడాకులు తీసుకున్నాం.

What???!$%&*&^#
Yes. I am divorced.
How can Jayant do this to you? ఒకొర్నొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు కదా! అలాంటి మీ మధ్య విడాకులేంటీ??
ఆగాగు... నీకు ఇంకో విషయం చెప్పాలి. చెప్పటం కంటే చూపించటం బెటర్ ఏమో! ఉండు. ఆ... ఇది చూడు, నా పెళ్ళి ఫోటో.
WHAT?????????!$%&*&^# నువ్వు పెళ్ళి చేసుకున్నది జయంత్ ని కాదా????
జయంత్ నే!
మరి ఫోటోలో నీ పక్కన ఇతనెవరు??
నా లైఫ్ లో డ్రామా కి ఏం తక్కువ లేదు జాహ్నవీ. కాలేజీలో నేను జయంత్ ని ఇష్టపడ్డాను. ఆ తరువాత చాలా కాలం స్నేహితులం. అదంతా నీకు తెలిసిందే. ఆ తరువాత ఇంట్లో 'పెళ్ళీ' అంటున్నారని జయంత్ దగ్గర పెళ్ళి ప్రస్తావన తెచ్చాను. తను వద్దన్నాడు. నేను లైట్ తీసుకున్నాను.
నువ్వా? లైట్ తీసుకున్నావా?? అది నేను నమ్మాలా??? నాకు తెలుసు నువ్వు తనని ఎంతగా ఇష్టపడ్డావో?!
అదేలే... ఒక 2-3 ఇయర్స్ పట్టింది, ఆ విషయం ఒక కొల్లిక్కి రావటానికి. ఇప్పుడవన్నీ అంత క్లోజప్ లో చెప్పడం ఎందుకులే అని, ఒకే ఒక లాంగ్ షాట్ లో లాగిస్తున్నా అన్నమాట.
అలా కాదు, వివరంగా చెప్పు. అసలేం జరిగింది?
నవ్వుతూ casual గా చెప్తున్నా కదా అని ఇదంతా చెప్పటం నాకు తేలికగా ఉందనుకుంటున్నావా??
హ్మ్.. సోరీ. నా ఉద్దేశం అది కాదు. సరే .. you continue. తరువాత ఏమైంది?
ఏమవుతుందీ? పెళ్ళైంది.
అదే, ఎలా?
ఇతను మా నాన్న గారి స్నేహితుల చుట్టాలబ్బాయి. నాకు అబ్బాయి పేరు వినగానే గుండె ఆగినంత పనైంది. నాన్న గారికి మాత్రం అబ్బాయి చాలా నచ్చాడు. లక్షణమైన కుర్రాడు. పేరు ఒకటే అన్న కారణం తో మంచి సంబంధం వదులుకోవాలి. ఐనా పరవాలేదు. నీకు నచ్చకపోతే మానేద్దాం అన్నారు. ఒక పక్క బాధ గానే ఉంది. గోరు చుట్టు మీద రోకటి పోటులా... పుండు మీద కారం లా...! ఇలా కాదని ప్రాక్టికల్ గా ఆలోచించాను. నాన్న చెప్పింది నిజమే అనిపించింది. పెళ్ళి కి 'ఊ' అన్నాను. 'మంచాడు ' 'చదువుకున్నాడు ', 'ఈడూ-జోడూ' లాంటి కామెంట్లతో మా ఇద్దరికీ పెళ్ళి కుదిర్చారు. అనుకున్నవి అన్నీ నిజమే. జయంత్ నిజంగానే చాలా మంచోడు.
చాలు ఆపు మేఘనా! అసలు నీ జీవితం ఇలా అవ్వటానికి నువ్వే కారణం. నీది మంచితనం అనుకోవాలో, పిచ్చితనం అనుకోవాలో నాకర్థం కావట్లేదు. నిన్ను ఈ పరిస్థితిలో నిలబెట్టిన వాడిని అసలు నువ్వు ఎలా పొగుడగలుగుతున్నావ్?
అలా అనకు జానూ. నువ్వు నా మీద అభిమానం తో ఇలా మాట్లాడుతున్నావు కానీ నిజానికి తనతో నువ్వు ఒక్క సారి మాట్లాడితే నువ్వే నాకంటే పొగుడుతావ్ తెలుసా!
అంత మంచోడైతే నిన్ను ఎందుకు వదిలేశాడు?
మా ఇద్దరికి కుదరదు కనుక.
ఆ ముక్క పెళ్ళికి ముందు తెలీలేదా?
శాంతం విను జానూ. తప్పు అంతా తన మీదకు తోసెయ్యకు. ఇక్కడ నీ ఫ్రెండ్ ఏమీ తక్కువ తినలేదు. మా పెళ్ళైన కొత్తలో తను నాకు దగ్గరవటనికి చాలా ప్రయత్నించాడు. నేను మాత్రం తనని ఒక స్నేహితుడిగా తప్ప జీవిత భాగస్వామిగా చూడలేకపోయాను. అప్పుడప్పుడు నా మూడ్ స్వింగ్స్ తో చిరాకు తెప్పించేదాన్ని. ఉత్త పుణ్యానికి, కారణాల్లేకుండా చాలా సార్లు తన మీద చిరాకు పడేదాన్ని. నిజానికి నాకు 'తన' మీద కోపం కాదు, నా మీద! నా మానసిక వైకల్యం మీద!! పెళ్ళి చేసుకుని ఇతన్ని కష్టపెడుతున్నా, ఇతని జీవితం స్పోయిల్ చేసా అన్న భావం నన్ను అనుక్షణం తరుముతూ ఉండేది. నిద్దట్లో కూడా.... ఆ బాధంతా విపరీతమైన చేష్ఠల రూపంలో తన మీద కక్కి తనకి మనశ్శాంతి లేకుండా చేసాను. భరించలేని పక్షంలో బైటకెళ్ళిపోయేవాడు. లేకపోతే తన గదిలోకెళ్ళి తలుపేసుకునేవాడు. అంతే కానీ నన్ను పల్లెత్తు మాట అనలేదు ఎప్పుడూ! ఎందుకు? ఏమిటీ? అని కూడా ప్రశ్నించలేదు. అలాంటప్పుడు కూడా నేను టైం కి తింటున్నానా లేదా..., నా ఆరోగ్యం ఎలా ఉంది.. ఇవన్నీ గమనిస్తూనే ఉండేవాడు. అతను గమనిస్తున్నాడన్న సంగతి నేను గమనిస్తూనే ఉండేదాన్ని. అలా కొంత కాలం గడిచింది. తన స్నేహితులకు నేనంటే ఎనలేని గౌరవం. అదంతా నా గురించి తను చెప్పిన దాని వల్లే అని నాకు చాలా సార్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి మనిషిని కష్టపెట్టటం భావ్యం కాదని, ఒక రోజున నేను కాలేజ్ లో 'జయంత్ అనే వ్యక్తిని ఇష్టపడ్డాను' అని తనతో చెప్పాను. విషయం విని ముందు డంగ్ అయ్యాడు. అప్పటి వరకు నా చేష్టలు అన్నీ ఒక్క సారిగా అర్థమయినట్టు చూసాడు. ఇద్దరి పేర్లు ఒకటే కావటం తనక్కూడా ఆశ్చర్యం కలిగించింది. తరువాత సున్నితం గా నన్ను ఓదార్చాడు. తను ఈ విషయాన్ని చాలా హుందాగా తీసుకున్నాడు. 'నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్? దేనికైనా నీకు నా support ఉంటుంది' అని ధైర్యం చెప్పాడు. ఐతే నాతో మానసికం గా దూరం పెంచుకుంటున్న సంగతి తను గమనించలేదు. నేను పసిగట్టాను. కొన్నాళ్ళకి ఇద్దరం మంచి స్నేహితులయ్యాం. అప్పుడే తనకి శృజన తో పరిచయం అయ్యింది. చాలా మంచిది. జయంత్ తన పరిచయాన్ని, సాంగత్యాన్ని ఇష్టపడుతున్నాడని గ్రహించాను. వారి మధ్య చనువు పెరుగుతుందని అనిపించగానే మా స్నేహం ఇచ్చిన ధైర్యం తో జయంత్ ని సూటీగా శృజన గురించి అడిగాను. 'పెళ్ళికి ముందు పరిచయం అయ్యి ఉంటే శృజన ను పెళ్ళి చేసుకుని ఉండేవాడిని' అని చెప్పాడు.

ఓహ్..! ఆ మాట విని నీకు బాధ, జయంత్ మీద కోపం లాంటివి కలగలేదా?
కోపం లేదు. ఎందుకో కాస్త బాధ ఐతే అనిపించింది. అన్నిటికంటే తన నిజయితీ నా మనసును గెలుచుకుంది.
You love him!
ఇష్టం, I agree. ప్రేమ, తెలీదు. అప్పుడే నేను విడాకుల సంగతి ఎత్తాను. ఇప్పుడు మించిపోయింది ఏమీ లేదన్నాను. తను ససేమిరా అన్నాడు. మెల్లగా ఒప్పించాను. నా మాట కాదనలేడు ఎప్పుడూ!
హుహ్?!!! నీకు తెలియట్లేదో, మరి తెలిసే కప్పిపుచ్చుకుంటున్నావో... నువ్వు లోలోపల చాలా ఏడుస్తున్నావు కదా? నిజం చెప్పు.
ఇందులో అబద్దం చెప్పటానికి, దాయటానికి ఏం లేదు. ఒట్టి ఏడుపు కాదు, కుళ్ళి, కుళ్ళి ఏడుస్తున్నాను.
మరి పైకి ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావ్? ఎవరి కోసం ఈ నటన??
నటన అని అనలేను, ప్రయత్నం అనుకో. నిజానికి మనసులో బాధంతా చెప్పుకునేందుకు ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది. గట్టిగా ఏడవాలని కూడా ఉంది. కానీ ఆర్ట్ మూవీ హీరోయిన్ లా ఏడుస్తూ... మొహం వాల్చి కుర్చోటం నాకు నచ్చదు. Thats not me! బాధ ఉంది. I am just letting it pass through. నా జీవితం లో జరుగుతున్న మార్పులను హుందాగా తీసుకోవాలని చాలా కోరికగా ఉంది. చూద్దాం, ఎంతవరకు వెళ్ళగలనో....
అమ్మా వాళ్ళూ ఎలా రియాక్ట్ అయ్యారు?
వాళ్ళకి ఇంకా తెలీదు. చెప్పలేదు.
అదేంటి? ఇంత పెద్ద నిర్ణయం నీ అంతట నువ్వే తీసుకున్నావా? తప్పు చేసావు మేఘనా!!
ఇంట్లో తెలిస్తే నా మీద సానుభూతి, తన మీద కోపం, యుద్ధం ప్రకటిస్తారు. ఆ రెండూ నాకు ఇష్టం లేదు. ఇక నిర్ణయం విషయానికొస్తే, ఇది నా జీవితం. ఎప్పుడు ఏం చేసినా ఆ నిమిషానికి, ఆ సందర్భానికి ఏది చేస్తే మంచిది అనిపిస్తుందో అదే చేసాను. అంతకు మించి ఆలోచించలేను. ఆలోచించటం నాకు రాదు కూడా.
ఏదో రకంగా నీ నిర్ణయాన్ని నువ్వు సమర్ధించుకుంటున్నావు. అంతే కానీ, అది నీ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది ఒక సారి ఆలోచించి ఉండాల్సింది.
భవిష్యత్తు గురించి ఆలోచించి చేసినవి ఎనాడూ ఫలించలేదు జానూ! అయినా ఇప్పుడేం చేసేది లేదు. ఇప్పుడు తప్పు చేసా అనుకుని లాభం కూడా లేదు. నాకలాంటి ఉద్దేశం ఈ విషయంలోనే కాదు, ఇప్పటి వరకు తీసుకున్న ఏ నిర్ణయం గురించీ లేదు. జీవితం అనేది 'వన్ సైడెడ్.' వెనక్కి చూడటాలు ఉండవు. అల్లుకుంటూ పోవడమే!
నాకెందుకో నువ్వు అమ్మా వాళ్ళతో కొన్నాళ్ళు ఉండటం మంచిది అనిపిస్తుంది.
లేదు. ఇప్పుడు నాక్కావలసింది సానుభూతో, ఓదార్పో కాదు. నాకు కాస్త సమయం కావాలి. నాకు నేను స్థిమిత పడాలి. ఆ తరువాత ఇంట్లో చెప్తాను.
ఈ లోపు తెలిస్తే?
తెలిసింది బాబాయ్ కి మాత్రమే. 'వీలు చూసి నేనే చెప్తాను, మీరేమీ అనద్దు.' అని బాబయ్ దగ్గర మాట తీసుకున్నాను. ఒక వేళ తెలిసినా పరవాలేదు. అప్పుడు ఏం చెయ్యాలో అప్పుడు ఆలోచిస్తా. ముందు ప్లాన్ చేసుకోవటానికేముంది? అమ్మ-నాన్న నే కదా.. కాసేపు బాధ పడినా, కసురుకున్నా మెల్లగా అర్థం చేసుకుంటారు.
హ్మ్.. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావ్?
'కస్తూరి బా' హాస్టల్ లో.
ముందు ఏం చేద్దామనుకుంటున్నావ్?
ప్రస్తుతం ముంబై లో నాకు తెలిసిన ఫ్రెండ్ కి వెబ్ సైట్ డిజైనింగ్ కి ఫ్రీలాన్సర్ గా చెస్తున్నా. వేరే జాబ్స్ కి కూడా అప్ప్లై చేస్తున్నాను.
ఏ NGOs కి అప్ప్లై చేసావ్?
NGO కాదు. స్కూల్స్ లో అప్ప్లై చేస్తున్నాను.
ఓహ్..! జాబ్ చేస్తే NGO లోనే చేస్తా అన్నట్టు గుర్తు నాకు?!
అవును. అప్పుడు అన్నాను. కానీ ఈ పరిస్థితిలో సర్వీస్ వర్క్ చెయ్యటం..., నేను దాని మీద మానసికం గా ఆధార పడతానేమో అనిపిస్తుంది. Service చేసే చోట emotions ఉండకూడదు. అందుకే ఆ విషయం నేను కాస్త కుదుటపడ్డాకా ఆలోచిస్తాను.
పోనీ నాతో వచ్చెయ్యరాదూ? కాదనకు.
సరే ఆలోచిస్తాను. రేపు కలిసినపుడు చెప్తాను.
....
....
(కస్తూరి బా హాస్టల్ లో....)
ఇక్కడ మేఘన అనే అమ్మాయి ఉండాలి. కొంచం పిలుస్తారా?
ఆమె నిన్న సాయంత్రం హాస్టల్ ఖాళీ చేశారండీ.
ఆ....!!!
అవునండీ, ఆమె నిన్న సాయంత్రం హాస్టల్ ఖాళీ చేశారు. మీ పేరు?
జాహ్నవి.
ఓహ్.. మిరొస్తే, ఈ ఉత్తరం ఇమ్మన్నారు.

జానూ,
భగవంతుడు నాకు అడుగడుగునా మానసికంగా కృంగిపోయేలా కష్టాలిచ్చినా, ఆ ముళ్ళ కంపల చాటున నీలాంటి నేస్తాల్ని ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. జీవితం లో నేను సాధించింది ఏదైనా ఉంటే అది నీలాంటి స్నేహితుల హృదయాల్లో కాస్త చోటు, బోలెడంత ప్రేమ. ఇవే! మీ అభిమానానికి ఒక్క థాంక్స్ తో బదులివ్వలేను. ఎప్పటికీ మీకు నేను కృతజ్ఞురాలిని. కానీ ఇప్పుడు నీతో రాలేను. నీలాంటి నేస్తాన్ని వదిలిపోవటం.... ఇప్పుడు నాకు ఇదే కరక్ట్ అనిపిస్తుంది. అర్థం చేసుకుంటావు కదా......!

విధి కాస్త అనుకూలిస్తే, జీవితంలో ఏదో ఒక మలుపులో మళ్ళీ నిన్ను కలుస్తా అన్న ఆశతో....

సదా నిన్ను అభిమానించే,
మేఘన.


******
కాస్త ప్రేమకే స్పందించి కురిసే మేఘనకు జీవితంలో అడుగడుగునా ప్రేమ తారసపడుతూనే ఉంది. ఆ ప్రేమకు స్పందిస్తూ ఆమె ప్రతి సారీ కరిగి కురుస్తూనే ఉంది, తన అస్థిత్వాన్ని కోల్పోతూనే ఉంది. తనకంటూ నిలువు నీడ కూడా సంపాదించలేని మేఘన జీవితం లోకం దృష్టిలో ఒక ఓటమి. ఆమెకు మాత్రం అడుగడుగునా స్వచ్ఛమైన ప్రేమను పొందగలిగిన(చూడగలిగిన) తన జీవితం ఒక నిజమైన గెలుపు.
******

సమాప్తం.

5 comments:

Unknown said...

ఇప్పుడే రెండు భాగాలు చదివా. చాలా బాగుంది. కానీ, happy endingsని ఇష్టపడే సాటి తెలుగు సినిమా అభిమానిగా కొద్దిగా బాధనిపించింది. :)

శేఖర్ పెద్దగోపు said...

రెండు ఎపిసోడ్స్ కంటిన్యూస్ గా చదివాను. చాలా చాలా బాగా రాసారు. పరిణితి చెందిన పాత్రలతో బాగా తీర్చిదిద్దారు. అన్నింటికన్నా ఒక డిఫరెంట్ స్టైల్లో చెప్పిన మీ నెరేషన్ చాలా ఆకట్టుకుంది. అక్కడక్కడా బోల్డ్ చేసి రాసిన వాక్యాలు సూపర్బ్...ముఖ్యంగా చివరి లైన్లు...

పోతే(ఎవరు అని అడక్కండి :-) మేఘన క్యారెక్టర్ ని వంద శాతం అర్ధం చేసుకోవటంలో నేను విఫలమయ్యానేమో అని అనిపించింది. అంతా చదివాక నా కొచ్చిన కొన్ని చిన్న చిన్న సందేహాలే అందుకు కారణం.

మీరు కవితలే బాగా రాస్తారు అనుకున్నాను భావోద్వేగాలతో ముడిపెట్టి ఇలా చక్కగా కధలు కూడా రాయగలరని ఇప్పుడు తెలిసింది. అభినందనలు.

ఏకాంతపు దిలీప్ said...

చాలా బాగా రాసారు.

మురారి said...

>>మేఘం కరిగింది. వాన వెలిసింది. ప్రకృతి మాత్రం ఇంకా అలానే ఉంది. తడిగా..
చదవడం అయ్యాక మనసు కూడా కాసేపు అలానే ఉండిపోయింది. బాలచందర్ సినిమా కనపడింది నాకైతే. మనసులో వచ్చిన భావాలని అలా వచ్చినట్టే పెట్టేసారు. దాంతో నిజంగా ఆమె మనసుని చదువుతున్నట్టే అనిపించింది. కారెక్టర్ ని ఎంత బాగా ఆవాహన చేసుకున్నారో మరి!.

కొన్ని బాగా నచ్చినవి:
>>చక చకా రోడ్డు దాటి అటువైపున్న వినాయకుడి గుడిలోకెళ్ళి మెట్లపై కూలబడింది.

>>మనసెప్పుడు మూగైనా, వాగైనా ఏదో వెతుకుతూ ఉంటుంది...
ఈ పేరాగ్రాఫ్ లో మనసు మర్మాల్ని చక్కగా స్పృశించారు.

>>నవ్వుతూ casual గా చెప్తున్నా కదా అని ఇదంతా చెప్పటం నాకు తేలికగా ఉందనుకుంటున్నావా??

>>ఇతని జీవితం స్పోయిల్ చేసా అన్న భావం నన్ను అనుక్షణం తరుముతూ ఉండేది. నిద్దట్లో కూడా...

>>చూద్దాం, ఎంతవరకు వెళ్ళగలనో..

>>నేను దాని మీద మానసికం గా ఆధార పడతానేమో అనిపిస్తుంది.
ఈ లైను వెనుక చాలా thought-process దాగి ఉంది. very deep and correct insight.

>>కాస్త ప్రేమకే స్పందించి కురిసే మేఘనకు..
ఈ ముగింపు మళ్లీ మళ్లీ చదవాలనిపించేలా ఉంది. ఒక సినిమా స్టోరీకి brief description లా ఉంది.

Unknown said...

entha bold ammayi kadaa meghana.. :)
entha badha unna..jeevitham lo chala nerchukundi..nerchukuntundi..
ika tanaki ee jaali..thodu avasaram ledu naa uddesam..

mee style of narration chala magundi.. :)