Sunday, October 14, 2007
మానస సరోవరం...
ప్రకృతి చాలా నిర్మలంగా ఉంది.
పక్షుల్ని తనలో స్వేచ్ఛగా ఎగరనిచ్చే విశాలమయిన నీలి ఆకాశం నిశ్శబ్దంగా ఆ జంటలను చూసి చిరునవ్వులు చిందిస్తోంది. ముట్టుకుంటే మాసిపోతాయేమో అనిపించే పాలనురుగులాంటి మబ్బులు.. అలా అలా గాలితో కలిసి పచార్లు కొడుతున్నాయి. ఆ చెట్లు.. తల్లి,తండ్రి పక్షులు తిరిగి వచ్చేవరకూ... బుల్లి పిట్టలకు ఊయలలూపి వింఝామరలు వీస్తున్నాయి. వీటి చాటున దూరంగా కనిపించే ఆ కొండలు.. ప్రియుని కోసం వేచి చూస్తున్న ప్రియురాలి వలె కనిపిస్తోంది.
ఈ గాలిగాడు మహా తుంటరి! రేపల్లె లో కృష్ణుడు ఒకే సారి అందరి గోపికల దగ్గరా ఉన్నట్టు.... అటు ఆ మబ్బులతో పచార్లు కొడుతూనే.. ఇటు ఈ జలపాతంలో జారే నీటిని ముద్దాడుతున్నాడు. ఆ స్పర్శకి నీటి భామ సిగ్గుతో వంకర్లు తిరుగుతోంది. వీడు అక్కడితో ఆగక... జలపాతంలో జారిన ఆ నీటి భామకు చక్కిలిగింతలు పెడుతున్నాడు. ఆ భామ కేరింతల సవ్వడి చేస్తూ అలలై పారుతోంది/పరుగెత్తుతోంది.
వారి ముచ్చట్లు చూస్తూ మురిసిపోతూ సాగిపోతున్న నన్ను కూడా వీడు వదలలేదు సుమీ...! నా జుట్టు రేపుతూ... నా పైట లాగుతూ... ఒక్క నిమిషం చిన్న పిల్లాడిలా తోచాడు. మరు క్షణం.. విరహంతో వాటేసుకుని కుదిపేసిన ప్రియుడిలా... ఏమో ఈ కృష్ణ మాయ.....!
ఇలా నేస్తాలతో కలిసి.."ముద్దుగారే యశోద..ముంగిట ముత్యమూ..వీడు..." అంటూ చిందెయ్యాలనిపించింది. ఆగక ఒక చిందేసాను. నవ్వుకున్నాము....
ప్రకృతితో ఒకటయి ఆనందించటానికి అమెరికా అయినా అనకాపల్లి అయినా ఒకటే కదా....!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment