
బీడువారిన నా మది మైదానంలోకి అనుకోని అతిధిగా వచ్చావు. మేఘమై, ప్రేమగా కురిసావు.
నా ప్రతి అణువులో జీవం నింపి, వసంతాలను ఇచ్చావు. స్నేహమనే కంచె కట్టి, తోటమాలివై పరిరక్షించావు.
నా ఒడిని అనురాగ కుసుమాలతో నింపావు. వాటిని మాల కట్టి అందియ్యబోతే, అది ’నీద’న్నావు. ’నా దారి వేరు’ అన్నావు.
’నను నీ వెంట రానీ’ అంటే, ’నీకు ముల్లు దిగితే నే చూడలేన’న్నావు. నాకు దగ్గరగా ఉంటూనే నన్ను దూరంగా ఉంచావు.
నీ మాట కాదనలేక, నిను వీడి ఉండలేక నే విలవిలలాడితే, నాపై కఠినత్వం నటించావు. గుడ్డిగా నీ మాటను మాత్రమే విన్నాను.
అంతా శూన్యమయింది. నీ చిరునవ్వు కిరణం లేని ఆ చీకటిలో, దారి కానక, కాలు జారి విషాద లోయలో పడ్డాను. భయం ముసిరేసింది.
ఒంటరిగా ఉన్న నన్ను చూసి వెక్కిరించింది. ఎగతాళి చేసింది. తనదే జయం అంది. ఇక ’నువ్వు నా బందీవి’ అంది.
నమ్మకాన్ని ప్రమిదగా చేసి, నీ జ్ఞాపకాల వత్తిని వెలిగించి, ముందుకు నడిచాను. ఒంటరితనం పరుగుతీసింది. భయం భయపడి పారిపోయింది.
నీకై వెతుకుతూ, నడక సాగించాను. కంటి తడి ఆరి, నీటిపొరలు కరిగాక, నీ మాట కాక, నీ గొంతు వినిపించింది.
ఒక్క సారిగా శూన్యం, పూర్ణమయింది. నాలో అంధకారాన్ని చెదరగొడుతూ నవోఉదయం నాలో చైతన్యం నింపింది.
అంత ప్రేమను గొంతులో దాచిన నువ్వు గరళ కంఠుడిలా తోచావు. భగవంతుడు నాకై పంపిన ప్రేమ దూతలా అనిపించావు.
ఆ నింగి వీడి, అలజడి అలలను ఛేదించి, సాగర గర్భాన దాగిన నాలో స్వాతిచినుకై చేరి ముత్యమై మెరిసావు.
--------------------------------------------------------------------------------------------------------------------------------
నీ ప్రేమ వేడిలో నా అహం కరిగి ఆత్మ జ్యోతికి ఆహుతయింది, ఇంధనమయింది. ఆ వెలుగులో నా ఉనికి స్పష్ఠమయ్యింది.
ప్రేమ లో నన్ను నేను కోల్పోతున్నాను అనుకున్నానే కానీ, నిజానికి నన్ను నేను పొందుతున్నానని అప్పుడే అర్థమయింది.